Markets Rally
-
కొత్త ఏడాదికి లాభాల స్వాగతం
ముంబై: భారత స్టాక్ మార్కెట్ కొత్త ఆర్థిక సంవత్సరానికి((2021–22) లాభాలతో స్వాగతం పలికింది. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గురువారం దేశీయ మార్కెట్ లాభాల్ని మూటగట్టుకుంది. మెటల్, ఆర్థిక, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్ల అండతో సెన్సెక్స్ 521 పాయింట్లు లాభంతో 50 వేలపైన 50,030 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 14,867 వద్ద నిలిచింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.24 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. అలాగే కేంద్రం నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.14,500 కోట్ల మూలధన నిధులను సమకూర్చింది. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్ సెంటిమెంట్ బలపరిచాయి. మరోవైపు అమెరికాలో భారీ ఉద్యోగ కల్పన లక్ష్యంగా మౌలిక రంగంలో 2.3 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులను పెడుతున్నట్లు దేశాధ్యక్షుడు బైడెన్ ప్రకటన ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ అంశం మన కూడా మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ఒక్క ఎఫ్ఎంసీజీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 583 పాయింట్లు, నిఫ్టీ 192 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో నాలుగు మాత్రమే నష్టపోయాయి. మార్కెట్ భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.2.94 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. ఫలితంగా బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.207.15 లక్షల కోట్లకు చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.149 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.297 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. పీఎస్బీ షేర్ల పరుగులు కేంద్ర ప్రభుత్వం నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులకు(పీఎస్బీ) రూ.14,500 కోట్ల నిధులను కేటాయించడంతో ఈ రంగ షేర్లు పరుగులు పెట్టాయి. మొండిబకాయిలుతో పాటు పలు సంస్థాగత సమస్యలను ఎదుర్కొంటున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కేంద్రం భారీ ఎత్తున నిధులను సమకూర్చడంతో ఈ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇంట్రాడేలో ఈ బ్యాంకు షేర్లు 10% ర్యాలీ చేశాయి. మెరిసిన మెటల్ షేర్లు...: బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ స్టీల్ కంపెనీలకు పాజిటివ్ అవుట్‌లుక్‌ను ఇవ్వడంతో ఈ రంగానికి చెందిన షేర్లు రాణించాయి. దీంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 5% ఎగిసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా నాల్కో షేరు 8.5% ఎగసి రూ.60 వద్ద స్థిరపడింది. డోల్వీ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించడంతో జేఎస్‌డబ్ల్యూ షేరు 8% లాభంతో రూ.505 వద్ద ముగిసింది. టాటా స్టీల్ షేరు 6% లాభపడి రూ.859 వద్ద స్థిరపడింది. మాక్రోటెక్ డెవలపర్స్ ఐపీఓ ధర రూ. 483–486 న్యూఢిల్లీ: గతంలో లోధా డెవలపర్స్‌గా కార్యకలాపాలు సాగించిన రియల్టీ దిగ్గజం మాక్రోటెక్ డెవలపర్స్ ఈ నెల 7న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 9న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణిని రూ. 483–486గా నిర్ణయించింది. తద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఐపీవో నిధులలో రూ. 1,500 కోట్ల వరకూ రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు ప్రకటించారు. -
45,000 శిఖరంపైకి సెన్సెక్స్
ముంబై: ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశ నిర్ణయాలు మార్కెట్‌ను మెప్పించాయి. మూడోసారి వడ్డీరేట్లను మార్చకపోవడంతో పాటు జీడీపీ వృద్ధి అంచనాలను సవరించడంతో శుక్రవారమూ సూచీల రికార్డు ర్యాలీ కొనసాగింది. సెనెక్స్ 447 పాయింట్ల లాభంతో తొలిసారి 45వేల పైన 45,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,259 వద్ద ముగిసింది. వచ్చే ఏడాది మొదట్లోనే కోవిడ్–19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని మోదీ ప్రకటనతో మార్కెట్ సెంటిమెంట్ మరింత మెరుగుపడింది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించేందుకు ఆర్బీఐ మొగ్గుచూపడంతో బ్యాంకింగ్, రియల్టీ, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వృద్ధి అంచనాలను సవరించడంతో ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లు ర్యాలీ చేశాయి. వ్యాక్సిన్‌పై సానుకూల వార్తలతో ఫార్మా షేర్లు రాణించాయి. బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, ఆర్బీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 4.50 శాతం నుంచి 2 శాతం లాభపడ్డాయి. బీఎస్ఈ బ్యాంక్ ఇండెక్స్ 2శాతం లాభంతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 515 పాయింట్లు ఎగసి 45,148 వద్ద, నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 13,280 వద్ద వద్ద ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీ అంశం తెరపైకి రావడంతో పాటు ఫైజర్, బయోటెక్‌లు రూపొందించిన కోవిడ్–19 వ్యాక్సిన్‌కు బ్రిటన్ ఆమోదం తెలపడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. నిఫ్టీకి వారం మొత్తం లాభాలే... ఈ వారం మొత్తం నిఫ్టీకి లాభాలొచ్చాయి. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం సెలవుతో నాలుగురోజులు జరిగిన ట్రేడింగ్‌లో నిఫ్టీ మొత్తం 289 పాయింట్లను ఆర్జించింది. ఇదేవారంలో ఒకరోజు నష్టంతో ముగిసిన సెనెక్స్ మొత్తం 930 పాయింట్లు లాభపడింది. ఆల్ట్రాటెక్ సిమెంట్ 4శాతం జంప్... అల్ట్రాటెక్ సిమెంట్ షేరు శుక్రవారం బీఎస్ఈలో 4% లాభంతో ముగిసింది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే రూ.5,477 కోట్ల వ్యయ ప్రణాళికకు బోర్డు అనుమతి లభించినట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 6.25 శాతం పెరిగి రూ.5,198 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4 శాతం లాభంతో రూ.5,093 వద్ద స్థిరపడింది. రూ.1.25 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద... సూచీల రికార్డు పర్వం కొనసాగడంతో ఇన్వెస్టర్లు భారీ లాభాల్ని మూటగట్టుకున్నారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే రూ. 1.25 లక్షల కోట్లు ఎగసి రూ.179.49 లక్షల కోట్లకు చేరుకుంది. -
కోవిడ్ ఎఫెక్ట్... శాంసంగ్ దూకుడు!
న్యూఢిల్లీ: కోవిడ్–19(కరోనా) వైరస్ చైనా ఎలక్ట్రానిక్ కంపెనీలను కలవరపెడుతుంటే.. భారత మార్కెట్లో ఆధిపత్యం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న దక్షిణ కొరియా కంపెనీ శాంసంగ్ ఈ వైరస్ రూపంలో లాభపడనుంది.! చైనా మొబైల్ తయారీ కంపెనీలు, ఎలక్ట్రానిక్ సంస్థల ప్రణాళికలపై కోవిడ్ ప్రభావం చూపిస్తోంది. యాపిల్‌తోపాటు చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, వివో, రియల్మీ తదితర ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తుల విడుదల ప్రణాళికల ను సమీక్షించుకుంటున్నాయి. కానీ, శాంసంగ్ మాత్రం తన ప్రణాళికలను వాయిదా వేసుకోకుండా మరింత దూకుడుగా ఉత్పత్తులను విడుదల చేసే కార్యక్రమంలో ఉంది. భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) గణాంకాల ప్రకారం.. శాంసంగ్ ఇండియా 2020 ప్రారంభంలోనే 9 నూతన మొబైల్ ఫోన్లకు సంబంధించి బీఐఎస్ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. కానీ, ఇదే సమయంలో షావోమీకి చెందిన రెడ్మీ, దక్షిణ కొరియాకు చెందిన మరో సంస్థ ఎల్జీ రెండేసి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ కోరడం చూస్తుంటే.. శాంసంగ్ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఇక ఇదే కాలంలో మోటరోలా, కూల్‌ప్యాడ్ సంస్థలు ఒక్కొక్క ఉత్పత్తి రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు పెట్టుకున్నాయి. దేశీయ కంపెనీలదీ దూకుడే..: ఈ సమయంలో దేశీయ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల విడుదలలో వేగాన్ని పెంచడాన్ని పరిశీలించాలి. ఢిల్లీకి చెందిన సెల్కార్ జనవరి 1 నుంచి ఇప్పటికే 15 మోడళ్లకు బీఐఎస్ రిజిస్ట్రేషన్ తీసుకుని చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. మరో స్థానిక బ్రాండ్ హైటెక్ కూడా మూడు మోడళ్లకు ఈ కాలంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం గమనార్హం. ‘‘పెద్ద తయారీ సంస్థలు (ఓఈఎంలు) తమ ఉత్పత్తుల విడుదలను జాప్యం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా బీఐఎస్ రిజిస్ట్రేషన్ తర్వాత ఉత్పత్తుల విడుదలకు 4–6 వారాలు తీసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితి శాంసంగ్‌కు అనుకూలం. ఎందుకంటే ప్రముఖ తయారీ కంపెనీగా కొరియా, ఇతర ప్రాంతాల నుంచి విడిభాగాలను సమీకరించుకుంటుంది. దీంతో కంపెనీ సరఫరా వ్యవస్థపై వైరస్ ప్రభావం ఉండదు’’ అని టెక్‌ఆర్క్‌కు చెందిన ముఖ్య అనలిస్ట్ ఫైసల్కవూసా తెలిపారు. చైనా కంపెనీలకు ఇబ్బందులు.. చైనాలో కోవిడ్ వైరస్ తీవ్రతతో కొన్ని ప్రాంతాల్లో తయారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇది సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపించనుంది. దీని తాలూకూ వేడి భారత్‌లో కార్యకలాపాలు కలిగి ఉన్న చైనా కంపెనీలకు ఇప్పటికే తాకింది. చైనాకు చెందిన ప్రముఖ కంపెనీలకు భారత్‌లో తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ.. విడి భాగాల కోసం అవి మాతృదేశంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. కానీ, వైరస్ ప్రభావం శాంసంగ్‌పై తక్కువే ఉండనుంది. ఎందుకంటే అధిక శాతం మొబైల్ ఫోన్లను ఈ సంస్థ నోయిడాలోని కేంద్రంలోనే తయారు చేస్తోంది. పైగా 2018లో తయారీ సామర్థ్యాన్ని కూడా గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 68 మిలియన్ యూనిట్లుగా ఉంటే, 120 మిలియన్ యూనిట్లకు విస్తరించింది. ఇక విడిభాగాలను కూడా స్థానికంగానే సమీకరించుకుంటోంది. అలాగే, వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా కలిగి ఉంది. ‘‘చైనా సంస్థలతో పోలిస్తే శాంసంగ్ కార్యకలాపాలు ఎన్నో ఖండాల్లో విస్తరించి ఉన్నాయి. కనుక అతిపెద్ద నిల్వలను కలిగి ఉంటుంది. చైనా నుంచి సరఫరా పరంగా ఉన్న ఇబ్బందులు మొదటి త్రైమాసికంలో శాంసంగ్‌కు కలసి రానున్నాయి’’ అని రీసెర్చ్ సంస్థ ఐడీసీ డైరెక్టర్ నవకేందర్సింగ్ తెలిపారు. పెద్దగా ప్రభావం ఉండదు.. ‘‘చాలా వరకు విడిభాగాలను భారత్‌లోనే తయారు చేస్తున్నాం. అంతేకాదు వియత్నాంలో భారీ తయారీ కేంద్రం కూడా ఉంది. కరోనా వైరస్ సంక్షోభ ప్రభావం మా కార్యకలాపాలపై పెద్దగా ఉండదు’’ అని శాంసంగ్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఫ్లాగ్షిప్ మోడళ్లు అయిన గెలాక్సీ జెడ్ ఫ్లిప్, ఎస్20 ప్లస్ మోడళ్లను మార్చి నాటికి విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఒకప్పుడు దేశీయ మార్కెట్లో టాప్‌లో ఉన్న శాంసంగ్ 2019 డిసెంబర్ నాటికి మూడో స్థానానికి పడిపోయింది. షావోమీ, వివో తొలి రెండు స్థానాలను ఆక్రమించేశాయి. 2019 జూన్ క్వార్టర్ నాటికి శాంసంగ్‌కు 25.3% మార్కెట్ వాటా కలిగి ఉండగా, డిసెంబర్ నాటికి అది 15.5%కి తగ్గింది. భారత మార్కెట్లో ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్’ ధర రూ.1.10 లక్షలు న్యూఢిల్లీ: శాంసంగ్.. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ జెడ్ ఫ్లిప్’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. గతవారంలోనే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో తన ఆల్ట్రా–ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రదర్శించిన కంపెనీ.. ఇక్కడ మార్కెట్లో దీన్ని గురువారం విడుదలచేసింది. ధర రూ. 1.10 లక్షలు కాగా, రెండు యాప్‌లను ఒకేసారి తెరవగలిగే సౌలభ్యం ఇందులో ఉందని, సాంకేతిక ఆవిష్కరణలో మైలురాయిగా నిలిచిపోయే హ్యాండ్‌సెట్‌గా జెడ్ ఫ్లిప్ నిలిచిపోనుందని ఈ సందర్భంగా కంపెనీ ఇండియా డైరెక్టర్(మొబైల్) ఆదిత్య బబ్బర్ వ్యాఖ్యానించారు. ఇక స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. 6.7 అంగుళాల పూర్తి హెచ్డీ డైనమిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే, 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుకవైపు రెండు 12 మెగాపిక్సెల్ కెమెరాలు, 10ఎంపీ సెల్పీ కెమెరా ఉన్నాయి. -
మార్కెట్లో ‘శాంతి’ ర్యాలీ!
ముంబై: ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశం అమెరికా.. చమురు ఉత్పత్తి పరంగా బలమైన ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం తేలికపడడం ప్రపంచవ్యాప్తంగా గురువారం ఈక్విటీ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. గత వారం ఇరాక్‌లో ఇరాన్ సైనిక కమాండర్ సులేమానీని అమెరికా దళాలు చంపేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీంతో ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆ నష్టాల్లో అధిక శాతం మేర గడిచిన రెండు రోజుల్లో మన ఈక్విటీ మార్కెట్లు తిరిగి పూడ్చుకున్నాయి. ప్రతీకార చర్య కింద ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసినా కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా తీసుకోకపోవడం, తాము శాంతినే కోరుకుంటున్నామని చెప్పడం పరిస్థితిని కుదుటపరిచింది. ఫలితంగా గురువారం బీఎస్ఈ సెన్సెక్స్ 635 పాయింట్ల లాభాన్ని (1.55 శాతం) నమోదు చేసుకుంది. 41,482 పాయింట్ల గరిష్టస్థాయిని తాకి... చివరకు 41,452 వద్ద క్లోజయింది. అటు నిఫ్టీ సైతం 191 పాయింట్లు పెరిగి (1.58 శాతం) 12,216 వద్ద క్లోజయింది. ట్రంప్ ప్రకటనతో క్రితం రాత్రి యూఎస్ మార్కెట్లు కూడా లాభాలను నమోదు చేశాయి. తమ ఉపాధ్యక్షుడు లీ వచ్చే వారం వాషింగ్టన్‌ను సందర్శిస్తారని, అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తారంటూ చైనా చేసిన ప్రకటన కూడా ఇన్వెస్టర్లను రిస్క్ తీసుకునే దిశగా ప్రోత్సహించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ► అధికంగా లాభపడిన షేర్లలో ఐసీఐసీఐ బ్యాంకు ముందుంది. ఆ తర్వాత ఎస్బీఐ, ఎంఅండ్ఎం, ఇండస్ఇండ్బ్యాంకు, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ► నష్టపోయిన షేర్లలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, సన్ ఫార్మా ఉన్నాయి. ► బీఎస్ఈ రియల్టీ, ఆటో, బ్యాంకెక్స్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్స్, ఎనర్జీ సూచీలు లాభపడ్డాయి. ఐటీ సూచీ నష్టపోయింది. ► బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1.55 శాతం వరకు పెరిగాయి. ► షాంఘై, హాంకాంగ్, టోక్యో, సియోల్ 2.31 శాతం వరకు గరిష్టంగా లాభపడ్డాయి. యూరోప్ మార్కెట్లు కూడా సానుకూలంగా ట్రేడింగ్ ఆరంభించాయి. ఒక్కరోజులో 2.25 లక్షల కోట్లు గురువారం నాటి మార్కెట్ ర్యాలీ పుణ్యమా అని ఒక్కరోజే ఇన్వెస్టర్ల వాటాల విలువ రూ.2.25 లక్షల కోట్ల మేర వృద్ధి చెందింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ బుధవారం ముగింపుతో పోలిస్తే.. రూ.2,25,554 కోట్లు పెరిగి మొత్తం రూ.1,57,06,155 కోట్లకు చేరుకుంది. మార్కెట్లపై క్యూ3 ఫలితాల ప్రభావం.. ‘‘వృద్ధిని పైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బడ్జెట్లో చర్యలను ప్రకటిస్తుందన్న అంచనాలు, మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు చల్లారడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించే విధానపరమైన చర్యలు, నిర్ణయాలు దీర్ఘకాలంలో ఈక్విటీలకు ప్రయోజనం కలిగిస్తాయి. అయితే, స్వల్పకాలానికి మాత్రం మార్కెట్లను మూడో త్రైమాసికం ఫలితాలు నిర్ణయిస్తాయి. తక్కువ బేస్(క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న గణాంకాలతో పోలిస్తే) కారణంగా డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో కొంత పురోగతి ఉంటుందని అంచనా’’ అంటూ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ తన అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘ఈక్విటీ మార్కెట్లకు అసాధారణ రోజు. ఒకటిన్నర శాతానికి పైగా లాభపడ్డాయి. చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడడం మరింత ఉత్సాహాన్నిచ్చింది’’ అని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. చల్లారిన పసిడి.. క్రూడ్ రూపాయికి 48 పైసలు లాభం న్యూయార్క్/న్యూఢిల్లీ: యుద్ధాన్ని కాంక్షించడంలేదంటూ అమెరికా–ఇరాన్ నుంచి వెలువడుతున్న సంకేతాలతో తిరిగి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత సాధనాలైన బంగారం, క్రూడ్ల నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు కనబడుతోంది. దీంతో అంతర్జాతీయంగా పసిడి, క్రూడ్ ధరలు గురువారమూ తగ్గాయి. ఈ ధోరణి భారత్ రూపాయి బలోపేతం కావడానికీ దోహదపడింది. బంగారం ఔన్స్ (31.1గ్రా) ధర అంతర్జాతీయ మార్కెట్ నైమెక్స్‌లో గురువారం ఈ వార్తరాసే 10.30 రాత్రి గంటల సమయానికి క్రితం ముగింపుతో పోల్చిచూస్తే, 10 డాలర్ల నష్టంలో 1,550 డాలర్లు వద్ద ట్రేడవుతోంది. బుధవారం గరిష్టంతో పోల్చితే ఇది 62 డాలర్లు తక్కువ. ట్రేడింగ్ ఒక దశలో ఈ ధర 1,541 డాలర్ల కనిష్టాన్నీ తాకింది. ► నైమెక్స్ క్రూడ్ పావు శాతం తగ్గుదలతో 59.40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ► డాలరుతో రూపాయి విలువ 48 పైసలు లాభపడి 71.21 వద్ద ముగిసింది. ► దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్– ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.377 నష్టంతో రూ.39,733 వద్ద ట్రేడవుతోంది. ‘‘యూఎస్–ఇరాన్ మధ్య ముదిరిన ఉద్రిక్తతలు ఒక్కసారిగా కనుమరుగయ్యాయి. దీంతో స్టాక్ మార్కెట్లు బలం చూపిస్తున్నాయి. బుధవారం రాత్రి అమెరికా మార్కెట్ బలంగా ముగియడం ఆసియాలోనూ కొనుగోళ్లకు దారితీసింది. ఇప్పుడు యూరోప్‌లోనూ బుల్లిష్ సెంటిమెంట్ కనిపిస్తోంది. యూఎస్, ఇరాన్ ఇప్పటికీ ఒకరిపట్ల మరొకరు విభేదంగా ఉన్నా, వివాదం ముదరకపోతే మంచి వాతావరణం కొనసాగే అవకాశమే ఉంటుంది’’ అని బ్రిటన్‌కు చెందిన సీఎంసీ మార్కెట్స్ అనలిస్ట్ డేవిడ్ మాడెన్ పేర్కొన్నారు. -
వెనెజులా...! ఎందుకిలా?
♦ పరిస్థితులకు భిన్నంగా మార్కెట్ల ర్యాలీ ♦ 2016లో ద్రవ్యోల్బణం 254%; ఇంకా పెరిగే చాన్స్ ♦ అయినా 1,100 శాతం పెరిగిన స్టాక్ మార్కెట్లు ♦ తాజాగా ఆ దేశాధ్యక్షుడిపై అమెరికా ఆంక్షలు ♦ ఆ వార్త వెలువడ్డాక మరో 3 శాతం ఎగసిన మార్కెట్లు ♦ తలపండిన విశ్లేషకులకూ ఇవి ‘షాక్’ మార్కెట్లే! న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలం స్టాక్ మార్కెట్లలో ప్రతిఫలిస్తుంది. వృద్ధి బలంగా ఉంటే, స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేస్తుంటాయి. బలహీనంగా ఉంటే పరిస్థితి భిన్నంగా ఉంటుంది. కానీ, వెనెజులా స్టాక్ మార్కెట్లు ఇందుకు భిన్నం!. అవి పెరగాలనుకుంటే పెరుగుతాయి. తగ్గాలనుకుంటే తగ్గుతాయి. 2016లో ఆ దేశ ద్రవ్యోల్బణం 254.9 శాతం. కానీ, స్టాక్ మార్కెట్లు గత ఏడాది కాలంలో ఏకంగా 1,100 శాతం లాభపడ్డాయి. తాజాగా గత సోమవారం అమెరికా ఆ దేశంపై ఆంక్షలు విధించింది. దీన్ని మార్కెట్లు పాజిటివ్‌గా తీసుకున్నాయో లేక పట్టించుకోలేదో గానీ, అదే రోజు స్టాక్ మార్కెట్లు 3 శాతం లాభపడ్డాయి. ఎందుకిలా...? విశ్లేషకులకు సైతం వెనెజులా స్టాక్ మార్కెట్లు ఓ పజిల్లా మారాయంటే ఆశ్చర్యం లేదు. ఆర్థిక ఇబ్బందులు వెనెజులాలో షామ్ ఎన్నికల (నామమాత్రపు) నిర్వహణకు వ్యతిరేకంగా ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మడురోపై అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో వెనెజులా ఒంటరిగా మారిపోయింది. కానీ, ఈక్విటీ బెంచ్‌మార్క్ 3,603 పాయింట్లు లాభపడి (3 శాతం) 1,39,399 పాయింట్ల వద్ద క్లోజవడం విశేషం. వెనెజులా ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆదాయ వనరు చమురే. అయితే, ఆ దేశానికి వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షల విషయంలో అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం కుదిరితే వెనెజులాకు మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఆ దేశం ఇప్పటికే ఆర్థికంగా సతమతం అవుతోంది. 2016లో జీడీపీ 18 శాతం తగ్గిపోయింది. 2015లో 6.2 శాతం, 2014లో 3.9 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది 7.4 శాతం, వచ్చే ఏడాది 4.1 శాతం ప్రతికూల వృద్ధి నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అంతర్జాతీయంగా చమురు ధరల పతనం, అంతర్గత సంఘర్షణలు, అసంబద్ధ విధానాలు ఇవన్నీ సమస్యలకు మూలాలు. అయినా సరే అక్కడి స్టాక్ మార్కెట్లు ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. ఇక, ద్రవ్యోల్బణం కూడా మూడంకెల స్థాయిలో కొనసాగుతోంది. 1998–2008 సంవత్సరాల మధ్య 20.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2016 నాటికి ఏకంగా 254.9 శాతానికి చేరింది. ఈ ఏడాది 720.5 శాతం ఉంటుందని, 2018లో 2,068 శాతం, 2022 నాటికి 4,684 శాతానికి పెరిగిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. దీంతో వెనెజులా మరో జింబాబ్వేగా మారే అవకాశం లేకపోలేదంటున్నారు. ఒక దశలో జింబాబ్వే ద్రవ్యోల్బణం 231,150,889 శాతాన్ని కూడా తాకింది. భారత కంపెనీలపై ప్రభావం! ఒకప్పటితో పోలిస్తే ఇరుగు పొరుగు దేశాలతో వెనెజులా వాణిజ్య సంబంధాలు ప్రస్తుతం చాలా పరిమిత స్థాయికి చేరాయి. ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు అగ్రరాజ్యం అమెరికాతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నాయి. మన భారత ఫార్మా కంపెనీలైన డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్ ఫార్మా వంటివి వెనెజులా మార్కెట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వాటి వ్యాపారంపై ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. -
ఐటీ షేర్ల దెబ్బ.. ర్యాలీకి బ్రేక్
28,000 స్థాయి నుంచి తగ్గిన సెన్సెక్స్ ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ భవిష్యత్ ఆదాయ వృద్ధి అంచనాల్ని తగ్గించడంతో నాలుగు రోజుల మార్కెట్ ర్యాలీకి శుక్రవారం బ్రేక్‌పడింది. ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడికాకముందు, ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 28,049 పాయింట్ల గరిష్టస్థాయిని తాకింది. ఒక్కసారి ఫలితాలు వెల్లడికాగానే ఇన్ఫోసిస్‌తో పాటు ఇతర ఐటీ షేర్లు కూడా క్షీణించడంతో చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 106 పాయింట్ల నష్టంతో 27,836 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 8,595 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి క్షీణించిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 8,541 పాయింట్ల వద్ద ముగిసింది. ఇతర ఐటీ షేర్లపై ఇన్ఫోసిస్ ప్రభావం... రానున్న క్వార్టర్లలో తమ వ్యాపారంలో ఒడుదుడుకులు వుండవచ్చంటూ ఇన్ఫోసిస్ యాజమాన్యం ప్రకటించడంతో దాదాపు ప్రధాన ఐటీ షేర్లన్నీ తగ్గాయి. ఇన్ఫోసిస్ 8.7 శాతం క్షీణించి 1,072 వద్ద ముగిసింది. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడైన టీసీఎస్ ఫలితాలు అంచనాల్ని మించినప్పటికీ, ఈ షేరు కూడా 2.8 శాతం తగ్గి 2,445 వద్ద క్లోజయ్యింది. విప్రో 2.81 శాతం, టెక్ మహింద్రా 2.5 శాతం చొప్పున తగ్గాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 5.35 శాతం పతనమయ్యింది. పెరిగిన రిలయన్స్.. క్వార్టర్లీ ఫలితాలు బావుంటాయన్న అంచనాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు స్వల్పంగా 0.6 శాతం పెరిగి రూ. 1,012 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ కంపెనీ వెల్లడించిన ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని మించాయి.