ముంబై: ఆర్‌బీఐ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశ నిర్ణయాలు మార్కెట్‌ను మెప్పించాయి. మూడోసారి వడ్డీరేట్లను మార్చకపోవడంతో పాటు జీడీపీ వృద్ధి అంచనాలను సవరించడంతో శుక్రవారమూ సూచీల రికార్డు ర్యాలీ కొనసాగింది. సెనెక్స్ 447 పాయింట్ల లాభంతో తొలిసారి 45వేల పైన 45,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 124 పాయింట్లు పెరిగి 13,259 వద్ద ముగిసింది. వచ్చే ఏడాది మొదట్లోనే కోవిడ్–19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ప్రధాని మోదీ ప్రకటనతో మార్కెట్ సెంటిమెంట్ మరింత మెరుగుపడింది. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించేందుకు ఆర్‌బీఐ మొగ్గుచూపడంతో బ్యాంకింగ్, రియల్టీ, ఆర్థిక రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. వృద్ధి అంచనాలను సవరించడంతో ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్లు ర్యాలీ చేశాయి. వ్యాక్సిన్‌పై సానుకూల వార్తలతో ఫార్మా షేర్లు రాణించాయి.
బంధన్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఆర్‌బీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 4.50 శాతం నుంచి 2 శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈ బ్యాంక్ ఇండెక్స్ 2శాతం లాభంతో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఒక దశలో సెన్సెక్స్ 515 పాయింట్లు ఎగసి 45,148 వద్ద, నిఫ్టీ 146 పాయింట్లు పెరిగి 13,280 వద్ద వద్ద ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌కు కలిసొచ్చాయి. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీ అంశం తెరపైకి రావడంతో పాటు ఫైజర్, బయోటెక్‌లు రూపొందించిన కోవిడ్–19 వ్యాక్సిన్‌కు బ్రిటన్ ఆమోదం తెలపడంతో అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి.
నిఫ్టీకి వారం మొత్తం లాభాలే...
ఈ వారం మొత్తం నిఫ్టీకి లాభాలొచ్చాయి. గురునానక్ జయంతి సందర్భంగా సోమవారం సెలవుతో నాలుగురోజులు జరిగిన ట్రేడింగ్‌లో నిఫ్టీ మొత్తం 289 పాయింట్లను ఆర్జించింది. ఇదేవారంలో ఒకరోజు నష్టంతో ముగిసిన సెనెక్స్ మొత్తం 930 పాయింట్లు లాభపడింది.
ఆల్ట్రాటెక్ సిమెంట్ 4శాతం జంప్...
అల్ట్రాటెక్ సిమెంట్ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో 4% లాభంతో ముగిసింది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే రూ.5,477 కోట్ల వ్యయ ప్రణాళికకు బోర్డు అనుమతి లభించినట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 6.25 శాతం పెరిగి రూ.5,198 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4 శాతం లాభంతో రూ.5,093 వద్ద స్థిరపడింది.
రూ.1.25 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద...
సూచీల రికార్డు పర్వం కొనసాగడంతో ఇన్వెస్టర్లు భారీ లాభాల్ని మూటగట్టుకున్నారు. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజులోనే రూ. 1.25 లక్షల కోట్లు ఎగసి రూ.179.49 లక్షల కోట్లకు చేరుకుంది.
45,000 శిఖరంపైకి సెన్సెక్స్
Published Sat, Dec 5 2020 5:46 AM | Last Updated on Sat, Dec 5 2020 5:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment