ముంబై: భారత స్టాక్ మార్కెట్ కొత్త ఆర్థిక సంవత్సరానికి((2021–22) లాభాలతో స్వాగతం పలికింది. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు కలిసిరావడంతో గురువారం దేశీయ మార్కెట్ లాభాల్ని మూటగట్టుకుంది. మెటల్, ఆర్థిక, ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్ల అండతో సెన్సెక్స్ 521 పాయింట్లు లాభంతో 50 వేలపైన 50,030 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 14,867 వద్ద నిలిచింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.24 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 45 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం మొదలైంది. అలాగే కేంద్రం నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.14,500 కోట్ల మూలధన నిధులను సమకూర్చింది.
ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్ సెంటిమెంట్ బలపరిచాయి. మరోవైపు అమెరికాలో భారీ ఉద్యోగ కల్పన లక్ష్యంగా మౌలిక రంగంలో 2.3 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులను పెడుతున్నట్లు దేశాధ్యక్షుడు బైడెన్ ప్రకటన ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఈ అంశం మన కూడా మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ఒక్క ఎఫ్‌ఎంసీజీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్ షేర్లు లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 583 పాయింట్లు, నిఫ్టీ 192 పాయింట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో నాలుగు మాత్రమే నష్టపోయాయి. మార్కెట్ భారీ ర్యాలీతో ఇన్వెస్టర్లు రూ.2.94 లక్షల కోట్ల సంపదను ఆర్జించారు. ఫలితంగా బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.207.15 లక్షల కోట్లకు చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.149 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.297 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
పీఎస్‌బీ షేర్ల పరుగులు
కేంద్ర ప్రభుత్వం నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులకు(పీఎస్‌బీ) రూ.14,500 కోట్ల నిధులను కేటాయించడంతో ఈ రంగ షేర్లు పరుగులు పెట్టాయి. మొండిబకాయిలుతో పాటు పలు సంస్థాగత సమస్యలను ఎదుర్కొంటున్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు కేంద్రం భారీ ఎత్తున నిధులను సమకూర్చడంతో ఈ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఇంట్రాడేలో ఈ బ్యాంకు షేర్లు 10% ర్యాలీ చేశాయి. మెరిసిన మెటల్ షేర్లు...: బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ స్టీల్ కంపెనీలకు పాజిటివ్ అవుట్‌లుక్‌ను ఇవ్వడంతో ఈ రంగానికి చెందిన షేర్లు రాణించాయి. దీంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 5% ఎగిసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా నాల్కో షేరు 8.5% ఎగసి రూ.60 వద్ద స్థిరపడింది. డోల్వీ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించడంతో జేఎస్‌డబ్ల్యూ షేరు 8% లాభంతో రూ.505 వద్ద ముగిసింది. టాటా స్టీల్ షేరు 6% లాభపడి రూ.859 వద్ద స్థిరపడింది.
మాక్రోటెక్ డెవలపర్స్ ఐపీఓ ధర రూ. 483–486
న్యూఢిల్లీ: గతంలో లోధా డెవలపర్స్‌గా కార్యకలాపాలు సాగించిన రియల్టీ దిగ్గజం మాక్రోటెక్ డెవలపర్స్ ఈ నెల 7న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 9న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణిని రూ. 483–486గా నిర్ణయించింది. తద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఐపీవో నిధులలో రూ. 1,500 కోట్ల వరకూ రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది.
గుడ్‌ఫ్రైడే సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment