
గాజా సిటీలోని హనాదీ ప్రాంతంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ధ్వంసం అవుతున్న భవనాలు
గాజా సిటీ: దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్– పాలస్తీనా మధ్య భీకర పోరు కొనసాగుతోంది. పాలస్తీనా ఉగ్రసంస్థ హమాస్, ఇతర ఉగ్ర సంస్థల అధీనంలోని గాజా సిటీ నుంచి పాలస్తీనా మీదకు, పాలస్తీనా నుంచి గాజా సిటీ వైపునకు లెక్కకు మించిన రాకెట్లు దూసుకొస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజా స్ట్రిప్‌లోని రెండు అపార్ట్‌మెంట్లు కుప్పకూలాయి. సెంట్రల్ గాజాలోని అత్యంత ఎత్తయిన భవంతుల్లో చాలా వాటిని ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు బాంబులతో నేలమట్టం చేశాయి. దీంతో గాజాలో సోమవారం నుంచి ఇప్పటివరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 48కి పెరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ప్రాణాలు కోల్పోయిన వారిలో 14 మంది చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. గాజాలో ఓ కారుపై క్షిపణి పడటంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు గాయపడ్డారు. మొత్తంగా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 86 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా దాదాపు 300 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా రాకెట్ల వర్షం కురిస్తామని హమాస్ కమాండర్లు ప్రకటించిన వీడియో దృశ్యాలను ఇజ్రాయెల్ టీవీ చానళ్లు ప్రత్యక్షప్రసారంచేశాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ మెట్రో ప్రాంతంపై ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. హమాస్ ఉగ్రవాదులు యుద్ధ ట్యాంక్ విధ్వంసక క్షిపణిని సరిహద్దులో ప్రయోగించగా ఒక ఇజ్రాయెల్ దేశస్తుడు మరణించాడు.
ఇద్దరు మహిళలు గాయపడ్డారు. మరణించిన వారు పౌరులా? సైనికులా? అనేది తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు జరిపిన వేర్వేరు దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ దేశస్తులు, ఒక సైనికుడు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరణించారు. ఉద్రిక్తతలు మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా ఉగ్రవాదులు మా దేశం మీదకు ఏకంగా 1,050 రాకెట్లతో దాడులు చేశారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. వీటిలో 200 రాకెట్లు గురితప్పి వాళ్ల అధీనంలోని గాజా సిటీలోనే పడిపోయాయని సైన్యం పేర్కొంది. గాజా నుంచి తమ వైపు దూసుకొచ్చిన డ్రోన్‌ను నేలకూల్చామని సైన్యం తెలిపింది. సరిహద్దున ఉన్న ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్ సమీప ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయని సైన్యం పేర్కొంది.
భద్రత అనేదే లేదిక్కడ
‘ మేం చూస్తుండగానే మా అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ప్రాణం పోయినంత పనైంది. ఇద్దరు పిల్లలను తీసుకుని ప్రాణాలు అరచేతలో పెట్టుకుని వెంటనే అపార్ట్‌మెంట్ మెట్లు దిగి అపార్ట్‌మెంట్ వాసులమంతా బయటికొచ్చాం. ఏడుపులు, భయాందోళనలతో పరిస్థితి దారుణంగా ఉంది. గాజాలో ఎక్కడా భద్రత అనేదే లేదు’ అని సమాహ్ హబౌ అనే మహిళ ఏడుస్తూ చెప్పారు. ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశాలు నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించింది.
ఉగ్రసంస్థ గాజా సిటీ కమాండర్ హతం
ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్‌కు చెందిన గాజా సిటీ కమాండర్ బసీమ్ ఇసా సహా ఇంకొందరు ఉగ్రవాదులు మరణించారు. గాజాలో గత ఏడేళ్లలో సిటీ కమాండర్ స్థాయి ఉగ్రవాది మరణించడం ఇదే తొలిసారి. కాగా, పరస్పర రాకెట్ల దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడారు. ‘ మా వైపు తీవ్రమైన నష్టం జరిగితే ఊహించని స్థాయిలో దీటైన సమాధామిస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
I watched this video 6 times with tears flooded in my eyes. They’re destroying the main towers in the most vital area in #Gaza city. Now a lot of people left without homes, offices, even without the good memories they had there. pic.twitter.com/WBIZn19Q5H
— Abier-Almasri (@abier_i) May 12, 2021