Israel-Gaza War: గాజా అష్ట దిగ్బంధం | Israel-Palestine War: Israeli Fighter Jets Attack Hamas Linked Islamic University In Gaza - Sakshi
Sakshi News home page

Israel-Gaza War: గాజా అష్ట దిగ్బంధం

Published Thu, Oct 12 2023 2:48 AM | Last Updated on Thu, Oct 12 2023 9:46 AM

Israel-Gaza War: Israeli Fighter Jets Attack Hamas - Sakshi

జెరూసలేం/టెల్‌ అవివ్‌/న్యూఢిల్లీ:  హమాస్‌ మిలిటెంట్లను తుదముట్టించడమే ధ్యేయంగా వారి పాలనలో ఉన్న గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం చుట్టముట్టింది. పూర్తిగా దిగ్బంధించింది. గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. రాకెట్లు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భవనాలు ధ్వంసమవుతున్నాయి. సామాన్య ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

నేలకూలుతున్న భవనాలు, ఎగిసిపడుతున్న దుమ్ము ధూళీ, పొగ.. గాజా అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పరిస్థితి హృదయవిదారకంగా మారింది. శిథిలాల కింద ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తేలడం లేదు. ఇజ్రాయెల్‌–హమాస్‌ యుద్ధం బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. హమాస్‌ ముష్కరులు ఇజ్రాయెల్‌పై రాకెట్ల దాడి కొనసాస్తూనే ఉన్నారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఆషె్కలాన్‌ సిటీపై బుధవారం భారీగా రాకెట్లను ప్రయోగించారు. ఇరువైపులా ఇప్పటివరకు 2,200 మంది చనిపోయారు.

తమ దేశంలో 155 మంది సైనికులు సహా 1,200 మందికిపైగా జనం ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్‌ అధికారులు ప్రకటించారు. గాజాలో కనీసం 1,055 మంది బలయ్యారు. వీరిలో 260 మంది చిన్నారులు, 230 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు, ఉత్తర ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో లెబనాన్, సిరియా నుంచి తీవ్రవాదులు ఇజ్రాయెల్‌ సైన్యంపై దాడికి దిగుతున్నారు. ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఇది మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  
 
క్షతగాత్రులతో నిండిపోయిన గాజా ఆసుపత్రులు  
దారులన్నీ మూసుకుపోవడంతో గాజాలో ఆహారం, ఇంధనం, ప్రాణాధార ఔషధాలు నిండుకున్నాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అంధకారం అలుముకుంది. ఆసుపత్రులన్నీ ఇప్పటికే క్షతగాత్రులతో నిండిపోయాయి. ఔషధాలు, వైద్య పరికరాలు లేకపోవడంతో బాధితులకు వైద్యం అందించలేకపోతున్నారు. ఇతర దేశాల నుంచి గాజాకు ఔషధాల సరఫరా కోసం సురక్షిత కారిడార్లు ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. గాజాలోని ఏకైక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఇంధనం లేకపోవడంతో మూతపడింది.

ఇంధన సరఫరాను ఇజ్రాయెల్‌ నిలిపివేసింది. ప్రస్తుతం కరెంటు కోసం కొన్నిచోట్ల జనరేటర్లు ఉపయోగిస్తున్నారు. ఈజిప్టు కూడా తమ సరిహద్దును మూసివేసింది. గాజా నుంచి రాకపోకలను అనుమతించడం లేదు. గాజాలో 2,50,000 మందికిపైగా ప్రజలు సొంత ఇళ్లు వదిలేసి, ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. గాజా చుట్టూ ఇజ్రాయెల్‌ సైన్యం మోహరించడంతో బయటకు వెళ్లే మార్గం లేకుండాపోయింది. గాజాలో ఇప్పుడు భద్రమైన స్థలం అంటూ ఏదీ లేదని స్థానికులు చెబుతున్నారు.  
 
బందీలను ఎక్కడ దాచారో?  
ఇజ్రాయెల్‌లో హమాస్‌ మిలిటెంట్లు అపహరించిన 150 మందికిపైగా జనం జాడ ఇంకా తెలియరాలేదు. హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్నవారి క్షేమ సమాచారాలు తెలియక వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా గాజాపై ఇజ్రాయెల్‌ దాడి చేసిన ప్రతిసారీ ఒక్కో బందీని చంపేస్తామని హమాస్‌ సాయుధ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. హమాస్‌ అపహరించిన 150 మందిలో ఇజ్రాయెల్‌ సైనికులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలో రహస్య సొరంగాల్లోకి వారిని తరలించినట్లు ఇజ్రాయెల్‌ అనుమానిస్తోంది.   
 
ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారుల హత్య!  
హమాస్‌ మిలిటెంట్లు రాక్షసంగా ప్రవర్తించారు. ఇజ్రాయెల్‌లో 40 మంది చిన్నారులను పాశవికంగా హత్య చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ వార్తా సంస్థ వెల్లడించింది. హమాస్‌ దాడులు చేసిన ప్రాంతాల్లో 40 మంది పసిబిడ్డల మృతదేహాలు లభ్యమయ్యాయని ఇజ్రాయెల్‌ సైన్యం తెలియజేసినట్లు పేర్కొంది. బాధిత చిన్నారుల మృతదేహాల్లో కొన్నింటికి తలలు దారుణంగా నరికేసి ఉన్నాయని వివరించింది.   

గాజాలో ఆకలి కేకలు
ఆహారం, తాగునీరు లేక గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటి నుంచి ఎలాంటి సరఫరాలూ వచ్చే మార్గం లేక 23 లక్షల మంది గాజాపౌరులు హాహాకారాలు చేస్తున్నారు. నిజానికి 2007 నుంచే  గాజాను ఇజ్రాయెల్‌ పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకుంది. అక్కడికి ఎలాంటి సరఫరాలైనా ప్రధానంగా ఇజ్రాయెల్‌ గుండా, దాని అనుమతితో వెళ్లాల్సిందే. గాజా గగనతలం, ప్రాదేశిక జలాలతో పాటు మూడు ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో రెండింటిని ఇజ్రాయెలే పూర్తిగా నియంత్రిస్తోంది.

మూడో సరిహద్దు ఈజిప్టు నియంత్రణలో ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని, గాజాకు అత్యవసర ఆహార పదార్థాలు, ఇతర సదుపాయాలు అందేలా చూడాలని పాలస్తీనా విమోచన సంస్థ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి హుసేన్‌ అల్‌ షేక్‌ విజ్ఞప్తి చేశారు. గాజాలో ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్న 1.8 లక్షల మందికి ఎలాంటి ఆహార సరఫరాలూ అందడం లేదని ఐరాస రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ వెల్లడించింది.   

హమాస్‌ దుశ్చర్యను ఖండించిన జో బైడెన్‌  
ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి ఖండించారు. ఈ దాడి ముమ్మాటికీ రాక్షస చర్య అని అభివరి్ణంచారు. ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ పరిణామాన్ని సానుకూలంగా మార్చుకోవాలని ఎవరూ చూడొద్దని హెచ్చరించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతు తెలియజేయడానికే ఆయన స్వయంగా వచి్చనట్లు సమాచారం. జో బైడెన్‌తోపాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహూతో ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఇజ్రాయెల్‌లో హమాస్‌ దాడిలో తమ పౌరులు 14 మంది మరణించారని జో బైడెన్‌ నిర్ధారించారు. అలాగే కనీసం 20 మంది అమెరికన్లు కనిపించకుండాపోయినట్లు సమాచారం. హమాస్‌ దాడిలో ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, ఆ్రస్టేలియా పౌరులు కూడా మృతిచెందారు. గాజాను ఇజ్రాయెల్‌ సైన్యం దిగ్బంధించడాన్ని తుర్కియే అధ్యక్షుడు రిసెప్‌ తయాప్‌ ఎర్డోగాన్‌ ఖండించారు. పాలస్తీనా పౌరుల మానవ హక్కులపై దాడి చేయొద్దని డిమాండ్‌ చేశారు. ఘర్షణకు తెరదించాలని, కాల్పుల విరమణ పాటించాలని ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌–సిసీ ఇజ్రాయెల్, హమాస్‌కు విజ్ఞప్తి చేశారు.  

భారత రాయబార కార్యాలయం భరోసా  
ఇజ్రాయెల్‌లో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని టెల్‌ అవివ్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఏదైనా సహాయం కావాలంటే తమను సంప్రదించాలని తెలియజేసింది. భద్రత విషయంలో స్థానిక అధికారుల మార్గదర్శకాలు పాటించాలని కోరింది.    

ఇజ్రాయెల్‌దే పైచేయి!  
హమాస్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం క్రమంగా పైచేయి సాధిస్తోంది. గాజాలో హమాస్‌ అ«దీనంలో ఉన్న ప్రాంతాలను సైన్యం స్వా«దీనం చేసుకుంటోంది. హమాస్‌ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. గాజా విషయంలో ఇక మునుపటి స్థితికి వెళ్లడం దాదాపు అసాధ్యమని ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి యోవ్‌ గల్లాంట్‌ తాజాగా ప్రకటించారు. హమాస్‌పై ఇక పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైనట్లు వెల్లడించారు. గాజా నుంచి హమాస్‌ మిలిటెంట్లను ఏరిపారేస్తామని తేల్చిచెప్పారు. వారికి శిక్ష తప్పదని స్పష్టం చేశారు.  

భారత విదేశాంగ శాఖ హెల్ప్‌లైన్‌  
ఇజ్రాయెల్, గాజాలో ఉన్న భారతీయులకు సహకరించేందుకు, ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు భారత విదేశాంగ శాఖ ఢిల్లీలో కంట్రోల్‌ రూమ్, టెల్‌ అవివ్, రమల్లాలో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. 1800118797, +91–11 23012113, +91–11–23014104, +91–11–23017905 +919968291988, +97235226748, +972–543278392, +970–592916418 నంబర్లకు ఫోన్‌ చేసి, సమాచారం తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ సూచించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement