ఖాన్ యూనిస్: ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో సామాన్యులే సమిధలవుతున్నారు. అక్టోబర్ 7న ఇరుపక్షాల మధ్య మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై వైమానిక, భూతల దాడులకు దిగుతోంది. సాధారణ జనావాసాలపై బాంబలు వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 20,057 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. అంటే గాజాలోని మొత్తం జనాభాలో ఒక శాతం మంది మృత్యువాత పడినట్లు స్పష్టమవుతోంది.
మృతుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. సరిపడా ఆహారం, నీరు అందక గాజాలో జనం ఆకలిలో అల్లాడిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 5 లక్షల మందికి ఆహారం అందడం లేదని వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాకు మానవతా సాయం ఆశించిన స్థాయిలో అందడం లేదని పేర్కొంది. యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణను కోరుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరగాల్సిన ఓటింగ్ వాయిదా పడింది.
రెండు రోజుల్లో 390 మంది బలి
గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకరస్థాయిలో విరుచుకుపడుతోంది. గత రెండు రోజుల వ్యవధిలో ఇజ్రాయెల్ దాడుల్లో ఏకంగా 390 మంది పాలస్తీనియన్లు బలయ్యారని గాజా ఆరోగ్య శాఖ పేర్కొంది. 734 మంది క్షతగాత్రులుగా మారారని తెలియజేసింది. గాజాలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది.
Comments
Please login to add a commentAdd a comment