గాజా స్ట్రిప్‌లో హమాస్ ఆయుధ కర్మాగారంగా భావిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌ను పరిశీలిస్తున్న ఇజ్రాయెల్ సైనికుడు
ఖాన్ యూనిస్: హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ యుద్ధం మరో మలుపు తిరిగింది. గాజా్రస్టిప్‌లో అతిపెద్ద నగరమైన గాజా సిటీని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు తీవ్రతరం చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. 100కుపైగా హమాస్ సొరంగాలను పేల్చేశామని, పదుల సంఖ్యలో మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయెల్ ప్రకటించింది.
ఇజ్రాయెల్ పదాతి దళాలు ఉత్తర గాజాలోని గాజా సిటీలోకి అడుగుపెట్టాయి. వీధుల్లో కవాతు చేస్తూ మిలిటెంట్ల కోసం గాలిస్తున్నాయి. గాజా సిటీలో రోగులు, క్షతగాత్రులతోపాటు వేలాదిగా పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న అల్–షిఫా హాస్పిటల్ యుద్ధక్షేత్రంగా మారింది. ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయెల్ సేనలు మోహరించాయి. అల్–షిఫా హాస్పిటల్‌లోనే హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని, సీనియర్ మిలిటెంట్లు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని, దాన్ని ధ్వంసం చేసి తీరుతామని సైన్యం తేలి్చచెప్పింది.
ప్రస్తుతం ఇజ్రాయెల్ జవాన్లు ఆసుపత్రి చుట్టూ 3 కిలోమీటర్ల దూరంలోనే మోహరించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. గాజాలోని అల్–ఖుద్స్ హాస్పిటల్‌పైనా సైన్యం దృష్టి పెట్టింది. ఇక్కడ వంద మందికిపైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. హమాస్ మిలిటెంట్లు అల్–ఖుద్స్ ఆసుపత్రి ప్రాంగణంలో మకాం వేశారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. క్షతగాత్రుల ముసుగులో తప్పించుకుంటున్నారని చెబుతోంది. ఆసుపత్రుల్లో మిలిటెంట్లు ఉన్నారన్న ఇజ్రాయెల్ వాదనను హమాస్ ఖండించింది.
వెస్ట్‌బ్యాంక్‌పై దాడి.. 11 మంది మృతి
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య గురువారం 10,812కు చేరుకుంది. మరో 2,300 మంది శిథిలాల కిందే ఉండిపోయారు. వారు మరణించి ఉంటారని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోనూ హింసాకాండ కొనసాగుతోంది. గురువారం వెస్ట్‌బ్యాంక్‌లోని జెనిన్ శరణార్థి శిబిరంపై జరిగిన ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 11 మంది పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. మరో 20 మంది గాయపడ్డారు. పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఆ ఫొటో జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలి
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని చిత్రీకరించిన ఫొటో జర్నలిస్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ గురువారం డిమాండ్ చేసింది. గాజాకు చెందిన ఈ జర్నలిస్టులు అంతర్జాతీయ మీడియా సంస్థల తరఫున పనిచేస్తున్నారు. హమాస్ దాడిని కెమెరాలతో చిత్రీకరించారు. ఫొటోలు తీశారు.
మీడియాకు విడుదల చేశారు. హమాస్ దాడి గురించి వారికి ముందే సమాచారం ఉందని, అందుకే కెమెరాలతో సర్వసన్నద్ధమై ఉన్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. మానవత్వంపై జరిగిన నేరంలో వారి పాత్ర ఉందని మండిపడింది. వారి వ్యవహార శైలి పాత్రికేయ ప్రమాణాలకు విరుద్ధమని ఆక్షేపించింది. సదరు ఫొటోజర్నలిస్టులు పనిచేస్తున్న మీడియా సంస్థకు ఇజ్రాయెల్ లేఖలు రాసింది.
ఉత్తర గాజా నుంచి దక్షిణ గాజాకు..
ఉత్తర గాజా–దక్షిణ గాజాను కలిపే ప్రధాన రహదారిని ఇజ్రాయెల్ సైన్యం వరుసగా ఐదో రోజు తెరిచి ఉంచింది. నిత్యం వేలాది మంది జనం ఉత్తర గాజా నుంచి వేలాది మంది దక్షిణ గాజాకు పయనమవుతున్నారు. పిల్లా పాపలతో కాలినడకనే తరలి వెళ్తున్నారు. కొందరు కట్టుబట్టలతో వెళ్లిపోతున్నారు. ఉత్తర గాజాలో హమాస్ స్థావరాలపై దాడులు ఉధృతం చేస్తామని, సాధారణ ప్రజలంతా దక్షిణ గాజాకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది.
గాజాలో జనం సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి, మానవతా సాయం అందించడానికి వీలుగా ప్రతిరోజూ 4 గంటలపాటు దాడులకు విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment