వాషింగ్టన్: అమెరికా, ఉ.కొరియాల మధ్య నెలకొన్న అణు ఉద్రిక్తతల నేపథ్యంలో జపాన్ భూభాగం, కొరియా ద్వీపకల్పంపై అమెరికా యుద్ధ విమానాలు శుక్రవారం విన్యాసాలు నిర్వహించాయి. జపాన్, దక్షిణ కొరియా యుద్ధ విమానాలు వెంట రాగా అమెరికా సూపర్ సోనిక్ బీ–1బీ లాన్సర్ విమానాలు కొరియా గగనతలంపై చక్కర్లు కొట్టాయి. ఆదివారం నుంచి జపాన్, దక్షిణ కొరియాల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటనకు సన్నాహకంగా నిర్వహించిన ఈ డ్రిల్‌ను ‘ఆకస్మిక అణు దాడి విన్యాసాలు’గా ఉత్తర కొరియా తీవ్రంగా తప్పుపట్టింది.
అణ్వాయుధాల్ని మోహరించడం ద్వారా సామ్రాజ్యవాద అమెరికా అణు యుద్ధానికి ఆజ్యం పోసేందుకు చూస్తోందని, అమెరికా చర్యలకు బెదిరే ప్రసక్తే లేదని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. గ్వామ్‌లోని అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి రెండు బీ–1బీ లాన్సర్ యుద్ధ విమానాలు పశ్చిమ జపాన్‌లో ఆ దేశ ఎయిర్ ఫోర్స్ విమానాలతో కలిసి సంయుక్త విన్యాసాలు జరిపాయని అమెరికా పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అనంతరం లాన్సర్ విమానాలు యెల్లో సీపై కొరియా యుద్ధ విమానాలతో కలిసి విన్యాసాల్లో పాల్గొని.. గ్వామ్‌లోని యుద్ధ విమానాల స్థావరానికి తిరిగి చేరుకున్నాయని తెలిపింది. పసిఫిక్ ప్రాంతంలో ఉమ్మడి యుద్ధ విన్యాసాల్లో భాగంగానే ఇవి కొనసాగాయని, కొరియా ద్వీపకల్పంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో వీటికి ఎలాంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో అమెరికా స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment