ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో యుద్ధ నౌకపై విన్యాసాలు చేస్తున్న సిబ్బంది
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారతదేశ నౌకాదళ శక్తి సామర్థాల్ని చూసి సంద్రం ఉప్పొంగింది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశ రక్షణ విషయంలో అగ్రరాజ్యాలతో పోటీపడుతూ.. తన పాటవాన్ని భారత నౌకాదళం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. సమరానికి ఏ క్షణమైనా సన్నద్ధమంటూ సంద్రంలో సవాల్ చేస్తూ నాలుగు వరుసల్లో నిలుచున్న యుద్ధ నౌకలు.. త్రివర్ణ పతాకానికి సగర్వంగా సెల్యూట్ చేస్తూ శత్రు సైన్యాన్ని జలసమాధి చేసేందుకు సిద్ధమంటూ సబ్‌మెరైన్‌లు.. గాలికంటే వేగంగా దూసుకెళ్తూ మిగ్ విమానాలు హోరెత్తించాయి. గగన తలంలో దేశ గర్వానికి ప్రతీకలుగా యుద్ధ విమానాల విన్యాసాలు.. సముద్ర కెరటాలతో పోటీపడుతూ చేతక్ హెలికాప్టర్లు అలరించాయి. యుద్ధమైనా, సహాయమైనా క్షణాల్లో వాలిపోతామంటూ మెరైన్ కమాండోలు చేసిన విన్యాసాలు.. వెరసి భారత నౌకాదళ సర్వ సంపత్తి ఒకేచోట చేరి నిర్వహించిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాలు మొత్తం విశాఖ వైపు చూసేలా చేసింది. మొత్తంగా త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిర్వహించిన భారత యుద్ధ నౌకల సమీక్ష ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్‌ఆర్–2022) ఆద్యంతం ఆకట్టుకుంది.
గౌరవ వందనం
భారతదేశ చరిత్రలో ఇది 12వ ఫ్లీట్ రివ్యూ. దేశ తూర్పు తీరంలో మూడో సమీక్షగా విశాఖలో జరుగుతున్న పీఎఫ్‌ఆర్ సోమవారం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి హార్బర్‌కు రాకముందు 150 మంది సెయిలర్స్ గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. 9 గంటలకు రాష్ట్రపతి హార్బర్ చేరుకున్నారు. ఈయనకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, నాలుగు నౌకాదళ కమాండ్‌ల చీఫ్‌లు వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా, వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, వైస్ అడ్మిరల్ హంపిహోలి, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్ తదితరులు స్వాగతం పలికారు. ముందుగా 21 తుపాకులతో భారత నౌకాదళం సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి.. ప్రెసిడెన్షియల్ యాచ్‌గా సిద్ధంగా ఉన్న ఐఎన్‌ఎస్ సుమిత్ర యుద్ధనౌకలో సతీసమేతంగా సమీక్షకు బయలుదేరారు. నౌక ముందుభాగంలో ప్రత్యేకంగా సిద్ధంచేసిన డెక్‌పై రాష్ట్రపతి దంపతులు ఆశీనులు కాగా.. రెండువైపులా రక్షణ మంత్రి, గవర్నర్, నౌకాదళాధిపతి కూర్చున్నారు.
నౌకాదళ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్. చిత్రంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నౌకాదళాధిపతి హరికుమార్
నౌకాదళ పాటవాల్ని సమీక్షించిన రాష్ట్రపతి
ఈ ఏడాది పీఎఫ్‌ఆర్‌కు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్రపతిని తీసుకుని ప్రెసిడెన్షియల్ యాచ్ ఐఎన్‌ఎస్ సుమిత్ర ముందుకు సాగుతుండగా.. సుమిత్ర కాన్వాయ్‌గా ఐఎన్‌ఎస్ సుమేధ, ఐఎన్‌ఎస్ సావిత్రి, టాంగో–39, టాంగో–40 యుద్ధనౌకలు బయల్దేరాయి. బంగాళాఖాతం సముద్ర జలాల్లో నాలుగు వరుసల్లో లంగరు వేసిన యుద్ధనౌకల మధ్యగుండా సాగుతూ వాటిపై నుంచి నౌకాదళ సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని త్రివిధ దళాధిపతి స్వీకరించారు. యుద్ధ నౌకల సిబ్బంది ప్రతి వార్ షిప్ ముందు నిల్చుని టోపీలని చేతితో తిప్పుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. మొత్తం షిప్‌లను సమీక్షించిన తర్వాత సబ్‌మెరైన్ కాలమ్‌లో ఉన్న ఐఎన్‌ఎస్ వేలా, ఐఎన్‌ఎస్ సింధుకీర్తి, ఐఎన్‌ఎస్ సింధురాజ్ జలాంతర్గాముల్ని ఆయన సమీక్షించారు.
అబ్బురపరిచిన విన్యాసాలు
ఇక రెండు గంటలకు పైగా సాగిన నౌకాదళ సమీక్షలో ఇండియన్ నేవీ.. తన సామర్థ్యాల్ని ఘనంగా ప్రదర్శించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన చేతక్ హెలికాప్టర్లతో పాటు సీకింగ్స్, కామోవ్, యుటిలిటీ హెలికాఫ్టర్ (యూహెచ్)–త్రీహెచ్, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్)లతో పాటు డార్నియర్స్, మిగ్–29కే, హాక్స్, మల్టీ మిషన్ మేరీటైమ్ ఎయిర్‌క్రాఫ్టŠస్ పీ8ఐ, ఐఎల్ 38 మొదలైన యుద్ధ విమానాలు నిర్వహించిన విన్యాసాలు ఉత్కంఠగా సాగాయి. యుద్ధ నౌకల సమీక్ష అనంతరం ఒకేసారి అన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు గాల్లోకి దూసుకుపోతూ ఫ్లై పాస్ట్ నిర్వహించాయి. ఈ యుద్ధ విమానా విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఈ సందర్భంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల డెమోతో మెరైన్ కమాండోలు నిర్వహించిన వాటర్ పారా జంప్స్, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తపాలా బిళ్ల విడుదల చేసిన రాష్ట్రపతి
ప్రతి పీఎఫ్‌ఆర్ లేదా ఐఎఫ్‌ఆర్ నిర్వహించిన తర్వాత దాని పేరుతో పోస్టల్ స్టాంప్, కవర్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం పీఎఫ్‌ఆర్–2022 జ్ఞాపకార్థం తపాలా శాఖ రూపొందించిన స్టాంప్, పోస్టల్ కవర్‌ని నేవల్ బేస్‌లో రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర కమ్యునికేషన్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ జె చౌహాన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment