
న్యూయార్క్: ఉత్తర కొరియా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించట్లేదు. బలప్రదర్శనలో భాగంగా ఉత్తరకొరియా తూర్పు తీరం మీదుగా తమ యుద్ధ విమానాలను పంపినట్లు అమెరికా రక్షణ శాఖ శనివారం ప్రకటించింది. ఎలాంటి ముప్పునైనా దీటుగా ఎదుర్కొనే సత్తా అమెరికాకు ఉందన్న అధ్యక్షుడు ట్రంప్ మాటలు నిజమని చూపేందుకే ఈ కసరత్తు చేసినట్లు అమెరికా రక్షణ కార్యాలయ అధికార ప్రతినిధి డానా వైట్ చెప్పారు. అమెరికా వైమానిక దళానికి చెందిన బీ–1బీ లాన్సర్ బాంబర్లు, ఎఫ్–15సీ ఈగల్ ఫైటర్ విమానాలు ఉత్తరకొరియా జలాల మీదుగా అంతర్జాతీయ గగనతలంపై వెళ్లాయని చెప్పారు.