![Israel Palestine War : War death toll nears 1800 as Hamas attacks Israeli city of Ashkelon after warning residents to leave - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/11/Israel-Hamas%20War%2C.jpg.webp?itok=Tw5EuN6S)
గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్‌లో భవన శిథిలాలను తొలగిస్తున్న పాలస్తీనియన్లు
జెరూసలేం/లండన్/వాషింగ్టన్/గాజా సిటీ/న్యూఢిల్లీ: ఇజ్రాయెల్ వైమానిక దాడులతో గాజా సిటీ దద్దరిల్లిపోతోంది. వందలాది భవనాలు ధ్వంసమవుతున్నాయి. శిథిలాలు దర్శనమిస్తున్నాయి. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం నాలుగో రోజుకు చేరింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గర్జించాయి. గాజాపై బాంబుల వర్షం కురిపించాయి. ఇరువైపులా ఇప్పటికే దాదాపు 1,800 మంది మరణించారు. ఇజ్రాయెల్‌లో 1,000 మందికిపైగా, గాజా, వెస్ట్‌బ్యాంకులో 800 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
కొన్ని ప్రాంతాల్లో శవాల దిబ్బలు కనిపించాయన్నారు. దాడులు, ప్రతిదాడుల్లో వేలాది మంది క్షతగాత్రులుగా మారారు. అంతర్జాతీయ సమాజం నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు వెల్లువెత్తుతోంది. హమాస్ మిలిటెంట్ల ఘాతుకాలను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. శత్రువులపై తమ ఎదురుదాడి కొన్ని తరాలపాటు ప్రతిధ్వనించేలా ఉంటుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.
ఆయన తాజాగా జాతినుద్దేశించి ప్రసంగించారు. తమ లక్ష్యం కేవలం హమాస్ మాత్రమేనని అన్నారు. మరోవైపు ఇజ్రాయెల్ గనుక తమపై వైమానిక దాడులు ఇలాగే కొనసాగిస్తే.. ఇప్పటికే తమ అ«దీనంలో ఉన్న బందీలను చంపేస్తామని హమాస్ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. దాడులు వెంటనే ఆపాలని హమాస్ డిమాండ్ చేస్తోంది.
ఇక భూభాగం నుంచి యుద్ధం!
దేశ సరిహద్దులపై పూర్తి పట్టు సాధించామని, తీవ్రవాదులు చొరబడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తమ దేశంలో వందలాదిగా హమాస్ మిలిటెంట్ల మృతదేహాలను గుర్తించామని తెలియజేసింది. తమ దాడుల్లో వారు మృతిచెందినట్లు పేర్కొంది. హమాస్‌తోపాటు ఇతర మిలిటెంట్ గ్రూప్‌లు తమ దేశం నుంచి 150కిపైగా జనాన్ని బందీలుగా తీసుకెళ్లాయని ఇజ్రాయెల్ తెలిపింది. వీరిలో సైనికులు, సాధారణ పౌరులు ఉన్నారని వివరించింది. హమాస్ అ«దీనంలో ఉన్న తమ వారిని వెంటనే విడిపించాలని బందీల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. బందీలను క్షేమంగా వెనక్కి తీసుకొస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలీ కోహెన్ చెప్పారు.
బందీలకు ఏమైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హమాస్‌ను హెచ్చరించారు. గాజాపై భూభాగం గుండా దాడి చేయాలని ఇజ్రాయెల్ సైన్యం నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం 3 లక్షల రిజర్వ్ సైనికులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి దాడి గాజాపై చివరిసారిగా 2014లో జరిగింది. ఇదిలా ఉండగా, శనివారం కారులో పారిపోతున్న ఇద్దరు హమాస్ తీవ్రవాదుల ను ఇజ్రాయెల్ బోర్డర్ పోలీసులు బైక్‌లపై వెంటాడి కాలి్చచంపిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఇజ్రాయెల్‌కు భారతీయుల అండదండలు: మోదీ
ఉగ్రవాదాన్ని భారత్ బలంగా, నిస్సందేహంగా వ్యతిరేకిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అరికట్టాల్సిందేనని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. తమ దేశంపై హమాస్ మిలిటెంట్ల దాడులు, తదనంతర పరిస్థితుల గురించి వివరించారు. అనంతరం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుత విపత్కర సమయంలో భారతీయులు ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తున్నారని వెల్లడించారు. తమ మద్దతు ఇజ్రాయెల్‌కు ఉంటుందని చెప్పారు. తనకు ఫోన్ చేసి, తాజా పరిస్థితిని వివరించిన నెతన్యాహూకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
మద్దతు ప్రకటించిన యూకే ప్రధాని రిషి సునాక్
ఇజ్రాయెల్‌కు తమ మద్దతు కచి్చతంగా ఉంటుందని యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. హమాస్ రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. యూకేలోని యూదుల రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిషి సునాక్ మంగళవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కాల్జ్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో మాట్లాడారు. ఇజ్రాయెల్–హమాస్ ఘర్షణపై చర్చించారు. వారితో కలిసి ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. హమాస్ ఉగ్రవాద చర్యలను సహించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. తనను తాను రక్షించుకొనే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని, ఆ విషయంలో ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
అంతర్జాతీయ విమానాల రాకపోకలు బంద్
ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇజ్రాయెల్ నుంచి తమ విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రకటించాయి. టెల్ అవివ్‌లోని బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మంగళవారం పలు విమానాలు నిలిచిపోయాయి. కొన్ని ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఫ్రాన్స్, కాథీ పసిఫిక్ ఎయిర్‌వేస్, వర్జిన్ అట్లాంటిక్ వంటి సంస్థలు ఇజ్రాయెల్‌కు విమానాలు నడపడం లేదని వెల్లడించాయి. యూరప్, ఆసియాలోని వివిధ విమానయాన సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి.
స్వచ్ఛంద సంస్థల సాయం
గాజాలో యుద్ధంలో చిక్కుకున్న సామాన్య ప్రజలను ఆదుకోవడానికి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు మందుకొస్తున్నాయి. ఇజ్రాయెల్ అష్ట దిగ్బంధనం చేయడంతో గాజాకు నీరు, ఔషధాలు, విద్యుత్ వంటి సౌకర్యాలు ఆగిపోయాయి. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈజిప్షియన్ రెడ్ క్రాస్ సంస్థ 2 టన్నులకుపైగా ఔషధాలను గాజాకు పంపించింది. ఆహారం, ఇతర నిత్యావసరాలు కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గాజాలోని ఆసుపత్రుల్లో రోగులకు ఔషధాలు అందిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బాధితుల కోసం నిధులు సేకరిస్తున్నామని పేర్కొంది.
పాలస్తీనియన్లు చెల్లాచెదురు
హమాస్ మిలిటెంట్ల పాలనలో ఉన్న గాజా స్ట్రిప్ జనాభా 20.3 లక్షలు. వీరంతా పాలస్తీనా జాతీయులు. ఇజ్రాయెల్‌పై హమాస్ ముష్కరుల దాడి తర్వాత వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హమాస్‌పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌పై విరుచుకుపడుతోంది. వైమానిక దాడులు కొనసాగిస్తోంది. రాకెట్లు, క్షిపణులు ప్రయోగిస్తోంది. దీంతో పాలస్తీనావాసులు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వారంతా చెల్లాచెదురవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1,80,000 మందికిపైగా పాలస్తీనియన్లు ఐక్యరాజ్యసమితి శిబిరాలకు చేరుకున్నారు.
అక్కడే తలదాచుకుంటున్నారు. బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. హమాస్ దుశ్చర్య తమకు ప్రాణసంకటంగా మారిందని గాజా స్ట్రిప్ పాలస్తీనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కోసం గాజా సిటీలోని పాఠశాలల్లో పదుల సంఖ్యలో తాత్కాలిక శిబిరాలను ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసింది. మరోవైపు నగరంలో విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోవడంతో జనం కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఆహారం దొరకడం లేదు. పిల్లల పరిస్థితి చూసి కన్నీళ్లు ఆగడం లేదని బాధితులు వాపోతున్నారు.
ఇజ్రాయెల్ దాడుల్లో ఐక్యరాజ్యసమితి శిబిరాలు కూడా ధ్వంసమవుతున్నాయి. ఆదివారం, సోమవారం జరిగిన దాడుల్లో ఆరు శిబిరాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ ఎంతమంది చనిపోయారన్నది తెలియరాలేదు. పొరుగుదేశం ఈజిప్టుకు వలస వెళ్లేందుకు కొందరు బాధితులు ప్రయత్నిస్తున్నారు. ముందుగా పేర్లు రిజిస్టర్ చేసుకున్నవారికే ఈజిప్టు నుంచి అనుమతి లభిస్తోంది. మరోవైపు తమ లక్ష్యం హమాస్ మిలిటెంట్లు మాత్రమేనని, సామాన్య ప్రజలు కాదని ఇజ్రాయెల్ చెబుతోంది. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ఆపరేషన్ కొనసాగిస్తున్నామని అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment