Tawang
-
భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా కీలక వ్యాఖ్యలు..
అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ అనంతరం భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై చైనా తొలిసారి స్పందించింది. సరిహద్దులో స్థిరత్వం నెలకొల్పి ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాము సిద్ధమని చెప్పింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడాలని ఆకాక్షించింది. ఈమేరకు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వాస్ అధికారిక ప్రకటనలో తెలిపారు. భారత్‌తో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని, దౌత్యపరంగా, సైనిక పరంగా రెండు దేశాలు టచ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. సరిహద్దులో స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని చెప్పారు. సరిహద్దులో శాంతి స్థాపనకు డిసెంబర్ 20న చైనాతో 17వసారి కమాండర్ స్థాయి చర్చలు జరిపింది భారత్. పశ్ఛిమ సెక్టార్లో శాంతియుత వాతావరణానికి రెండు దేశాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలోనే చైనా ప్రకటన విడుదల చేసింది. చదవండి: Covid-19: కోట్లలో కోవిడ్ కేసులు.. చైనా దిక్కుమాలిన చర్య.. -
తీరు మారితేనే సామరస్యం
దౌత్యరంగంలో మాటలకూ, చేతలకూ కాస్తయినా పొంతన ఉండాలి. లేనట్టయితే దేశాల మధ్య పరస్పర విశ్వాసం అడుగంటుతుంది. అవి ఇరుగు పొరుగు దేశాలైనప్పుడూ, వాటిమధ్య తీర్చు కోవాల్సిన జటిల సమస్యలున్నప్పుడూ మరింత జాగ్రత్తగా మెలగాలి. మొదటినుంచీ చైనా ఆ విషయంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. అదును చూసి దాడికి దిగటం, ఆ తర్వాత భారత్‌దే తప్ప న్నట్టు మాట్లాడటం, ఏమీ ఎరగనట్టు చర్చలకు రావటం దానికి రివాజుగా మారింది. ఇంతక్రిత మైనా, ఈ రెండేళ్లనుంచైనా ఇదే వరస. సరిహద్దు ఘర్షణలపై ఈ నెల 20న చర్చలు జరుగుతాయన్న అవగాహన చైనాకుంది. అయినా అంతకు రెండు వారాలముందు... అంటే 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో గిల్లికజ్జాలకు దిగింది. దాని తీవ్రత గురించిన స్పష్టమైన సమాచారం విడుదల చేయకపోయినా ‘ఈ ఉదంతంలో ఇరు పక్షాల సైనికుల్లోనూ కొందరు స్వల్పంగా గాయ పడ్డా’రని మన రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత్ సైనిక కమాండర్ చొరవ తీసుకుని చైనా కమాండర్‌తో చర్చలు జరపటంతో సామరస్యత నెలకొందని ఆ ప్రకటన సారాంశం. చైనాతో మనకున్న 4,057 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ ప్రస్తుతానికి సరిహద్దుగా ఉంది. రెండేళ్లుగా పశ్చిమ సెక్టార్ (లద్దాఖ్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతం)లో తరచుగా చోటుచేసుకుంటున్న ఘర్షణలపై ఇంకా చర్చల ప్రక్రియ సాగుతోంది. మూడురోజులనాటి చర్చలు అందులో భాగమే. ఈ చర్చల ప్రక్రియ పర్యవసానంగా ప్యాంగాంగ్ సో ప్రాంతంలో నిరుడు ఫిబ్రవరిలో, గోగ్రా హాట్ స్ప్రింగ్స్ లోని 17వ పెట్రోలింగ్ పాయింట్ నుంచి నిరుడు ఆగస్టులోనూ, అదే ప్రాంతంలోని 15వ పెట్రో లింగ్ పాయింట్ నుంచి నవంబర్ మొదట్లోనూ రెండు దేశాల సైన్యాలు వెనక్కు తగ్గాయి. ఆఖరికి 20 మంది భారత జవాన్లను బలి తీసుకున్న తవాంగ్ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో కూడా నెమ్మ దిగా సామరస్యం నెలకొంది. ఇలా పరిస్థితులు ఎంతో కొంత కుదుటపడుతున్నాయనుకుంటున్న దశలో తాజా చర్చలకు ముందే తూర్పు సెక్టార్లో చొరబాటుకు ప్రయత్నించటం చైనా కపటనీతికి నిదర్శనం. చైనాతో కోర్ కమాండర్ల స్థాయిలో ఇంతవరకూ 16 విడతల చర్చలు జరిగాయి. ప్రతి సంద ర్భంలోనూ మన ప్రభుత్వం చర్చల తేదీని ముందుగానే ప్రకటించటం, ఆ చర్చలు పూర్తయ్యాక అందులోని ముఖ్యాంశాలను వివరిస్తూ ప్రకటన విడుదల చేయటం రివాజు. కానీ ఈసారి మాత్రం 17వ విడత చర్చల విషయంలో ఆ సంప్రదాయాన్ని పాటించలేదు. చర్చలు పూర్తయిన మూడు రోజుల తర్వాత మాత్రమే ప్రకటన వెలువడింది. కారణాలు ఊహించటం కష్టమేమీ కాదు. తవాంగ్‌లో జరిగిన తాజా ఘర్షణలపై పార్లమెంటు ఉభయ సభల్లోనూ అలజడి రేగటం, ప్రభుత్వం ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేయటం ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఇలాంటి సమయంలో చర్చలంటే భావోద్వేగాలు మరింత పెరుగుతాయి. అంతమాత్రాన ఏం జరుగుతు న్నదో దేశ ప్రజలకు వెంటవెంటనే తెలియజేయకపోవటం సరికాదని ప్రభుత్వం గుర్తించాలి. ఆ సంగతలా ఉంచి నిరంతర ఘర్షణ వాతావరణం ఏ దేశానికీ మంచిది కాదు. అయితే ఎల్లకాలమూ ఘర్షణ వాతావరణం ఉండటం సరికాదు. స్పష్టమైన సరిహద్దు లేనిచోట భారీగా సైన్యాలను మోహ రించటం, ఎప్పుడో ఒకప్పుడు ఫలానా ప్రాంతం తమదేనంటూ కయ్యానికి దిగటం, ఘర్షణలు చోటుచేసుకోవటం పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది. అది చివరకు యుద్ధంగా పరిణమించినా ఆశ్చర్యంలేదు. కనుక ఎంతటి క్లిష్ట సమస్యకైనా చర్చల ప్రక్రియ మాత్రమే పరిష్కార మార్గం. అదే సమయంలో స్నేహం నటిస్తూనే ద్రోహ చింతనతో మెలగుతున్న చైనా కపటనీతిని బయటపెట్టడం కూడా అవసరం. మన సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ మనోజ్ పాండే గత నెలలో ఎల్ఏసీ గురించి చెబుతూ అక్కడ పరిస్థితి స్థిరంగానే ఉన్నా అనూహ్యంగా ఉన్నదని వ్యాఖ్యానించిన సంగతి గుర్తుంచుకోవాలి. ఒకపక్క కొవిడ్‌తో చైనా అల్లకల్లోలంగా ఉంది. కఠినమైన ఆంక్షలకు నిరసనగా రోడ్లపైకి వచ్చిన జనమే ఇప్పుడు బయటకు రావటానికి హడలెత్తుతున్నారు. ఏం చేయాలో చైనా సర్కారుకు పాలు బోవటం లేదు. దాన్నుంచి జనం దృష్టి మళ్లించటానికి కూడా ఎల్ఏసీలో చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడి ఉండొచ్చు. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తూనే, వాటితో సంబంధం లేకుండా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకుందామని చైనా 80వ దశ కంలో ముందుకొచ్చింది. అందువల్ల గత కొన్ని దశాబ్దాలుగా మనకన్నా ఎక్కువ లాభపడుతున్నది కూడా చైనాయే. కానీ అంతర్గతంగా అవసరం పడినప్పుడల్లా ఎల్ఏసీ వద్ద మంట పెట్టాలని చూస్తోంది. ఈ పోకడలు ఎంత త్వరగా విరమిస్తే చైనాకు అంత మంచిది. ఘర్షణలు ముదురుతున్న తీరు చూశాక మన దేశం ఎల్ఏసీలోని మూడు సెక్టార్లలోనూ చైనాతో సమానంగా మౌలిక సదుపా యాల మెరుగుకు చర్యలు తీసుకోవటం మొదలెట్టింది. నిర్ధారిత సరిహద్దు లేనిచోట ఇరు దేశాలూ సైన్యాలను మోహరిస్తే, ఏదో ఒక పక్షం కయ్యానికి దిగుతుంటే సహజంగానే పరిస్థితులు ప్రమాద కరంగా పరిణమిస్తాయి. కనుక విజ్ఞతతో మెలగటం అవసరమనీ, అంతర్గత విషయాల్లోనైనా, విదేశీ సంబంధాల్లోనైనా శాంతి సుస్థిరతలు ఏర్పడాలంటే కొన్ని విలువలనూ, నియమ నిబంధనలనూ పాటించటం ముఖ్యమనీ చైనా నాయకత్వం గ్రహించాలి. -
ఫలితం లేకుండానే ముగిసిన భారత్–చైనా చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లోని తవాంగ్ వద్ద రెండు దేశాల ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో భారత్, చైనాల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. అయితే, తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభన తొలిగేదిశగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని భారత్, చైనా పేర్కొన్నాయి. అపరిష్కృత సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాలంటూ ఇరు దేశాల నేతలు అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా దాపరికాలు లేకుండా మరింత వివరణాత్మకంగా చర్చలు జరిపినట్లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. క్షేత్ర స్థాయిలో సరిహద్దుల్లో భద్రతను, స్థిరతను కాపాడుకోవాలని అంగీకరించినట్లు చెప్పాయి. సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తూ, విభేదాలకు ఆమోదయోగ్య పరిష్కారాన్ని త్వరగా కనుగొనాలని పేర్కొన్నాయి. ఈ నెల 20న సరిహద్దుల్లోని చైనా భూభాగంలో చుషుల్–మోల్దో వద్ద 17వ విడత భారత్–చైనా కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. -
చైనా వ్యూహానికి దూకుడే విరుగుడా?
భారత, చైనా సైనికుల మధ్య తవాంగ్ ప్రాంతంలో జరిగిన ఘటన అనూహ్యమేమీ కాదు. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు చైనా దూకుడుగా వ్యవహరిస్తుందన్నది నిర్వివాదాంశం. చైనా దృష్టిలో ఆసియాలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. అందుకే తన షరతులతోనే సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా నాయకత్వం భావిస్తోంది. అయితే భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి. చైనా మన మాటలు వినాలంటే, మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలి. యాంగ్సీలోనూ చైనా దళాలు వెంటనే వెనక్కు తగ్గడమూ ఈ విషయాన్నే సూచిస్తోంది! అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమభాగంలో... భారత, చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ నెల తొమ్మిదిన తవాంగ్ ప్రాంతంలోని యాంగ్సీ వద్ద ఇరు వర్గాల మధ్య జరిగిన ఈ ఘటన అనూహ్యమేమీ కాదు. ఏదో ఒక రోజు తప్పదన్న అంచనాలు చాలాకాలంగా ఉన్నాయి. వాస్తవాధీనరేఖ వెంబడి చాలాకాలంగా ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూండటం ఇందుకు కారణం. ఈ ఘర్షణకు ముందస్తు సూచన ఏదైనా ఉందీ అంటే... అది భారత – అమెరికా మిలటరీ ప్రదర్శనలకు పొరుగుదేశం చైనా పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేయడం! వాస్తవాధీన రేఖకు వంద కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ సెంట్రల్ సెక్టర్లో భారత, అమెరికా మిలటరీ దళాలు కలిసికట్టుగా విన్యాసాలు చేసిన విషయం తెలిసిందే. యాంగ్సీ వద్ద చెలరేగిన ఘర్షణలు తూర్పు లదాఖ్ ఘటనల తరువాత రెండేళ్లకు జరిగాయి. ఈ రకమైన తోపు లాటలు, ఘర్షణలు, పరస్పర దాడులు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింల లోని వివాదాస్పద ప్రాంతాల్లో చాలాకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 2020 జూన్‌లో గల్వాన్ లోయలో రెండుపక్కల సైనికులకు ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో తాజా ఘటనలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులు ఈ మధ్యకాలంలో వీధిపోరాటల విషయంలో బాగా ఆరితేరినట్లు కనిపి స్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి వీరు ముళ్ల్లతో కూడిన కర్రలతో, టేజర్లతో(కరెంట్ షాక్ కొట్టే ఆయుధం) ప్రత్యర్థులపైకి విరుచుకుపడు తున్నారు. మందు గుండు ఆయుధాలు వినియోగించడం ఇక్కడ సాధ్యం కాదు మరి! గల్వాన్ ఘర్షణ... ఫలితంగా జరిగిన ప్రాణనష్టం... భౌతిక దాడుల విషయంలో పీఎల్ఏ చేసుకున్న మార్పుల తీవ్రత ఎలాంటిదో తెలిపింది. అయితే తవాంగ్ ఘటనకు భారతీయ సైనికులు సర్వసన్న ద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రత్యర్థి బలగాల మోహరింపును అడ్డుకోవడం, అదనపు సిబ్బందితో తమ స్థానాన్ని పదిలపరచు కోవడం, తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. చలికాలంలో తేమతో కూడిన దుస్తులపై టేజర్లు ప్రయోగిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పో వచ్చు. కాబట్టి... భారతీయ సైనికుల కోసం పెద్ద పెద్ద ఆయుధాలు, ఇతర వ్యవస్థలను సమకూర్చడంతోపాటు ఘర్షణలను ఎదుర్కొ నేందుకు ఉపయోగించే పరికరాలనూ అందించాల్సిన అవసర ముంది. పిడిగుద్దులు, ఘర్షణలతో బెదిరించాలని చూస్తున్న శత్రు వును ఎదుర్కునేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. వ్యూహాత్మక సంకేతం అగ్రరాజ్యాల్లో ఒకటైన అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశం... తన సరిహద్దుల్లో వీధిపోరాటాల స్థాయికి దిగజారడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ... ఇవన్నీ తమ అసలు ఉద్దేశాలను వ్యక్తం చేసేందుకు వ్యూహాత్మకంగా ఇస్తున్న సంకేతాలుగా పరిగ ణించాలి. చైనా నాయకత్వం మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పడం! చైనీస్ కమ్యూనిస్టు పార్టీ 20వ కాంగ్రెస్ రెండు నెలల క్రితం బీజింగ్‌లో విజయవంతంగా ముగిసింది. ఇందులోనే ప్రపంచ వేదికపై చైనా వ్యవహారశైలి ఎలా ఉండబోతోందో స్పష్టమైంది. ఇండోనేసియాలో జరిగిన జీ20 సమావేశాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వైఖరి కూడా చైనా ఆధిపత్య ధోరణికి అద్దం పట్టేదే. సుదీర్ఘ శత్రుత్వం కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌లో స్థానిక సరిహద్దు వివాదాలతో ఎలా వ్యవహరించబోయేదీ అధికారికంగానే వివరించారు. సౌత్ చైనా సముద్రంలో తైవాన్‌తో ఉన్న వివాదాలు... కొన్ని ద్వీపాల విషయంలో జపాన్‌తో ఉన్న చిక్కులు, హిమాలయా ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ విషయంలోనూ తమ వైఖరి ఏమిటన్నది అక్కడే నిర్ణయమైంది. తైవాన్, ఇతర సముద్ర సంబంధిత సమస్యలను ఆర్థిక ప్రభా వంతో లేదా బలవంతంగానైనా పరిష్కరించాలని చైనా భావిస్తోంది. అయితే... భారత్ విషయంలోనే చైనా ఆందోళన. ఏకంగా 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖతో కూడిన సరిహద్దు.... దాని వెంబడే గుర్తించిన వివాదాస్పద, సున్నితమైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ సరిహద్దుపై ఉన్న వివాదాలు అన్నీ ఇన్నీ కాదు. సద్దుమణిగేందుకు చైనా ఏ రకమైన అవకాశమూ ఇవ్వలేదు. నిత్యం ఎక్కడో ఒక చోట అగ్గి రాజేస్తూ వివాదాన్ని కొనసాగిస్తోంది. ‘సెంట్రల్ టిబెటెన్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎక్సైల్’, దలైలామా భారత నేలపై ప్రవాసంలో ఉండటం భారత, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో వివాదాస్పదమైన అంశంగా నిలుస్తోంది. అంతేకాకుండా... చైనా దృష్టిలో ఆసియా ప్రాంతంలో తన ఆధిపత్యానికి గండికొట్టగల దేశం భారత్ మాత్రమే. తద్వారా భారత్ అగ్రరాజ్యం స్థాయిని అందుకోగలదని చైనా భావిస్తోంది. అందుకే తన షరతులతోనే భారత్‌తో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని చైనా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇప్పుడప్పుడే సమసేది కాదు తూర్పు లదాఖ్ ప్రాంతంలో పీఎల్ఏతో 2020 మే నెల నుంచి వివాదం మొదలైంది. పలు దఫాలు చర్చలు నడిచినా సాధించింది ఏమీ లేదు. ఫలితంగా భారత సైనికులు దీర్ఘ కాలంపాటు అననుకూల వాతావరణంలో గస్తీ నిర్వహించాల్సి వస్తోంది. భారతీయ సైనికులు కైలాశ్ పర్వత శ్రేణిలోని కీలక ప్రాంతాలను ఆక్రమించినప్పుడు మాత్రమే చర్చలు కొంతైనా ముందుకు సాగాయి అని చెప్పవచ్చు. ఈ పరిణామంతో చైనా ఖంగుతింది. వెంటనే తాము నిర్మించిన ఆవాసాలను, ఇతర నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించింది. పాంగ్యాంగ్ సో ఉత్తరభాగ తీరం వెంబడి తన దళాలను ఉపసంహరించుకుంది కూడా. చైనా మన మాటలు వినాలంటే... మనం దానిపై ఎంతో కొంత పట్టు సాధించాలని చెబుతోంది ఈ ఘటన. యాంగ్సీలోనూ చైనా దళాలు వెనువెంటనే వెనక్కు తగ్గడం కూడా ఈ విషయాన్నే సూచిస్తోంది! ఒక్క విషయమైతే స్పష్టం. వాస్తవాధీన రేఖ వెంబడి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగుతూనే ఉంటాయన్నది మనమూ అంగీకరించాల్సి ఉంటుంది. తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పట్టు సాధించేందుకు పీఎల్ఏ దూకుడుగా వ్యవ హరిస్తుందన్నదీ నిర్వివాదాంశం. అదే సమయంలో ద్వైపాక్షిక సంబంధాలనూ, సరిహద్దు వివాదాలనూ వేర్వేరుగా చూడాలని చైనా ఒత్తిడి తీసుకువస్తుంది. ప్రతిగా భారత్ సరిహద్దుల్లో శాంతి నెలకొంటేనే అన్ని విషయాలను సమగ్రంగా సమీక్షించవచ్చునని అంటోంది. అయితే ఈ పరిస్థితి వల్ల భారత ఆర్మీ ఏడాది పొడవునా... అననుకూల పరిస్థితుల్లో గస్తీ కాయాల్సిన పరిస్థితి కొనసాగనుంది. చైనా ఒకవైపు తన మిలిటరీ దూకుడును కొనసాగిస్తూనే... భారత్‌తో సరిహద్దు వివాదాలను దీర్ఘకాలం నాన్చే ప్రయత్నం చేస్తుందని ప్రస్తుత పరిణామాల ఆధారంగా అంచనా కట్టవచ్చు. ఇందుకు భారత్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. దౌత్యం, మిలిటరీ రెండింటిలోనూ అన్నమాట. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుంటే... యాంగ్సీ, గల్వాన్ లాంటి ఘటనలు జరక్కుండా ముందస్తుగానే నివారించడం ఎంతైనా అవసరం. వ్యాసకర్త మిలిటరీ వ్యవహారాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు..
కయ్యాలమారి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తూ ఈశాన్య రాష్ట్రాలపై గురి పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఇటీవల ఘర్షణల అనంతరం టిబెట్‌లోని వైమానిక స్థావరాల్లో భారీ సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరించి మనపై కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేసింది. మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ మక్సర్ తీసిన హై రిజల్యూషన్ ఉప గ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. మన వైమానిక దళం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కొంది. గగనతలంలో నిరంతరం యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తూ డ్రాగన్ దేశం కార్యకలాపాలను గట్టిగా అడ్డుకుంటామని చాటి చెప్పింది. భవిష్యత్‌లో చైనా నుంచి ఎటు నుంచైనా ముప్పు పొంచి ఉందని ఈ ఛాయా చిత్రాలు హెచ్చరిస్తున్నాయి. బాంగ్డా వైమానిక కేంద్రం డబ్ల్యూజెడ్–7 ‘‘సోరింగ్ డ్రాగన్’’ డ్రోన్, ఈ డ్రోన్‌ని గత ఏడాది చైనా అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. 10 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు. నిఘా వ్యవస్థకు ఈ డ్రోన్ పెట్టింది పేరు. భారత్‌లో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి క్రూయిజ్ క్షిపణులు పని చేసేలా డేటాను ప్రసారం చేసే సామర్థ్యం కూడా ఈ డ్రోన్ కలిగి ఉంది. ఈ తరహా డ్రోన్లు భారత్ వద్ద లేవు. ఇక డిసెంబర్ 14నాటి ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో బాంగ్డాలో ఫ్లాంకర్ టైప్ యుద్ధ విమానాలు రెండు మోహరించి ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు భారత్ దగ్గర ఉన్న ఎస్‌యూ–30ఎంకేఐ మాదిరిగా పని చేస్తాయి. లాసా వైమానిక కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి 260 కి.మీ. దూరం నాలుగు జే–10 యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచింది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీలో ఈ యుద్ధ విమానాలు అత్యంత విశ్వసనీయమైనవిగా గుర్తింపు పొందాయి. 1988 నుంచి వీటిని వాడుతున్న చైనా ఆర్మీకి ఈ యుద్ధ విమానాలు బాక్ బోన్ అని చెప్పొచ్చు. ఇక లాసాలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. రెండో రన్‌వే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. షిగాట్సే వైమానిక కేంద్రం సిక్కిం సరిహద్దుకి 150కి.మీ. దూరం ఇక్కడ చైనా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ)లను మోహరించింది. టిబెట్‌లో మొత్తం రక్షణ వ్యవస్థనే ఆధునీకరిస్తోంది. ఆధునిక యుద్ధ విమానాలైన జే–10సీ, జే–11డీ, జే–15 విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ వినియోగించే జెట్స్‌ను అడ్డుకునే అవకాశాలున్నాయి. బలం పెంచుకుంటున్న ఇరుపక్షాలు 2017లో డోక్లాం సంక్షోభం తర్వాత భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాలపరంగా, సదుపాయాలపరంగా బలం పెంచుకుంటున్నాయి. వివాదాస్పద జోన్లలో భారత్ సైన్యం కదలికల్ని అనుక్షణం అంచనా వేయడానికి చైనా వైమానిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో చైనా మోహరిస్తున్న ఆధునిక యుద్ధ విమానాలు, ఇతర కొత్త ప్రాజెక్టులు, నిర్మాణాలు డ్రాగన్ బలాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయని టిబెట్ ప్రాంతంలో ఆ దేశ మిలటరీ కార్యకలాపాలను నిరంతరం ట్రాక్ చేసే మిలటరీ అనలిస్ట్ సిమ్ టాక్ అభిప్రాయపడ్డారు. టిబెట్, తూర్పు లద్దాఖ్ మీదుగా చైనా బలగాలను అనుసంధానం చేయడానికి కొత్త మార్గాలను నిర్మించే పనిలో డ్రాగన్ దేశం ఉందని చెప్పారు. అస్సాం, బెంగాల్లో మైదాన ప్రాంతాలైన తేజ్‌పూర్, మిసామరి, జోర్హాట్, హషిమారా, బాగ్డోగ్రాలో దశాబ్దాలుగా భారతీయ యుద్ధ విమానాల నిర్వహణ మన దేశానికి ఎంతో కలిసొస్తోంది. కొండ ప్రాంతాల్లోని టిబెట్ వైమానిక స్థావరాల నిర్వహణలో చైనాకు యుద్ధ విమానాల బరువుపై పరిమితులున్నాయి. మనకది లేకపోవడం కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనా, పాక్ భాష
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చైనా వ్యాఖ్యలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. అరుణాచల్‌లోని తవాంగ్‌లో భారత జవాన్లను చైనా సైనికులు కొట్టారని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ నిరంతరం చైనా, పాకిస్తాన్ భాష మాట్లాడుతూ ఉంటారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు. శనివారం నడ్డా మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ను కాంగ్రెస్ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్జికల్ దాడులు, బాలాకోట్ వైమానిక దాడులపై గతంలో రాహుల్ సందేహాలు వ్యక్తం చేశారని, ఇవన్నీ చూస్తుంటే ఆయనకున్న దేశభక్తి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాహుల్ తన వ్యాఖ్యలతో సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. పార్టీని ఖర్గే తన నియంత్రణలోకి తీసుకొని రాహుల్‌ని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీతో అవగాహన ఒప్పందం చేసుకున్నారని, అందుకే ఆ దేశ భాష రాహుల్ మాట్లాడుతూ ఉంటారని ఆరోపించారు. ఆర్మీపై రాహుల్‌కు నమ్మకం లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. -
‘చైనా పే చర్చ’ ఎప్పుడు ?
న్యూఢిల్లీ: ఛాయ్ పే చర్చా అంటూ ప్రతీసారి మాట్లాడే ప్రధాని మోదీ.. కీలకమైన చైనా అంశంపై ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిలదీశారు. ‘అరుణాచల్‌లో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికుల చొరబాటు యత్నంతో దేశ ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించి వారిలో విశ్వాసం పాదుకొల్పేలా ఎప్పుడు మాట్లాడతారు ? అని ప్రధాని మోదీకి ఖర్గే సూటి ప్రశ్నవేశారు. ‘ దేశ ప్రధాన భూభాగంతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే సింహద్వారం ‘సిలిగురి కారిడార్’ భద్రతకు మరింత ముప్పు వాటిల్లేలా చైనా డోక్లామ్‌లో శాశ్వత నిర్మాణాలు పూర్తిచేసినట్లు వార్తలొచ్చాయి. డోక్లామ్ నుంచి జంపేరీ రిట్జ్ వరకు నిర్మాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది దేశ భద్రతను మరింత ప్రమాదంలోకి నెట్టేయడమే. ఇలాంటి కీలక తరుణంలో ‘చైనా పే చర్చ’ ఎప్పుడు నిర్వహిస్తారు?’ అని ఖర్గే శనివారం ట్వీట్‌చేశారు. కాగా, ప్రధాని వీటికి సమాధానాలు చెప్పాల్సిందేనంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ పలు ప్రశ్నలు ట్వీట్‌చేశారు. 1. తూర్పు లద్దాఖ్‌లో 2020 జూన్ 20న భారత భూభాగంలోకి చైనా చొరబడలేదని ఎందుకు చెప్పారు ? 2. 2020 మే నెల ముందువరకు అక్కడి వేలాది కి.మీ.ల విస్తీర్ణంలో పహారా కాసే మన సేనలను ఆ తర్వాత చైనా సైన్యం అడ్డుకుంటే మీరేం చేశారు ? 3. కేబినెట్ ఆమోదించిన ‘పర్వతప్రాంత మెరుపు దాడి దళం’ కార్యరూపం ఎందుకు దాల్చలేదు? -
కేంద్రం మొద్దు నిద్ర: రాహుల్
జైపూర్: చైనా మన మీదకి యుద్ధానికి సన్నాహాలు చేస్తూ ఉంటే కేంద్రం నిద్రపోతోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జైపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చైనా నుంచి మనకు ముప్పు ఉందని రెండు, మూడేళ్లుగా నాకు స్పష్టంగానే తెలుస్తూనే ఉంది. కానీ కేంద్రం దాన్ని దాచి పెడుతూ పట్టనట్టు వ్యవహరిస్తోంది. 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది. 20 మంది సైనికుల ప్రాణాలు తీసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో మన జవాన్లను కొట్టింది. లద్దాఖ్, తవాంగ్‌లో ఘర్షణలు జరిగాయి. ఇన్ని జరిగినా మోదీ సర్కారు మొద్దు నిద్రపోతోంది’’ అంటూ ధ్వజమెత్తారు. చైనా ఆయుధ సంపత్తి, వాటిని నియోగిస్తున్న తీరు చూస్తూ ఉంటే మనపై పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తేటతెల్లమవుతోందన్నారు. బీజేపీని ఓడించేది మేమే కాంగ్రెస్‌ను ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని, ఎప్పటికైనా బీజేపీని ఓడించేది తమ పార్టీయేనని రాహుల్ అన్నారు. ‘‘కాంగ్రెస్ పనైపోయిందంటున్నారు. కానీ బీజేపీ ఎప్పటికైనా కాంగ్రెస్ చేతిలోనే ఓడుతుంది. కాంగ్రెస్‌కు కోట్లాది మంది కార్యకర్తల బలముంది. వారి సేవల్ని పూర్తిగా వినియోగించుకుంటే రాజస్థాన్‌లో అఖండ విజయం ఖాయం’’ అన్నారు. కాంగ్రెస్ నుంచి నేతల నిష్క్రమణను మీడియా ప్రస్తావించగా, ‘పోయేవాళ్లందరినీ పోనిస్తాం. కాంగ్రెస్‌పై నమ్మకమున్న వాళ్లే మాతో ఉంటారు’’ అన్నారు. బీజేపీకి బీ టీమ్ ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి బీ–టీమ్‌గా మారిందని రాహుల్ ఆరోపించారు. ఆప్ లేకుంటే గుజరాత్ ఎన్నికల్లో గెలిచే వాళ్లమన్నారు. ‘‘ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్ఫథం లేదు. దేశానికి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలన్నది కాంగ్రెస్‌కు మాత్రమే తెలిసిన విద్య. వచ్చే ఎన్నికల్లో ఇతర విపక్షాలతో కలిసి పని చేస్తాం. మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అందుకు ప్రణాళికలు రచిస్తున్నారు’’ అన్నారు. హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ తదితరులు రాహుల్‌తో కలిసి నడిచారు. ‘నెహ్రూ భారత్’ కాదిది: బీజేపీ న్యూఢిల్లీ: చైనా యుద్ధానికి వస్తూ ఉంటే కేంద్రం నిద్రపోతోందన్న రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పి కొట్టింన్నిలాంటి మాటలతో సైనికుల స్థైర్యాన్ని రాహుల్ దెబ్బ తీస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విమర్శించారు. ‘‘1962లో మనపై చైనా యుద్ధానికి కాలుదు వ్వినప్పటి నెహ్రూ కాలపు భారత్ కాదిది. మోదీ నేతృత్వంలోని కొత్త నవీన భారత్. కయ్యానికి కాలు దువ్వే వాళ్లకు గట్టిగా జవాబిస్తాం’’ అన్నారు. -
Tawang dominates Parliament: ‘చైనా’పై చర్చించాల్సిందే
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంట చైనా సైనికులతో భారత సేన ఘర్షణ అంశాన్ని పార్లమెంట్లో చర్చించాల్సిందేనన్న ఉభయసభల్లో విపక్షాలు పట్టుబట్టాయి. అయితే, ఈ అంశాన్ని రాజ్యసభ, లోక్‌సభల్లో చర్చించే ప్రసక్తేలేదని ఇరుసభల సభాపతులు తేల్చిచెప్పడంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. బుధవారం ఉదయం లోక్‌సభలో ప్రశ్నావళి ముగియగానే సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి ఈ అంశాన్ని లేవనెత్తారు. ‘1962లో భారత్–చైనా యుద్ధంపై స్వయంగా ప్రధాని నెహ్రూనే చర్చించారు. ఆనాడు 165 మంది సభ్యులకు మాట్లాడే అవకాశమిచ్చారు. ఇప్పుడూ తవాంగ్‌లో చైనా దుందుడుకుపై సభలో చర్చించాల్సిందే’ అని పట్టుబట్టారు. చర్చించాలా వద్దా అనేది సభావ్యవహారాల సలహా కమిటీ భేటీలో నిర్ణయిస్తామని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా స్పష్టంచేశారు. ఇందుకు ఒప్పుకోబోమంటూ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. అంతకుముందు సైతం వేర్వేరు అంశాలపై ప్రభుత్వాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, ఎన్సీ పార్టీల సభ్యులు కొందరు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను దాటి చైనా సైనికులు భారత భూభాగంలోకి వచ్చిన అంశాన్ని చర్చించాలంటూ రాజ్యసభలోనూ విపక్షాలు డిమాండ్ల మోత మోగించాయి. అయితే, ఈ అంశంపై చర్చకు ముందస్తు నోటీసు ఇవ్వనికారణంగా రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ చర్చకు నిరాకరించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, ఆర్జేyీ తదితర పార్టీల సభ్యులు వాకౌట్ చేశారు. -
భారత్-చైనా సైనికుల ఘర్షణపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై స్పందించింది అమెరికా. తవాంగ్ ఘర్షణ తలెత్తగా ఇరు దేశాలు త్వరగా వెనక్కి తగ్గి ఉద్రిక్తతలు సద్దుమణగటం ఆహ్వానించదగ్గ విషయమని అమెరికా శ్వేతసౌధం పేర్కొంది. వైట్‌హౌస్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్ మాట్లాడారు. భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వివాదాస్పద సరిహద్దుల అంశంపై ప్రస్తుత దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ‘ఘర్షణ నుంచి ఇరు పక్షాలు వెనక్కి తగ్గటం ఆహ్వానించదగ్గ విషయం. మేము పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. వివాదాస్పద అంశాలపై ద్వైపాక్షిక మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలి. ఈసారి ఘర్షణ వాతావరణం త్వరగా సద్దుమణిగినందుకు సంతోషం.’ అని తెలిపారు శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్. మరోవైపు.. సరిహద్దులో ఉద్రిక్తతలు సద్దుమణిగేందుకు భారత్ తీసుకున్న చర్యలకు తమ మద్దతు ఉంటుందని పెంటగాన్ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న సుమారు 300 మంది చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారిని భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. భారత సైనికులు చైనా కుతంత్రాన్ని దీటుగా తిప్పికొట్టారని పార్లమెంట్లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఇదీ చదవండి: సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. సరిహద్దులో పరిస్థితులపై ప్రకటన -
చైనా సేనలను తరిమికొట్టాం
న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన సైన్యం పూర్తిస్థాయిలో తిప్పికొట్టిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ‘‘అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో యాంగ్ట్సే ప్రాంతం వద్ద వాస్తవాధీన రేఖను దాటేందుకు, తద్వారా యథాతథ స్థితిని మార్చేందుకు డిసెంబర్ 9న చైనా సైన్యం ప్రయత్నించింది. వాటన్నింటినీ మన సైనికులు చాలా గట్టిగా తిప్పికొట్టారు. మన సైనిక కమాండర్లు సకాలంలో స్పందించడంతో చైనా సైన్యం తోక ముడిచింది’’ అని చెప్పారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయన వేర్వేరుగా ప్రకటన చేశారు. ‘‘ఈ ఘర్షణ ఇరు సైనికుల నడుమ భౌతిక పోరుకూ దారి తీసింది. మనవాళ్లు వీరోచితంగా పోరాడారు. మన భూభాగాల్లోకి చొచ్చుకొచ్చేందుకు చైనా సైన్యం చేసిన ప్రయత్నాలను వమ్ము చేసి వారిని తరిమికొట్టారు’’ అని వివరించారు. ‘‘ఈ ప్రయత్నంలో మనవైపు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగలేదు. కొందరు సైనికులు స్వల్పంగా గాయపడ్డారు’’ అని స్పష్టం చేశారు. ‘‘ఈ ఘటన తర్వాత మన స్థానిక సైనిక కమాండర్, చైనా కమాండర్ మధ్య డిసెంబర్ 11న ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. దీనిపై మన ఆగ్రహాన్ని, అభ్యంతరాలను దౌత్య మార్గాల్లో కూడా చైనాకు తెలియజేశాం. ఇలాంటి దుందుడుకు చర్యలను పునరావృతం చేయొద్దని, సరిహద్దుల వెంబడి శాంతి, సామరస్యాలను కాపాడాలని గట్టిగా చెప్పాం’’ అని వెల్లడించారు. ‘‘మన భూభాగాన్ని ఆక్రమించేందుకు జరిగే ఎలాంటి ప్రయత్నాలనైనా పూర్తిగా తిప్పికొట్టేందుకు, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైన్యం నిత్యం సన్నద్ధంగా ఉంది. సభకు ఈ మేరకు హామీ ఇస్తున్నా’’ అని చెప్పారు. అంతకుముందు తాజా పరిస్థితిపై సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సమీక్ష జరిపారు. గల్వాన్ తరహా ఘర్షణ ► డిసెంబర్ 9 నాటి చైనా ఆక్రమణ యత్నం మరోసారి రెండేళ్లనాటి ‘గల్వాన్ లోయ’ ఉదంతాన్ని తలపించింది. విశ్వసనీయ సమాచారం మేరకు... చైనా సైనికులు అచ్చం అప్పటి మాదిరిగానే ఇనుప ముళ్లతో కూడిన లావుపాటి ఆయుధాలు, కర్రల వంటివాటితో దాడికి దిగారు. అప్పట్లాగే పరిస్థితి మరోసారి బాహాబాహీకి కూడా దారితీసింది. ► తవాంగ్ పరిసరాల్లో యాంగ్ట్సే వద్ద 17 వేల అడుగుల పై చిలుకు ఎత్తున్న మంచు శిఖరాలపై పట్టు కోసం చైనా ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే దాదాపు రెండేళ్ల అనంతరం మరోసారి మన భూభాగాల్లోకి సైలెంటుగా చొచ్చుకొచ్చేందుకు డిసెంబర్ 9న దొంగ ప్రయత్నం చేసింది. ► అయితే అక్కడ ఎటు చూసినా మన సైన్యం భారీగా మోహరించిన తీరుతో చైనా దళాలు అవాక్కైనట్టు సమాచారం. వాటి చొరబాటు యత్నాలను మనవాళ్లు దీటుగా అడ్డుకోవడమే గాక పూర్తిస్థాయిలో తరిమి కొట్టారు. ► ఆ ప్రాంతంలో భారత సైన్యపు మోహరింపులు హై రిజల్యూషన్ కెమెరాలతో తీసిన ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కన్పిస్తున్నాయి. ► 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయ వద్ద చైనా, భారత దళాల మధ్య జరిగిన భీకర పోరు జరగడం తెలిసిందే. దానివల్ల ఇరుదేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. ► అప్పటినుంచి తూర్పు ప్రాంతంలో వాస్తవా ధీన రేఖ వద్ద మోహరింపులను, యుద్ధ సన్నద్ధతను సైన్యం బాగా పెంచింది. నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. ► ఆ తర్వాత ఇరు దేశాల మధ్య చోటుచేసుకున్న పెద్ద ఘర్షణ ఇదే. ఈ దురాక్రమణ యత్నంలో చైనా వైపు చాలామంది సైనికులు గాయపడ్డట్టు సమాచారం. ► 2012 అక్టోబర్‌లో కూడా యాంగ్ట్సే ప్రాంతంలోనే భారత, చైనా సైనికుల మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ► కొంతకాలంగా ఈ ప్రాంతంలో చైనా డ్రోన్ల హడావుడి బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజా రగడకు ముందే మన యుద్ధ విమానాలు తవాంగ్ పరిసరాల్లో గస్తీ కాయడం, డేగ కళ్లతో నిఘా వేయడం మొదలైంది. ► దాదాపు 3,500 కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ పొడవునా పరిస్థితిపై, దళాల సన్నద్ధతపై త్రివిధ దళాధిపతులు సమీక్ష జరిపారు. భారత సైనికులు అడ్డుకున్నందుకే...తవాంగ్ రగడ: చైనా సైన్యం ‘గల్వాన్ లోయ’ చేదు అనుభవం నేపథ్యంలో తవాంగ్ రగడపై చైనా ప్రభుత్వ ఆచితూచి స్పందించగా సైన్యం మాత్రం తెంపరి వ్యాఖ్యలకు దిగింది! సరిహద్దుల వెంబడి పరిస్థితి నిలకడగా ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘‘భారత దళాలే అక్రమంగా ఎల్ఓసీ దాటాయి. చైనా వైపు డాంగ్జాంగ్ ప్రాంతంలో గస్తీ విధుల్లో ఉన్న మా సైనికులను అడ్డుకున్నాయి. అది డిసెంబర్ 9 రగడకు దారి తీసింది’’ అని చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) వెస్టర్న్ థియేటర్ కమాండ్ అధికార ప్రతినిధి కల్నల్ లోంగ్ షోహువా ఆరోపించారు. నిజాలు దాస్తున్న కేంద్రం రాజ్‌నాథ్‌ది అరకొర ప్రకటన: కాంగ్రెస్ ‘తవాంగ్’పై అట్టుడికిన ఉభయసభలు కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాల వాకౌట్ తవాంగ్ రగడ మంగళవారం పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. చైనాను నిలువరించడంలో కేంద్రం సమర్థంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ సారథ్యంలో విపక్షాలన్నీ దుయ్యబట్టాయి. ‘‘ఇది కచ్చితంగా దౌత్య వైఫల్యమే. సరిహద్దుల వద్ద పరిస్థితిపై తక్షణం సవివర చర్చకు ప్రభుత్వం సిద్ధపడాలి’’ అని డిమాండ్ చేశాయి. రాజ్‌నాథ్ ప్రకటనపై వివరణకు పట్టుబట్టాయి. ఇది సున్నితమైన అంశమంటూ వివరణ కోరేందుకు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా అనుమతివ్వలేదు. అందుకు నిరసనగా కాంగ్రెస్, ఎస్పీ, జేఎంఎం, ఆర్జేడీ, శివసేన, సీపీఎం, సీపీఐ ఉభయ సభల నుంచీ వాకౌట్ చేశాయి. అనంతరం రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. చైనా సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్) గుర్తింపు రద్దు అంశాన్ని కావాలని మోదీ సర్కారు తెరపైకి తెస్తోందని ఆరోపించారు. ఉభయ సభల్లో వివరణ ఇవ్వకుండా పారిపోయిందని ఎద్దేవా చేశారు. చైనా దురాక్రమణ, ఉగ్రవాదం దేశ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు పెను ముప్పుగా మారుతున్నా మౌన ప్రేక్షకునిగా చూస్తోందంటూ దుయ్యబట్టారు. మంత్రుల వెనక దాక్కుంటున్న మోదీ చైనా అంశంపై ప్రభుత్వ వ్యవహార శైలిని కాంగ్రెస్‌తో పాటు విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. తవాంగ్ రగడపై రక్షణ మంత్రి అరకొర ప్రకటనతో సరిపెట్టారంటూ కాంగ్రెస్ దుయ్యబట్టింది. దీనిపై మోదీ ప్రభుత్వం వాస్తవాలు దాచిపెడుతోందని పార్టీ నేతలు గౌరవ్ గొగొయ్, పవన్ ఖేరా ఆరోపించారు. ‘‘డిసెంబర్ 9న ఘర్షణ జరిగితే రక్షణ మంత్రి ప్రకటనకు ఇంత ఆలస్యమెందుకు? ప్రజల నుంచి ఏం దాస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. జాతీయ భద్రత అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా మోదీ తన మంత్రుల వెనక దాక్కుంటారని ఎద్దేవా చేశారు. పీఎం కేర్స్ నిధికి విరాళాలిచ్చిన చైనా కంపెనీల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అంగుళం కూడా వదలం: అమిత్ షా రాజీవ్ ఫౌండేషన్‌కు చైనా నిధులు దాని గుర్తింపు రద్దయినందుకే నిరసనలు కాంగ్రెస్‌కు హోం మంత్రి చురకలు మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం భారత భూభాగంలో ఎవరూ ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎలాంటి చొరబాట్లనూ అనుమతించబోమన్నారు. ‘లోక్‌సభలో కార్యకలాపాలను కాంగ్రెస్ పదేపదే అడ్డుకోవడానికి అసలు కారణం తవాంగ్ రగడ కాదు. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్జీఎఫ్)కు విదేశీ విరాళాల చట్టం (ఎఫ్సీఆర్ఏ) గుర్తింపును కేంద్రం రద్దు చేయడమే!’’ అంటూ చురకలంటించారు. ‘‘సమాజ సేవ కోసమంటూ నమోదు చేసుకున్న ఆర్జీఎఫ్కు ఇండో–చైనా సంబంధాల అభివృద్ధి సంబంధిత అధ్యయనం పేరిట చైనా ఎంబసీ నుంచి రూ.1.35 కోట్లు అందాయి. అందుకే దాని గుర్తింపు రద్దు చేయాల్సి వచ్చింది. విపక్షాల గొడవ వల్ల ప్రశ్నోత్తరాలు తుడిచిపెట్టుకుపోయాయి. లేదంటే ఈ విషయాన్ని సభలోనే చెప్పేవాన్ని. బహుశా ఆర్జీఎఫ్ తన అధ్యయనం ముగించే ఉంటుంది. ఇంతకూ, 1962 చైనా యుద్ధంలో ఎన్ని వేల హెక్టార్ల భారత భూ భాగాన్ని చైనా ఆక్రమించిందన్నది ఆ అధ్యయనంలో ఉందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. చైనాపై మోదీ ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తోందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టారు. నిజానికి విదేశీ నాయకులతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాధినేతలకు ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఐరాస భద్రతా మండలిలో స్థానం చేజారిందంటూ ప్రత్యారోపణ చేశారు. ‘‘భద్రతా మండలిలో భారత్ స్థానాన్ని కాంగ్రెస్‌కు చెందిన దేశ తొలి ప్రధాని నెహ్రూ ఎందుకు ‘త్యాగం’ చేశారు? కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్సింగ్ అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తే చైనా అభ్యంతరపెట్టింది. ఆ రాష్ట్ర సీఎం దోర్జీ ఖండూకు వీసా నిరాకరించింది. జమ్మూ కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ అక్కడి ప్రజలకు స్టేపుల్ వీసాలిచ్చింది. వీటన్నింటిపై కూడా ఆర్జీఎఫ్ అధ్యయనం చేసిందా?’’ అంటూ ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ సారథ్యంలోని ఆర్జీఎఫ్కు ఉగ్రవాదులతో లింకుల ఆరోపణలపై నిషేధం ఎదుర్కొంటున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జకీర్ నాయక్ నుంచి కూడా రూ.50 లక్షలందాయని ఆరోపించారు. -
సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. ఏమందంటే?
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా సైనికుల నడుమ ఘర్షణ తెలెత్తడంతో మరోమారు సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. ఈ నెల 9న చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. మన సైన్యం వారి ప్రయత్నాలను తిప్పికొట్టింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సైనికుల ఘర్షణ తర్వాత తొలిసారి స్పందించింది చైనా. భారత్ సరిహద్దులో పరిస్థితులు ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా స్థిరంగా ఉన్నాయని ప్రకటించింది. ‘మాకు ఉన్న సమాచారం మేరకు చైనా-భారత్ సరిహద్దులో పరిస్థితులు స్థిరంగానే ఉన్నాయి. సరిహద్దు వివాదంపై ఇరు పక్షాలు దౌత్య, మిలిటరీ మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నాయి.’ అని పేర్కొన్నారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్. తవాంగ్ సెక్టార్లో సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రకటన చేశారు. చైనా కుతంత్రాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయన ప్రకటన చేసిన కొద్ది సేపటికే చైనా స్పందించటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
తవాంగ్ ఘర్షణపై లోక్‌సభలో రాజ్‌నాథ్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: తవాంగ్ సెక్టార్ ఘటనపై లోక్‌సభలో రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. చైనా ఆర్మీ మన భూభాగంలోకి వచ్చేందుకు యత్నించిందని, చైనా కుత్రంతానికి భారత బలగాలు దీటుగా బదులిచ్చాయని స్పష్టం చేశారు. భారత పోస్టును ఆక్రమించేందుకు చైనా జవాన్లు యత్నించినట్లు పేర్కొన్నారు. సరైన సమయంలో భారత బలగాలు స్పందించటంతో పీఎల్ఏ సైన్యం తోకముడుచుకుని తిరిగి వారి పోస్టులోకి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. భారత సైనికుల్లో ఎవరూ తీవ్రంగా గాయపడలేదన్నారు. ‘డిసెంబర్ 9న తవాంగ్ సెక్టార్లో పీఎల్ఏ బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు యత్నించాయి. చైనా కుతంత్రాన్ని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. వారిని వెనక్కి వెళ్లేలా చేశాయి. ఈ అంశాన్ని దౌత్యపరమైన విధానంలో చైనా ముందుకు తీసుకెళ్తాం. మన సరిహద్దులను కాపాడేందుకు, ఎలాంటి సంఘటనలు ఎదురైనా తిప్పికొట్టేందుకు మన బలగాలు సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇస్తున్నాం. ఈ ఘర్షణలో ఇరువైపుల కొద్ది మంది సైనికులు గాయపడ్డారు. మన సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు, తీవ్రంగా గాయపడలేదు. మన బలగాలు సరైన సమయంలో స్పందించటంతో పీఎల్ఏ సైనికులు తిరిగి వారి వారి ప్రాంతానికి వెళ్లిపోయారు.’ - రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. తవాంగ్ ఘర్షణ తర్వాత డిసెంబర్ 11న స్థానిక కమాండర్ చైనా కమాండర్‌తో ఫ్లాగ్ మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిపారు రాజ్‌నాథ్. ఈ సందర్భంగా సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకే తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా కమాండ్ తెలిపినట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: తవాంగ్ ఘర్షణ: చైనా సరిహద్దులో భారత ఫైటర్ జెట్స్ గస్తీ -
భారత్-చైనా బలగాల మధ్య ఘర్షణ.. ఇరు వర్గాలకు గాయాలు!
ఈటానగర్: సరిహద్దులో భారత్-చైనా బలగాల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 9న జరిగిన ఈ ఘటనలో రెండు దేశాల సైనికులకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఘర్షణ అనంతరం భారత్-చైనా బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే చైనా సైనికులే వాస్తవాధీన రేఖను చేరుకోవడంతో భారత బలగాలు ప్రతిఘటించినట్లు సమాచారం. దాదాపు 300 మంది చైనా సైనికులు 17,000 అడుగుల ఎత్తులోని భారత పోస్టును తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. మన సైనికులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు గొడవపడ్డాయి. ఈ ఘర్షణలో ఆరుగురు భారత సైనికులకు గాయలవ్వగా.. వారిని చికిత్స నిమిత్తం గువహటి ఆస్పత్రికి తరలించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో భారత సైనికుల కంటే చైనా సైనికులే ఎక్కువ సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. 2020 జూన్ 15న జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతం గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ హింసాత్మక ఘటనలో ఇరు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అనేక మార్లు చర్చల అనంతరం సరిహద్దులో బలగాల ఉపసంహరణ జరిగింది. ఇప్పుడు మళ్లీ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా మరోమారు కయ్యానికి కాలు దువ్వుతోంది. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. -
పీపీ–15 నుంచి వెనక్కి వెళ్లిపోండి: చైనాకు తెగేసి చెప్పిన భారత్
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో మిగిలిన వివాదాస్పద ప్రాంతాల నుంచి చైనా బలగాలు సాధ్యమైనంత త్వరగా వెనక్కి వెళ్లిపోవాలని భారత్ మరోసారి తేల్చిచెప్పింది. భారత్–చైనా మధ్య 13వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి సైనిక చర్చలు ఆదివారం జరిగాయి. ఇరు దేశాల నడుమ చుషుల్–మోల్డో బోర్డర్ పాయింట్ వద్ద చైనా వైపు భూభాగంలో ఉదయం 10.30 గంటలకు మొదలైన ఈ చర్చలు రాత్రి 7 గంటలకు ముగిశాయని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. 8.30 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కీలకాంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపాయి. భారత్ తరఫు బృందానికి లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పి.జి.కె.వీునన్ నేతృత్వం వహించారు. ప్రధానంగా తూర్పు లద్దాఖ్ హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలోని పెట్రోలింగ్ పాయింట్(పీపీ)–15 నుంచి బలగాల ఉపసంహరణ గురించే చర్చించినట్లు తెలిసింది. గత ఏడాది మే నెలలో చోటుచేసుకున్న ఘర్షణ పురావృతం కాకుండా సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేపట్టాలని, ఇందుకోసం కొత్త ప్రోటోకాల్స్ రూపొందించుకోవాలని ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే, దీనిపై సైన్యం నుంచి అధికారిక ప్రకటనేదీ వెలువడలేదు. గోగ్రా నుంచి ఉపసంహరణ పూర్తి 2020 మే 5వ తేదీన తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరువైపులా పదుల సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా వివిధ స్థాయిల్లో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. రాజకీయ, దౌత్య, సైనిక పరమైన చర్చలు జరుగుతున్నాయి. 12వ దఫా కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఈ ఏడాది జూలై 31న జరిగాయి. ఈ చర్చల్లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గోగ్రా నుంచి తమ బలగాల ఉపసంహరణ ప్రక్రియను భారత్, చైనా పూర్తి చేశాయి. ఇరు దేశాల నడుమ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడాలంటే డెస్పాంగ్‌తో సహా అన్ని వివాదాస్పద ప్రాంతాలపై ఒక ఒప్పందానికి రావాలని భారత్ నొక్కి చెబుతోంది. ఇటీవల చైనా సైన్యం వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ)ను అతిక్రమించి ఉత్తరాఖండ్‌లోని బారాహోతి సెక్టార్, అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. ఇరు దేశాల అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో 13వ దఫా చర్చలు సాఫీగా సాగడం విశేషం. -
చైనాకు ఝలక్.. దలైలామాకు ఓకే
న్యూఢిల్లీ/ధర్మశాల: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా త్వరలో భారత్‌లో అడుగుపెట్టనున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఇచ్చిన ఆహ్వానానికి అంగీకరించిన ఆయన కొత్త ఏడాదిలో(2017) మార్చి మధ్యలో అక్కడి తవాంగ్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అయితే, ఈ పర్యటనపై ఈ నెల ప్రారంభంలోనే ప్రకటన వెలువడినప్పటికీ దీనిపై అధికారికంగా ధ్రువీకరణ జరగలేదు. దలైలామా పర్యటనతో భారత్-చైనా సంబంధాలు ఎలా ఉంటాయో అనే చర్చ ప్రారంభమైంది. అంతకుముందు అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు రానుండగా బీజింగ్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. భారత్-చైనా మధ్య ఈ ప్రాంతంపై వివాదం ఉన్న నేపథ్యంలో అమెరికా అందులో అడుగుపెట్టొద్దని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దలైలామా పర్యటన ఏ పరిణామాలకు దారి తీస్తుందో అని ఆసక్తి నెలకొంది. అయితే, భారత్ మాత్రం దలైలామా పర్యటనపై తన వైఖరి కుండబద్ధలు కొట్టింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ అంశంపై ప్రకటన చేస్తూ'బౌద్ధ మత గురువు దలైలామా భారత అతిథి. ఆయన దేశంలో ఎక్కడైనా పర్యటించవొచ్చు. ఆయన గతంలో అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఇప్పుడు మరోసారి పర్యటనకు వచ్చినా ఏమీ జరగబోదని భావిస్తున్నాం' అని స్పష్టం చేశారు. -
విరిగిపడ్డ కొండ చరియలు: 17 మంది మృతి
ఈటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని భారీ వర్షాల కారణంగా తవాంగ్ జిల్లా ఫామ్లా గ్రామంలో గురువారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 17 మంది మరణించారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి తవాంగ్ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌కు ఫోన్ చేసి... వివరాలు కనుకున్నారు. అయితే మృతులంతా భవన నిర్మాణ కార్మికులను తెలిసింది. వీరంతా ఫామ్లాలో హోటల్ నిర్మాణం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులను ప్రభుత్వాధికారులు వెల్లడించారు.