దేశంలోని పలుప్రాంతాల్లో ప్రస్తుతం విపరీతమైన చలి వాతావరణం నెలకొంది. ఈ చలికి తట్టుకోలేక జనం వణికిపోతున్నారు. మనదేశంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల స్థాయికి పడిపోయే పలు ప్రాంతాలున్నాయి. ఈ అంత్యత శీతల ప్రాంతాల పేరు చెప్పగానే పలువురికి చలితో పాటు వణుకు పుడుతుంది. ఆ ప్రదేశాలపై ఒక లుక్కేద్దాం.
సియాచిన్ గ్లేసియర్ (Siachen Glacier)
ఇది ఉత్తర కారాకోరం శ్రేణిలో ఉంది. సియాచిన్ భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి మాత్రమే కాదు.. ఇది మొత్తం ధ్రువేతర ప్రపంచంలో అత్యంత శీతల ప్రదేశాలలో ప్రముఖమైనది. ప్రపంచంలోనే అత్యధిక శ్రేణి హిమపాతం ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత -50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఇది దేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో మొట్టమొదటిగా గుర్తింపు పొందింది. వేసవి నెలల్లో కూడా సియాచిన్‌లో ఉష్ణోగ్రత -10 సెంటీగ్రేడ్ డిగ్రీలకు తగ్గుతుంది. విపరీతమైన చలి కారణంగా పలువురు సైనికులు ఈ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారు.
సెలా పాస్, తవాంగ్(Sela Pass, Tawang)
సెలా పాస్.. సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం బౌద్ధ నగరమైన తవాంగ్‌ను తేజ్‌పూర్- గౌహతిలతో కలుపుతుంది. వేసవి కాలంలో ఇక్కడ చలి నుండి కొంత ఉపశమనం దొరుకుతుంది. శీతాకాలంలో చలి అత్యధికస్థాయిలో ఉంటుంది. విపరీతంగా మంచు కురుస్తుంటుంది. సెలా పాస్ హిమాలయాల్లో 4,170 మీటర్ల ఎత్తులో ఉంది. అక్టోబర్, నవంబర్, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. ఈ నెలల్లో ఇక్కడ మంచు ఎక్కువగా ఉండదు. రోడ్లు కూడా సాధారణంగా ఉంటాయి. సెలా పాస్‌లో ఉష్ణోగ్రత -15 డిగ్రీల వరకు పడిపోతుంది.
లేహ్, లడఖ్( Leh, Ladakh)
లేహ్ మన దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం. ఇక్కడి చరిత్ర, సంస్కృతి ఎంతో గొప్పవి. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత -12 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతుంటుంది. శీతాకాలంలో విపరీతంగా మంచు కురుస్తుంది. ఇటువంటి పరిస్థితి చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ఇక్కడ అనేక ఆలయాలు, సరస్సులు ఉన్నాయి. ఇవి లేహ్‌ను సందర్శించదగిన ప్రదేశాలలో ఒకటిగా మలచాయి. లేహ్ సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో ఉంది. లడఖ్‌లోని పర్వతాలు సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి ఎంతో అందంగా కనిపిస్తాయి.
కీలాంగ్(Keylong)
కీలాంగ్ ప్రాంతం లేహ్ ప్రధాన రహదారిలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 3340 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టూ విల్లో చెట్లు, నీటి ప్రవాహాలు, మంచుతో కూడిన పర్వతాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో ఉష్ణోగ్రత కూడా -2 డిగ్రీలకు పడిపోతుంది. ఈ ప్రదేశం మనాలి, కాజా, లేహ్ తదితర అందమైన పర్యాటక ప్రదేశాలకు అనుసంధానంగా ఉంది.
లాచెన్, థంగు వ్యాలీ(Lachen and Thangu Valley)
అత్యంత అందమైన మంచుతో కూడిన పర్వత శిఖరాలు ఉత్తర సిక్కింలో కనిపిస్తాయి. ఉత్తర సిక్కింలో లాచెన్, థంగు వ్యాలీలను సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. లాచెన్, థంగు వ్యాలీ 2,500 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి ఉష్ణోగ్రతలు శీతాకాలంలో మైనస్ డిగ్రీలకు చేరుకుంటాయి. విపరీతమైన మంచు కూడా కురుస్తుంటుంది.
ద్రాస్, కార్గిల్ ( Dras, Kargil)
ద్రాస్.. భారతదేశంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశం. ఈ ప్రదేశాన్ని "గేట్‌వే టు లడఖ్" అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. కార్గిల్ జిల్లాలో ఉన్న ద్రాస్.. అమర్‌నాథ్, సియాల్‌కోట్‌లకు వెళ్లేవారికి ప్రధాని రహదారిగా ఉంది. సముద్ర మట్టానికి 10,761 అడుగుల (3,280 మీ) ఎత్తులో ద్రాస్ ఉంది. ఇక్కడి అందమైన ప్రకృతి దృశ్యాలు, మంచు పర్వతాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.
ఇది కూడా చదవండి: కుంభమేళాకు సుందరంగా ముస్తాబైన ప్రయాగ్‌రాజ్
Comments
Please login to add a commentAdd a comment