Siachen Glacier
-
కొండంత ధైర్యంతో...
సియాచిన్ పేరు వినబడగానే ఒంట్లో చలితోపాటు మృత్యుభయం కూడా దూరుతుంది. శత్రువుల జాడను కనిపెట్టడం ఒక ఎత్తయితే, ప్రకృతే శత్రువుగా మారి ప్రాణాలు కబళించే ప్రమాదకర పరిస్థితి నుంచి బయట పడడం మరో ఎత్తు. దేశం కోసం కొండంత ధైర్యంతో సియాచిన్ గ్లాసియర్‌లో విధులు నిర్వహిస్తున్నారు మన సైనికులు. సియాచిన్ గ్లాసియర్‌లో విధులు నిర్వహించబోతున్న ఫస్ట్ ఉమన్ మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ఫాతిమా వసీమ్ చరిత్ర సృష్టించింది... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. గడ్డకట్టే చలిలో మన సైనికుల సాహసం, అంకితభావం మాటలకు అందనివి. సముద్ర మట్టానికి 17,720 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌లో శీతాకాలంలో పగలు ఏడు గంటలు మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండకపోవడంతో సైనికులు ఎక్కువ సమయం నిద్ర పోవడానికి వీలుకాదు. షేవింగ్ చేసుకోవాలన్నా కష్టమే. ఒకవేళ చర్మం తెగితే గాయం మానడానికి చాలా సమయం పడుతుంటుంది. స్నానం చేయాలన్న కష్టమే. ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి చేరుకోగలవు. ఇక్కడ మూడు వేలమంది వరకు సైనికులు పనిచేస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు గస్తీ విధులు నిర్వహిస్తుంది. మంచుకొండ చరియలు విరిగి పడడం ద్వారా ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రతికూలత’ గురించి తప్ప ‘అనుకూలత’ గురించి ఒక్క మాట కూడా వినిపించని మృత్యుక్షేత్రంలోకి మెడికల్ ఆఫీసర్‌గా అడుగు పెట్టనుంది కెప్టెన్ ఫాతిమా వసీమ్. ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ పొందింది ఫాతిమా. ‘సియాచిన్ గ్లేసియర్‌పై ఆపరేషనల్ పోస్ట్‌లో విధులు నిర్వహించబోతున్న తొలి మహిళా వైద్యాధికారిగా ఫాతిమా వసీమ్ ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ఇది చారిత్రక సందర్భం. కెప్టెన్ ఫాతిమా వసీమ్ ధైర్యసాహసాలు, అంకితభావాలకు అద్దం పట్టిన సందర్భం’ అంటూ ‘ఎక్స్’లో ఇండియన్ ఆర్మీ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ‘ఐసే జాగోరే సాథియో... దునియా సే జాకో బోలుదో’ అనే పాట వినిపిస్తుండగా ‘మీట్ కెప్టెన్ ఫాతిమా, ఏ సియాచిన్ వారియర్. ఉయ్ సెల్యూట్ హర్’ అంటూ వీడియో మొదలవుతుంది. ఈ వీడియోలో ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఫాతిమా వసీమ్ శిక్షణ తీసుకుంటున్న, సైనికులకు వైద్యం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ∙కెప్టెన్ ఫాతిమా వసీమ్∙శిక్షణలో... ∙వైద్య సేవలు అందిస్తూ -
హిమపాతంతో ఇద్దరు జవాన్ల మృతి
జమ్మూ: హిమపాతం కారణంగా ఇద్దరు ఆర్మీ జవాన్లు శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. లద్ధాఖ్లోని దక్షిణ సియాచిన్ హిమానీనదం వద్ద సుమారు 18 వేల అడుగుల ఎత్తులో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా హిమపాతం సంభవించిందని రక్షణ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా తెలిపారు. హిమపాత సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుందని, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వారందరినీ గుర్తించి బయటకు తీయగలిగామని ఆయన చెప్పారు. హిమపాతంలో చిక్కుకున్న బాధితులను రక్షించడానికి ఆర్మీ హెలికాప్టర్ల సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. వైద్య బృందాలు శాయశక్తులా ప్రయత్నించాయని, అయితే ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు తెలిపారు. -
సియాచిన్ ప్రాంతాన్ని చూసేందుకు మిలిటరీ ఏర్పాట్లు..
ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధభూమి.. సియాచిన్‌ను ఇక మీరూ చూడొచ్చు.. మన వీరజవాన్ల కష్టాలు తెలుసుకోవచ్చు.. దీనికి తగిన ఏర్పాట్లు చేసేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది. సాధారణ పౌరులు అక్కడికి వెళ్లేలోపు.. ఆ ప్రాంత విశేషాలు కొన్ని.. సియాచిన్ భారత్ అధీనంలో ఉన్నంత వరకు పాకిస్తాన్, చైనా నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం సాధ్యం కాదు. తద్వారా లదాక్పై మన పొరుగు దేశాల దృష్టిపడదు. చైనా అధీనంలోని షక్స్‌గామ్ లోయ, పాక్ అధీనంలోని బాల్టిస్తాన్‌కు మధ్యలో ఉంటుంది సియాచిన్. ఇది భారత్‌కు అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. సియాచిన్ హిమానీనదీ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు భారత్ రోజుకు రూ.5 నుంచి రూ.7 కోట్లు ఖర్చు చేస్తోంది. 3 వేల మంది జవాన్లు ఇక్కడి సరిహద్దులను కాపలా కాస్తుంటారు. 1984లో ఈ ప్రాంతాన్ని మన స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పటి నుంచి సియాచిన్‌లో సుమారు వెయ్యి మంది సైనికులు మరణించారు. వీరిలో పాక్ కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య సుమారు 220 కాగా.. మిగిలిన వారు అననుకూల వాతావరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. కార్గిల్ యుద్ధంలో మరణించిన వారి కంటే ఈ సంఖ్య రెట్టింపు. సముద్రమట్టానికి 21 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ ఆర్మీ పోస్టుల్లో సాధారణంగా ఒక జవాన్ 3 నెలలు మాత్రమే పనిచేస్తారు. ఈ ప్రాంతాన్ని చేరుకోవాలంటే సుమారు 28 రోజుల పాటు మంచు గుట్టలు ఎక్కాల్సి ఉంటుంది. మొత్తం 128 కిలోమీటర్ల దూరం నడిస్తేగానీ.. సియాచిన్ ఆర్మీ పోస్టులకు చేరుకోలేం. సియాచిన్లోని సాల్టోరో వద్ద పాక్ ఆర్మీ పోస్టులు సుమారు 3వేల అడుగుల దిగువన ఉంటాయి. సియాచిన్‌లో మిలిటరీ దళాల ఉపసంహరణ కోసం భారత్–పాక్ మధ్య చర్చలు జరిగాయి. ఆపరేషన్ మేఘ్‌దూత్ ద్వారా 1984లో సియాచిన్‌లో భారత్.. పాక్‌పై తొలిసారి దాడి చేసింది. 2003లో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. సియాచిన్ హిమానీనదిని సాధారణ పౌరులు సందర్శించడం దాదాపు అసాధ్యం. ఏటా మిలిటరీ అధికారులు ఒక యాత్ర నిర్వహిస్తారు. సుమారు 40 మందితో కూడిన బృందంతో ఈ సాహసయాత్ర నడుస్తుంటుంది. ఇందులో ఆర్మీ నిపుణులతో పాటు ఇద్దరు విలేకరులు, రక్షణ రంగ శాస్త్రవేత్తలు, స్కూల్ విద్యార్థులు, స్వచ్ఛందంగా ముందుకొచ్చే పౌరులు భాగస్వాములుగా ఉంటారు. జమ్మూకశ్మీర్‌లోని లేహ్ ప్రాంతం నుంచి సియాచిన్ యాత్ర మొదలవుతుంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తొలి రెండ్రోజులు కేవలం కడుపునిండా తినడం.. కంటి నిండా నిద్రపోవడంతో గడచిపోతుంది. వాతావరణ పరిస్థితులకు శరీరం అలవాటు పడేందుకు ఈ ఏర్పాటు. విస్తృత వైద్య పరీక్షల తర్వాతే సియాచిన్ యాత్ర ప్రయాణికుల తుది జాబితా సిద్ధమవుతుంది. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు నుబ్రా నది సమీపంలోని మిలటరీ స్కూల్లో తగిన శిక్షణ ఇస్తారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సియాచిన్‌లో భారత సైనికుల తిండితిప్పలు
-
పగలని గుడ్డు.. జవాన్లకు నో ఫుడ్డు!
శ్రీనగర్ : ఎముకల కొరికే చలిలో గస్తీ నిర్వహిస్తున్న భారత సైనికలు బుక్కెడు బువ్వ కోసం నానా కష్టాలు పడుతున్నారు. దేశ రక్షణ కోసం ప్రపంచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతం సియాచిన్ గ్లేసియర్‌లో మైనస్ 40-70 డిగ్రీల చలి మధ్యన ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఆ మంచు పర్వతాల్లో శత్రువుల కంటే... మంచుతోనే యుద్ధం చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి తాగే నీటితోపాటూ తినే ఏ పదార్థమైనా ఇట్టే గడ్డకట్టిపోతుంటాయి. ఎంతలా అంటే... సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తిండి కోసం పడే తిప్పలు ఎలా ఉంటాయో వివరిస్తూ... ఓ జవాన్ ట్విట్టర్లో వీడియోని పోస్ట్ చేశారు. సియాచిన్ గ్లేసియర్‌లో జీవించడం ఎంత కష్టమో.. భారత సైన్యం చేస్తున్న సేవ ఏంటో ఈ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ ఇటుకలా గడ్డకట్టడం దాన్ని సుత్తెతో కొట్టినా పగలలేదు. వేడి చేస్తే తప్పా ఆ జ్యూస్ తాగాలేరు. ఇక దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కోడిగుడ్లు, అల్లం... ఇలా అన్నీ రాళ్లలాగా గట్టిగా ఉంటాయి. గడ్లు గట్టిగా కొట్టినా పగలదంటూ ఆ సైనికులు తమ బాధను వివరించారు. గుడ్లు, అల్లం, ఉల్లిపాయలు ఇలా ఏది పగలగొట్టాలన్నా ఓ యుద్ధం చేసినట్లేనని, ఇంత దారుణమైన పరిస్థితుల్లో తాము పహారా కాస్తున్నామని సైనికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండగా.. చాలా మంది నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతూ సైనికుల సేవలను కొనియాడుతున్నారు. What it is like to save freedom of 1.3 billion people. #IndianArmy Jawans explains one part of it. Enjoy your freedom also be thankful to all our Jawans for making it happen. pic.twitter.com/uFEyoG1vQl — 👁️ INTEL ⚔️ Defence 🌏 OSINT ☢️ Conflict 💬 News (@Ind4Ever) June 8, 2019 -
సియాచిన్‌లో రాజ్‌నాథ్ పర్యటన
న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన తొలి పర్యటనలో ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన, ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌ను సందర్శించనున్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్‌తో కలసి సోమవారం ఉదయం ఆయన లేహ్ లోని 14వ, శ్రీనగర్‌లోని 15వ సైనికదళాల ప్రధాన కార్యాలయాలను సందర్శించారు. పాకిస్తాన్‌తో ఉన్న నియంత్రణరేఖ (ఎల్వోసీ) వద్ద భద్రతా ఏర్పాట్లు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై సైనిక ఉన్నతాధికారులు రాజ్‌నాథ్‌కు వివరిస్తారు. అనంతరం సాయంత్రానికి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. సియాచిన్ వద్ద గత పదేళ్లలో దేశం 163 మంది సైనికులను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ అమరవీరులకు నివాళులు అర్పించారు. -
రాజ్‌నాథ్‌సింగ్ తొలి పర్యటన ఖరారు!
సాక్షి, న్యూఢిల్లీ : రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్ తొలి పర్యటన ఖరారైంది. ఆయన రేపు సియాచిన్ గ్లేసియర్‌ని సందర్శించి భద్రతా పరిస్థితులను సమీక్షిస్తారు. అక్కడున్న సైనికాధికారులు, జవాన్లతో చర్చించడంతోపాటు వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా రాజ్‌నాథ్‌తో కలిసి సియాచిన్‌కి వెళ్లనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రంగా సియాచిన్ గ్లెసియర్‌కు పేరుంది. 12వేల అడుగుల నుంచి 23వేల అడుగుల ఎత్తులో భారత్ బేస్‌క్యాంప్స్ ఉంటాయి. శీతాకాలంలో ఇక్కడ మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇంతటి క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డి నిలబడి తమ సైనికులు రక్షణ విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నరేంద్రమోదీ కూడా సియాచిన్ గ్లేసియర్‌ని సందర్శించారు. జాతీయ పోలీస్ స్మారకాన్ని సందర్శించిన అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ పోలీస్ స్మారకాన్ని సందర్శించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. తర్వాత జాతీయ పోలీస్ మెమోరియల్ మ్యూజియంను షా సందర్శించారు. హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌తోపాటు పోలీస్‌శాఖ ఉన్నతోద్యోగులు ఆయనతో ఉన్నారు. కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా శనివారం బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
వ్యూహాత్మక ప్రాంతాల్లో రక్షణమంత్రి పర్యటన
శ్రీనగర్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ బేస్ క్యాంప్‌ను పర్యటించారు. జమ్మూకశ్మీర్‌లో రెండోరోజు పర్యటనలో భాగంగా ఆమె దేశ రక్షణపరంగా కీలక వ్యూహాత్మక ప్రాంతాలు అయిన లేహ్, లడఖ్, సియాచిన్ ప్రాంతాలను సందర్శించారు. అలాగే సియాచిన్ బేస్ క్యాంప్‌లో అమరవీరులకు నిర్మలా సీతారామన్ నివాళులు అర్పించారు. అనంతరం లేహ్‌లో బ్రిడ్జిను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్...సైనికులకు దసరా శుభాకాంక్షలు తెలిపినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. రక్షణమంత్రితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నారు. -
సైనికులతో స్మృతి ఇరానీ రక్షాబంధన్..!
న్యూఢిల్లీః కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ యుద్ధ భూమికి పయనమౌతున్నారు. వచ్చేవారం సియాచిన్ గ్లేసియర్ వద్ద సైనికులతో రక్షాబంధన్ జరుపుకునేందుకు సిద్ధమౌతున్నారు. స్మృతీ పర్యటనకు రక్షణమంత్రి మనోహర్ పారికర్ అనుమతికూడా మంజూరు చేశారు. హిమాలయాల్లోని తూర్పు కారాకోరం పర్వతశ్రేణుల్లో ఉన్న సియాచిన్... ఎత్తైన మంచు శిఖరం. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రంగా పేరొందిన సియాచిన్ గ్లేసియర్ ప్రాంతానికి వెళ్ళేందుకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సన్నాహాలు చేస్తున్నారు. ఈశాన్య రాజస్థాన్, కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలోని సియాచిన్ లో జవాన్లతో కలసి మంత్రి ఇరానీ రాఖీ పండుగను జరుపుకోనున్నారు. స్మృతి ఇరానీ పర్యటనకు రక్షణమంత్రి మనోహర్ పారికర్ అనుమతికూడా లభించింది. ఈ నెల 18న రక్షా బంధన్ ను పురస్కరించుకొని ఇరానీతోపాటు మహిళా మంత్రుల బృందం సియాచిన్ బేస్ క్యాంప్ కు వెళ్ళనున్నారు. కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్, ఉమాభారతి, మేనకాగాంధీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి, అనుప్రియ పటేల్ లు స్మతి ఇరానీతోపాటు బేస్ క్యాంపుకు వెళ్ళి అక్కడి సైనికులకు రాఖీ కట్టి రక్షాబంధన్ జరుపుకోనున్నట్లు రక్షణమంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
సియాచిన్‌లో 41 మంది..
న్యూఢిల్లీ: సియాచిన్ గ్లేసియర్ విషాదంపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. సభ్యులు విశ్వంభర్ ప్రసాద్ నిషద్, కనకలతా సింగ్ రాజ్యసభలో అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. సైనికుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. సియాచిన్ పర్వత ప్రాంతంలో భారత సైన్యం అత్యాధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా మానవరహిత ఏరియల్ వాహనాలు, వివిధ రకాల రాడార్లు తదితర ఆధునిక టెక్నాలజీని ఉపయెగిస్తున్నామన్నారు. ఇకముందు సరిహద్దులో భద్రతా కారణాలు, అక్కడి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అవసరమైన మేరకు సైనిక బలగాలను తరలిస్తామన్నారు. దీంతోపాటు తాజా ఘటన సహా, గత మూడేళ్లుగా సియాచిన్ పర్వత ప్రాంతాల్లో అమరులైన సైనికుల వివరాలు అందజేశారు. 2016 ఫిబ్రవరి 18 వరకు ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 2013 - 10 2014 - 8 2015 - 9 2016- 14 కాగా సియాచిన్ గ్లేసియర్‌లో సంభవించిన మంచుతుఫానులో చిక్కుకొని ఫిబ్రవరి 3న 10 మంది సైనికులు అసువులు బాసిన సంగతి తెలిసిందే. -
అక్కడ నిత్యం మృత్యువుతో పోరాటమే...
కారకోరమ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తై యుద్ధ క్షేత్రంగా పేరుగాంచిన సియాచిన్ మంచు పర్వత శ్రేణుల్లో శత్రు సేనలను ఎదుర్కోవడం చాలా సులభం. అక్కడి వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవడమే చాలా కష్టం. అక్కడ భారత సైనికులు నిత్యం సాగించేది జీవన్మరణ పోరాటమే. అక్కడ పొరపాటున గ్లౌజు లేకుండా తుపాకీ ట్రిగ్గర్ను 15 సెకండ్లపాటు పట్టుకున్నామంటే చేతి వేళ్లకు ‘ఫ్రాస్ట్‌బైట్ (అతి శీతలం వల్ల జన్యువులు చచ్చిపోవడంతో పుండవడం)’ వస్తుంది. వెంటనే ఆ వేళ్లను కోసివేయాల్సిందే. సాక్స్ నుంచి బొటన వేళ్లు బయటకు వచ్చినా పరిస్థితి అంతే. ఒంటిలో అంగుళం కూడా వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా నిండా చలి దుస్తులు ధరించాల్సిందే. సముద్ర మట్టానికి దాదాపు 19వేల అడుగుల ఎత్తులో శత్రువుల ఉనికి కోసం నిరంతర నిఘా కొనసాగిస్తున్న భారత సైనికులకు నిద్ర పట్టదు. ఆకలి వేయదు. కంటి చూపు మసకబారుతుంది. గొంతు పూడుకపోతోంది. మాట సరిగ్గా రాదు. మతి మరుపు ముంచుకొస్తుంది. ఈ లక్షణాలు ఎక్కువైనప్పుడు వారిని బేస్ క్యాంప్‌కు తీసుకొచ్చి చికిత్స చేస్తారు. సరైన ఆహారం కూడా అందుబాటులో ఉండదు. మైనస్ 45 డిగ్రీల నుంచి మైనస్ 60 డిగ్రీల వరకు శీతలీయంగా ఉండే సియాచిన్ మంచు పర్వతాల్లో గాలిలో ఆక్సిజన్ శాతం కేవలం పది శాతం (మైదాన ప్రాంతాలతో పోలిస్తే) మాత్రమే ఉంటుంది. ఆపిల్ పండుగానీ, నారింజ పండుగానీ క్షణాల్లోనే క్రికెట్ బాల్లా గట్టిగా తయారవుతుంది. ఆలుగడ్డను సుత్తిపెట్టి కొట్టినా ముక్కలవదు. అందుకని సైనికులు ఎక్కువగా కేన్‌లో భద్రపరిచిన డ్రై ఫుడ్‌నే తీసుకుంటారు. అది కూడా అతి తక్కువ మోతాదులో. నెలకు ఒక్కసారో, రెండు సార్లో తాజా ఆహారం అందుతుంది. చీతా హెలికాప్టర్ల ద్వారా సైన్యం 20 వేల అడుగులో తాజా ఆహార పదార్థాలను పడేసి వెళుతుంది. శత్రువుల కంటపడకుండా క్షణాల్లో పని ముగించాల్సి ఉంటుంది. భారత సైనికులు కనపడని శత్రువు కోసం కళ్లు కాయలు కాసేలా నిరంతర నిఘా కొనసాగించడంతోపాటు అస్తమానం కిరోసిన్ స్టౌను వెలిగించి తుపాకులను ఎప్పటికప్పుడు వేడిచేస్తుండాలి. లేకపోతే తుపాకీ గొట్టం మంచుతో గడ్డకట్టుకుపోతుంది. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తూనే ఉంటాయి. నెలకు మూడువారాలు ఈ గాలులను తట్టుకొని నిలబడాల్సిందే. నెలకు ఒకసారి మాత్రమే స్నానం చేస్తారు. డీఆర్డీవో ప్రత్యేకంగా తయారు చేసిన టబ్‌లోనే స్నానం చేయాలి. రోజూ కళ్లు మాత్రమే కడుక్కుంటారు. మంచు కరగించి ఆ నీటినే తాగుతారు. 20 లీటర్ల నీటికోసం దాదాపు గంటసేపు మంచును వేడి చేయాల్సి ఉంటుంది. మంచు తుపానుల కారణంగా గడచిన 30 ఏళ్లలో 846 మంది భారత సైనికులు మరణించారని లోక్‌సభలో ప్రభుత్వమే ప్రకటించింది. శత్రువుల కాల్పుల్లో చనిపోయింది వారిలో పదోవంతు మంది కూడా ఉండరు. ఇంతటి దారుణ పరిస్థితులు సరిహద్దుకు ఆవల కాపలాకాస్తున్న పాకిస్తాన్ సైనికలకు ఎదురుకావు. కారణం...మంచు పర్వతాలకు దిగువున వారి సైనిక స్థావరం ఉంది. వారు అక్కడి నుంచి పర్వతాలపైకి ఎక్కకూడదు. భారత సైనికులు పర్వతాల నుంచి ఆవలివైపు కిందకు దిగకూడదు. అందుకోసమే ఇరువైపుల కాపలా కొనసాగుతోంది. ఇంతటి మృత్యువాతావరణంలో సైనిక నిఘాను కొనసాగించాల్సిన అవసరం ఉందా ? అంటూ అక్కడి భారత సైనికులు తరచూ చర్చించుకున్న సందర్భాలు అనేకం. ఫిబ్రవరి మూడవ తేదీన మంచు తపానులో కూరుకుపోయి చనిపోయిన పది మంది సైనికులతో కలసి అక్కడ రెండు సార్లు విధులు నిర్వహించి ప్రస్తుతం సెలవులో ఉన్న ఓ సైనికుడి కథనం ఇది. పేరు వెల్లడించడానికి ఆయన ఇష్టపడలేదు. -
అదో నిశ్శబ్ద మృత్యుశిఖరం
నెలకో సైనికుడు బలి * పాక్ సైన్యాన్ని నిలువరించేందుకు 1984లో శిబిరాల ఏర్పాటు * గడ్డ కట్టిపోయే చలిలో విధులు * ఇప్పటివరకూ 883 మంది మృతి * గస్తీ కోసం రూ. వేల కోట్ల వ్యయం న్యూఢిల్లీ/ఉధంపూర్: సియాచిన్ మంచుపర్వతం... బహుశా ఈపేరు విననివారెవరూ ఉండరు. పైకి చల్లగా.. నిశ్చబ్దంగా కనిపించినా ఇదొక మృత్య శిఖరం లాంటిదేనని అక్కడి ఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రతి నెలా మంచుకొండ చరి యలు విరిగిపడటం వల్లనో, లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడిన కారణంగానో కనీసం ఓ సైనికుడు బలైపోతున్నాడు. ఈ మృత్యుమృదంగం 1984 నుంచే ప్రారంభమైంది. తొలిసారి పాకిస్థాన్ సైన్యాన్ని ఏవిధంగానైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో దాదాపు 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ వద్ద భారత సైనిక శిబిరాల్ని ఏర్పాటు చేశారు. 1984 నుంచి అక్కడ సైన్యాన్ని మోహరించడం ప్రారంభించారు. దాదాపు ఎవరెస్టు శిఖరం ఎత్తులో భారత జవాన్లు దేశ రక్షణ కోసం గ డ్డకట్టి చనిపోయే చలిలో నిత్యం గస్తీ కాస్తుంటారన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1984 నుంచి 2015 మధ్య మొత్తం 869 మంది భారత సైనికులు సియాచిన్ గ్లేసియర్‌లో మృత్యువాత పడ్డారు. అనంతరం జరిగిన కొన్ని ఘటనలతోపాటు బుధవారం జరిగిన ప్రమాదంలో మరణించిన పదిమంది సైనికులను కలుపుకుని మొత్తం ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య 883కు చేరుకుంది. వీరిలో 33 మంది అధికారులు, 54 మంది జూనియర్ ఆఫీసర్లు 782 మంది ఇతర ర్యాంకుల జవాన్లు ఉన్నారు. కాగా, అత్యధికంగా 2011లో 24 మంది సైనికులు ఈ గ్లేసియర్‌లో మృత్యువాత పడగా.. 2015లో ఐదుగురు చనిపోయారు. ఏడాదికి భారత ప్రభుత్వం ఈ ప్రాంత గస్తీకోసం దాదాపు వేలకోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్క 2012-13, 2014-15, మధ్యనే రూ. 6, 566 కోట్లు ఖర్చు చేసింది. వీటిని అక్కడ ఉండే సైనికులకు కావాల్సిన వస్త్రాలు, పర్వతారోహణ సామగ్రి, ఇతర వస్తువులకు ఎక్కువగా ఖర్చేయ్యేవి. మరో విషయమేమిటంటే సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీల వరకు ఉంటుంది. ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి వెళ్లగలుగుతాయి. ప్రతి ఏటా మూడు బెటాలియన్ల నుంచి 3 నుంచి నాలుగువేల మంది సైనికులు ఇక్కడ భద్రతా సేవలందిస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు ఏళ్ల వరకు ఇక్కడ గస్తీ కాస్తుంది. అయితే, ఇలా ప్రతికూల పరిస్థితులున్నాయని, ప్రాణనష్టం ఎదువవుతుందని అక్కడి నుంచి సైనికులను విరమించుకుంటే దేశరక్షణ గాలికొదిలేసినట్లవుందని , ఇది ఏమాత్రం సురక్షితం కాదని ఇటీవల రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పిన మాటలు సరైనవేనని ఆమోదించక తప్పదేమో. షరతులు ఒప్పుకుంటేనే భారత్... హనుమంతప్ప మృతి నేపథ్యంలో సియాచిన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని పాక్ చేసిన సూచనపై భారత ఆర్మీ స్పందించింది. ‘నిస్సైనీకరణ చేయాలంటే పాక్ కొన్ని ప్రాథమిక షరతులకు అంగీకరించాలి. ఆ ప్రాంతంలోని మా స్థావరాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది’ అని నార్తరన్ కమాండ్ ఉన్నతాధికారి లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా స్పష్టం చేశారు. -
సాహస జవాను కన్నుమూత
* ఆర్మీ ఆసుపత్రిలో లాన్స్‌నాయక్ హనుమంతప్ప మృతి * కీలక అవయవాల వైఫల్యంతో మరణం ఘనంగా నివాళులర్పించిన ప్రణబ్, అన్సారీ, మోదీ, సోనియా * నీలోని సైనికుడు అమరుడంటూ ప్రధాని సంతాప సందేశం * నేడు కర్ణాటకలోని స్వగ్రామంలోప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు * మంచు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి మృత్యువుతో పోరాడిన వైనం న్యూఢిల్లీ: ఆ వీరుడి ప్రాణాల కోసం దేశం మొత్తం ఒక్కటై చేసిన ప్రార్థనలు ఫలించలేదు. సియాచిన్ ప్రమాదం నుంచి విస్మయకర రీతిలో, ప్రాణాలతో బయటపడిన సాహస జవాను లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్(33) ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు.ఆరు రోజుల పాటు 30 అడుగుల లోతున, మైనస్ 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, టన్నుల కొద్దీ బరువైన మంచు చరియల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ హనుమంతప్ప చివరి వరకు మృత్యువుతో పోరాడారు. ఆయన ప్రాణాలను రక్షించేందుకు ఆర్మీ ఆస్పత్రి, ఎయిమ్స్ వైద్యులు శాయశక్తులా కృషి చేశారు. బహుళ శరీరాంగాల వైఫల్యంతో గురువారం ఉదయం 11.45 గంటలకు హనుమంతప్ప మృతి చెందినట్లు ఆర్మీ ప్రకటించింది. ‘ఆయన ప్రాణాలను రక్షించేందుకు చాలా ప్రయత్నించాం. అయినా, ఈ రోజు ఉదయం రక్తపోటు బాగా తగ్గిపోయింది. దాంతో గుండెపోటుకు గురయ్యారు’ అని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెల్ హాస్పిటల్ డెరైక్టర్ అండ్ కమాండెంట్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎస్డీ దుహన్ పేర్కొన్నారు. హనుమంతప్పకు భార్య మహాదేవి, రెండేళ్ల కూతురు నేత్ర ఉన్నారు. హనుమంతప్ప మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పలు రాష్ట్రాల సీఎంలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘నీ ధైర్య సాహసాలు, అజేయ స్ఫూర్తిని ఈ దేశం మరిచిపోదు’ అని రాష్ట్రపతి ప్రణబ్ కొనియాడారు. ‘నీ లోని సైనికుడు అమరుడు’ అంటూ మోదీ ట్విటర్లో ఘనంగా నివాళులర్పించారు. బ్రార్ స్క్వేర్ వద్ద ఉంచిన హనుమంతప్ప మృతదేహాన్ని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ త్రివిధ దళాల అధిపతులు, సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు సందర్శించి, పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. గురువారం రాత్రి మృతదేహాన్ని కర్ణాటకకు తరలిస్తామని, శుక్రవారం సాయంత్రంలోగా ఆయన స్వగ్రామమైన ధార్వాడ్ జిల్లా బెటదూరు గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ముగుస్తాయని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. బెటదూరు విషాదంలో మునిగిపోయింది. హనుమంతప్ప బంధువులు, స్థానికులు ఆయనింటికి చేరుకున్నారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. గురువారం రాత్రి హనుమంతప్ప మృతదేహానికి హుబ్లీ విమానాశ్రయంలో సీఎంనివాళులర్పిస్తారని, అనంతరం మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రికి తరలించి, శుక్రవారం ఉదయం ప్రజల సందర్శనార్థం నెహ్రూ గ్రౌండ్‌కు తరలిస్తారని సీఎం ఆఫీసుతెలిపింది.ఆత్మస్థైర్యంతో ఆరు రోజుల పాటు.. ఫిబ్రవరి 3న భారత్, పాక్ సరిహద్దుల్లోని ప్రమాదకర సియాచిన్ మంచు పర్వతంపై 19వేల అడుగుల ఎత్తై భారతీయ సైనిక స్థావరం ‘సోనమ్’పై భారీగా మంచు చరియలు విరిగిపడటంతో అక్కడ విధుల్లో ఉన్న మొత్తం 10 మంది సైనికులు ఆ మంచు చరియల్లో కూరుకుపోయారు. అక్కడి సైనికులంతా చనిపోయారనే అభిప్రాయంతోనే సహాయ చర్యలు ప్రారంభించిన సైన్యానికి ఆశ్చర్యకరంగా ఆరు రోజుల తరువాత ఫిబ్రవరి 9న 30 అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన హనుమంతప్ప కొన ఊపిరితో కనిపించాడు. తక్షణమే అత్యవసర వైద్యం అందించి, ఢిల్లీకి తరలించారు. ఘనంగా నివాళులు.. 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన హనుమంతప్ప మృతికి నివాళులు వెల్లువెత్తాయి. ‘ఆయన వీరుడు. ప్రతికూల పరిస్థితుల్లో అద్భుతమైన ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. విధి నిర్వహణలో అమరుడై గొప్ప త్యాగం చేశాడు. నీ కుమారుడి మృతికి దేశమంతా బాధపడ్తోంది’ - హనుమంతప్ప తల్లికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప సందేశం ‘మీ వంటి అమరవీరులు భారతావనికి సేవలందించడం గర్వంగా ఉంది’ -ప్రధాని నరేంద్ర మోదీ ‘దేశం మొత్తం ఈ వీరుడికి సెల్యూట్ చేస్తోంది’ - మనోహర్ పరీకర్, రక్షణ మంత్రి ‘నీలోని సైనికుడు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాడు’ - జనరల్ దల్బీర్ సింగ్, ఆర్మీ చీఫ్ ‘భారతీయ సైనిక దళాలకే ప్రత్యేకమైన తెగువ, పట్టుదల, ధైర్యసాహసాలను మీరు చూపారు’ - సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ‘దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుడిగా హనుమంతప్ప చరిత్రలో నిలిచిపోతాడు’ - కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ సీఎం హనుమంతప్ప జీవితం స్ఫూర్తిదాయకం: జగన్ హనుమంతప్ప మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడ వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన హనుమంతప్ప మనందరికీ స్ఫూర్తి దాయకమని, ఎప్పటికీ చిరస్మరణీయుడుగా ఉంటారని ట్విటర్లో నివాళులర్పించారు. హనుమంతప్ప కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గుండె వేగం అసాధారణం.. మంచు చరియలు విరిగిపడిపడినప్పుడు హనుమంతప్ప.. స్లీపింగ్ బ్యాగ్, ఎయిర్ బ్యాగ్‌గా మారడంతో ఆయనకు ఎముకలు విరగడంలాంటి గాయాలు కాలేదని నిపుణుల అభిప్రాయం.ఆయన యోగాలో నిపుణుడైనందువల్ల శ్వాసను నియంత్రించుకోగలిగాడని భావిస్తున్నారు. ‘ఆర్మీ ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో హనుమంతప్ప శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గానే ఉంది. గుండె మాత్రం అసాధారణ వేగంతో కొట్టుకుంటోంది. బీపీ చాలా తక్కువగా ఉంది’ అని ఆర్మీ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ దుహన్ తెలిపారు. ‘ఆ వెంటనే చికిత్స ప్రారంభించాం. ఆరురోజులుగా ఆహారం తీసుకోనందువల్ల వెంటనే గ్లూకోజ్ ఎక్కించడం ప్రారంభించాం. ఐదారు రోజులుగా రక్తప్రసరణ లేని శరీర భాగాలకు క్రమంగా రక్తాన్ని అందించడం మొదలెట్టాం. అన్ని రోజులపాటు ఆక్సిజన్, గ్లూకోజ్ లేకుండా ఉన్న కణాలు జీవక్రియల భారాన్ని తట్టుకోలేకపోయాయి. అప్పటికే బలహీనంగా ఉన్న ఆ కణాలు పెద్ద ఎత్తున విషపదార్ధాలను విడుదల చేయడం ప్రారంభించాయి. అవి రక్తంలో చేరి అప్పటికే దెబ్బతిని ఉన్న కిడ్నీలు, మెదడు, కాలేయాలను మరింత నాశనం చేశాయి’ అని దుహన్ వివరించారు. అన్నీ క్లిష్టమైన పోస్టింగ్‌లే.. హనుమంతప్ప 2002 అక్టోబర్ 25న మద్రాస్ రెజిమెంట్‌లోని 19వ బెటాలియన్‌లో జవానుగా చేరారు. 2003- 2006 మధ్య జమ్మూకశ్మీర్‌లోని మాహోర్‌లో, 2008- 2010 మధ్య 54వ రాష్ట్రీయ రైఫిల్స్(మద్రాస్)లో విధుల్లో జమ్మూకశ్మీర్‌లో పనిచేశారు.ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2010 -2012 మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద నిరోధక చేపట్టిన ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. 2015 అక్టోబర్ నుంచి సియాచిన్ గ్లేసియర్‌లో విధుల్లో ఉన్నారు. 2015 డిసెంబర్లో 19,500 అడుగుల ఎత్తై క్యాంప్‌లో విధులు నిర్వర్తించేందుకు వెళ్లి, ప్రమాదంలో చిక్కుకున్నారు. సియాచిన్‌పై సయోధ్య కావాలి హనుమంతప్ప మృతి లాంటి విషాదాలు మరోసారి జరగకుండా ఉండేందుకు.. సియాచిన్ సమస్యపై భారత్, పాకిస్తాన్‌లు సయోధ్యకు రావాలని భారత్‌లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. పరస్పర అంగీకారంతో సియాచిన్ నుంచి దళాలను ఉపసంహరించుకునేలా ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. గత సంవత్సరం ఐరాస సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ ప్రతిపాదన తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. -
మృత్యువును మోసగించాడు
న్యూఢిల్లీ: మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. 35 అడుగుల మంచు గర్భంలో అయిదు రోజుల పాటు మనిషి జీవించి ఉండటం సాధ్యమేనా? సియాచిన్ గ్లేసియర్‌లో హనుమంతప్ప సజీవంగా బయటపడటం నిపుణులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఆస్ట్రియాలోని హాన్‌బరో యూనివర్సిటీ పరిశోధన ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి 45 నుంచి 160 నిమిషాల కంటే ఎక్కువగా జీవించి ఉండే అవకాశాలు లేవని చెప్తున్నారు. కానీ లాన్స్‌నాయక్ హనుమంతప్ప మాత్రం ఈ పరిశోధనను వమ్ము చేశారు. ముంచుకొచ్చిన మృత్యువునే మోసగించాడు. మంచులో కూరుకుపోయిన సందర్భంలో హనుమంతప్ప తన శరీరాన్ని ఒక వలయాకారంలో మలచుకుని తనకు తాను వీలైనంత వెచ్చదనం ఉండేలా చూసుకున్నారు. గర్భంలో పిండం ఉన్నట్లుగా శరీరాన్ని ఉంచటం వల్ల ఆయనకు పెద్దగా హాని జరగలేదు. దీనికి తోడు సహజంగా ప్రాణవాయువు లభించి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆక్సిజన్ కోసం మీద పడిన మంచును తవ్వే ప్రయత్నం చేయకపోవటం వల్ల శరీరానికి అలసట కలగకపోవటం కూడా అతని జీవశక్తిని కాపాడి ఉండవచ్చంటున్నారు. హనుమంతప్ప ప్రతికూల వాతావరణంలోనూ.. వ్యాయామాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు యోగా, ప్రాణాయామం కారణంగానే శ్వాసను అదుపులో ఉంచుకోగలిగాడు. మంచు చరియల్లో 30 అడుగుల లోతులో ఇతన్ని గుర్తించిన రెస్క్యూ ఆపరేషన్ జరుపుతున్న జవాన్లు హనుమంతప్ప.. నోరు, ముక్కు వద్ద ఎయిర్ ప్యాకెట్లను చూసి ఆశ్చర్యపోయారు. -
ఒక జవాను మృతదేహం లభ్యం
శ్రీనగర్: భారత సైనికులపట్ల విషాదంగా మారిన సియాచిన్ మంచుకొండలవిరిగిపాటు ఘటనలో ఎట్టకేలకు ఓ సైనికుడి మృతదేహం లభ్యమైంది. మరో తొమ్మిదిమంది సైనికులు మృతదేహాలు లభించాల్సి ఉంది. దాదాపు ఆరు రోజులుగా సైనికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 19 వేల అడుగుల ఎత్తులోని సియాచిన్ గ్లేసియర్‌పై భారీ మంచుకొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పదిమంది భారత జవాన్లు గల్లంతయ్యారు. సాధరణంగా సైనికులు కూడా చేరుకోలేని ఈ ప్రాంతంలో అతి క్లిష్టమైన పరిస్థితుల మధ్య గల్లంతైన సైనికుల కోసం ఆరు రోజులుగా గాలిస్తుండగా సోమవారం సాయంత్రం ఓ జవాను మృతదేహం లభ్యమైంది. జవానులు కూరుకుపోయిన ప్రాంతంలో 30 అడుగుల మేర మంచుకొండలు పడిపోయాయి. -
సియాచిన్‌లో రోజుకు మూడున్నర కోట్ల ఖర్చు
కశ్మీర్: మంచు తుఫాను కారణంగా పది మంది భారత సైనికులు మరణించడంతో కశ్మీర్‌కు ఆవల మంచు పర్వతాలతో కూడిన ‘సియాచిన్’ ప్రాంతం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (సముద్ర మట్టానికి ఇరవై వేల అడుగుల ఎత్తులో) యుద్ధ క్షేత్రంగా గుర్తింపు పొందిన సియాచిన్ ప్రాంతాన్ని కాపల కాసేందుకు భారత ప్రభుత్వం రోజుకు అక్షరాల మూడున్నర కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది. సియాచిన్‌లో భారత్, పాకిస్తాన్ సైనికుల మధ్య ఇంతవరకు జరిగిన సంఘర్షణ, యుద్ధాల్లో 900 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది మంచు తుఫానుల కారుణంగానే మరణించడం గమనార్హం. 2012లో సంభవించిన భారీ హిమపాతంలో పాకిస్తాన్‌కు చెందిన 140 మంది సైనికులు మరణించారు. అప్పుడు భారత్ అందిస్తానన్న సహాయ సహకారాలను పాకిస్తాన్ స్వీకరించలేదు. ఇప్పుడు గల్లంతయిన పది మంది భారత సైనికులను కాపాడేందుకు పాకిస్తాన్ అందిస్తానన్న సహాయాన్ని భారత్ స్వీకరించలేదు. ఇరు దేశాలు ఇలాంటి వైఖరిని అనుసరిస్తూ వస్తుండడం వల్లనే ఇంతవరకు సియాచిన్ సమస్య పరిష్కారం కాలేదు. భారత్, పాకిస్తాన్ దేశాలు రెండుగా విడిపోయిన తర్వాత 1949లో కుదిరిన కరాచి ఒప్పందంలో ఇరుదేశాల మధ్య సియాచిన్ సరిహద్దులను నిర్దేషించలేదు. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందంలో కూడా సరిహద్దులను నిర్దేశించకుండా కేవలం కాల్పుల విరమణ హద్దులను మాత్రమే నిర్ణయించారు. మానవ నివాసానికి గానీ, మరే ఇతర అవసరాలకుగానీ ఉపయోగపడే ప్రాంతం కాకపోవడం వల్లనే ఆ ప్రాంతాన్ని అలా వదిలేశారు. తరచు దట్టమైన మంచు కురిసే సియాచిన్‌లో ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీల వరకు పడిపోతుంది. ఈ ప్రాంతం గుండా అటు పాకిస్తాన్లోకి, అక్కడి నుంచి ఇటు భారత్‌లోకి రావడం దాదాపు అసాధ్యం. వేసవి కాలంలో పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు సియాచిన్ ప్రాంతం గుండా కశ్మీర్లోకి ప్రవేశిస్తున్నారన్న ఆరోపణలతో భారత సైన్యం 1984, ఏప్రిల్ 13వ తేదీన ‘మేఘదూత్ ఆపరేషన్’ పేరిట సైనిక చర్యను చేపట్టింది. ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సియాచిన్ యుద్ధం కొనసాగుతోంది. ఇరువైపుల సైనిక దళాలు దాదాపు 19,600 అడుగుల ఎత్తులో సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకొని కాపలాగాస్తున్నాయి. 2012లో హిమపాతం వల్ల 140 మంది పాక్ సైనికులు మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ కయానీ సియాచిన్ ప్రాంతం నుంచి సైన్యాన్ని ఇరువైపుల ఉపసంహరించుకుందామన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇరు దేశాలకు పరస్పర విశ్వసనీయత లేకపోవడం, కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం వల్ల ఈ ప్రతిపాదన కార్యరూపానికి దారి తీయలేదు. అందుకు భారత్ కూడా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. మన సైనికుల ప్రాణాలను కోల్పోవడమే కాకుండా రోజుకు మూడున్నర కోట్ల రూపాయలను అనవసరంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సియాచిన్ లాంటి చిన్న సరిహద్దు సహస్యలను ముందుగా పరిష్కరించుకోవడం మున్ముందు సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి దారితీయవచ్చని నేడు పది మంది భారత సైనికులు అమరులంటూ జోహార్లు అర్పించిన ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి. -
ప్రమాదంలో 10 మంది సైనికులు
లడఖ్: లడఖ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. భారీ కొండచరియలు విరిగిపడి దానికింద సైనికులు చిక్కుకున్నారు. దాదాపు పదిమంది సైనికులు కొండచరియల శిథిలాల కింద ఇరుక్కుపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సియాచిన్ గ్లేసియర్ వద్ద ఈ ఘటన సంభవించింది. శిథిలాల కింద ఇరుక్కున్న సైనికులను రక్షించేందుకు ఇండియన్ ఆర్మీ, వాయుసేన రంగంలోకి దిగాయి. సముద్రమట్టానికి 19 వేల అడుగుల ఎత్తున ఈ ఘటన సంభవించిన ప్రాంతం ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నేడు సియాచిన్‌కు సందర్శించనున్న మోడీ