సాహస జవాను కన్నుమూత | He Walked 6 KM To School: What We Didn't Know About Siachen Braveheart | Sakshi
Sakshi News home page

సాహస జవాను కన్నుమూత

Published Fri, Feb 12 2016 1:28 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM

సాహస జవాను కన్నుమూత

సాహస జవాను కన్నుమూత

* ఆర్మీ ఆసుపత్రిలో లాన్స్‌నాయక్ హనుమంతప్ప మృతి  
* కీలక అవయవాల వైఫల్యంతో మరణం
ఘనంగా నివాళులర్పించిన ప్రణబ్, అన్సారీ, మోదీ, సోనియా
* నీలోని సైనికుడు అమరుడంటూ ప్రధాని సంతాప సందేశం
* నేడు కర్ణాటకలోని స్వగ్రామంలోప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
* మంచు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి మృత్యువుతో పోరాడిన వైనం

న్యూఢిల్లీ: ఆ వీరుడి ప్రాణాల కోసం దేశం మొత్తం ఒక్కటై చేసిన ప్రార్థనలు ఫలించలేదు.

సియాచిన్ ప్రమాదం నుంచి విస్మయకర రీతిలో, ప్రాణాలతో బయటపడిన సాహస జవాను లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్(33) ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు.ఆరు రోజుల పాటు 30 అడుగుల లోతున, మైనస్ 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో, టన్నుల కొద్దీ బరువైన మంచు చరియల కింద చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డ  హనుమంతప్ప చివరి వరకు మృత్యువుతో పోరాడారు. ఆయన ప్రాణాలను రక్షించేందుకు ఆర్మీ ఆస్పత్రి, ఎయిమ్స్ వైద్యులు శాయశక్తులా కృషి చేశారు.

బహుళ శరీరాంగాల వైఫల్యంతో గురువారం ఉదయం 11.45 గంటలకు హనుమంతప్ప మృతి చెందినట్లు ఆర్మీ ప్రకటించింది. ‘ఆయన ప్రాణాలను రక్షించేందుకు చాలా ప్రయత్నించాం. అయినా, ఈ రోజు ఉదయం రక్తపోటు బాగా తగ్గిపోయింది. దాంతో గుండెపోటుకు గురయ్యారు’ అని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరెల్ హాస్పిటల్ డెరైక్టర్ అండ్ కమాండెంట్ లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎస్‌డీ దుహన్ పేర్కొన్నారు.

హనుమంతప్పకు భార్య మహాదేవి, రెండేళ్ల కూతురు నేత్ర ఉన్నారు. హనుమంతప్ప మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పలు రాష్ట్రాల సీఎంలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘నీ ధైర్య సాహసాలు, అజేయ స్ఫూర్తిని ఈ దేశం మరిచిపోదు’ అని రాష్ట్రపతి ప్రణబ్ కొనియాడారు. ‘నీ లోని సైనికుడు అమరుడు’ అంటూ మోదీ ట్విటర్లో ఘనంగా నివాళులర్పించారు.

బ్రార్ స్క్వేర్ వద్ద ఉంచిన హనుమంతప్ప మృతదేహాన్ని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ త్రివిధ దళాల అధిపతులు, సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు సందర్శించి, పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. గురువారం రాత్రి మృతదేహాన్ని కర్ణాటకకు తరలిస్తామని, శుక్రవారం సాయంత్రంలోగా ఆయన స్వగ్రామమైన ధార్వాడ్ జిల్లా బెటదూరు గ్రామంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ముగుస్తాయని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

బెటదూరు విషాదంలో మునిగిపోయింది. హనుమంతప్ప బంధువులు, స్థానికులు ఆయనింటికి  చేరుకున్నారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. గురువారం రాత్రి హనుమంతప్ప మృతదేహానికి హుబ్లీ విమానాశ్రయంలో సీఎంనివాళులర్పిస్తారని, అనంతరం మృతదేహాన్ని కిమ్స్ ఆస్పత్రికి తరలించి, శుక్రవారం ఉదయం ప్రజల సందర్శనార్థం నెహ్రూ గ్రౌండ్‌కు తరలిస్తారని సీఎం ఆఫీసుతెలిపింది.ఆత్మస్థైర్యంతో ఆరు రోజుల పాటు.. ఫిబ్రవరి 3న భారత్, పాక్ సరిహద్దుల్లోని ప్రమాదకర సియాచిన్ మంచు పర్వతంపై 19వేల అడుగుల ఎత్తై భారతీయ సైనిక స్థావరం ‘సోనమ్’పై భారీగా మంచు చరియలు విరిగిపడటంతో అక్కడ విధుల్లో ఉన్న మొత్తం 10 మంది సైనికులు ఆ మంచు చరియల్లో కూరుకుపోయారు. అక్కడి సైనికులంతా చనిపోయారనే అభిప్రాయంతోనే సహాయ చర్యలు ప్రారంభించిన సైన్యానికి ఆశ్చర్యకరంగా ఆరు రోజుల తరువాత ఫిబ్రవరి 9న 30 అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన హనుమంతప్ప కొన ఊపిరితో కనిపించాడు. తక్షణమే అత్యవసర వైద్యం అందించి, ఢిల్లీకి తరలించారు.
 ఘనంగా నివాళులు.. 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన హనుమంతప్ప మృతికి నివాళులు వెల్లువెత్తాయి.
 
‘ఆయన వీరుడు. ప్రతికూల పరిస్థితుల్లో అద్భుతమైన ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. విధి నిర్వహణలో అమరుడై గొప్ప త్యాగం చేశాడు. నీ కుమారుడి మృతికి దేశమంతా బాధపడ్తోంది’
 - హనుమంతప్ప తల్లికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప సందేశం
 
‘మీ వంటి అమరవీరులు భారతావనికి సేవలందించడం గర్వంగా ఉంది’ -ప్రధాని నరేంద్ర మోదీ
 ‘దేశం మొత్తం ఈ వీరుడికి సెల్యూట్ చేస్తోంది’
 - మనోహర్ పరీకర్, రక్షణ మంత్రి
 ‘నీలోని సైనికుడు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాడు’
 - జనరల్ దల్బీర్ సింగ్, ఆర్మీ చీఫ్
 
‘భారతీయ సైనిక దళాలకే ప్రత్యేకమైన తెగువ, పట్టుదల, ధైర్యసాహసాలను మీరు చూపారు’
 - సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు
 ‘దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుడిగా హనుమంతప్ప చరిత్రలో నిలిచిపోతాడు’
 - కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ సీఎం
 
హనుమంతప్ప జీవితం స్ఫూర్తిదాయకం: జగన్ హనుమంతప్ప మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన హనుమంతప్ప మనందరికీ స్ఫూర్తి దాయకమని, ఎప్పటికీ చిరస్మరణీయుడుగా ఉంటారని ట్విటర్‌లో నివాళులర్పించారు. హనుమంతప్ప కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
 
గుండె వేగం అసాధారణం..
మంచు చరియలు విరిగిపడిపడినప్పుడు హనుమంతప్ప..  స్లీపింగ్ బ్యాగ్, ఎయిర్ బ్యాగ్‌గా మారడంతో ఆయనకు ఎముకలు విరగడంలాంటి గాయాలు కాలేదని నిపుణుల అభిప్రాయం.ఆయన యోగాలో నిపుణుడైనందువల్ల శ్వాసను నియంత్రించుకోగలిగాడని భావిస్తున్నారు. ‘ఆర్మీ ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో హనుమంతప్ప శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గానే ఉంది. గుండె మాత్రం అసాధారణ వేగంతో కొట్టుకుంటోంది.

బీపీ చాలా తక్కువగా ఉంది’ అని ఆర్మీ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ దుహన్ తెలిపారు. ‘ఆ వెంటనే చికిత్స ప్రారంభించాం. ఆరురోజులుగా ఆహారం తీసుకోనందువల్ల వెంటనే గ్లూకోజ్ ఎక్కించడం ప్రారంభించాం. ఐదారు రోజులుగా రక్తప్రసరణ లేని శరీర భాగాలకు క్రమంగా రక్తాన్ని అందించడం మొదలెట్టాం. అన్ని రోజులపాటు ఆక్సిజన్, గ్లూకోజ్ లేకుండా ఉన్న కణాలు జీవక్రియల భారాన్ని తట్టుకోలేకపోయాయి.

అప్పటికే బలహీనంగా ఉన్న ఆ కణాలు పెద్ద ఎత్తున విషపదార్ధాలను విడుదల చేయడం ప్రారంభించాయి. అవి రక్తంలో చేరి అప్పటికే దెబ్బతిని ఉన్న కిడ్నీలు, మెదడు, కాలేయాలను మరింత నాశనం చేశాయి’ అని దుహన్ వివరించారు.
 
అన్నీ క్లిష్టమైన పోస్టింగ్‌లే.. హనుమంతప్ప 2002 అక్టోబర్ 25న మద్రాస్ రెజిమెంట్‌లోని 19వ బెటాలియన్‌లో జవానుగా చేరారు. 2003- 2006 మధ్య జమ్మూకశ్మీర్లోని మాహోర్‌లో, 2008- 2010 మధ్య  54వ రాష్ట్రీయ రైఫిల్స్(మద్రాస్)లో విధుల్లో జమ్మూకశ్మీర్లో పనిచేశారు.ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2010 -2012 మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద నిరోధక చేపట్టిన ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. 2015 అక్టోబర్ నుంచి సియాచిన్ గ్లేసియర్‌లో విధుల్లో ఉన్నారు.  2015 డిసెంబర్‌లో 19,500 అడుగుల ఎత్తై క్యాంప్‌లో విధులు నిర్వర్తించేందుకు వెళ్లి, ప్రమాదంలో చిక్కుకున్నారు.
 
సియాచిన్‌పై సయోధ్య కావాలి
హనుమంతప్ప మృతి లాంటి విషాదాలు మరోసారి జరగకుండా ఉండేందుకు.. సియాచిన్ సమస్యపై భారత్, పాకిస్తాన్‌లు సయోధ్యకు రావాలని భారత్‌లో పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యానించారు. పరస్పర అంగీకారంతో సియాచిన్ నుంచి దళాలను ఉపసంహరించుకునేలా ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. గత సంవత్సరం ఐరాస సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ ప్రతిపాదన తీసుకువచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement