సియాచిన్ పేరు వినబడగానే ఒంట్లో చలితోపాటు మృత్యుభయం కూడా దూరుతుంది. శత్రువుల జాడను కనిపెట్టడం ఒక ఎత్తయితే, ప్రకృతే శత్రువుగా మారి ప్రాణాలు కబళించే ప్రమాదకర పరిస్థితి నుంచి బయట పడడం మరో ఎత్తు.
దేశం కోసం కొండంత ధైర్యంతో సియాచిన్ గ్లాసియర్‌లో విధులు నిర్వహిస్తున్నారు మన సైనికులు. సియాచిన్ గ్లాసియర్‌లో విధులు నిర్వహించబోతున్న ఫస్ట్ ఉమన్ మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ఫాతిమా వసీమ్ చరిత్ర సృష్టించింది...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. గడ్డకట్టే చలిలో మన సైనికుల సాహసం, అంకితభావం మాటలకు అందనివి. సముద్ర మట్టానికి 17,720 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌లో శీతాకాలంలో పగలు ఏడు గంటలు మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండకపోవడంతో సైనికులు ఎక్కువ సమయం నిద్ర పోవడానికి వీలుకాదు. షేవింగ్ చేసుకోవాలన్నా కష్టమే. ఒకవేళ చర్మం తెగితే గాయం మానడానికి చాలా సమయం పడుతుంటుంది. స్నానం చేయాలన్న కష్టమే.
ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి చేరుకోగలవు. ఇక్కడ మూడు వేలమంది వరకు సైనికులు పనిచేస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు గస్తీ విధులు నిర్వహిస్తుంది. మంచుకొండ చరియలు విరిగి పడడం ద్వారా ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రతికూలత’ గురించి తప్ప ‘అనుకూలత’ గురించి ఒక్క మాట కూడా వినిపించని మృత్యుక్షేత్రంలోకి మెడికల్ ఆఫీసర్‌గా అడుగు పెట్టనుంది కెప్టెన్ ఫాతిమా వసీమ్.
‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ పొందింది ఫాతిమా. ‘సియాచిన్ గ్లేసియర్‌పై ఆపరేషనల్ పోస్ట్‌లో విధులు నిర్వహించబోతున్న తొలి మహిళా వైద్యాధికారిగా ఫాతిమా వసీమ్ ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ఇది చారిత్రక సందర్భం. కెప్టెన్ ఫాతిమా వసీమ్ ధైర్యసాహసాలు, అంకితభావాలకు అద్దం పట్టిన సందర్భం’ అంటూ ‘ఎక్స్’లో ఇండియన్ ఆర్మీ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ‘ఐసే జాగోరే సాథియో... దునియా సే జాకో బోలుదో’ అనే పాట వినిపిస్తుండగా ‘మీట్ కెప్టెన్ ఫాతిమా, ఏ సియాచిన్ వారియర్. ఉయ్ సెల్యూట్ హర్’ అంటూ వీడియో మొదలవుతుంది. ఈ వీడియోలో ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఫాతిమా వసీమ్ శిక్షణ తీసుకుంటున్న, సైనికులకు వైద్యం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి.
∙కెప్టెన్
ఫాతిమా వసీమ్∙శిక్షణలో...
∙వైద్య
సేవలు
అందిస్తూ
Comments
Please login to add a commentAdd a comment