Woman officer
-
మహిళా అధికారితో దురుసు ప్రవర్తన.. మంత్రి రాజీనామాకు ఆదేశం
కలకత్తా: సొంత పార్టీ నేత, పశ్చిమబెంగాల్ జైళ్ల మంత్రి అఖిల్గిరిపై తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గిరి ఓ మహిళా అధికారిని బెదిరిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పార్టీ సీరియస్ అయింది. ఆ మహిళా అధికారికి క్షమాపణలు చెప్పడంతో పాటు మంత్రిపదవికి వెంటనే రాజీనామా చేయాలని గిరిని పార్టీ ఆదేశించింది. ఈ విషయమై తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ సంతనుసేన్ మాట్లాడుతూ ‘ఒక మహిళా అధికారితో మా మంత్రి అనుచితంగా ప్రవర్తించారు. ఇలాంటి ప్రవర్తనను మేం సమర్థించం. ఆ మంత్రిని మహిళా అధికారికి క్షమాపణ చెప్పడంతోపాటు మంత్రిపదవికి రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించాం.తృణమూల్ కాంగ్రెస్ రాజధర్మాన్ని పాటిస్తుంది. మహిళా వ్యతిరేక పార్టీ బీజేపీ సొంత పార్టీ నేతలపై ఎప్పుడూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో సీపీఎం కూడా ఈ విషయాల్లో రాజధర్మాన్ని పాటించలేదు’అని సంతనుసేన్ తెలిపారు. -
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డీజీగా చరిత్రకెక్కిన సాధనా సక్సేనా
ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా సాధనా సక్సేనా నాయర్ ( Sadhna Saxena Nair) రికార్డు సృష్టించారు. ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళా డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఆగస్టు 1న (గురువారం) ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు.ఈ నియామకానికి కంటే ముందు ఆమె ఆర్మీ బలగాల డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారి కూడా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయరే కావడం గమనార్హం. ర్యాంకులో ఎయిర్ మార్షల్‌గా పదోన్నతి కల్పించి మరీ ఆమెను ఆ పదవిలో నియమించారు. గతంలో ఆమె ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.పుణెలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన ఎయిర్ మార్షల్ సాధనా సక్సేనా నాయర్ 1985లో వైద్యురాలిగా ఆర్మీలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎయిర్ మార్షల్ హోదాకు చేరుకున్నారు. డిసెంబరు 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్లో నియమితులయ్యారు. 1986లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా చేరారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ , స్విట్జర్లాండ్‌లోని MME (మిలిటరీ మెడికల్ ఎథిక్స్)తో CBRN (కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్) వార్ఫేర్లో శిక్షణ పొందారు.వైద్య విద్యపై ఆసక్తితో ఆర్మీలో పనిచేస్తూనే ఆమె ఫ్యామిలీ మెడిసిన్‌లో పీజీ చేశారు. న్యూ ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా ర్మీ మెడికల్ సర్వీసెస్‌కు డీజీగా ఎంపికయ్యారు. ఆమె అందించిన సేవలకు గాను విశిష్ట సేవా పతకాన్ని (VSM) అందుకున్నారు. మెరిటోరియస్ సర్వీస్ కోసం ఆమెకు AOC-in-C (వెస్ట్రన్ ఎయిర్ కమాండ్),చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ప్రశంసలు లభించాయి. జనరల్ ఆఫీసర్ ఎయిర్ మార్షల్ కేపీ నాయర్ (రిటైర్డ్)ని వివాహం చేసుకున్నారు. నాయర్ కుటుంబంలోని మూడు తరాలు గత 70 ఏళ్లుగా సాయుధ దళాలలో పనిచేశారు. -
అన్నీ ఎదురుదెబ్బలే, 4 సార్లు ఫెయిల్ : సక్సెస్ చేయి అందుకుంది
అసాధారణమైన సంకల్ప శక్తి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు. బాధలనుంచే సంతోషాన్ని, సక్సెస్‌ను అందుకోవచ్చు. ఢిల్లీకి చెందిన అన్షికా జైన్ సక్సెస్ స్టోరీ చదివితే దీన్ని అక్షరాలా నిజం అంటారు. ఇంతకీ అన్షిక ఏం సాధించారో ఈ కథనంలో తెలుసుకుందాం. ఢిల్లీకి చెందిన అన్షికా అయిదేళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో అమ్మమ్మ , మేనమామల వద్దే పెరిగింది. వారే ఆమె జీవితంలో ప్రధానంగా మారిపోయారు. ఆమె జీవితంలో బలమైన స్తంభాలుగా నిలిచారు. ఆమె ఉన్నతికి బాటలు వేశారు. ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న అన్షిక అమ్మమ్మ తాను సివిల్ సర్వెంట్ కావాలని కలగంది. కానీ అది సాకారం లేదు. అందుకే మనవరాలిని ఆ వైపు ప్రోత్సహించింది. అన్షిక కూడా అమ్మమ్మ డ్రీమ్‌ను నెరవేర్చాలని నిర్ణయించుకుంది. ఢిల్లీ యూనివర్సిటీలోని రాంజాస్ కాలేజీలో ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత, దేశంలోని అతిపెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది అన్షికకు. కానీ ఐపీఎస్ కావాలనేది కోరికతో దానిని తిరస్కరించింది. యూపీఎస్సీ కోసం సిద్ధమవుతోంది. ఇక్కడే మరోసారి ఆమెకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2019లో తనకు పెద్ద దిక్కుగా ఉన్న అమ్మమ్మను కోల్పోయింది. ఏకైక సపోర్ట్ సిస్టమ్ మాయం కావడంతో చాలా బాధపడింది అన్షిక. కానీ అమ్మమ్మ డ్రీమ్ గుర్తు చేసుకుంది. పట్టుదలతో ప్రిపరేషన్‌ను కొనసాగించింది. నాలుగు సార్లు విజయం దక్కకపోయినా పట్టు వీడలేదు. 2020లో జస్ట్ ఒక్క నంబరులో అవకాశాన్ని కోల్పోయింది. చివరికి అయిదో ప్రయత్నంలో AIR-306 ర్యాంకు సాధించింది. అలా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ కావాలనే ఆమె కోరిక ఫలించింది. 2023, జూన్ 5 ఏఐఎస్ అధికారి వాసు జైన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అన్షిక ఐపీఎస్ కల సాకారంలో వాసు జైన్ పాత్ర కూడా చాలా ఉందిట. -
కొండంత ధైర్యంతో...
సియాచిన్ పేరు వినబడగానే ఒంట్లో చలితోపాటు మృత్యుభయం కూడా దూరుతుంది. శత్రువుల జాడను కనిపెట్టడం ఒక ఎత్తయితే, ప్రకృతే శత్రువుగా మారి ప్రాణాలు కబళించే ప్రమాదకర పరిస్థితి నుంచి బయట పడడం మరో ఎత్తు. దేశం కోసం కొండంత ధైర్యంతో సియాచిన్ గ్లాసియర్‌లో విధులు నిర్వహిస్తున్నారు మన సైనికులు. సియాచిన్ గ్లాసియర్‌లో విధులు నిర్వహించబోతున్న ఫస్ట్ ఉమన్ మెడికల్ ఆఫీసర్ (ఆపరేషనల్ పోస్ట్)గా ఫాతిమా వసీమ్ చరిత్ర సృష్టించింది... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్. గడ్డకట్టే చలిలో మన సైనికుల సాహసం, అంకితభావం మాటలకు అందనివి. సముద్ర మట్టానికి 17,720 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్‌లో శీతాకాలంలో పగలు ఏడు గంటలు మాత్రమే ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా ఉండకపోవడంతో సైనికులు ఎక్కువ సమయం నిద్ర పోవడానికి వీలుకాదు. షేవింగ్ చేసుకోవాలన్నా కష్టమే. ఒకవేళ చర్మం తెగితే గాయం మానడానికి చాలా సమయం పడుతుంటుంది. స్నానం చేయాలన్న కష్టమే. ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి చేరుకోగలవు. ఇక్కడ మూడు వేలమంది వరకు సైనికులు పనిచేస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు నెలల వరకు గస్తీ విధులు నిర్వహిస్తుంది. మంచుకొండ చరియలు విరిగి పడడం ద్వారా ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రతికూలత’ గురించి తప్ప ‘అనుకూలత’ గురించి ఒక్క మాట కూడా వినిపించని మృత్యుక్షేత్రంలోకి మెడికల్ ఆఫీసర్‌గా అడుగు పెట్టనుంది కెప్టెన్ ఫాతిమా వసీమ్. ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఎన్నో నెలల పాటు కఠోరమైన శిక్షణ పొందింది ఫాతిమా. ‘సియాచిన్ గ్లేసియర్‌పై ఆపరేషనల్ పోస్ట్‌లో విధులు నిర్వహించబోతున్న తొలి మహిళా వైద్యాధికారిగా ఫాతిమా వసీమ్ ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చింది. ఇది చారిత్రక సందర్భం. కెప్టెన్ ఫాతిమా వసీమ్ ధైర్యసాహసాలు, అంకితభావాలకు అద్దం పట్టిన సందర్భం’ అంటూ ‘ఎక్స్’లో ఇండియన్ ఆర్మీ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ‘ఐసే జాగోరే సాథియో... దునియా సే జాకో బోలుదో’ అనే పాట వినిపిస్తుండగా ‘మీట్ కెప్టెన్ ఫాతిమా, ఏ సియాచిన్ వారియర్. ఉయ్ సెల్యూట్ హర్’ అంటూ వీడియో మొదలవుతుంది. ఈ వీడియోలో ‘సియాచిన్ బ్యాటిల్ స్కూల్’లో ఫాతిమా వసీమ్ శిక్షణ తీసుకుంటున్న, సైనికులకు వైద్యం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి. ∙కెప్టెన్ ఫాతిమా వసీమ్∙శిక్షణలో... ∙వైద్య సేవలు అందిస్తూ -
నేవీ షిప్‌పై మొదటిసారిగా మహిళా అధికారికి బాధ్యతలు
న్యూఢిల్లీ: నావికా దళం యుద్ధ నౌకపై మొదటిసారిగా మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. మహిళా అధికారులకు ‘అన్ని ర్యాంకులు– అన్ని బాధ్యతలు’ అనే సిద్ధాంతానికి నేవీ కట్టుబడి ఉంటుందన్నారు. హిందూ మహా సముద్రంలో చైనా ఉనికి పెరిగిన నేపథ్యంలో భారత నావికా దళం యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు గత ఏడాదిగా వ్యూహాత్మకంగా చురుగ్గా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. -
లైంగిక వేధింపుల కేసులో మాజీ డీజీపీకి మూడేళ్ల శిక్ష
తమిళనాడు:లైంగిక వేధింపుల కేసులో తమిళనాడు మాజీ డీజీపీకి న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఐపీఎస్ అధికారి, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) రాజేశ్ దాస్‌ను విల్లుపురం న్యాయస్థానం దోషిగా తేల్చింది. తోటి సీనియర్ అధికారి రాజేశ్ దాస్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా ఐపీఎస్ అధికారి 2021లో ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రి కే పళనిస్వామి భద్రతపై విధులకు వెళ్లిన క్రమంలో తనను వేధించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణలపై దాస్‌ను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దర్యాప్తు చేయడానికి ఆరుగురి వ్యక్తులతో కూడిన ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కేసు అప్పటి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించింది. ఎన్నికల బరిలో నిలిచిన ఎంకే స్టాలిన్.. తనను గెలిపిస్తే ఈ కేసును న్యాయబద్దంగా దర్యాప్తు చేపిస్తానని ప్రజలకు హామీ కూడా అప్పట్లో ఇచ్చారు. ఇదీ చదవండి:గవర్నర్ Vs సీఎం స్టాలిన్:సెంథిల్ బాలాజీ అంశంలో మరో వివాదం.. -
సాయ్(SAI) మహిళా అధికారి నిర్వాకం.. వీడియో వైరల్
టీనేజ్ అథ్లెట్‌తో సాయ్(SAI) మహిళా అధికారి మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చేసింది. విషయంలోకి వెళితే.. షర్మిలా తేజావత్ అనే మహిళ ధార్‌లోని కుషాభౌ ఠాక్రే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) స్పెషల్ ఏరియా గేమ్స్ సెంటర్లో ఇన్ఛార్జ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తోంది. సాయ్ సెంటర్‌కు వచ్చే టీనేజ్ అథ్లెట్స్‌ను షర్మిలా తేజావత్ తరచూ తన ఇంటికి తీసుకెళ్లి పర్సనల్ పనులకు వాడుకోవడమే కాకుండా వారితో మసాజ్ చేయించుకోవడం అలవాటుగా చేసుకుంది. తాజాగా ఇద్దరు టీనేజ్ అథ్లెట్లను తన ఇంటికి తీసుకెళ్లిన షర్మిలా తేజావత్ వారితో మసాజ్ చేయించుకున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. వీడియో తేదీ, సమయం, మసాజ్ చేస్తున్న అథ్లెట్స్ ఏ క్రీడకు చెందినవారు అనే దానిపై క్లారిటీ లేదు. కానీ షర్మిలాతో పాటే ఉన్న మరొక వ్యక్తి ఈ తతంగమంతా తన సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సాయ్ ఇంతవరకు స్పందించలేదు. అయితే మసాజ్ వ్యవహారంపై సదరు మహిళా అధికారిణిని ప్రశ్నించగా.. ఆమె తన సమాధానాన్ని దాటవేశారు. దేశంలోని ప్రతిష్టాత్మకమైన క్రీడా శిక్షణా శిబిరంగా పేరున్న సాయ్కు ఇది పెద్ద మచ్చ లాంటిదని పలువురు క్రీడా పండితులు అభిప్రాయపడ్డారు. బాధ్యత గల పదవిలో ఉంటూ మంచి అథ్లెట్స్‌గా తీర్చిదిద్దాల్సింది పోయి వారితో ఇలాంటి పనులు చేయించుకోవడం ఏంటని మండిపడ్డారు. కాగా ధార్‌లోని జెట్‌పురాలోని కేంద్రానికి దేశం నలుమూలల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున శిక్షణ కోసం వస్తుంటారు. #धार #साई ट्रेनिंग सेंटर स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया का वीडियो वायरल हो रहा है, जिसमें साई सेंटर केंद्र प्रभारी सर्मिला तेजावत खिलाड़ियों से पैर दबवातीं नज़र आ रहीं हैं। खिलाड़ियों का ऐसा शोषण? कृपया संज्ञान लें @Media_SAI @YASMinistry @ianuragthakur #वायरल_वीडियो pic.twitter.com/JxxzJTR080 — 🇮🇳Sandeep Singh संदीप सिंह (@Sandeep_1Singh_) August 28, 2022 చదవండి: G.O.A.T అని ఇలా కూడా పిలవొచ్చా.. వారెవ్వా! -
టీడీపీ నేత పత్తిపాటి, అనుచరుల దౌర్జన్యకాండ.. అధికారిణిపై దాడి
చిలకలూరిపేట(పల్నాడు జిల్లా): అనుమతుల్లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి చెరువు వద్ద బోర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ ప్లాంట్ పునఃప్రారంభం పేరుతో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళా అధికారిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటన పల్నాడు జిల్లాలో శుక్రవారం జరిగింది. వివరాలివీ.. చదవండి: సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే కారణమా..? చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పాత మంచినీటి చెరువు కట్టపక్కన ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం పేరుతో వాటర్ ప్లాంట్‌ను నాటి మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ ప్లాంట్ మనుగడలో లేదు. కానీ, దీనిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం మీడియాలో ప్రచారం చేశారు. దీనికితోడు.. పురపాలక సంఘానికి చెందిన స్థలంలో గుట్టుగా రెండు బోర్లు వేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు బోర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అక్కడ ఎలాంటి తదుపరి చర్యలు నిర్వహించరాదని గురువారం నోటీసులు జారీచేశారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా, పత్తిపాటి తన అనుచరులు సుమారు 200మందితో ప్లాంటు వద్దకు చేరుకుని నానా రభస సృష్టించారు. పోలీసులను తోసేసి వాటర్‌ప్లాంట్‌లోకి ప్రవేశిస్తున్న పత్తిపాటి పుల్లారావు, టీడీపీ నాయకులు మహిళా అధికారిణిపై దాడి ప్లాంట్ ప్రారంభానికి వచ్చిన పత్తిపాటి పుల్లారావుకు మునిసిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (టీపీఎస్) కోడిరెక్క సునీత, రెవెన్యూ అధికారి ఫణికుమార్, ఇతర అధికారులు బోర్లు, ప్లాంట్ నిర్వహణకు అనుమతుల్లేవని స్పష్టంచేశారు. అర్బన్ సీఐ జి. రాజేశ్వరరావు, పట్టణ ఎస్ఐలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. టీడీపీ నాయకులు మునిసిపల్ అధికారులను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగి రభస సృష్టించారు. అంతేకాక.. మహిళ అని కూడా చూడకుండా సునీతను తోసేసి, ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు భుజం, వీపు ప్రాంతంలో గట్టి దెబ్బలు తగిలాయి. ఈ గందరగోళం ఇలా జరుగుతుండగానే పుల్లారావు ప్లాంటులోకి వెళ్లి కొబ్బరికాయ కొట్టేశారు. ఆసుపత్రిలో టీపీఎస్ సునీత చేరిక మరోవైపు.. సంఘటనలో గాయపడ్డ సునీతను మునిసిపల్ సిబ్బంది ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత విడదల గోపి, మునిసిపల్ చైర్మన్ షేక్ రఫాని, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్దిరాల విశ్వనాథం, మాజీ చైర్మన్ బొల్లెద్దు చిన్నా తదితరులు ఆమెను పరామర్శించారు. ఈ సందర్బంగా సునీత మాట్లాడుతూ.. తనను కారుతో గుద్దించే ప్రయత్నం చేశారని, ఎస్సీ మహిళనైన తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇదే విషయాన్ని పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. టీడీపీ నేతల తీరు అమానుషమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. -
ఆ అధికారిణి ఎవరో తెలిసిపోయింది
సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక కొన్ని ఘటనలు, కొందరు వ్యక్తులు అనతికాలంలోనే విశేష ప్రచారం పొందుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఓ మహిళా పోలింగ్ అధికారికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకు ఆమె చేసిందేమీ లేదు.. కొద్దిగా మోడ్రన్ లుక్‌లో పోలింగ్ విధులకు హాజరు కావడమే. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో.. నెటిజన్లు ఆమె వివరాల కోసం తెగ వెతికారు. తొలుత ఆమె రాజస్తాన్‌కు చెందినవారని, జైపూర్‌లో పోలింగ్ విధులు నిర్వహించారని, ఆ బూత్‌లో 100 శాతం పోలింగ్ నమోదైందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ కొందరు మాత్రం ఆ వార్తలను నమ్మలేదు. ఆమె ఉన్న ఫొటోలోని ఆధారాల సాయంతో ఆమె గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ఫొటోలో ఆమె పక్కన బస్సుపై ఉన్న అక్షరాల ఆధారంగా ఆమె ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన వారని గుర్తించారు. ఆ తర్వాత ఆమె పేరు రీనా ద్వివేదీ అని.. లక్నోలో పీడబ్ల్యూడీ విభాగంలో ఆమె జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టుగా తెలింది. ఎన్నికల విధులకు వెళ్తుండగా తుషార్ రాయ్ అనే ఓ ఫొటో జర్నలిస్ట్ ఈ ఫొటో తీసినట్టుగా తెలిసింది. తన ఫొటో ఇంతలా వైరల్ కావడంపై రీనా స్పందించారు. ‘ఆ ఫొటో పోలింగ్ ముందు రోజు మే 5వ తేదీన తీసింది. లక్నోలోని బూత్ నంబర్ 173 పోలింగ్ విధులకు వెళ్లినప్పుడు ఈ ఫొటో తీయడం జరిగింది. ఈ ఫొటో వైరల్‌గా మారడంతో ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపట్టి.. నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది కాస్తా పాజిటివ్ అయినప్పటికీ.. కొద్దిగా నెగిటివ్ కూడా అనిపిస్తుంది. నేను పనిచేసిన బూత్‌లో 100 శాతం పోలింగ్ జరిగిందనే వార్తల్లో నిజం లేదు. అక్కడ కేవలం 70 శాతం పోలింగ్ నమోదైంద’ని తెలిపారు. -
సోషల్ మీడియాలో వైరలైన మహిళా పోలింగ్ అధికారి
-
మంత్రికి మహిళా అధికారి బురిడీ!
సాక్షి, హైదరాబాద్: ఆమె సాగునీటి శాఖలో మహి ళా అధికారి.. పౌర సరఫరాల శాఖ పరిధిలో పని చేస్తున్న తన భర్తను బదిలీ చేయించుకునేందుకు ఏకంగా మంత్రి ఈటల రాజేందర్‌నే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ బదిలీ వీలుపడదంటూ ఫైలుపై ఉన్న కొర్రీలను వైట్నర్తో చెరి పేసి.. మంత్రితో సంతకం చేయించుకున్నారు. చివరికి మంత్రి ఓఎస్డీ పరిశీలనలో ఈ ‘చిట్టి’మోసం బయటపడింది. ఈ మోసంలో ఈటల పర్యవేక్షిస్తున్న పౌరసరఫరాల శాఖ సిబ్బంది పాత్ర ఉన్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలుకుబడి ఉపయోగించినా.. సాగునీటి శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తు న్న ఓ మహిళా అధికారి భర్త.. పౌర సరఫరాల విభాగంలో వికారాబాద్ మేనేజర్‌గా పనిచేస్తున్నా రు. ఆయన్ను హైదరాబాద్‌కు బదిలీ చేయించుకునేందుకు సదరు అధికారి ప్రయత్నం మొదలుపెట్టారు. దీనికోసం అదనపు కార్యదర్శిగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకున్నారు. పౌరసరఫరాల శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి పేషీ లోని సిబ్బంది సహకారంతో.. ఆ బదిలీ ఫైల్‌ను కిందిస్థాయి నుంచి కమిషనర్ కార్యాలయం చేర్చారు. కానీ హైదరాబాద్‌లో ఆ స్థాయి పోస్టు ఏదీ ఖాళీగా లేదంటూ పౌరసరఫరాల శాఖ ఇన్చార్జి కమిషనర్ సునీల్‌శర్మ ఫైలుపై కొర్రీ రాశారు. దీంతో ఫైలు ఆగిపోయింది. వెనక్కి తగ్గని ఆ అధికారి.. మంత్రి పేషీ సాయంతో అదే ఫైలును మరోసారి ముందుకు కదిపారు. ఆ ఫైలు పై కమిషనర్ రాసిన కొర్రీపై వైట్నర్ పూసి.. కొర్రీ ఏమీ లేనట్టుగా మార్చేశారు. అనంతరం ఆ అధి కారి తన భర్తను బదిలీ చేయాలంటూ స్వయంగా ఫైలును మంత్రి ఈటల వద్దకు తీసుకెళ్లారు. కమిషనర్ రాసిన కొర్రీ కనబడకుండా చేయడంతో.. మంత్రి ఆ ఫైలుపై సంతకం చేసేశారు. ఓఎస్డీ అప్రమత్తతతో..: మంత్రి సంతకం తర్వాత ఆ బదిలీ ఫైలు ఓఎస్డీకి చేరింది. దానిని పరిశీలించిన ఓఎస్డీ.. వైట్నర్ పూసినట్లు గుర్తించి, ఫైలును వెనక్కి పంపి మంత్రిని అప్రమత్తం చేశా రు. దాంతో అసలు తతంగం బయటపడింది. సాధారణంగా మంత్రి తాను సంతకం చేయాల్సిన ఫైళ్లపై ఓఎస్డీని సంప్రదించిన తర్వాతే సం తకం చేస్తుంటారు. కానీ ఈ వివాదాస్పద బదిలీ ఫైలును మంత్రి పేషీలోని సిబ్బందే.. ఓఎస్డీ లేని సమయంలో ముందుకు కదిపినట్టు తెలుస్తోంది. మంత్రి పేషీలోని సిబ్బంది ఉద్దేశపూర్వకంగానే తప్పుదోవ పట్టించారా.. అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. తన కళ్లు గప్పి బదిలీ ఫైలును ముందుకు కదిపిన వ్యవహారంపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆ ఫైలును పక్కన పడేయటంతోపాటు, వైట్నర్ పెట్టిందెవరనే దానిపై సిబ్బందిని నిలదీసినట్టు తెలిసింది. ఈ బదిలీ విషయంగా మహిళా అధికారి వ్యవహరించిన తీరును ఆమె పనిచేస్తున్న శాఖా మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. వెంటనే స్పందించిన మంత్రి హరీశ్.. ఆమెను సాగునీటి శాఖ నుంచి బదిలీ చేయాలని సిఫార్సు చేయగా, ఆమెను జీఏడీ విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. -
‘లంచం వద్దంది.. అందుకే చంపా!’
సిమ్లా: నిజాయితీతో వ్యవహరించిన ఓ అధికారిణిని వెంటాడి చంపిన ఘటనలో నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ కట్టాల కూల్చివేతను పర్యవేక్షించిన అధికారి షహిల్ బాల శర్మ(51)ను ఓ వ్యక్తి అతికిరాతకంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు విజయ్ను ఎట్టకేలకు గురువారం సాయంత్రం పోలీసులు మధురలో(యూపీ) అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు విజయ్ పోలీసులకు అసలేం జరిగిందో చెప్పాడు. ‘కూల్చివేతలు వద్దని ఆమెను బతిమాలుకున్నాం. ఆమె వినలేదు. చివరకు లంచం కూడా ఇస్తామన్నాం. కానీ, ఆమె తిరస్కరించారు. నా తల్లి ఆమె కాళ్ల మీద పడింది.. అయినా కనికరించలేదు. పైగా తాను నిజాయితీ ఆఫీసర్‌నంటూ ప్రగల్భాలు పలికారు. తన చేతిలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని.. వాటిని పాటించక తప్పదని ఆమె చెప్పారు. భరించలేక పోయా.. అందుకే వెంటాడి చంపేశా’ అని విజయ్ తెలిపాడు. ఘటన తర్వాత అడవిలోకి పారిపోయిన నిందితుడు.. ఆ రాత్రి ఇంటికి తిరిగొచ్చి డబ్బు, ఏటీఎంలతో ఢిల్లీకి చేరుకున్నాడు. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీయించుకుని మధురకు చేరుకున్నాడని, సెల్ ఫోన్స్ సిగ్నల్ ఆధారంగా అతన్ని కనిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి కసౌలీ పట్టణంలో అక్రమ కట్టడాలను కూల్చివేతకు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఉపక్రమించింది. పోలీసుల సాయంతో అధికారులు నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్లను కూల్చివేయటం ప్రారంభించారు. ఈ క్రమంలో మండో మాట్కండలో ఉన్న నారాయణి గెస్ట్ హౌజ్ కూల్చేందుకు యత్నించగా.. అధికారిణి షహిల్ బాల, ఆ గెస్ట్‌హౌజ్ యజమాని విజయ్ సింగ్ మధ్య వాగ్వాదం మొదలైంది. కోపోద్రిక్తుడైన విజయ్ సింగ్ తుపాకీతో వెంటాడి పీడబ్ల్యూడీ అధికారులపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో షహిల్ బాల అక్కడిక్కడే మృతి చెందగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. -
గత సర్కారును పొగిడిందని అధికారిణికి షాక్!
గత ప్రభుత్వాలపై గురించి చెప్పాల్సి వస్తే.. ప్రస్తుత ప్రభుత్వానికి కోపం రాకుండా అధికారులు జాగ్రత్త పడాలేమో.. హర్యానాలో తాజాగా జరిగిన ఉదంతం ఇదే చాటుతోంది. భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశంసించేలా ఆర్టీఐ కింద వివరాలు వెల్లడించిన ఓ మహిళా అధికారికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఏకంగా ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంతో పోలిస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వమే పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన విషయంలో ముందున్నదని పరిశ్రమలు, వాణిజ్య శాఖ అధికారిణి సునితా దేవి ఓ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చారు. ఇది సహజంగానే రాజకీయంగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేసింది. అయితే, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన విషయంలో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చిందని, అందుకే ఆమెపై చార్జిషీట్ కూడా దాఖలు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారని హర్యానా అధికార వర్గాలు చెప్తున్నాయి.