ఆర్మీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా సాధనా సక్సేనా నాయర్ ( Sadhna Saxena Nair) రికార్డు సృష్టించారు. ఆర్మీ మెడికల్ సర్వీసెస్ తొలి మహిళా డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయర్ ఈ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఆగస్టు 1న (గురువారం) ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు.
ఈ నియామకానికి కంటే ముందు ఆమె ఆర్మీ బలగాల డైరెక్టర్ జనరల్ బాధ్యతలు నిర్వహించారు. ఆ పదవి చేపట్టిన తొలి మహిళా అధికారి కూడా లెఫ్టినెంట్ జనరల్ సాధనా సక్సేనా నాయరే కావడం గమనార్హం. ర్యాంకులో ఎయిర్ మార్షల్‌గా పదోన్నతి కల్పించి మరీ ఆమెను ఆ పదవిలో నియమించారు. గతంలో ఆమె ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.
పుణెలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన ఎయిర్ మార్షల్ సాధనా సక్సేనా నాయర్ 1985లో వైద్యురాలిగా ఆర్మీలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ఎయిర్ మార్షల్ హోదాకు చేరుకున్నారు. డిసెంబరు 1985లో ఆర్మీ మెడికల్ కార్ప్స్‌లో నియమితులయ్యారు. 1986లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైట్ లెఫ్టినెంట్‌గా చేరారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ , స్విట్జర్లాండ్‌లోని MME (మిలిటరీ మెడికల్ ఎథిక్స్)తో CBRN (కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్ మరియు న్యూక్లియర్) వార్‌ఫేర్‌లో శిక్షణ పొందారు.
వైద్య విద్యపై ఆసక్తితో ఆర్మీలో పనిచేస్తూనే ఆమె ఫ్యామిలీ మెడిసిన్‌లో పీజీ చేశారు. న్యూ ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో మెడికల్ ఇన్ఫర్మేటిక్స్‌లో రెండు సంవత్సరాల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. తాజాగా ర్మీ మెడికల్ సర్వీసెస్‌కు డీజీగా ఎంపికయ్యారు.
ఆమె అందించిన సేవలకు గాను విశిష్ట సేవా పతకాన్ని (VSM) అందుకున్నారు. మెరిటోరియస్ సర్వీస్ కోసం ఆమెకు AOC-in-C (వెస్ట్రన్ ఎయిర్ కమాండ్),చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ప్రశంసలు లభించాయి. జనరల్ ఆఫీసర్ ఎయిర్ మార్షల్ కేపీ నాయర్ (రిటైర్డ్)ని వివాహం చేసుకున్నారు. నాయర్ కుటుంబంలోని మూడు తరాలు గత 70 ఏళ్లుగా సాయుధ దళాలలో పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment