ఆ అధికారిణి ఎవరో తెలిసిపోయింది | Yellow Saree Election Officer Viral | Sakshi
Sakshi News home page

ఆ అధికారిణి ఎవరో తెలిసిపోయింది

Published Sun, May 12 2019 6:50 PM | Last Updated on Sun, May 12 2019 7:02 PM

Yellow Saree Election Officer Viral - Sakshi

సోషల్‌ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక కొన్ని ఘటనలు, కొందరు వ్యక్తులు అనతికాలంలోనే విశేష ప్రచారం పొందుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఓ మహిళా పోలింగ్‌ అధికారికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకు ఆమె చేసిందేమీ లేదు.. కొద్దిగా మోడ్రన్‌ లుక్‌లో పోలింగ్‌ విధులకు హాజరు కావడమే. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవ్వడంతో.. నెటిజన్లు ఆమె వివరాల కోసం తెగ వెతికారు.

తొలుత ఆమె రాజస్తాన్‌కు చెందినవారని, జైపూర్‌లో పోలింగ్‌ విధులు నిర్వహించారని, ఆ బూత్‌లో 100 శాతం పోలింగ్‌ నమోదైందని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ కొందరు మాత్రం ఆ వార్తలను నమ్మలేదు. ఆమె ఉన్న ఫొటోలోని ఆధారాల సాయంతో ఆమె గురించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ ఫొటోలో ఆమె పక్కన బస్సుపై ఉన్న అక్షరాల ఆధారంగా ఆమె ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన వారని గుర్తించారు. ఆ తర్వాత ఆమె పేరు రీనా ద్వివేదీ అని.. లక్నోలో పీడబ్ల్యూడీ విభాగంలో ఆమె జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నట్టుగా తెలింది. ఎన్నికల విధులకు వెళ్తుండగా తుషార్‌ రాయ్‌ అనే ఓ ఫొటో జర్నలిస్ట్‌ ఈ ఫొటో తీసినట్టుగా తెలిసింది.

తన ఫొటో ఇంతలా వైరల్‌ కావడంపై రీనా స్పందించారు. ‘ఆ ఫొటో పోలింగ్‌ ముందు రోజు మే 5వ తేదీన తీసింది. లక్నోలోని బూత్‌ నంబర్‌ 173 పోలింగ్‌ విధులకు వెళ్లినప్పుడు ఈ ఫొటో తీయడం జరిగింది. ఈ ఫొటో వైరల్‌గా మారడంతో ప్రతి ఒక్కరు నన్ను గుర్తుపట్టి.. నాతో సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇది కాస్తా పాజిటివ్‌ అయినప్పటికీ.. కొద్దిగా నెగిటివ్‌ కూడా అనిపిస్తుంది. నేను పనిచేసిన బూత్‌లో 100 శాతం పోలింగ్‌ జరిగిందనే వార్తల్లో నిజం లేదు. అక్కడ కేవలం 70 శాతం పోలింగ్‌ నమోదైంద’ని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement