అసాధారణమైన సంకల్ప శక్తి, పట్టుదల ఉంటే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోవచ్చు. బాధలనుంచే సంతోషాన్ని, సక్సెస్‌ను అందుకోవచ్చు. ఢిల్లీకి చెందిన అన్షికా జైన్ సక్సెస్ స్టోరీ చదివితే దీన్ని అక్షరాలా నిజం అంటారు. ఇంతకీ అన్షిక ఏం సాధించారో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఢిల్లీకి చెందిన అన్షికా అయిదేళ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో అమ్మమ్మ , మేనమామల వద్దే పెరిగింది. వారే ఆమె జీవితంలో ప్రధానంగా మారిపోయారు. ఆమె జీవితంలో బలమైన స్తంభాలుగా నిలిచారు. ఆమె ఉన్నతికి బాటలు వేశారు.
ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న అన్షిక అమ్మమ్మ తాను సివిల్ సర్వెంట్ కావాలని కలగంది. కానీ అది సాకారం లేదు. అందుకే మనవరాలిని ఆ వైపు ప్రోత్సహించింది. అన్షిక కూడా అమ్మమ్మ డ్రీమ్‌ను నెరవేర్చాలని నిర్ణయించుకుంది.
ఢిల్లీ యూనివర్సిటీలోని రాంజాస్ కాలేజీలో ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత, దేశంలోని అతిపెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది అన్షికకు. కానీ ఐపీఎస్ కావాలనేది కోరికతో దానిని తిరస్కరించింది. యూపీఎస్‌సీ కోసం సిద్ధమవుతోంది. ఇక్కడే మరోసారి ఆమెకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 2019లో తనకు పెద్ద దిక్కుగా ఉన్న అమ్మమ్మను కోల్పోయింది. ఏకైక సపోర్ట్ సిస్టమ్ మాయం కావడంతో చాలా బాధపడింది అన్షిక. కానీ అమ్మమ్మ డ్రీమ్ గుర్తు చేసుకుంది. పట్టుదలతో ప్రిపరేషన్‌ను కొనసాగించింది.
నాలుగు సార్లు విజయం దక్కకపోయినా పట్టు వీడలేదు. 2020లో జస్ట్ ఒక్క నంబరులో అవకాశాన్ని కోల్పోయింది. చివరికి అయిదో ప్రయత్నంలో AIR-306 ర్యాంకు సాధించింది. అలా ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ కావాలనే ఆమె కోరిక ఫలించింది. 2023, జూన్ 5 ఏఐఎస్ అధికారి వాసు జైన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అన్షిక ఐపీఎస్ కల సాకారంలో వాసు జైన్ పాత్ర కూడా చాలా ఉందిట.
Comments
Please login to add a commentAdd a comment