మృత్యువును మోసగించాడు
న్యూఢిల్లీ: మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. 35 అడుగుల మంచు గర్భంలో అయిదు రోజుల పాటు మనిషి జీవించి ఉండటం సాధ్యమేనా? సియాచిన్ గ్లేసియర్‌లో హనుమంతప్ప సజీవంగా బయటపడటం నిపుణులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఆస్ట్రియాలోని హాన్‌బరో యూనివర్సిటీ పరిశోధన ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి 45 నుంచి 160 నిమిషాల కంటే ఎక్కువగా జీవించి ఉండే అవకాశాలు లేవని చెప్తున్నారు. కానీ లాన్స్‌నాయక్ హనుమంతప్ప మాత్రం ఈ పరిశోధనను వమ్ము చేశారు. ముంచుకొచ్చిన మృత్యువునే మోసగించాడు.
మంచులో కూరుకుపోయిన సందర్భంలో హనుమంతప్ప తన శరీరాన్ని ఒక వలయాకారంలో మలచుకుని తనకు తాను వీలైనంత వెచ్చదనం ఉండేలా చూసుకున్నారు. గర్భంలో పిండం ఉన్నట్లుగా శరీరాన్ని ఉంచటం వల్ల ఆయనకు పెద్దగా హాని జరగలేదు. దీనికి తోడు సహజంగా ప్రాణవాయువు లభించి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆక్సిజన్ కోసం మీద పడిన మంచును తవ్వే ప్రయత్నం చేయకపోవటం వల్ల శరీరానికి అలసట కలగకపోవటం కూడా అతని జీవశక్తిని కాపాడి ఉండవచ్చంటున్నారు.
హనుమంతప్ప ప్రతికూల వాతావరణంలోనూ.. వ్యాయామాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు యోగా, ప్రాణాయామం కారణంగానే శ్వాసను అదుపులో ఉంచుకోగలిగాడు. మంచు చరియల్లో 30 అడుగుల లోతులో ఇతన్ని గుర్తించిన రెస్క్యూ ఆపరేషన్ జరుపుతున్న జవాన్లు హనుమంతప్ప.. నోరు, ముక్కు వద్ద ఎయిర్ ప్యాకెట్లను చూసి ఆశ్చర్యపోయారు.