lance naik hanumanthappa
-
లాన్స్‌నాయక్ హనుమంతప్పకు సేనా మెడల్
న్యూఢిల్లీ: దుర్భరమైన హిమాలయాల్లో 30 అడుగుల లోతులో మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచు పెళ్లల కింద ఆరురోజులపాటు మృత్యువుతో పోరాడి అనంతరం ఆస్పత్రిలో మరణించిన వీరసైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్‌ను సైన్యం సేనా పతకంతో సత్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సియాచిన్ యుద్ధభూమిలో గత ఫిబ్రవరి 3న మంచుతుపాన్‌లో 10 మంది సైనికులు సజీవ సమాధి కాగా ఒక్క హనుమంతప్పను మాత్రం ఆరు రోజుల తర్వాత సహాయక దళాలు ప్రాణాలతో బయటికి తీశాయి. అనంతరం అతన్ని సైనిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 11న మరణించాడు. ఆర్మీడే సందర్భంగా ఆదివారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హనునమంతప్ప భార్య మహాదేవి అశోక్ బిలేబల్‌కు ఈ అవార్డు అందజేశారు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా బెటాదుర్ గ్రామానికి చెందిన హనుమంతప్ప మద్రాస్ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేశాడు. -
ప్రాణాలు - పేలాలు
ఈ కాలమ్కీ, రాజకీయాలకీ ఎటువంటి సంబంధమూ లేదు. మొన్న దయనీయమైన స్థితిలో ఆత్మహత్య చేసుకున్న యువకుని ఘటనని ఈ దేశంలో రాజకీయ పార్టీలన్నీ సొమ్ము చేసుకున్నాయి. కానీ ఏ ఒక్కరూ ఆ యువకుని సమస్య గురించి ఆలోచించడం కానీ, పరిష్కరించడానికి కానీ ప్రయత్నించలేదు. కలకత్తా నుంచి తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి డెరిక్ ఓబ్రియన్ వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఏచూరి వారూ దయచేశారు. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ దిగ్విజయ్‌సింగ్‌తో సహా వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వచ్చారు. బహుజన సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు వేంచేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కేంద్రాన్ని దుయ్యబట్టారు. వీరంతా ఈ దేశం, ముఖ్యంగా యువత ఈ ప్రభుత్వం చేతుల్లో ఎంతగా నష్టపోతోందో హాహాకారాలు చేశారు. బొత్తిగా బొడ్డూడని ఓ నాయకుడు కన్నుమూసిన కుర్రాడిని మహాత్మా గాంధీతో పోల్చారు. ఈ నేతకి ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ తప్ప మహాత్మా గాంధీ గురించి తెలిసే అవకాశం లేదు. వీరి యావ చనిపోయిన కుర్రాడికి జరిగిన అన్యాయం, జరగవలసిన న్యాయం గురించి కాదు. ఢిల్లీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయడం. ఆ పని పూర్తికాగానే అందరూ మాయమయిపోయారు. దీనికి తెలుగులో ఓ సామెత ఉంది- శవాల మీద పేలాలు ఏరుకోవడం. ఇది ఒకప్పుడు సామెత. కానీ మన కళ్ల ముందే రాజకీయ నాయకులు నిజంగా నిరూపించారు. యూపీఏ హయాంలో కనీసం 8 మంది ఇలా ఆత్మహత్యలు చేసుకున్నారు. న్యాయంగా వీరంతా 8 మంది మహాత్మా గాంధీలు. వీరి గురించి ఈ కుర్ర నాయకుడు ఆ రోజుల్లో పట్టించుకోలేదు. కారణం - అప్పుడు వాళ్ల అమ్మ పాలన సాగుతోంది కనుక. ఇప్పుడు మొన్నటి సియాచిన్ దుర్ఘటన గురించి. మైనస్ 46 డిగ్రీల చలి ప్రాంతంలో - సియాచిన్‌లో ఆరురోజుల పాటు 25 అడుగుల కింద మంచు చరియల్లో కూరుకుపోయిన పదిమందిలో ఒకరు- హనుమంతప్ప కొన ఊపిరితో బయటపడ్డాడు. 9 మంది మరణించారు. ఆరురోజుల తరువాత ఈ వ్యక్తిని రక్షించడం, ఇలా ప్రాణాలతో మిగలడం ఒక అద్భుతం. అయినా మొన్న పేలాలు పంచుకున్న రాజకీయ నాయకులెవరూ ఒక్కసారయినా స్పందించలేదు. ఒక్కరూ మిలటరీ ఆసుపత్రికి వెళ్లలేదు. మొన్న చెన్నైలో వర్షాల తాకిడికి జరిగిన ఉపద్రవంలో సైనికులు తరలి వచ్చి చేసిన ఉపకారం గురించి ఒక్కరూ మాట్లాడలేదు. ఒక్క సైనికుడి పేరు ఎవరికీ తెలియదు. పైగా ఎవరో వదాన్యులు ఉచితంగా ఇచ్చిన ఆహార పొట్లాల మీద అమ్మ (ముఖ్యమంత్రమ్మ) ఫొటోని చేర్చి రాజకీయ పార్టీ సొమ్ము చేసుకుందట. ఇవి మరికొన్ని పేలాలు వారికి. తెలంగాణ శాసనసభ్యులు తమ జీతాలు 200 శాతం పెంచాలని అడగడం కాదు- డిమాండ్ చేస్తున్నారు. సైన్యంలో పనిచేసే ఒక మామూలు లాన్స్‌నాయక్ జీతమెంతో తెలుసా? కేవలం రూ.6,100. క్రితంసారి ఇలాగే మంచు కింద కప్పబడినవారిలో సియాచిన్‌లో రక్షించబోయి చేతి, కాలివేళ్లు పోగొట్టుకున్న ఆనాటి 23 ఏళ్ల సైనికుడిని టీవీలో ప్రశ్నించారు: ‘‘ఆ సమయంలో మీకేమనిపించింది?’’ అని. ‘‘ఆ మంచు పెళ్లల కింద నేనే ఉంటే నాకీ ఉపకారం నా సహోద్యోగులు తప్పక చేసేవారు అనుకున్నాను’’ అన్నాడా యువకుడు. ఒకే ఒక ఫొటోని ఇక్కడ జత చేస్తున్నాను. భయంకరమైన విపత్తులో, వంతెన నిర్మించడానికి అవకాశం, వనరులు లేని దశలో - కొన్ని వందల మంది సైనికులు వంతెనగా పడుకుని తమ శరీరాల మీద నుంచి మనుషులు నడిచి వెళ్లి ప్రాణాలు దక్కించుకునే అవకాశాన్ని కల్పించారు. వారిలో ఒక్కరి పేరూ ఈ దేశ ప్రజలకి తెలీదు. ఈ శాసన సభ్యులకీ తెలీదు. తెలియాలని భావించలేదు. ఆశించలేదు. త్యాగం వ్యాపారం కాదు. ఈ దేశంలో పదవి వ్యాపారం కాదు. కాదు పేలాల మూట. నాయకత్వానికి త్యాగం ముసుగు, నీచమయిన సాకు. ఇంతకీ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న సిపాయిని తన చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని లెక్క చేయక ఒక నాయకుడు- ఒకే ఒక్క నాయకుడు- కాదు- ఒకే ఒక వ్యక్తి- ఆయన పేరు నరేంద్ర మోదీ ఆసుపత్రికి వెళ్లి ఆ కుర్రాడిని చూసి వచ్చారు. ‘‘సైనికులంటే ఈ దేశపు నాయకత్వం స్పందిస్తున్న దని మేము తృప్తి పడుతున్నాం’’ అన్నాడు మాజీ సైనికోద్యోగి, ఈ వ్యక్తి చూపిన మానవత్వపు మర్యాదకి మురిసిపోయి. పేలాలను ఏరుకోకుండా, పదవిని అడ్డు పెట్టుకోకుండా, ఒక సైనికుడిని పరామర్శించ బోయిన ఒక ‘మానవత్వం గల మనిషి’కి- నేను మనసారా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. దురదృష్టవశాత్తు హనుమంతప్ప మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. జీవన కాలమ్: గొల్లపూడి మారుతీరావు -
సైనికుల త్యాగానికి సెల్యూట్: మమత
కోల్కత్తా: సియాచిన్ వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్పకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం నివాళులర్పించారు. హనుమంతప్ప చనిపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆమె ట్విట్ చేశారు. దేశం కోసం సైనికులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారని, వారి త్యాగానికి సెల్యూట్ చేస్తున్నానని మమత పేర్కొన్నారు. హనుమంతప్పను బ్రతికించేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు గురువారం ఉదయం 11.45 నిమిషాలకు హనుమంతప్ప చివరి శ్వాస విడిచారు. కాగా హిమాలయ కొండచరియల పైనుంచి కిలోమీటర్ ఎత్తు.. 800 మీటర్ల వెడల్పు ఉన్న మంచు పలక వచ్చి.. సియాచిన్లోని భారత సైనిక శిబిరంపై పడటంతో 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆరురోజుల పాటు 35 అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన జవాన్ హనుమంతప్పను సోమవారం సజీవంగా వెలికితీశారు. అయితే అప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమంగా మారింది. -
హనుమంతప్ప మనందరికీ స్ఫూర్తి:వైఎస్ జగన్
హైదరాబాద్: జవాన్ లాన్స్‌నాయక్ హనుమంతప్ప (33) మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశం కోసం హనుమంతప్ప ప్రాణత్యాగం చేశాడని ట్విటర్లో పేర్కొన్నారు. ఆయన మనకు స్ఫూర్తిదాయకమని, ఎప్పటికీ చిరస్మరణీయుడిగా ఉంటాడని జగన్ నివాళులు అర్పించారు. హనుమంతప్ప కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. సియాచిన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హనుమంతప్ప ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం 12 గంటల ప్రాంతంలో కనుమూశారు. హనుమంతప్ప మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం ప్రకటించారు. దేశం ఓ గొప్ప సైనికుడిని కోల్పోయిందని నివాళులు అర్పించారు. -
జవాన్ హనుమంతప్ప కన్నుమూత
ఢిల్లీ: సియాచిన్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో పోరాడి జవాన్ లాన్స్‌నాయక్ హనుమంతప్ప (33) తుది శ్వాస విడిచారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. గురువారం 12 గంటల ప్రాంతంలో హనుమంతప్ప కనుమూశారు. హిమాలయ కొండచరియల పైనుంచి కిలోమీటర్ ఎత్తు.. 800 మీటర్ల వెడల్పు ఉన్న మంచు పలక వచ్చి.. సియాచిన్లోని భారత సైనిక శిబిరంపై పడటంతో 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా ఆరురోజుల పాటు 35 అడుగుల లోతున మంచులో కూరుకుపోయిన జవాన్ హనుమంతప్ప ప్రాణాలతో ఉండటం వైద్యనిపుణులను, సైనికాధికారులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. సోమవారం హనుమంతప్పను వెలికితీసి ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి అప్పటికే విషమంగా మారింది. హనుమంతప్ప కోలుకోవాలని ప్రధాని మోదీతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, అధికారులు ఆకాంక్షించారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు నిరంతరం శ్రమించారు. అయితే మృత్యువుతో పోరాడుతూ హనుమంతప్ప ఈ రోజు మరణించారు. కర్ణాటకలోని థార్వాడ్‌కు చెందిన హనుమంతప్పకు భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు. -
మృత్యువును మోసగించాడు
న్యూఢిల్లీ: మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో.. 35 అడుగుల మంచు గర్భంలో అయిదు రోజుల పాటు మనిషి జీవించి ఉండటం సాధ్యమేనా? సియాచిన్ గ్లేసియర్‌లో హనుమంతప్ప సజీవంగా బయటపడటం నిపుణులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఆస్ట్రియాలోని హాన్‌బరో యూనివర్సిటీ పరిశోధన ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనిషి 45 నుంచి 160 నిమిషాల కంటే ఎక్కువగా జీవించి ఉండే అవకాశాలు లేవని చెప్తున్నారు. కానీ లాన్స్‌నాయక్ హనుమంతప్ప మాత్రం ఈ పరిశోధనను వమ్ము చేశారు. ముంచుకొచ్చిన మృత్యువునే మోసగించాడు. మంచులో కూరుకుపోయిన సందర్భంలో హనుమంతప్ప తన శరీరాన్ని ఒక వలయాకారంలో మలచుకుని తనకు తాను వీలైనంత వెచ్చదనం ఉండేలా చూసుకున్నారు. గర్భంలో పిండం ఉన్నట్లుగా శరీరాన్ని ఉంచటం వల్ల ఆయనకు పెద్దగా హాని జరగలేదు. దీనికి తోడు సహజంగా ప్రాణవాయువు లభించి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆక్సిజన్ కోసం మీద పడిన మంచును తవ్వే ప్రయత్నం చేయకపోవటం వల్ల శరీరానికి అలసట కలగకపోవటం కూడా అతని జీవశక్తిని కాపాడి ఉండవచ్చంటున్నారు. హనుమంతప్ప ప్రతికూల వాతావరణంలోనూ.. వ్యాయామాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు యోగా, ప్రాణాయామం కారణంగానే శ్వాసను అదుపులో ఉంచుకోగలిగాడు. మంచు చరియల్లో 30 అడుగుల లోతులో ఇతన్ని గుర్తించిన రెస్క్యూ ఆపరేషన్ జరుపుతున్న జవాన్లు హనుమంతప్ప.. నోరు, ముక్కు వద్ద ఎయిర్ ప్యాకెట్లను చూసి ఆశ్చర్యపోయారు. -
మృత్యువుతో పోరాడుతున్న లాన్స్‌నాయక్
ఢిల్లీ: సియాచిన్ ప్రమాదం నుంచి బయటపడిన లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ 24 గంటలు అత్యంత కీలకమని వైద్యులు వెల్లడించారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలోని కర్ణాటక రెసిడెంట్ కమిషనర్ అతుల్ కుమార్ తివారి బుధవారం ఆర్మీ ఆస్పత్రిని సందర్శించారు. హనుమంతప్ప ఆరోగ్య పరిస్థతిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హనుమంతప్పకు ఐసీయూలో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారని తివారి తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. హనుమంతప్ప కుటుంబ సభ్యుల తరపున ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు ఆర్మీ ఆస్పత్రికి వచ్చినట్టు వెల్లడించారు. హనుమంతప్ప తమ రాష్ట్రానికి చెందినవాడు కావడం తమకెంతో గర్వకారణమని చెప్పారు. ఆయన కోలుకుంటాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటకలోని థార్వాడ్‌కు చెందిన హనుమంతప్పకు భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు. భారత్-పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద సియాచిన్ గ్లేసియర్‌పై ఉన్న సైనిక బేస్‌క్యాంపుపై ఆరు రోజుల కింద(ఫిబ్రవరి 3) మంచు చరియలు విరిగిపడడంతో 9 మంది సైనికులు మృతి చెందారు. 35 అడుగుల లోతులో కూరుకుపోయి ప్రాణాలతో ఉన్న హనుమంతప్పను సోమవారం వెలికితీశారు. -
హనుమంతప్ప త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్
సియాచిన్ మంచుతుపానులో చిక్కుకుని, ఐదు రోజుల తర్వాత బయటపడిన వీర సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆయనకు భగవంతుడు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. సియాచిన్ ప్రాంతంలో భారీ మంచుతుపాను కారణంగా మంచు చరియల కింద కూరుకుపోయి దాదాపు 10 మంది సైనికుల జాడ తెలియలేదు. వారిలో చివరకు లాన్స్‌నాయక్ హనుమంతప్ప మాత్రం కొన ఊపిరితో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. దేశవాసులంతా హనుమంతప్ప బతకాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. Prayers for the speedy recovery and long life of the #SiachenAvalanche survivor Lance Naik Hanumanthappa — YS Jagan Mohan Reddy (@ysjagan) February 10, 2016 -
భగవంతుడా.. బతికించు
సియాచిన్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన జవాను ♦ సోమవారం రాత్రి హుటాహుటిన ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలింపు ♦ అత్యంత విషమంగా వీర జవాను ఆరోగ్యం ♦ ఆసుపత్రికి వచ్చి చూసివెళ్లిన ప్రధాని ♦ మిగతా 9 మంది సైనికుల మృతి ♦ భగవంతుడా బతికించాలని ప్రార్థిస్తున్న భారతావని న్యూఢిల్లీ/ధార్వాడ్: అతనో వీర జవాను... హిమాలయ పర్వతశ్రేణుల్లో అత్యంత కఠిన వాతావరణంలో సియాచిన్‌పై 19 వేల అడుగుల ఎత్తులో... ఎడతెగకుండా కురిసే మంచులో సరిహద్దు భద్రతను నిర్వర్తిస్తున్నాడు. ఈనెల మూడోతేదీన ప్రకృతి కన్నెర్ర చేసింది. సియాచిన్లోని భారత సైనికుల బేస్‌పై భారీ మంచుచరియలు విరిగిపడ్డాయి. ఆచూకీ దొరకని పదిమంది సైనికులూ మరణించే ఉంటారని రెండు రోజులకే ఆర్మీ అధికారికంగా ప్రకటించింది కూడా. మృతదేహాలను వెలికితీసే చర్యలు కొనసాగాయి. సోమవారం... అప్పటికే ఐదురోజులు గడిచిపోయాయి. సోమవారం సాయంత్రానికి ఐదు మృతదేహాలను బయటకు తీశారు. గాలింపులో భాగంగా మంచుకొండలను తవ్వుతున్న సిబ్బందికి మరొక దేహం కనిపించింది. మెల్లిగా చుట్టూ ఉన్న మంచును తొలగిస్తున్నారు. ఆశ్చర్యం.. ఆ సాహస జవాను చనిపోలేదు. సర్వశక్తులతో మృత్యువుతో పోరాడుతున్నాడు. అంతే సహాయక సిబ్బందిలో ఒక్కసారిగా విభ్రాంతి. ఏమిటిది? ఎలా సాధ్యం? వెంటనే అక్కడే ఉన్న వైద్యబృందం చికిత్స మొదలుపెట్టింది. అనంతరం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రికి తరలించారు. మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో, 25 అడుగుల లోతులో మంచుకింద కూరుకుపోయినా... ఐదు రోజుల దాకా ఊపిరి నిలుపుకోవడం అద్భుతమే. అసలు శ్వాస అందడమే గగనం. మంచులోతుల్లో సజీవ సమాధి.. ఎక్కడున్నామో, ఎలా బయటపడతామో, సహాయం ఎప్పుడు అందుతుందో, అసలు బతుకుతానో... లేదో! ఇవేవీ ఆ వీర జవాను స్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. అతను లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్. అత్యంత శీతల వాతావరణంలో రోజుల తరబడి ఉండటంతో అతని రక్తపోటు తగ్గింది. గుండె కొట్టుకునే వేగం నెమ్మదించింది. శరీరంలోని కీలక అవయవాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గింది. కాలేయం, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. శరీర ఉష్ణోగ్రతా నెమ్మదిగా తగ్గింది. అయితే అదృష్టవశాత్తు హనుమంతప్ప శరీరం ఎక్కడా మంచుకు ఎక్స్పోజ్ కాలేదు. పూర్తిగా కవర్ చేసి ఉండటంతో కాళ్లు, చేతులు గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఉత్పన్నం కాలేదు. అయితే శరీరంలో నీటిశాతం తగ్గిపోవడం, ఆహారం లేకపోవడంతో... బాగా నీరసించిపోయాడు. హనుమంతప్ప కాలేయం, కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం లేదని, దీంతో వెంటలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ప్రకటించారు. దేశ రక్షణకోసం సియాచిన్‌పై విధుల్లో నిలిచిన ఈ వీరజవానును బతికించాలని భారతావని భగవంతుడిని ప్రార్థిస్తోంది. ఐదు రోజుల పాటు.. మైనస్ 40 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత వద్ద.. మంచు కింద 30 అడుగుల లోతున కూరుకుపోయినా.. హనుమంతప్ప జీవించి ఉండటం సంచలనంగా మారింది. ఆయనను మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. హనమంతప్ప ఇంకా స్పృహలోకి రాలేదని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. హనుమంతప్పను ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ పరామర్శించారు. హనుమంతప్ప కర్ణాటకలోని థార్వాడ్‌కు చెందినవారు. ఆయనకు భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు. ఆయన జీవించి ఉండడంతో వారి కుటుంబంలో తిరిగి సంతోషం నెలకొంది. భారత్-పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద సియాచిన్ గ్లేసియర్‌పై ఉన్న సైనిక బేస్‌క్యాంపుపై ఆరు రోజుల కింద(ఫిబ్రవరి 3) మంచు చరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. 19 వేల అడుగుల ఎత్తయిన ఆ ప్రాంతంలో మంచు చరియల కింద పది మంది జవాన్లు కూరుకుపోయారు. యుద్ధ ప్రాతిపదికన సహాయం.. సియాచిన్ ప్రాంతంలో హనమంతప్ప జీవించి ఉన్నట్లు గుర్తించిన సైన్యం వైద్యులు.. అక్కడే చికిత్స ప్రారంభించారు. పూర్తిగా చల్లబడిపోయిన శరీర భాగాలను వేడెక్కించేందుకు వేడి ద్రవాలను నరాల ద్వారా ఎక్కించారు. ఓవైపు వేడి చేసిన ఆక్సిజన్ వాయువును అందిస్తూ.. మరోవైపు శరీరాన్ని బయటి నుంచి కూడా వేడి చేసే చర్యలు చేపట్టారు. ఆ వెంటనే ప్రమాద స్థలి నుంచి ఓ హెలికాప్టర్లో సియాచిన్ బేస్‌క్యాంపునకు చేర్చారు. అక్కడ మరికొంత చికిత్స చేసి.. వైద్య నిపుణులు తోడుగా మరో హెలికాప్టర్లో థాయిస్ ఎయిర్‌బేస్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్య సౌకర్యాలున్న ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. ఆయన ఆత్మస్థైర్యం గొప్పది: మోదీ మంచు చరియల కింద నుంచి సజీవంగా బయటపడిన హనమంతప్పను మంగళవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ దల్బీర్‌సింగ్ పరామర్శించారు. హనమంతప్ప ఒక గొప్ప సైనికుడని, ఆయన ఆత్మస్థైర్యం ఎంతో గొప్పదని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి అభినందన: హనుమంతప్ప సాహస వీరుడని, సియాచిన్ మంచు చరియల తుపాను నుంచి ఆయన చిరంజీవిగా బయటపడిన వార్త విని తనకు ఎంతో ఆనందమేసిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇది మాకు పునర్జన్మ.. హనమంతప్ప భార్య మహాదేవి: సియాచిన్‌లో మంచు కింద కూరుకుపోవడంతో హనుమంతప్ప మరణించి ఉంటాడన్న ఆవేదనలో కూరుకుపోయిన ఆయన కుటుంబంలో... ఆయన బతికే ఉన్నాడన్న వార్త తిరిగి సంతోషం నింపింది. ఇది తమ కుటుంబానికే పునర్జన్మ అని ఆయన భార్య మహాదేవి పేర్కొన్నారు. బుల్లెట్ల కంటే మంచే ప్రమాదకరం హిమాలయాల్లో అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండే యుద్ధభూమి సియాచిన్. పగలు ఉష్ణోగ్రత మైనస్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్లు.. రాత్రి మైనస్ 55 డిగ్రీల వరకూ పడిపోతుంది. 1984 నుంచి వాతావరణ ప్రతికూలతల వల్ల 869మంది చనిపోయారు. 1984లో పాక్ నుంచి సియాచిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు నిర్వహించిన ఆపరేషన్‌లో 33మంది సైనిక అధికారులు చనిపోయారు. వీరు కాకుండా 54మంది జూనియర్ కమాండింగ్ అధికారులు, మరో 782మంది ఇతర అధికారులు, జవానులు మృతి చెందారు. మిగతా తొమ్మిది మంది మృతి హనుమంతప్ప మినహా మంచులో కూరుకుపోయిన మిగతా తొమ్మిదిమంది జవానులు మరణించినట్లు ఆర్మీ ప్రకటించింది. ► సిపాయ్ ముష్తాక్ అహ్మద్.. పర్నపల్లె, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ ► సుబేదార్ నగేషా.. తేజూర్, హసన్ జిల్లా కర్ణాటక ► లాన్స్ హవాల్దార్ ఎలుమామలై.. దుక్కం పరై, వేలూరు,తమిళనాడు ► లాన్స్ హవిల్దార్ ఎస్ కుమార్.. కుమానన్ తోఝు, తెని.. కేరళ ► లాన్స్‌నాయక్ సుధీశ్ మోన్రోతురుత్, కొల్లాం, కేరళ ► సిపాయ్ మహేశ పీఎన్ హెచ్డీ కోటే, మైసూర్, కర్ణాటక ► సిపాయ్ గణేశన్, చెక్కతేవన్ పట్టి, మదురై, తమిళనాడు ► సిపాయ్ రామమూర్తి, గుడిసతన పల్లి, కృష్ణగిరి, తమిళనాడు ►సిపాయ్ నర్సింగ్ అసిస్టెంట్ సూర్యవంశి, మస్కర్వాడి, సతారా, మహారాష్ట్ర