అదో నిశ్శబ్ద మృత్యుశిఖరం
నెలకో సైనికుడు బలి
* పాక్ సైన్యాన్ని నిలువరించేందుకు 1984లో శిబిరాల ఏర్పాటు
* గడ్డ కట్టిపోయే చలిలో విధులు
* ఇప్పటివరకూ 883 మంది మృతి
* గస్తీ కోసం రూ. వేల కోట్ల వ్యయం
న్యూఢిల్లీ/ఉధంపూర్: సియాచిన్ మంచుపర్వతం... బహుశా ఈపేరు విననివారెవరూ ఉండరు. పైకి చల్లగా.. నిశ్చబ్దంగా కనిపించినా ఇదొక మృత్య శిఖరం లాంటిదేనని అక్కడి ఘటనలు రుజువు చేస్తున్నాయి. ప్రతి నెలా మంచుకొండ చరి యలు విరిగిపడటం వల్లనో, లేక ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడిన కారణంగానో కనీసం ఓ సైనికుడు బలైపోతున్నాడు. ఈ మృత్యుమృదంగం 1984 నుంచే ప్రారంభమైంది. తొలిసారి పాకిస్థాన్ సైన్యాన్ని ఏవిధంగానైనా కట్టడి చేయాలనే ఉద్దేశంతో దాదాపు 18 వేల అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ గ్లేసియర్ వద్ద భారత సైనిక శిబిరాల్ని ఏర్పాటు చేశారు. 1984 నుంచి అక్కడ సైన్యాన్ని మోహరించడం ప్రారంభించారు.
దాదాపు ఎవరెస్టు శిఖరం ఎత్తులో భారత జవాన్లు దేశ రక్షణ కోసం గ డ్డకట్టి చనిపోయే చలిలో నిత్యం గస్తీ కాస్తుంటారన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 1984 నుంచి 2015 మధ్య మొత్తం 869 మంది భారత సైనికులు సియాచిన్ గ్లేసియర్‌లో మృత్యువాత పడ్డారు. అనంతరం జరిగిన కొన్ని ఘటనలతోపాటు బుధవారం జరిగిన ప్రమాదంలో మరణించిన పదిమంది సైనికులను కలుపుకుని మొత్తం ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంఖ్య 883కు చేరుకుంది. వీరిలో 33 మంది అధికారులు, 54 మంది జూనియర్ ఆఫీసర్లు 782 మంది ఇతర ర్యాంకుల జవాన్లు ఉన్నారు. కాగా, అత్యధికంగా 2011లో 24 మంది సైనికులు ఈ గ్లేసియర్లో మృత్యువాత పడగా.. 2015లో ఐదుగురు చనిపోయారు. ఏడాదికి భారత ప్రభుత్వం ఈ ప్రాంత గస్తీకోసం దాదాపు వేలకోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్క 2012-13, 2014-15, మధ్యనే రూ. 6, 566 కోట్లు ఖర్చు చేసింది. వీటిని అక్కడ ఉండే సైనికులకు కావాల్సిన వస్త్రాలు, పర్వతారోహణ సామగ్రి, ఇతర వస్తువులకు ఎక్కువగా ఖర్చేయ్యేవి. మరో విషయమేమిటంటే సియాచిన్ గ్లేసియర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీల వరకు ఉంటుంది.
ప్రత్యేక చీతా హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడికి వెళ్లగలుగుతాయి. ప్రతి ఏటా మూడు బెటాలియన్ల నుంచి 3 నుంచి నాలుగువేల మంది సైనికులు ఇక్కడ భద్రతా సేవలందిస్తారు. ఒక్కో బెటాలియన్ మూడు ఏళ్ల వరకు ఇక్కడ గస్తీ కాస్తుంది. అయితే, ఇలా ప్రతికూల పరిస్థితులున్నాయని, ప్రాణనష్టం ఎదువవుతుందని అక్కడి నుంచి సైనికులను విరమించుకుంటే దేశరక్షణ గాలికొదిలేసినట్లవుందని , ఇది ఏమాత్రం సురక్షితం కాదని ఇటీవల రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చెప్పిన మాటలు సరైనవేనని ఆమోదించక తప్పదేమో.
షరతులు ఒప్పుకుంటేనే భారత్...
హనుమంతప్ప మృతి నేపథ్యంలో సియాచిన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని పాక్ చేసిన సూచనపై భారత ఆర్మీ స్పందించింది. ‘నిస్సైనీకరణ చేయాలంటే పాక్ కొన్ని ప్రాథమిక షరతులకు అంగీకరించాలి. ఆ ప్రాంతంలోని మా స్థావరాలను ధ్రువీకరించాల్సి ఉంటుంది’ అని నార్తరన్ కమాండ్ ఉన్నతాధికారి లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా స్పష్టం చేశారు.