50 మంది పాక్ సైనికుల తలలు కావాలి
► అమర జవాన్ ప్రేమ్ సాగర్ కుమార్తె డిమాండ్
► ప్రభుత్వానికి చేతకాకపోతే తాను ప్రతీకారం తీర్చుకుంటానన్న పరంజీత్ భార్య
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యం సరిహద్దులో శిరచ్ఛేదం చేసిన ఇద్దరు భారత జవాన్ల కుటుంబాలు తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం నేర్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘మా నాన్న అమరుడయ్యాడు. ఆయన త్యాగం వృథా కాకూడదు. ఒక తలకు బదులుగా నాకు 50 మంది పాక్ సైనికుల తలలు కావాలి’ అని బీఎస్‌ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్(45) కుమార్తె సరోజ్ డిమాండ్ చేశారు. ఓ పక్క ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ, మరోపక్క తల్లి శాంతిని ఓదారుస్తూ ఈ కోరిక కోరింది.
దారుణ హత్యకు గురైన మరో జవాన్ నాయిబ్ సుబేదార్ పరంజీత్ సింగ్(42) కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కూడా పాక్ దురాగతానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ‘పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం నేర్పేందుకు ప్రభుత్వం ఆర్మీకి స్వేచ్ఛనివ్వాలి. పాక్ ఒక భారత సైనికుడి తల నరికితే పదిమంది శత్రు సైనికులకు అదే గతిపడుతుందని మన ప్రభుత్వం గతంలో చెప్పింది.
కానీ ఇప్పడేం జరుగుతోంది? పాక్‌కు ప్రభుత్వం గుణపాఠం నేర్పకపోతే నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి నాకు అనుమతివ్వాలి’ అని పరంజీత్(42) భార్య పరంజీత్ కౌర్ అన్నారు. పాకిస్తాన్‌కు తగిన గుణపాఠం నేర్పాలని పరంజీత్ సింగ్ తండ్రి ఉధమ్ సింగ్, సోదరుడు రంజిత్ సింగ్‌లు కూడా డిమాండ్ చేశారు. పరంజీత్ బలిదానానికి గర్విస్తున్నామన్నారు. పరంజీత్‌కు 11–14 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు పిల్లలు ఉన్నారు.
నా తండ్రి త్యాగానికి గర్విస్తున్నా: పరంజీత్ కుమార్తె
దేశం కోసం తన తండ్రి ప్రాణత్యాగం చేసినందుకు తనకు గర్వంగా ఉందని పరంజీత్ కుమార్తె సిమర్‌దీప్ కన్నీటిపర్యంత మవుతూ చెప్పింది. పరంజీత్ సింగ్ అంత్యక్రియలను పంజాబ్ తార్న్ తారన్ జిల్లాలోని ఆయన స్వగ్రామం వయిన్‌పూర్‌లో మంగళవారం అశ్రునయనాల మధ్య సైనిక లాంఛనాలతో నిర్వహించారు. సైనికులు తుపాకులు పేల్చి వందనం సమర్పిం చారు. స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలి వచ్చి ఘనంగా నివాళి అర్పించారు.
‘షహీద్ పరంజీత్ అమర్ రహే..పాకిస్తాన్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అంత్యక్రియలకు, తమ కుటుంబాన్ని పరామర్శించడానికి సీనియర్ అధికారులెవరూ రాలేదని పరంజీత్ కౌర్ ఆరోపిం చారు. ఆర్మీలో పనిచేసిన సీఎం అమరీందర్.. తన సోదరుడి అంత్యక్రియలకు హాజరై ఉండాల్సిందని రంజిత్ సింగ్ అన్నారు. పాక్ దారుణానికి నిరసనగా పంజాబ్‌లో లూధియానా తదితర చోట్ల ఆ దేశ పతాకాలను తగలబెట్టారు. మరోపక్క.. ప్రేమ్ సాగర్ భౌతికకాయాన్ని ఉత్తరప్రదేశ్‌లో దేవరియా జిల్లాలోని ఆయన స్వగ్రామమైన టేకన్‌పూర్ తరలించారు. అంతకుముందు ఈ ఇద్దరు అమరవీరుల భౌతికకాయాలకు పూంచ్‌లో సైనికులు ఘనంగా నివాళి అర్పించారు.