పాక్ బరితెగింపు: ముక్కలుగా జవాన్ల దేహాలు!
సరిహద్దుల్లో పాకిస్థాన్ మళ్లీ బరితెగించింది. జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఎల్‌వోసీ మీదుగా ఉన్న బీఎస్‌ఎఫ్ పోస్టులపై ఏకపక్షంగా కాల్పులు జరిపి ఇద్దరు జవాన్ల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. అంతేకాకుండా వీరమరణం పొందిన జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసి తన కిరాతకత్వాన్ని చాటుకుంది. కృష్ణగాటి సెక్టార్‌లో ఉదయం 8.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. పాక్ ఆర్మీ ఏకపక్షంగా రాకెట్లు ప్రయోగిస్తూ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని, ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జూనియర్ కమిషన్డ్ అధికారితోపాటు, ఓ బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ప్రాణాలు విడిచారని సైనిక వర్గాలు తెలిపాయి. ఒక జవానుకు గాయాలయ్యాయి.
వెంటనే ఈ కాల్పులకు భారత ఆర్మీ దీటుగా బదులిచ్చిందని, కానీ, పాక్ సైన్యం పిరికిపందల తరహాలో జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసిందని, అత్యంత హేయమైన ఈ చర్యకు దీటుగా బదులిస్తామని ఆర్మీ నార్తరన్ కమాండ్ ఓ ప్రకటనలో హెచ్చరించింది. కశ్మీర్‌లో అలజడుల నేపథ్యంలో పాక్ ఆర్మీ మళ్లీ కాల్పుల ఉల్లంఘనలతో చెలరేగిపోతోంది. గత నెలలో ఏడుసార్లు దాయాది సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది.