చైనాకు ఝలక్.. దలైలామాకు ఓకే
న్యూఢిల్లీ/ధర్మశాల: టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా త్వరలో భారత్లో అడుగుపెట్టనున్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఇచ్చిన ఆహ్వానానికి అంగీకరించిన ఆయన కొత్త ఏడాదిలో(2017) మార్చి మధ్యలో అక్కడి తవాంగ్ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అయితే, ఈ పర్యటనపై ఈ నెల ప్రారంభంలోనే ప్రకటన వెలువడినప్పటికీ దీనిపై అధికారికంగా ధ్రువీకరణ జరగలేదు. దలైలామా పర్యటనతో భారత్-చైనా సంబంధాలు ఎలా ఉంటాయో అనే చర్చ ప్రారంభమైంది.
అంతకుముందు అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు రానుండగా బీజింగ్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. భారత్-చైనా మధ్య ఈ ప్రాంతంపై వివాదం ఉన్న నేపథ్యంలో అమెరికా అందులో అడుగుపెట్టొద్దని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దలైలామా పర్యటన ఏ పరిణామాలకు దారి తీస్తుందో అని ఆసక్తి నెలకొంది. అయితే, భారత్ మాత్రం దలైలామా పర్యటనపై తన వైఖరి కుండబద్ధలు కొట్టింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ అంశంపై ప్రకటన చేస్తూ'బౌద్ధ మత గురువు దలైలామా భారత అతిథి. ఆయన దేశంలో ఎక్కడైనా పర్యటించవొచ్చు. ఆయన గతంలో అరుణాచల్ ప్రదేశ్లో పర్యటించారు. ఇప్పుడు మరోసారి పర్యటనకు వచ్చినా ఏమీ జరగబోదని భావిస్తున్నాం' అని స్పష్టం చేశారు.