వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై స్పందించింది అమెరికా. తవాంగ్ ఘర్షణ తలెత్తగా ఇరు దేశాలు త్వరగా వెనక్కి తగ్గి ఉద్రిక్తతలు సద్దుమణగటం ఆహ్వానించదగ్గ విషయమని అమెరికా శ్వేతసౌధం పేర్కొంది. వైట్‌హౌస్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్ మాట్లాడారు. భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వివాదాస్పద సరిహద్దుల అంశంపై ప్రస్తుత దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు.
‘ఘర్షణ నుంచి ఇరు పక్షాలు వెనక్కి తగ్గటం ఆహ్వానించదగ్గ విషయం. మేము పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. వివాదాస్పద అంశాలపై ద్వైపాక్షిక మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలి. ఈసారి ఘర్షణ వాతావరణం త్వరగా సద్దుమణిగినందుకు సంతోషం.’ అని తెలిపారు శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్. మరోవైపు.. సరిహద్దులో ఉద్రిక్తతలు సద్దుమణిగేందుకు భారత్ తీసుకున్న చర్యలకు తమ మద్దతు ఉంటుందని పెంటగాన్ తెలిపింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న సుమారు 300 మంది చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారిని భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. భారత సైనికులు చైనా కుతంత్రాన్ని దీటుగా తిప్పికొట్టారని పార్లమెంట్‌లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.
ఇదీ చదవండి: సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. సరిహద్దులో పరిస్థితులపై ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment