Soldiers attack
-
US Gunfire: అమెరికాలో నరమేధం
లెవిస్టన్ (అమెరికా): అమెరికాలో మళ్లీ తుపాకీ పేలింది. మానసిక స్థితి సరిగా లేదని భావిస్తున్న ఓ సైనికుడు నరమేధానికి దిగాడు. చిన్నారులు, వారి తల్లిదండ్రులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం పారిపోతూ దార్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్పైనా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దారుణాల్లో ఏకంగా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 13 మందికి పైగా గాయపడ్డారు. మెయిన్ రాష్ట్రంలోని లెవిస్టన్లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి వేళ ఈ ఘోరం జరిగింది. కాల్పుల అనంతరం చీకటి చాటున తప్పించుకుని పారిపోయిన హంతకుని కోసం భారీ వేట సాగుతోంది. హంతకుడిని 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. అతడు అమెరికా ఆర్మీ రిజర్వ్‌లో ఆయుధాల ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. కొంతకాలంగా అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు పోలీసులు తెలిపారు. హంతకుని ఫొటోను విడుదల చేశారు. అందులో అతను చేతిలో ఆటోమేటిక్ రైఫిల్‌తో కన్పిస్తున్నాడు. హంతకుడు పారిపోయేందుకు ఉపయోగించినట్టుగా భావిస్తున్న కారును ఆండ్రోస్కాగిన్ కౌంటీలో స్వా«దీనం చేసుకున్నారు. ఈ దారుణంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మెయిన్ గవర్నర్‌తో మాట్లాడారు. బౌలింగ్ పోటీలు జరుగుతుండగా... కాల్పులు జరిగిన స్పేర్‌టైమ్ రిక్రియేషన్, షెమెంగీస్ బార్ అండ్ గ్రిల్ రెస్టారెంట్ లెవిస్టన్ శివార్లలోని డౌన్టౌన్లో ఉన్నాయి. బుధవారం రాత్రి అక్కడి బౌలింగ్ ఏరియాలో చిన్నారుల బౌలింగ్ లీగ్ జరుగుతోంది. ఆటవిడుపుగా దాంట్లో పాల్గొంటున్న పిల్లలు, వారి తల్లిదండ్రులతో సందడిగా ఉన్న సమయంలో రాబర్ట్ అందులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. హింసాత్మక ప్రవృత్తి రాబర్ట్ది హింసాత్మక ప్రవృత్తి అని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తెలిపారు. రెండు వారాల క్రితమే ఓ మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కూడా తీసుకున్నాడన్నారు. అతను ఎలాంటి సమస్యతో బాధపడుతున్నాడో చెప్పకపోయినా, కంఠధ్వనులు వినిపిస్తున్నాయని ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. బౌలింగ్ ఏరియాలో కాల్పుల మోతకు జనం వణికిపోయారు. ప్రాణభయంతో చెల్లాచెదురైపోయారు. హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. బెలూన్లను పేలుస్తున్నారనుకున్నాం... తాను బౌలింగ్ ఏరియాలోకి వెళ్లిన కాసేపటికే వెంటవెంటనే కనీసం 10సార్లు తుపాకీ పేలి్చన శబ్దం విన్నట్టు బ్రెండన్ అనే వ్యక్తి చెప్పాడు. ‘‘ఆ సమయంలో కాళ్లకు బూట్లు తొడుక్కుంటున్నా. సరదాగా బెలూన్లను పేలుస్తున్నారని తొలుత అనుకున్నా. కానీ డోర్ వద్ద చేతిలో తుపాకీతో హంతకున్ని చూసి వణికిపోయా. వెంటనే నేలపై పాక్కుంటూ బౌలింగ్ మెషీన్‌లోకి దూరి దాక్కున్నా. ఐదారు గంటల పాటు ఉత్తకాళ్లతో గడిపా’’అని వివరించాడు. రెయిలీ దెమోంట్ అనే ఆవిడ తల్లిదండ్రులతో కలిసి తన కూతురి ఆట చూస్తోంది. ఆమె తండ్రి రిటైర్డ్ పోలీసాఫీసర్. ‘‘కాల్పులు మొదలు కాగానే అక్కడున్న వాళ్లందరినీ మా నాన్న హుటాహుటిన ఓ మూలకు తరలించాడు. టేబుళ్లు తదితరాలను వారికి అడ్డుగా పెట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు’’అని చెప్పింది. బార్లో కూడా కాల్పుల శబ్దం వింటూనే సిబ్బంది వెంటనే తలుపులన్నీ మూసేసి లోపలున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎందుకీ కాల్పులు...? కాల్పులను కళ్లారా చూసిన జోయ్ లెవెస్క్ అనే పదేళ్ల చిన్నారి ఇప్పటికీ దాన్ని తలుచుకుని వణికిపోతోంది! ‘‘బులెట్ నా కాలికి తగులుతూ దూసుకెళ్లింది. ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఎవరైనా ఎందుకిలా ప్రవర్తిస్తారు?’’అని ప్రశి్నస్తోంది. కాల్పుల అనంతరం బౌలింగ్ ఏరియాలో, రెస్టారెంట్లో ఉన్నవాళ్లందరినీ పోలీసులు సమీపంలోని స్కూలుకు తరలించారు. ఈ ఏడాది 36వ ఘటన అమెరికాలో ఇది ఈ ఏడాదే ఏకంగా 36వ సామూహిక కాల్పుల ఘటన! ఇక మెయిన్ రాష్ట్రంలో కాల్పుల్లో ఇంతమంది బలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో 2022 మొత్తంలో పరస్పర కాల్పుల ఘటనల్లో 29 మంది మరణించారు. ఈ రాష్ట్రం వేటకు, షూటింగ్ క్రీడలకు ప్రసిద్ధి. అందుకే ఇక్కడ తుపాకీ కోసం లైసెన్సు కూడా అక్కర్లేదు! తుపాకీ కొనేందుకు లైసెన్సును తప్పనిసరి చేసేందుకు జరిగిన ప్రయత్నాలను స్థానిక ప్రజలే వ్యతిరేకించారు. కనీసం కొనుగోలుదారుల నేపథ్యాన్ని క్షుణ్నంగా తనిఖీ చేయాలన్న ప్రతిపాదనను కూడా బుట్టదాఖలు చేశారు. ఇక కాల్పులు జరిగిన లెవిస్టన్ కేవలం 38 వేల జనాభాతో కూడిన చిన్న పట్టణం. ఇక్కడ ప్రధానంగా ఆఫ్రికన్లు నివసిస్తుంటారు. ప్రస్తుతం పట్టణంలో లాక్డౌన్ విధించారు. నార్త్ కరోలినాలో ఐదుగురు మృతి క్లింటన్: అమెరికాలో గురువారమే మరో కాల్పుల ఉదంతం చోటుచేసుకుంది. నార్త్ కరోలినాలోని క్లింటన్లో హైవే సమీపంలోని ఓ ఇంట్లో ఐదుగురు తూటా గాయాలతో చనిపోయి కని్పంచినట్టు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఎవరు, ఎందుకు పాల్పడిందీ ఇప్పటికైతే తెలియలేదన్నారు. పరస్పర గొడవలే ఇందుకు దారి తీసి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశారు. -
భారత్-చైనా సైనికుల ఘర్షణపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై స్పందించింది అమెరికా. తవాంగ్ ఘర్షణ తలెత్తగా ఇరు దేశాలు త్వరగా వెనక్కి తగ్గి ఉద్రిక్తతలు సద్దుమణగటం ఆహ్వానించదగ్గ విషయమని అమెరికా శ్వేతసౌధం పేర్కొంది. వైట్‌హౌస్‌లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్ మాట్లాడారు. భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వివాదాస్పద సరిహద్దుల అంశంపై ప్రస్తుత దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. ‘ఘర్షణ నుంచి ఇరు పక్షాలు వెనక్కి తగ్గటం ఆహ్వానించదగ్గ విషయం. మేము పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. వివాదాస్పద అంశాలపై ద్వైపాక్షిక మార్గాల ద్వారా చర్చించి పరిష్కరించుకోవాలి. ఈసారి ఘర్షణ వాతావరణం త్వరగా సద్దుమణిగినందుకు సంతోషం.’ అని తెలిపారు శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్-పీయెర్. మరోవైపు.. సరిహద్దులో ఉద్రిక్తతలు సద్దుమణిగేందుకు భారత్ తీసుకున్న చర్యలకు తమ మద్దతు ఉంటుందని పెంటగాన్ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ వద్ద డిసెంబర్ 9న సుమారు 300 మంది చైనీస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ సైనికులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించారు. వారిని భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. భారత సైనికులు చైనా కుతంత్రాన్ని దీటుగా తిప్పికొట్టారని పార్లమెంట్లో ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఇదీ చదవండి: సైనికుల ఘర్షణపై స్పందించిన చైనా.. సరిహద్దులో పరిస్థితులపై ప్రకటన -
తవాంగ్ ఘర్షణ: రాజ్‌నాథ్ ఉన్నతస్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికల నడుమ తలెత్తిన ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిద ధళాల అధిపతులు, విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 9న జరిగిన ఘటనపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. సరిహద్దులో ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పార్లమెంట్‌లోనూ ఈ అంశంపై రాజ్‌నాథ్ మాట్లాడనున్నారు. తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద యాంగ్త్సే సమీపంలో భారత్, చైనా సైనికల నడుమ ఘర్షణ చోటు చేసుకుంది.ఈ నెల9న జరిగిన ఈ సంఘటన వివరాలను భారత సైన్యం సోమవారం బహిర్గతం చేసింది. ఘర్షణలో ఇరు దేశాల జవాన్లు కొందరు స్వల్పంగా గాయపడ్డారని ఒక ప్రకటనలో వెల్లడించింది. కయ్యానికి కాలుదువ్విన చైనా జవాన్లను మన సైనికులు ధీటుగా ఎదుర్కొన్నారని, గట్టిగా తిప్పికొట్టారని తెలియజేసింది. ఇదీ చదవండి: భారత్-చైనా సరిహద్దు ఘర్షణ.. ప్రతిపక్షాలకు పార్లమెంట్లో గట్టి కౌంటర్ పడేనా? -
సైనికుల చేతిలో బుర్కినా ప్రెసిడెంట్ బందీ!
ఉగడుగు: బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరెను బంధించామని ఆ దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు ప్రకటించారు. అధ్యక్షుడిని ఎక్కడ దాచింది వెల్లడించలేదు. ఆదివారం సైనిక శిబిరాల వద్ద మొదలైన కాల్పుల కలకలం సోమవారం కూడా కొనసాగింది. అధ్యక్ష భవనం వద్ద చిన్నపాటి యుద్దం జరిగింది. రాజధానిలో తిరుగబాటు సైనికులు గస్తీ కాస్తున్నారు. తొలుత ఇది తిరుగుబాటు కాదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ చివరకు సైనికుల చేతికి ప్రెసిడెంటే బందీగా చిక్కారు. 2015 నుంచి బుర్కినాకు కబోరె అధిపతిగా ఉన్నారు. దేశంలో జరుగుతున్న ఉగ్రచర్యలతో మిలటరీ తీవ్రంగా నష్టపోతోంది. తమకు సరైన సదుపాయాలు లేవని సైనికులు అసంతృప్తిగా ఉన్నారు. ఇది చివరకు తిరుగుబాటకు దారితీసింది. తిరుగుబాటుకు ప్రజల్లో కూడా మద్దతు ఉన్నట్లు కనిపిస్తోందని రాజకీయ నిపుణులు తెలిపారు. -
విషం చిమ్మిన చైనా..
న్యూఢిల్లీ: ఇండో–చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వారి దాడిలో తెలుగువాడైన ఒక కల్నల్, ఇద్దరు జవాన్లు అమరులైనట్లు మొదట ఆర్మీ ప్రకటించింది. కానీ, ఘర్షణలు పెద్ద ఎత్తున జరిగాయని, భారీగా మోహరించిన రెండు దేశాల సైనికులు కొన్ని గంటల పాటు ముఖాముఖి తలపడటంతో ఇరు వర్గాల సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారని అనంతరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్–చైనా సరిహద్దు ఊహాచిత్రం... ఆ తరువాత, లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు అమరులైనట్లు మంగళవారం రాత్రి ఆర్మీ ప్రకటించింది. ఘటనాస్థలి నుంచి రెండు దేశాల సైనికులు వెనక్కు వెళ్లారని పేర్కొంది. చైనాకు కూడా భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 43 మంది చైనా సైనికులు భారత సైనికుల దాడిలో చనిపోయి ఉండొచ్చని సమాచారం. అయితే, ఐదుగురు చైనా సైనికులు చనిపోయారని, 11 మంది గాయపడ్డారని పేర్కొంటూ చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ సీనియర్ రిపోర్టర్ చేసినట్లుగా చెబుతున్న ట్వీట్ ఒకటి వైరల్ అయింది. ప్రధాని సమీక్ష ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే స్పందించారు. గాల్వన్ లోయ ప్రాంతంలో సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటన, తదనంతర పరిణామాలు, వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. అంతకుముందు, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్యాంగ్యాంగ్ సొ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ, గాల్వన్ లోయ ప్రాంతాల్లో భారత బలగాల సంఖ్యను భారీగా పెంచాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఆ తరువాత, జై శంకర్, ఆర్మీ చీఫ్ నరవణెలతో రాజ్‌నాథ్ మళ్లీ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం పఠాన్‌కోట్ పర్యటనను ఆర్మీ చీఫ్ రద్దు చేసుకున్నారు. మరోవైపు, హోం మంత్రి అమిత్ షా కూడా ప్రధాని మోదీతో సమావేశమై చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు. మే తొలివారం నుంచి.. మే 5వ తేదీ నుంచి చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దులకు భారీగా బలగాలను, ఆయుధ సామగ్రిని తరలించాయి. పలుమార్లు రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగి, గాయాల పాలయ్యారు. అనంతరం, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మేజర్ జనరల్ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక అవగాహన మేరకు రెండు దేశాలు తమ సైన్యాలను వెనక్కు తరలించడం ప్రారంభించాయి. ఆ క్రమంలోనే సోమవారం రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ ప్రారంభమై తీవ్రరూపు దాల్చిందని సైనిక వర్గాలు తెలిపాయి. దాడుల అనంతరం మంగళవారం ఇరుదేశాల సైన్యంలోని ఉన్నతాధికారులు ఘటనాస్థలంలో సమావేశమయ్యారని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఫింగర్ ఏరియా కీలకం ప్యాంగ్యాంగ్ సొ సరస్సు చుట్టూ ఫింగర్ ఏరియాలో భారత్ చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని, గాల్వన్ లోయలో దార్బుక్– షాయొక్– దౌలత్ బేగ్ ఓల్డీలను అనుసంధానించే భారత్ చేపట్టిన మరో రోడ్డు నిర్మాణాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్యాంగ్యాంగ్ సొ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం భారత్‌కు అత్యంత కీలకం. చైనా వ్యతిరేకతను పట్టించుకోకుండా, తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని సరిహద్దుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది. 2022 నాటికి చైనా సరిహద్దుల్లో 66 కీలక రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. చైనా తీరు ఏకపక్షం సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా చేసిన ప్రయత్నం కారణంగానే తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఉన్నత స్థాయిలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా గౌరవించి ఉంటే.. రెండు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కాదని పేర్కొంది. వాస్తవాధీన రేఖకు ఇవతలి(భారత్) వైపుననే భారత్ చేపట్టే అన్ని కార్యకలాపాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. చైనా నుంచి కూడా అదే తీరును ఆశిస్తున్నామంది. భారత్‌దే తప్పు: చైనా జూన్ 15న భారత దళాలు వాస్తవాధీన రేఖను రెండుసార్లు దాటి వచ్చి, తమ సైనికులపై దాడులు చేసి రెచ్చగొట్టారని చైనా ఆరోపించింది. దాంతో రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ‘గతంలో అంగీకారానికి వచ్చిన ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని, తమ దళాలు సరిహద్దు దాటకుండా చూసుకోవాలని, పరిస్థితులు విషమించేలా ఏకపక్ష చర్యలకు దిగకుండా చూసుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియాన్ వ్యాఖ్యానించారు. గాల్వన్ లోయ ప్రాంతం చైనాదేనని ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి కల్నల్ జాంగ్ షుయిలీ మంగళవారం పేర్కొన్నారు. ‘నాకందిన సమాచారం మేరకు అక్కడ జరిగింది ముఖాముఖీ పోరాటమే. కొందరు చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దుందుడుకుగా వ్యవహరించవద్దని, చైనా సంయమనాన్ని బలహీనతగా భావించవద్దని భారత్‌కు చెబుతున్నా. భారత్‌తో ఘర్షణను చైనా కోరుకోవడం లేదు. అలా అని మేమేం భయపడడం లేదు’ అని అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు జీజిన్ ట్వీట్ చేశారు. చైనా దుందుడుకుతనం గాల్వన్లోయతో పాటు తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సొ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో నెలరోజులకు పైగా సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలుమార్లు ప్యాంగ్యాంగ్ సొ సహా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దును దాటి చైనా దళాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. వాస్తవాధీన రేఖ సమీపానికి శతఘ్నులను, ఇతర ఆధునిక ఆయుధ సామగ్రిని భారీగా తరలించింది. సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో బాహాబాహీకి దిగిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చొరబాట్లను భారత్ తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే వెనక్కు వెళ్లాలని చైనాను హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 6న లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మేజర్ జనరల్ ల్యూ లిన్ల మధ్య 7 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆ తరువాత మేజర్ జనరల్ స్థాయి చర్చలు రెండు దఫాలుగా జరిగాయి. ఆ చర్చల్లో, ఉద్రిక్తతల ముందు నాటి యథాతథ స్థితి ఏర్పడాలని, చైనా దళాలు వెంటనే వెనక్కు వెళ్లాలని భారత్ డిమాండ్ చేసింది. రెండు దేశాలు తమ దళాలను క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయని శనివారం భారత ఆర్మీ చీఫ్ నరవణె తెలిపారు. చర్చలు ఫలవంతమయ్యాయని, గాల్వన్ లోయకు ఉత్తరం వైపు నుంచి భారత దళాల ఉపసంహరణ ప్రారంభమైందని చెప్పారు. భారత్, చైనా సరిహద్దులు ఇలా .. ► భారత్, చైనా సరిహద్దుల్ని మూడు సెక్టార్ల కింద విభజించారు. వీటిలో పశ్చిమ సెక్టార్ ఎప్పుడూ ఉద్రిక్తతలకి, చొరబాట్లకి కేంద్ర బిందువుగా ఉంటోంది. ► కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి 1,597 కి.మీ. ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్ అంటారు. ► హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో 545 కి.మీ. పొడవునా మధ్య సెక్టార్ ఉంది. ► తూర్పు సెక్టార్లో 1,346 కి.మీ. మేర సరిహద్దు ఉంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఈ సెక్టార్ ఉంది. తెలుగువాడి వీర మరణం చైనా సైనికులతో ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోశ్ బాబు, మరో ఇద్దరు జవాన్లు మృతి చెందారని ఆర్మీ ప్రకటించింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ గాల్వన్ లోయ ప్రాంతంలో 16 బిహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. చనిపోయిన ఇద్దరు జవాన్లను హవల్దార్ పళని, సిపాయి ఓఝా అని ఆర్మీ తెలిపింది. ఈ ఘర్షణల సందర్భంగా కాల్పులు చోటు చేసుకోలేదని, తుపాకుల వంటి మారణాయుధాలను ఉపయోగించలేదని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు. రాళ్లు, కర్రలు, ఐరన్ రాడ్లను ఉపయోగించినట్లు సమాచారముందన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. గాల్వన్‌లోయలోని ఒక ప్రాంతం నుంచి చైనా దళాలు వెనక్కు వెళుతుండగా, ఘర్షణ ప్రారంభమైందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మొదట కల్నల్ సంతోష్, కల్నల్‌తో పాటు ఉన్న సైనికులపై చైనా దళాలు దాడి చేశాయని, భారత్ ప్రతిదాడికి దిగడంతో ఘర్షణ తీవ్రరూపు దా ల్చిందని వివరించాయి. గత ఐదు దశాబ్దాల్లో ఈ స్థాయి ఉద్రిక్తత రెండు దేశాల మధ్య నెలకొనలేదు. చైనా టెంట్‌ను తొలగించమన్నందుకే.. న్యూఢిల్లీ: భారత్–చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీసిన పరిణామం ఏమిటన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అధికార వర్గాల కథనం ప్రకారం.. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ 14 అనే చోట చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) టెంట్ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. ఈ నెల ప్రారంభంలోనే ఈ టెంట్ వేసినట్లు సమాచారం. ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. వాస్తవాధీన రేఖకు(ఎల్ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్ ఏర్పాటు చేశారు. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్ పాయింట్ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. ఇనుప రాడ్లతో దాడికి దిగారు. భారత సైనికులు కూడా ధీటుగా బదులిచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్ పాయింట్ 14 గాల్వన్, ష్యోక్ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్ కమాండర్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. ఐరాస ఆందోళన ఐక్యరాజ్యసమితి: భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన మంగళవారం పిలుపునిచ్చారు. ఉద్రిక్తతను చల్లార్చేందుకు భారత్–చైనా చర్యలు ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. -
ఇండో–చైనా సరిహద్దులో ఉద్రిక్తత
న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తూర్పు లద్దాఖ్, ఉత్తర సిక్కింలోని నకూ లా పాస్ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇరుదేశాలకు చెందిన సైనికులు గాయపడ్డారని భారత సైన్యాధికారులు ఆదివారం వెల్లడించారు. తొలి ఘటనలో.. మే 5న సాయంత్రం తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సరస్సు తీరం వెంబడి భారత్, చైనా దళాలకు చెందిన దాదాపు 200 మంది బాహాబాహీకి దిగడంతోపాటు, రెండు వైపులా ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. కొన్ని గంటల పాటు ఈ ఘర్షణ కొనసాగింది. చర్చల అనంతరం మర్నాడు ఉదయానికి అది ముగిసింది. ఈ గొడవలో ఇరుదేశాల సైనికులు గాయపడ్డారు. ఓ సమయంలో ఉద్రిక్తత పెరగడంతో రెండు దేశాలు మరిన్ని దళాలను ఆ ప్రాంతానికి తరలించాయి. ఈ ఘర్షణలో ఎంతమంది భారతీయ సైనికులు గాయపడ్డారనే వివరాలను అధికారులు ఇవ్వలేదు. మరో ఘటనలో.. సిక్కింలోని నకూ లా పాస్ వద్ద ఇరుదేశాలకు చెందిన సుమారు 150 మంది సైనికులు బాహాబాహీకి దిగి పిడిగుద్దులతో ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. ఈ ఘటనలో 10 మంది భారతీయ సైనికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. స్థానిక స్థాయి చర్చల అనంతరం ఇరువర్గాలు వెనక్కు తగ్గాయన్నారు. ‘సరిహద్దు సమస్య తేలకపోవడంతో ఇరు దేశాల సైనికుల మధ్య ఈ ప్రాంతాల్లో తాత్కాలిక, చిన్నస్థాయి ఘర్షణలు సాధారణమే. సిబ్బంది ఆవేశపూరిత మనస్తత్వం వల్ల కూడా ఘర్షణలు చోటు చేసుకుంటాయి. చిన్నపాటి గాయాలతో ముగుస్తాయి’ అని వివరించారు. భారత్, చైనాల మధ్య 2017లో డోక్లాం ట్రై జంక్షన్ వద్ద 73 రోజుల పాటు యుద్ధం స్థాయిలో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. వాస్తవ నియంత్రణ రేఖగా పేర్కొనే 3,488 కి.మీ. పొడవైన సరిహద్దుపై వివాదం కొనసాగుతోంది. ఐబీజీలు సిద్ధం : ఆర్మీ చీఫ్ ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ‘సమగ్ర యుద్ధ బృందాలు (ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ గ్రూప్స్–ఐబీజీ)’ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయని, కరోనా కారణంగా దీని అమలును కొంతకాలం వాయిదా వేశామని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె తెలిపారు. యుద్ధ సామర్థ్యాలను పెంచుకునే దిశగా ప్రయోగాత్మకంగా పదాతి దళం, శతఘ్ని దళం, వైమానిక దళం, లాజిస్టిక్ యూనిట్స్‌లతో ‘ఐబీజీ’లను ఏర్పాటు చేశారు. సుమారు 5 వేల మంది సిబ్బంది ఉండే ప్రతీ ఐబీజీకి ఒక మేజర్ జనరల్ నేతృత్వం వహిస్తారు. ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనేందుకు వారు సుశిక్షితులై ఉంటారు. ముఖ్యంగా పాక్, చైనా సరిహద్దుల్లో వీటిని మోహరించాలని ప్రణాళిక రచించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటనకు ముందు ప్రయోగాత్మకంగా ఐబీజీల సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అరుణాచల్ ప్రదేశ్‌లో సైనిక విన్యాసాలు నిర్వహించారు. -
ఆర్మీ క్యాంపులో ఘర్షణ
♦ గుండెనొప్పితో జవాను మృతి.. కెప్టెన్‌పై సహచర జవాన్ల దాడి ♦ తిరుగుబాటు కాదన్న ఆర్మీ ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లో ఓ మిలటరీ క్యాంపులో ఆదివారం ఘర్షణ చెలరేగింది. సహచరుడు గుండెనొప్పితో మృతి చెందడంతో ఆగ్రహించిన కొందరు జవాన్లు.. కెప్టెన్‌పై దాడిచేశారని.. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగానే ఉందని ఆర్మీ తెలిపింది. ఈటానగర్‌కు దగ్గర్లోని క్యాంపులో రోజూలాగే రూట్ మార్చ్ మొదలైంది. ఓ జవాను తనకు ఛాతీలో నొప్పిగా ఉందని కెప్టెన్‌కు తెలిపారు. పరీక్షించిన యూనిట్ వైద్యాధికారి.. సదరు జవాను శిక్షణకు ఫిట్‌గా ఉన్నాడని చెప్పడంతో తప్పనిసరి స్థితుల్లో మార్చ్‌లో పాల్గొనాల్సి వచ్చింది. మార్చ్ మొదలవగానే ఆ జవాన్ గుండెనొప్పితో కుప్పకూలటంతో వైద్యాధికారి.. ఆయన చనిపోయినట్లుగా నిర్ధారించారు. దీంతో కోపోద్రిక్తులైన నలుగురైదుగురు అక్కడే ఉన్న కెప్టెన్‌పై దాడిచేసి గాయపరిచారు. వెంటనే ఇతర జవాన్లు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ విషయం బయటకు పొక్కటంతో.. సైన్యంలో తిరుగుబాటు మొదలైందనే వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఆర్మీ ఉన్నతాధికారులు ఖండించారు. ఈ ఘటనలో విచారణకు ఆదేశించారు.