భారత, చైనా బలగాల కవాతు(ఫైల్)
న్యూఢిల్లీ: ఇండో–చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇరు దేశాల సైనికుల మధ్య సోమవారం రాత్రి జరిగిన తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణల్లో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం జరిగింది. ముఖాముఖీ పోరాటంలో రాళ్లు, ఇనుప రాడ్‌లతో చైనా సైనికులు దాడి చేశారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వారి దాడిలో తెలుగువాడైన ఒక కల్నల్, ఇద్దరు జవాన్లు అమరులైనట్లు మొదట ఆర్మీ ప్రకటించింది. కానీ, ఘర్షణలు పెద్ద ఎత్తున జరిగాయని, భారీగా మోహరించిన రెండు దేశాల సైనికులు కొన్ని గంటల పాటు ముఖాముఖి తలపడటంతో ఇరు వర్గాల సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారని అనంతరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
భారత్–చైనా సరిహద్దు ఊహాచిత్రం...
ఆ తరువాత, లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో 20 మంది భారతీయ సైనికులు అమరులైనట్లు మంగళవారం రాత్రి ఆర్మీ ప్రకటించింది. ఘటనాస్థలి నుంచి రెండు దేశాల సైనికులు వెనక్కు వెళ్లారని పేర్కొంది. చైనాకు కూడా భారీగానే నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 43 మంది చైనా సైనికులు భారత సైనికుల దాడిలో చనిపోయి ఉండొచ్చని సమాచారం. అయితే, ఐదుగురు చైనా సైనికులు చనిపోయారని, 11 మంది గాయపడ్డారని పేర్కొంటూ చైనా అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ సీనియర్ రిపోర్టర్ చేసినట్లుగా చెబుతున్న ట్వీట్ ఒకటి వైరల్ అయింది.
ప్రధాని సమీక్ష
ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెంటనే స్పందించారు. గాల్వన్ లోయ ప్రాంతంలో సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటన, తదనంతర పరిణామాలు, వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. అంతకుముందు, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్‌నాథ్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్యాంగ్యాంగ్ సొ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ, గాల్వన్ లోయ ప్రాంతాల్లో భారత బలగాల సంఖ్యను భారీగా పెంచాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. ఆ తరువాత, జై శంకర్, ఆర్మీ చీఫ్ నరవణెలతో రాజ్‌నాథ్ మళ్లీ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం పఠాన్‌కోట్ పర్యటనను ఆర్మీ చీఫ్ రద్దు చేసుకున్నారు. మరోవైపు, హోం మంత్రి అమిత్ షా కూడా ప్రధాని మోదీతో సమావేశమై చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు.
మే తొలివారం నుంచి..
మే 5వ తేదీ నుంచి చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రెండు దేశాలు సరిహద్దులకు భారీగా బలగాలను, ఆయుధ సామగ్రిని తరలించాయి. పలుమార్లు రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగి, గాయాల పాలయ్యారు. అనంతరం, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా రెండు దేశాల మధ్య దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మేజర్ జనరల్ స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక అవగాహన మేరకు రెండు దేశాలు తమ సైన్యాలను వెనక్కు తరలించడం ప్రారంభించాయి. ఆ క్రమంలోనే సోమవారం రాత్రి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ ప్రారంభమై తీవ్రరూపు దాల్చిందని సైనిక వర్గాలు తెలిపాయి. దాడుల అనంతరం మంగళవారం ఇరుదేశాల సైన్యంలోని ఉన్నతాధికారులు ఘటనాస్థలంలో సమావేశమయ్యారని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది.
ఫింగర్ ఏరియా కీలకం
ప్యాంగ్యాంగ్ సొ సరస్సు చుట్టూ ఫింగర్ ఏరియాలో భారత్ చేపట్టిన రోడ్డు నిర్మాణాన్ని, గాల్వన్ లోయలో దార్బుక్– షాయొక్– దౌలత్ బేగ్ ఓల్డీలను అనుసంధానించే భారత్ చేపట్టిన మరో రోడ్డు నిర్మాణాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్యాంగ్యాంగ్ సొ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం భారత్‌కు అత్యంత కీలకం. చైనా వ్యతిరేకతను పట్టించుకోకుండా, తూర్పు లద్దాఖ్ ప్రాంతంలోని సరిహద్దుల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేయాలని భారత్ కృత నిశ్చయంతో ఉంది. 2022 నాటికి చైనా సరిహద్దుల్లో 66 కీలక రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
చైనా తీరు ఏకపక్షం
సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చేందుకు చైనా ఏకపక్షంగా చేసిన ప్రయత్నం కారణంగానే తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఉన్నత స్థాయిలో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా గౌరవించి ఉంటే.. రెండు దేశాల సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది కాదని పేర్కొంది. వాస్తవాధీన రేఖకు ఇవతలి(భారత్) వైపుననే భారత్ చేపట్టే అన్ని కార్యకలాపాలు ఉంటున్నాయని స్పష్టం చేసింది. చైనా నుంచి కూడా అదే తీరును ఆశిస్తున్నామంది.
భారత్‌దే తప్పు: చైనా
జూన్ 15న భారత దళాలు వాస్తవాధీన రేఖను రెండుసార్లు దాటి వచ్చి, తమ సైనికులపై దాడులు చేసి రెచ్చగొట్టారని చైనా ఆరోపించింది. దాంతో రెండు దేశాల సైనికులు బాహాబాహీకి దిగే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ‘గతంలో అంగీకారానికి వచ్చిన ఏకాభిప్రాయానికి కట్టుబడి ఉండాలని, తమ దళాలు సరిహద్దు దాటకుండా చూసుకోవాలని, పరిస్థితులు విషమించేలా ఏకపక్ష చర్యలకు దిగకుండా చూసుకోవాలని భారత్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావొ లిజియాన్ వ్యాఖ్యానించారు.
గాల్వన్ లోయ ప్రాంతం చైనాదేనని ఆ దేశ మిలటరీ అధికార ప్రతినిధి కల్నల్ జాంగ్ షుయిలీ మంగళవారం పేర్కొన్నారు. ‘నాకందిన సమాచారం మేరకు అక్కడ జరిగింది ముఖాముఖీ పోరాటమే. కొందరు చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దుందుడుకుగా వ్యవహరించవద్దని, చైనా సంయమనాన్ని బలహీనతగా భావించవద్దని భారత్‌కు చెబుతున్నా. భారత్‌తో ఘర్షణను చైనా కోరుకోవడం లేదు. అలా అని మేమేం భయపడడం లేదు’ అని అధికార మీడియా గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ హు జీజిన్ ట్వీట్ చేశారు.
చైనా దుందుడుకుతనం
గాల్వన్‌లోయతో పాటు తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ సొ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో నెలరోజులకు పైగా సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలుమార్లు ప్యాంగ్యాంగ్ సొ సహా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దును దాటి చైనా దళాలు భారత భూభాగంలోకి చొరబడ్డాయి. వాస్తవాధీన రేఖ సమీపానికి శతఘ్నులను, ఇతర ఆధునిక ఆయుధ సామగ్రిని భారీగా తరలించింది. సరిహద్దుల్లో ఇరు దేశాల సైనికులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో బాహాబాహీకి దిగిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ చొరబాట్లను భారత్ తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే వెనక్కు వెళ్లాలని చైనాను హెచ్చరించింది.
ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. జూన్ 6న లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ హరీందర్ సింగ్, టిబెట్ మిలటరీ డిస్ట్రిక్ట్ కమాండర్ మేజర్ జనరల్ ల్యూ లిన్‌ల మధ్య 7 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆ తరువాత మేజర్ జనరల్ స్థాయి చర్చలు రెండు దఫాలుగా జరిగాయి. ఆ చర్చల్లో, ఉద్రిక్తతల ముందు నాటి యథాతథ స్థితి ఏర్పడాలని, చైనా దళాలు వెంటనే వెనక్కు వెళ్లాలని భారత్ డిమాండ్ చేసింది. రెండు దేశాలు తమ దళాలను క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయని శనివారం భారత ఆర్మీ చీఫ్ నరవణె తెలిపారు. చర్చలు ఫలవంతమయ్యాయని, గాల్వన్ లోయకు ఉత్తరం వైపు నుంచి భారత దళాల ఉపసంహరణ ప్రారంభమైందని చెప్పారు.
భారత్, చైనా సరిహద్దులు ఇలా ..
► భారత్, చైనా సరిహద్దుల్ని మూడు సెక్టార్‌ల కింద విభజించారు. వీటిలో పశ్చిమ సెక్టార్ ఎప్పుడూ ఉద్రిక్తతలకి, చొరబాట్లకి కేంద్ర బిందువుగా ఉంటోంది.
► కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి 1,597 కి.మీ. ప్రాంతాన్ని పశ్చిమ సెక్టార్ అంటారు.
► హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో 545 కి.మీ. పొడవునా మధ్య సెక్టార్ ఉంది.
► తూర్పు సెక్టార్‌లో 1,346 కి.మీ. మేర సరిహద్దు ఉంది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఈ సెక్టార్ ఉంది.
తెలుగువాడి వీర మరణం
చైనా సైనికులతో ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోశ్ బాబు, మరో ఇద్దరు జవాన్లు మృతి చెందారని ఆర్మీ ప్రకటించింది. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ గాల్వన్ లోయ ప్రాంతంలో 16 బిహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. చనిపోయిన ఇద్దరు జవాన్లను హవల్దార్ పళని, సిపాయి ఓఝా అని ఆర్మీ తెలిపింది. ఈ ఘర్షణల సందర్భంగా కాల్పులు చోటు చేసుకోలేదని, తుపాకుల వంటి మారణాయుధాలను ఉపయోగించలేదని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు.
రాళ్లు, కర్రలు, ఐరన్ రాడ్‌లను ఉపయోగించినట్లు సమాచారముందన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. గాల్వన్‌లోయలోని ఒక ప్రాంతం నుంచి చైనా దళాలు వెనక్కు వెళుతుండగా, ఘర్షణ ప్రారంభమైందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మొదట కల్నల్ సంతోష్, కల్నల్‌తో పాటు ఉన్న సైనికులపై చైనా దళాలు దాడి చేశాయని, భారత్ ప్రతిదాడికి దిగడంతో ఘర్షణ తీవ్రరూపు దా ల్చిందని వివరించాయి. గత ఐదు దశాబ్దాల్లో ఈ స్థాయి ఉద్రిక్తత రెండు దేశాల మధ్య నెలకొనలేదు.
చైనా టెంట్‌ను తొలగించమన్నందుకే..
న్యూఢిల్లీ: భారత్–చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురి మృతికి దారితీసిన పరిణామం ఏమిటన్న దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అధికార వర్గాల కథనం ప్రకారం.. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత భూభాగంలో పెట్రోలింగ్ పాయింట్ 14 అనే చోట చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) టెంట్ వేసిందన్న సమాచారంతో భారత జవాన్లు రంగంలోకి దిగారు. ఈ నెల ప్రారంభంలోనే ఈ టెంట్ వేసినట్లు సమాచారం. ఆ టెంట్‌ను తొలగించే ప్రయత్నంలోనే ఇరు దేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది.
వాస్తవాధీన రేఖకు(ఎల్‌ఏసీ) ఇటువైపున భారత భూభాగంలోనే చైనా సైనికులు టెంట్ ఏర్పాటు చేశారు. ఆ టెంట్‌ను వెంటనే తొలగించాలని భారత జవాన్లు సూచించగానే, పెట్రోలింగ్ పాయింట్ 14 పై భాగం నుంచి చైనా జవాన్లు రాళ్లు విసరడం ప్రారంభించారు. ఇనుప రాడ్లతో దాడికి దిగారు. భారత సైనికులు కూడా ధీటుగా బదులిచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన భారత జవాన్లను మిలటరీ ఆసుపత్రికి తరలించారు. పెట్రోలింగ్ పాయింట్ 14 గాల్వన్, ష్యోక్ నదుల సంగమ ప్రాంతం సమీపంలోనే ఉంది. గత వారం ఇక్కడే భారత్, చైనా డివిజన్ కమాండర్ స్థాయి అధికారుల సమావేశం జరిగింది. గాల్వన్‌లో బలగాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు.
ఐరాస ఆందోళన
ఐక్యరాజ్యసమితి: భారత్–చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన మంగళవారం పిలుపునిచ్చారు. ఉద్రిక్తతను చల్లార్చేందుకు భారత్–చైనా చర్యలు ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment