మన గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు | No force can stop Indian troops from patrolling | Sakshi
Sakshi News home page

మన గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు

Published Fri, Sep 18 2020 4:21 AM | Last Updated on Fri, Sep 18 2020 5:21 AM

No force can stop Indian troops from patrolling - Sakshi

న్యూఢిల్లీ: భారత సైన్యం లద్దాఖ్‌ ప్రాంతంలో సరిహద్దు గస్తీ నిర్వహించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌æ స్పష్టం చేశారు. తూర్పులద్దాఖ్‌లో పరిస్థితిపై గురువారం రక్షణ మంత్రి రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. చైనా తన సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిందని, భారత్‌ తదనుగుణంగా బలగాలను సిద్ధంగా ఉంచిందని తెలిపారు. చైనా చెప్పే మాటలకు, చేతలకూ పొంతన ఉండటం లేదని అన్నారు. గల్వాన్‌ లోయపై గతంలో ఎన్నడూ చైనాతో వివాదం తలెత్తలేదని, ఫింగర్‌ పాయింట్‌–8 వరకు మన బలగాలు గస్తీ చేపట్టేవని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు.

ఆయన ప్రశ్నకు రాజ్‌నాథ్‌ వివరణ ఇస్తూ.. చైనాతో గొడవంతా గస్తీ విషయంలోనేనని తెలిపారు. గస్తీ విధానం విస్పష్టంగా ఉందని, చాలా కాలంగా కొనసాగుతున్నదేనని చెప్పారు. సరిహద్దు వివాదాల్లాంటి సున్నితమైన అంశాలపై చర్చ వద్దన్న అంశంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు అంగీకరించిన తరువాత రాజ్‌నాథ్‌æ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సభ్యులు కొన్ని అంశాలపై కోరిన వివరణకు రక్షణ మంత్రి స్పందించారు. చైనా సరిహద్దుల్లో ఏప్రిల్‌ నాటి పరిస్థితులను పునరుద్ధరించాలని అంతకుముందు ప్రతిపక్షం డిమాండ్‌ చేసింది. తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న ఈ సమయంలో పార్టీల కతీతంగా సభ సైన్యానికి మద్దతు, సంఘీభావం ప్రకటించింది.  

భారత భూభాగాన్ని ఆక్రమించింది
లద్దాఖ్‌ ప్రాంతంలో సుమారు 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోనూ 5,180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉందని రాజ్‌నాథ్‌ తెలిపారు. భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అతితక్కువ సైనిక బలగాల మోహరింపు ఉండాలని 20 ఏళ్ల క్రితమే ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు.

పార్లమెంట్‌ ఆవరణలో రైతు బిల్లు ప్రతులు దహనం
కేంద్రం ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించిన రైతుల బిల్లులపై కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన తెలిపారు. పంజాబ్‌కు చెందిన ఆ పార్టీ ఎంపీలు బిల్లుల ప్రతులను పార్లమెంట్‌ ఆవరణలో తగులబెట్టి, మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కేంద్రం తప్పుడు విధానాల కారణంగా రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత ఆధిర్‌ రంజన్‌ చౌధురి ఆరోపించారు.

సాయుధ సంపత్తికి
బిలియన్‌ డాలర్లువాస్తవాధీన రేఖ వెంట ప్రస్తుతం మోహరించిన బలగాలను చలికాలం ముగిసేవరకు కొనసాగించాలని చైనా నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ నెలాఖరులో జరగనున్న ఇరుదేశాల మిలటరీ స్థాయి చర్చల్లో ప్రాదేశిక మార్పులకు సంబంధించి గొప్ప ఫలితాలేవీ రాకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తుండటంతో.. సుమారు బిలియన్‌ డాలర్ల(రూ. 7,361 కోట్లు) విలువైన మిలటరీ సాయుధ సంపత్తిని అత్యవసరంగా సమకూర్చుకునేందుకు భారత ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని వెల్లడించాయి.

ఒకవేళ నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగే పరిస్థితే ఉంటే.. అందుకు అవసరమైన సాయుధ సంపత్తిని సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. ఇందులో టీ–72, టీ–90 యుద్ధ ట్యాంకులకు అవసరమైన పేలుడు పదార్ధాలు, ఇజ్రాయెల్‌ తయారీ క్షిపణులు, హెరోన్‌ డ్రోన్లు, ఎస్‌ఐజీ 716 రైఫిల్స్, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నాయని వెల్లడించాయి. అలాగే, సుమారు 50 వేల మంది జవాన్లకు అవసరమైన.. తీవ్ర చలిని తట్టుకోగల దుస్తులు, హీటర్లు, టెంట్స్‌ను సమకూర్చుకోవాల్సి ఉందని తెలిపాయి. మరోవైపు, చైనా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధపడకపోవచ్చని, భారత దళాలను నెలలు, లేదా సంవత్సరాల తరబడి సరిహద్దుల్లో ఎంగేజ్‌ చేయడం ద్వారా భారత్‌ను దెబ్బతీయాలనే లక్ష్యంతో పనిచేయవచ్చని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు మనోజ్‌ జోషి వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుంటే, భారత్‌కు ఇది భారమే అవుతుందన్నారు. మరోవైపు, ఆర్మీ చీఫ్‌ నరవాణే గురువారం శ్రీనగర్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.


కశ్మీర్‌లోని సరిహద్దు వెంట పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్న ఆర్మీ చీఫ్‌ నరవాణే  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement