petroling
-
నైట్ పెట్రోలింగ్ ఉండాలి
న్యూఢిల్లీ: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై రేప్, హత్య ఘటనసహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందిపై లైంగికదాడుల ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. వైద్య సిబ్బంది భద్రతకు ఆస్పత్రుల్లో అమలుచేయాల్సిన మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం బుధవారం జారీచేసింది. బుధవారం వర్చువల్ విధానంలో జరిగిన నేషనల్ టాస్క్ ఫోర్స్ భేటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర, ప్రధాన కార్యదర్శలు, డీజీపీలు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భేటీలో సూచించిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి..→ పెద్ద ఆస్పత్రుల్లో జనం పెద్దగా తిరగని చోట్ల, చీకటి ప్రాంతాలు, మూలగా ఉండే చోట్ల సీసీటీవీలు బిగించాలి→ ఆస్పత్రుల్లో భద్రతపై జిల్లా కలెక్టర్లు, డీఎస్పీలు, జిల్లా ఆస్పత్రి యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి తగు సెక్యూరిటీ ఏర్పాట్లు చూసుకోవాలి→ సెక్యూరిటీ, ఇతర సిబ్బందిని భద్రతా తనిఖీలు చేయాలి→ రాత్రుళ్లు అన్ని ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో సెక్యూరిటీ పెట్రోలింగ్ తరచూ జరుపుతుండాలి→ పెద్ద జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటుచేయాలి. సీసీటీవీలను ఎప్పటికప్పుడు చెక్చేస్తూనే డాటాను కూడా తరచూ బ్యాకప్ తీసుకోవాలి→ అత్యవసర కాల్స్‌కు స్పందించి కంట్రోల్ రూమ్, సెక్యూరిటీ, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూసుకోవాలి. కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బంది శారీరకదారుఢ్యం మెరుగు కోసం వారికి శిక్షణ ఇప్పించాలి→ రోగులను స్ట్రెచర్, ట్రాలీ, చక్రాల కుర్చీల్లోకి మారుస్తూ ఎక్కువ మంది బంధువులు ఆస్పత్రుల్లో పోగుబడుతున్నారు. వీరి సంఖ్యను తగ్గించేందుకు ఆస్పత్రులే ఈ పనులకు తగు సిబ్బందిని నియమించాలి→ వైద్యారోగ్య సిబ్బంది రక్షణ కోసం ఉన్న భారతీయ న్యాయ సంహిత చట్టాలు, వారిపై దాడులకు పాల్పడితే బాధ్యులకు విధించే శిక్షలకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలి→ తమ రాష్ట్రాల్లో హెల్ప్‌లైన్ నంబర్లు 100, 112 ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చాలా రాష్ట్రాలు స్పష్టంచేశాయి.→ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో వైద్య సిబ్బంది రక్షణ కోసం మెరుగైన విధానాలు అమల్లో ఉన్నాయని ఆయా రాష్ట్రాలను కేంద్రం మెచ్చుకోవడం విశేషం. -
అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!
దొంగతనాలు జరగకుండా.. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తుంటారు. అవసరమైతే రాత్రిపూట పెట్రోలింగ్ వంటివి కూడా చేస్తుంటారు. మనకు తెలిసినంతవరకు పోలీసులు పెట్రోలింగ్కుకు పలు రకాల వాహనాలనే ఉపయోగిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పెట్రోలింగ్ కోసం పోలీసులు గేదెలను ఉపయోగిస్తారట. ఇదేంటి గేదెలతోనా ఆశ్చర్యపోకండి. ఎందుకంటే వాటితో గస్తీ కాయడం అంత ఈజీ కాదు. ఎక్కడ..? ఏ దేశంలో ఇలా చేస్తారంటే..? బ్రెజిల్ దేశంలో మరాజే అనే ఒక ద్వీపం ఉంటుంది. ఈ ద్వీపం స్విట్జర్లాండ్ దేశమంత ఉంటుంది.. అయితే ఇక్కడ పోలీసింగ్ విధానం చాలా వెరైటీగా ఉంటుంది. సాధారణంగా పోలీసులు వాహనాలలో తిరుగుతూ గస్తి నిర్వహిస్తారు. కానీ ఇక్కడి పోలీసులు మాత్రం నీటి గేదెలు, గుర్రాలపై గస్తి నిర్వహిస్తారు.. మరాజో ద్వీపంలో నీటి గేదెలు ఎక్కువగా ఉంటాయి… ఇక్కడ వాతావరణం వాటికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ గేదెలను వందల ఏళ్ల క్రితమే ఫ్రెంచ్ గయానా దేశస్తులు తీసుకొచ్చారని అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఈ ద్వీపంలో నాలుగు లక్షల 40 వేల మంది జీవిస్తుంటారు. ఈ ప్రాంతం ఉష్ణ మండల వాతావరణానికి ప్రసిద్ధి చెందింది.. జనాభాపరంగా, విస్తీర్ణం పరంగా చిన్నగా ఉన్న ఈ ద్వీపంలో పోలీసులు గేదెలపై లేదా గుర్రాలపై సవారి చేస్తూ భద్రతను పర్యవేక్షిస్తూ.. గస్తీ కాస్తూ ఉంటారు. ఇక్కడ నీటి గేదెలను గస్తీ కోసం మాత్రమే కాకుండా.. వాటిని వధించి ఆ మాంసాన్ని వండుకొని తింటారు కూడా. అంతేగాదు ఈ ప్రాంతంలో బఫెలో స్టిక్స్ అనే వంటకం అత్యంత ప్రసిద్ధి చెందింది. మోజారెల్లా గ్రేసింగ్ రెస్టారెంట్లో బఫెలోస్టిక్స్ ప్రత్యేకంగా ఉంటుందని ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెబుతుంటారు. అయితే పోలీసులకు శిక్షణలో భాగంగా గేదెలపై సవారి నేర్చించడం జరుగుతుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. బురద నిండిన మడ అడవులలో గేదెలపైకి నూతనంగా రిక్రూట్ అయిన పోలీసులను ఎక్కించి శిక్షణ ఇస్తుంటారు. ఆ గేదెను సవారి చేయడంలో నైపుణ్యం సంపాదించిన వారికి మాత్రమే గస్తీ కాసే బాధ్యత అప్పగిస్తారు. అయితే గేదెను నియంత్రించడం అనేది అంత ఈజీ మాత్రం కాదు. ఇది అత్యంత సవాల్ తో కూడుకున్నదని ఇక్కడి సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.. ఇలా గేదెలపై పోలీసులు గస్తీ కాస్తుండడం అనేది ఇక్కడకు వచ్చే పర్యాటకులకు మాత్రం వింతగా కనిపిస్తుంది. ఇది ఒకరకంగా ప్రకృతి, దేశ సంస్కృతి ఒక దానిపై ఒకటి ముడిపడి ఉన్నాయి అని చెప్పేందుకు తమ దేశ పోలీసులు ఇలా గేదెలపై గస్తీ కాస్తున్నట్లు చెబుతున్నారు అధికారులు. అలాగే ఈ గేదె బలం, సహకారం, ప్రత్యేక జీవన విధానానికి చిహ్నంగా ఉంటుంది. అందువల్లే దీన్ని తాము ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. (చదవండి: హీరోయిన్లా కనిపించాలని వందకుపైగా సర్జరీలు! అందుకోసం..) -
వామ్మో..! చెడ్డీ గ్యాంగ్..! జర జాగ్రత్త..!!
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగల ముఠా సంచారం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చెడ్డీ గ్యాంగ్‌ను తలపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు హెచ్చరించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలోని కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఉన్న జయశంకర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు అరవడం మొదలు పెట్టాయి. కొందరు కాలనీవాసులు బయటకు వచ్చి చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు. అనుమానంతో ఉదయాన్నే ఇండ్లలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా ఉదయం 3 నుంచి 3.30 ప్రాంతంలో కాలనీలోని శివాలయం, చుట్టూ పక్కల గల్లీలలో ఏడుగురు సభ్యులు గల ఓ దొంగల ముఠా సంచరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, రూరల్ పోలీసులు కాలనీవాసులతో మాట్లాడారు. పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని, ఆయా కాలనీల్లో గస్తీ దళాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాట్సప్ గ్రూపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా జయశంకర్ కాలనీకి సమీపంలోని ఓం శాంతి మందిర ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అదే సమయంలో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని దేవయ్య ఇటీవలే కుటుంబంతో కలిసి ముంబాయికి వెళ్లాడు. దొంగలు తాళం పగులగొట్టి ఇళ్లంతా చిందరవందర చేశారు. ఇంటిని పోలీసులు పరిశీలించారు. కుటుంబం ఇక్కడ లేకపోవడంతో ఎలాంటి వస్తువులు చోరీకి గురియ్యాయో తెలియరాలేదు. ఈ చోరీకి పాల్పడింది కూడా చెడ్డీ గ్యాంగే అని భావిస్తున్నారు. జయశంకర్‌కాలనీ ప్రాంతంలో సీసీ కెమెరాలు చాలా చోట్ల లేవు. ఉన్న కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ఏవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
మన గస్తీని ఏ శక్తీ అడ్డుకోలేదు
న్యూఢిల్లీ: భారత సైన్యం లద్దాఖ్ ప్రాంతంలో సరిహద్దు గస్తీ నిర్వహించకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్æ స్పష్టం చేశారు. తూర్పులద్దాఖ్‌లో పరిస్థితిపై గురువారం రక్షణ మంత్రి రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. చైనా తన సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించిందని, భారత్ తదనుగుణంగా బలగాలను సిద్ధంగా ఉంచిందని తెలిపారు. చైనా చెప్పే మాటలకు, చేతలకూ పొంతన ఉండటం లేదని అన్నారు. గల్వాన్ లోయపై గతంలో ఎన్నడూ చైనాతో వివాదం తలెత్తలేదని, ఫింగర్ పాయింట్–8 వరకు మన బలగాలు గస్తీ చేపట్టేవని రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ అన్నారు. ఆయన ప్రశ్నకు రాజ్‌నాథ్ వివరణ ఇస్తూ.. చైనాతో గొడవంతా గస్తీ విషయంలోనేనని తెలిపారు. గస్తీ విధానం విస్పష్టంగా ఉందని, చాలా కాలంగా కొనసాగుతున్నదేనని చెప్పారు. సరిహద్దు వివాదాల్లాంటి సున్నితమైన అంశాలపై చర్చ వద్దన్న అంశంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు అంగీకరించిన తరువాత రాజ్‌నాథ్æ రాజ్యసభలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో సభ్యులు కొన్ని అంశాలపై కోరిన వివరణకు రక్షణ మంత్రి స్పందించారు. చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నాటి పరిస్థితులను పునరుద్ధరించాలని అంతకుముందు ప్రతిపక్షం డిమాండ్ చేసింది. తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యంతో ప్రతిష్టంభన కొనసాగుతున్న ఈ సమయంలో పార్టీల కతీతంగా సభ సైన్యానికి మద్దతు, సంఘీభావం ప్రకటించింది. భారత భూభాగాన్ని ఆక్రమించింది లద్దాఖ్ ప్రాంతంలో సుమారు 38 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోనూ 5,180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని కలిగి ఉందని రాజ్‌నాథ్ తెలిపారు. భారత్, చైనాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి అతితక్కువ సైనిక బలగాల మోహరింపు ఉండాలని 20 ఏళ్ల క్రితమే ఒప్పందాలు జరిగాయని గుర్తు చేశారు. పార్లమెంట్ ఆవరణలో రైతు బిల్లు ప్రతులు దహనం కేంద్రం ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదించిన రైతుల బిల్లులపై కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన తెలిపారు. పంజాబ్‌కు చెందిన ఆ పార్టీ ఎంపీలు బిల్లుల ప్రతులను పార్లమెంట్ ఆవరణలో తగులబెట్టి, మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కేంద్రం తప్పుడు విధానాల కారణంగా రైతులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి ఆరోపించారు. సాయుధ సంపత్తికి బిలియన్ డాలర్లువాస్తవాధీన రేఖ వెంట ప్రస్తుతం మోహరించిన బలగాలను చలికాలం ముగిసేవరకు కొనసాగించాలని చైనా నిర్ణయించిన నేపథ్యంలో.. ఈ నెలాఖరులో జరగనున్న ఇరుదేశాల మిలటరీ స్థాయి చర్చల్లో ప్రాదేశిక మార్పులకు సంబంధించి గొప్ప ఫలితాలేవీ రాకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరింతకాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తుండటంతో.. సుమారు బిలియన్ డాలర్ల(రూ. 7,361 కోట్లు) విలువైన మిలటరీ సాయుధ సంపత్తిని అత్యవసరంగా సమకూర్చుకునేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించాయి. ఒకవేళ నెలరోజులకు పైగా యుద్ధం కొనసాగే పరిస్థితే ఉంటే.. అందుకు అవసరమైన సాయుధ సంపత్తిని సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాయి. ఇందులో టీ–72, టీ–90 యుద్ధ ట్యాంకులకు అవసరమైన పేలుడు పదార్ధాలు, ఇజ్రాయెల్ తయారీ క్షిపణులు, హెరోన్ డ్రోన్లు, ఎస్ఐజీ 716 రైఫిల్స్, ఇతర యుద్ధ సామగ్రి ఉన్నాయని వెల్లడించాయి. అలాగే, సుమారు 50 వేల మంది జవాన్లకు అవసరమైన.. తీవ్ర చలిని తట్టుకోగల దుస్తులు, హీటర్లు, టెంట్స్‌ను సమకూర్చుకోవాల్సి ఉందని తెలిపాయి. మరోవైపు, చైనా పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధపడకపోవచ్చని, భారత దళాలను నెలలు, లేదా సంవత్సరాల తరబడి సరిహద్దుల్లో ఎంగేజ్ చేయడం ద్వారా భారత్‌ను దెబ్బతీయాలనే లక్ష్యంతో పనిచేయవచ్చని వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు మనోజ్ జోషి వ్యాఖ్యానించారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుంటే, భారత్‌కు ఇది భారమే అవుతుందన్నారు. మరోవైపు, ఆర్మీ చీఫ్ నరవాణే గురువారం శ్రీనగర్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కశ్మీర్‌లోని సరిహద్దు వెంట పరిస్థితులను స్వయంగా సమీక్షిస్తున్న ఆర్మీ చీఫ్ నరవాణే -
తిరుపతిలో పోలీసుల భారీ పెట్రోలింగ్
-
కొత్వాల్ కొరడా..!
‘రాత్రి 12 గంటలు. కోతిరాంపూర్‌లోని ఓ గల్లీలో కొందరు యువకులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. చౌరస్తాలో అప్పటికే సిద్ధం చేసిన టేబుల్, దానిపై ఓ కేక్, క్యాండిల్స్... పుట్టినరోజు జరుపుకుంటున్న తమ మిత్రుడికి శుభాకాం క్షలు చెబుతూ కేక్ కట్ చేయించారు. కేరింతలు కొడుతూ బీర్ల మూతలు తెరిచారు. యువకుల సందడిని చూసిన ఓ వ్యక్తి 100 నెంబర్‌కు ఫోన్ చేయడంతో వెంటనే పెట్రోలింగ్ వాహనం అక్కడికి చేరింది. పోలీసు వాహనం హారన్ వినగానే ఎక్కడి వారు అక్కడ పరార్’ – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలను తగ్గించడం, మహిళలు, బాలికల రక్షణ, యువకుల విచ్చలవిడి తనానికి పుల్‌స్టాప్ పెట్టడం, అక్రమ దందాలను అరికట్టడం... తదితర అంశాలపై పోలీస్ కమిషనర్ వి.బి.కమలాసన్‌రెడ్డి గత కొంతకాలంగా తీసుకుంటున్న చర్యలకు మరింత పదును పెట్టారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ స్థాయిల్లోని అధికారులతోపాటు బ్లూకోట్స్, పెట్రోలింగ్ స్టాఫ్, క్రైం పార్టీలు, ఈ కాప్స్, అడ్మినిస్ట్రేషన్, రిసిప్షన్ తదితర 10 విభాగాల సిబ్బందికి ఇచ్చే శిక్షణా కార్యక్రమాలకు హాజరవుతూ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం బ్లూకోట్స్, పెట్రోలింగ్ టీంలతో పాటు క్రైంపార్టీ పోలీసులతో జరిగిన సమావేశానికి హాజరై పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందితో మాట్లాడి వారి నుంచి సలహాలు కూడా తీసుకున్నారు. బ్లూకోట్స్, పెట్రోలింగ్ టీమ్‌లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా కితాబిచ్చారు. ప్రార్థనా స్థలాల వద్ద తెల్లవారు జామున ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. తరచూ ఈవ్‌టీజింగ్ జరిగే బస్టాండ్స్, పార్కులు, కాలేజీ అడ్డాలు వంటి ‘హాట్‌స్పాట్స్’ను గుర్తించిన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని వారిని ఆదేశించారు. వ్యవస్థీకృత భూదందాలు నిర్వహిస్తున్న వారిపై ఇప్పటికే నిఘా ఉన్నప్పటికీ... పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సురక్షిత కరీంనగర్ లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలని, విచ్చలవిడి తనాన్ని రూపు మాపడం, మహిళలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించడం ధ్యేయంగా పనిచేయాలని అధికారులు, క్షేత్రస్థాయి పోలీసులకు సూచనలు ఇచ్చారు. మనోళ్ల పనితీరు ఎలా ఉంది..? సోమవారం స్పెషల్ బ్రాంచ్(ఎస్బీ) పోలీసులతో కమిషనర్ కమలాసన్‌రెడ్డి సమావేశం అయ్యారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్లు, సీఐ, ఎస్సైల తీరుపై ఆరా తీశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్హెచ్ఓలు, భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్న వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్న పోలీసు అధికారుల వివరాలతోపాటు సామాన్యులు పోలీసుల విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారనే అంశాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఎస్బీ మీటింగ్‌లో సూచనలు, సలహాలు చేసిన అనంతరం ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. వడ్డీ దందాలు, ఆర్థిక నేరాలకు సంబంధించి కూడా ఆయన ఆరా తీసినట్లు సమాచారం. ఒక్కొక్కరు ఒక్క నేరాన్నైనా ఛేదించాలి: క్రైంపార్టీల్లో పనిచేస్తున్న పోలీసులు మెదడుకు పనిచెప్పాలని, వ్యూహాత్మకంగా నేరాలను ఛేదించాలని మంగళవారం జరిగిన క్రైంపార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. ఎలాంటి కేసైనా పట్టుదలతో ప్రయత్నిస్తే ఛేదన కష్టం కాదని, ప్రతీ నేరానికి ఎక్కడో ఒకచోట క్లూ లభిస్తుందని అన్నారు. ఇతర జిల్లాల్లో నేరగాళ్లు పట్టుబడే విధానాలను పరిశీలించాలని సూచించారు. సైబర్ ల్యాబ్‌తోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. క్రైంపార్టీలలో పనిచేసే పోలీసులు ఒక్క నేరాన్ని అయినా స్వయంగా ఛేదించాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. 31లోగా అన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రతి పాఠశాలలో ఈ నెల 31లోగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. విద్యార్థినులు, మహిళలు చదువుకునే పాఠశాలలు, కళాశాలలు, లేడీస్ హాస్టళ్లు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి వంద మంది గుమిగూడే ఏ ప్రాంతమైనా సీసీ కెమెరా తప్పనిసరని, సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తే ఎలాంటి సంఘటననైనా రికార్డు చేయవచ్చని అన్నారు. పాఠశాలల్లో చదివే ఎదిగిన పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పాఠశాలలోని ప్రతి ఆవరణ నిక్షిప్తం అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఆ సందర్భంగా ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయని ఓ పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జార్ఖండ్‌లో మావోల పంజా
సిరాయికెలా–ఖర్సవాన్: జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులను కాల్చి చంపారు. శుక్రవారం జార్ఖండ్‌లోని తిరుల్దిహ్ పోలీస్ స్టేషన్ పరిధి (జార్ఖండ్–బెంగాల్ సరిహద్దు)లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందారని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అవినాశ్‡ తెలిపారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మావోయిస్టులు పోలీసు అధికారులను చంపారని అడిషనల్ డీజీపీ మురారి లాల్ మీనా తెలిపారు. అమరుల కుటుంబాలకు రాష్ట్రమంతా అండగా ఉంటుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శుక్రవారం ఉదయం మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. తడోకి ఠాణా పరిధిలోని ముర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు డీఆర్జీ, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ముర్నార్ అటవీ ప్రాంతంలో తారసపడిన మావోయిస్టులు పోలీస్ బలగాలపై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారని డీజీపీ గిర్దార్ తెలిపారు. -
మహిళలకు తోడుగా ‘ఉమెన్ ఆన్ వీల్స్’
ఖైరతాబాద్: నగరం పోలీసు విభాగంలో షీ టీమ్స్ తరహాలోనే పెట్రోలింగ్ వ్యవస్థలో ఉమెన్ ఆన్ వీల్స్ కూడా కీలకంగా మారుతుందని సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా వేదికగా ప్రత్యేకంగా శిక్షణ పొందిన 20 మంది మహిళా కానిస్టేబుళ్లను ‘‘ఉమెన్ ఆన్ వీల్స్’’ విధుల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ హైదరాబాద్ సిటీ పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థలో మహిళా కానిస్టేబుళ్లతో ‘ఉమెన్ ఆన్ వీల్స్’ పేరుతో పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. షీ టీమ్స్ తరహాలోనే పెట్రోలింగ్ వ్యవస్థలో పురుషులకు సమానంగా మహిళలను నియమిస్తున్నారు. వారికి రెండు నెలల పాటు డ్రైవింగ్ స్కిల్స్, ఇంటర్న్‌షిప్, ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రజల్లోకి పంపుతున్నట్లు తెలిపారు. విదేశాల్లో ఈ తరహా పోలీసింగ్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఇప్పటివరకు మహిళా కానిస్టేబుళ్లు కౌన్సిలింగ్, రిసెప్షనిస్ట్‌లుగా మాత్రమే పరిమితమయ్యారన్నారు. ఎన్టీఆర్గార్డెన్, లుంబినీపార్క్, సంజీవయ్యపార్క్, మాల్స్ తదితర ప్రాంతాల్లో మహిళలు ఈవ్‌టీజింగ్ తదితర ఇబ్బందులు ఎదుర్కొటున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉమెన్ పెట్రోలింగ్ సిబ్బందితో మహిళలు వారి సమస్యలను నేరుగా చెప్పుకునేందుకు వీలవుతుందన్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ‘ఉమెన్ ఆన్ వీల్స్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో 20మంది కానిస్టేబుళ్లు అవగాహన కల్పించేందుకు పీపుల్స్ ప్లాజా నుంచి ఐమాక్స్ రోటరీ చౌరస్తా, లుంబినీపార్క్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించారు. సైఫాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, చిక్కడపల్లి, ఆబిడ్స్, లేక్ పోలీస్స్టేషన్ల పరిధిలో వీరు విధులు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో షీ టీమ్స్ ఏసీపీ నర్మద, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి, సైఫాబాద్ ఇన్స్‌స్పెక్టర్ చింతల సైదిరెడ్డి, సీసీఎస్ అడ్మిన్ పూర్ణచందర్, నాంపల్లి రాజేష్, రాంగోపాల్‌పేట్ బాబు ఇన్స్ప్పెక్టర్లు పాల్గొన్నారు. సమస్యలను ధైర్యంగా చెప్పుకోవచ్చు మహిళలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు 100కు డయల్‌చేసిన వెంటనే పెట్రోలింగ్ విధుల్లో ఉండే పురుషులు సంఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు వారి సమస్యలను నేరుగా చెప్పలేకపోవచ్చు. ఆ విధుల్లో మేము ఉండటం వల్ల వారు ధైర్యంగా వారి ఇబ్బందులు మాతో చెప్పుకోగలరు. విధులను చాలెంజ్‌గా తీసుకుంటా.– పుష్యమిత్ర, చాంద్రాయణగుట్ట పీఎస్ కొత్త ఒరవడికి శ్రీకారం ఉమెన్ ఆన్ వీల్స్ అనే కొత్త వరవడికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా మాకు రెండు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రజలకు నేరుగా సేవచేసేందుకు ఇదో మంచి అవకాశం. – నాగకుమారి, చాంద్రాయణగుట్ట పీఎస్ -
సిటీ పోలీస్: ఇక గల్లీల్లోనూ సైకిళ్లతో గస్తీ!
సిటీ పోలీస్ ఇక సైకిల్ బాట పడుతున్నారు. స్ట్రీట్ బైస్కిల్ పెట్రోలింగ్ (ఎస్బీపీ) పేరిట కాలనీలు, గల్లీల్లో గస్తీ నిర్వహణకు ప్రత్యేక సైకిళ్లు వినియోగించాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు సైకిళ్లను సోమవారం నుంచి వినియోగిస్తున్నారు. బ్లూకోల్ట్స్, ఇన్నోవాలు, ఇంటర్సెప్టార్ వాహనాలు వెళ్లలేని గల్లీల్లోనూ గస్తీ చేపట్టేందుకు ఈ సైకిళ్లు ఉపయోగపడతాయని, ఇంధనం అవసరం లేని కారణంగా ఇవి పర్యావరణ హితమైనవి కూడా అని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దశలవారీగా వీటి వినియోగాన్ని విస్తరిస్తామని తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుతం నగర పోలీసు విభాగం గస్తీ కోసం బ్లూకోల్ట్స్‌గా పిలిచే ద్విచక్ర వాహనాలు, రక్షక్లుగా పిలిచే ఇన్నోవాలు వినియోగిస్తోంది. వీటికి తోడు ఒక్కో సబ్–డివిజన్లో ఒకటి చొప్పున ఇంటర్‌సెప్టర్ వాహనాలు తిరుగుతున్నాయి. ఇవన్నీ పెట్రోల్ లేదా డీజిల్ ఇంధనంగా పని చేస్తూ అత్యంత వేగంగా దూసుకుపోయేవి. వీటివల్ల కాలుష్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ప్రాంతంలోనూ ఉన్న మారుమూల గల్లీల్లోకి వీటి ద్వారా వెళ్ళడం సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో మౌంటెడ్ పోలీసుగా పిలిచే అశ్వక దళాన్ని వాడుతున్నా.. అన్ని సందర్భాల్లోనూ ఇది అనువైంది కాదు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ పెట్రోలింగ్ కోసం ప్రత్యేకమైన సైకిల్స్ సమీకరించుకోవాలని నిర్ణయించారు. బ్యాటరీ సాయంతో పని చేసే ఈ బై సైకిల్స్‌ను ప్రయోగాత్మకంగా పంజగుట్ట ఠాణా పరిధిలో సోమవారం ప్రారంభించారు. తొలి దశలో ఐదు సైకిళ్లలో స్ట్రీట్ బైస్కిల్ పెట్రోలింగ్ (ఎస్బీపీ) పేరుతో ఇది మొదలైందని ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ ‘సాక్షి’కి తెలిపారు. ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, ఎల్లారెడ్డిగూడ, ఆనంద్‌నగర్‌కాలనీ, సోమాజిగూడల్లోని స్లమ్స్, గల్లీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎస్బీపీ వ్యవస్థ పని చేస్తుందని వివరించారు. అవసరాలకు తగ్గట్టు ఏర్పాట్లు... ఈ సైకిళ్లను గస్తీ పోలీసుల దైనందిన అవసరాలకు తగ్గట్లు డిజైన్ చేశారు. వీటిని వినియోగించడం ద్వారా గస్తీ సిబ్బంది ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బ్లూకోల్ట్సŠ, రక్షక్‌లు చేరలేని ప్రాంతాలకూ ఇవి వెళ్తాయి. లాఠీ, వాటర్‌బాటిల్, సైరన్లతో పాటు జీపీఎస్ విధానం కూడా ఈ సైకిళ్లకు ఉంటుంది. వాకీటాకీ, సెల్‌ఫోన్, డైరీలను తమ వెంట తీసుకువెళ్ళడానికి అనువుగా ఏర్పాట్లు చేశారు. ఉదయం ఠాణా నుంచి గస్తీకి బయలుదేరిన సిబ్బంది సాయంత్రం వరకు ఈ సైకిల్ పైనే తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే వారికి అలసట లేకుండా అద్భుతంగా పని చేసే షాక్ ఎబ్జార్వర్స్, బ్రేకింగ్ సిస్టం దీనికి ఉన్న అదనపు ఆకర్షణలు. ఈ సైకిల్‌కు వెనుక భాగంలో ఏర్పాటు చేసిన పెట్టెలో ప్రథమ చికిత్స ఉపకరణాలతో పాటు క్రైమ్ సీన్‌ను రక్షించడానికి ఉపయోగించేవీ, సైరన్ ఏర్పాటు చేశారు. మారుమూల ప్రాంతం లో నేరం జరిగినప్పుడు తక్షణం అక్కడు వెళ్ళే ఎస్బీపీ సిబ్బంది తక్షణం సహాయక చర్యలు చేపట్టడానికి, నేర స్థలిని రక్షించడానికి ఇవి ఉపకరిస్తాయి. భవిష్యత్‌లో ఎస్బీపీ విస్తరణ... దేశంలోనే బెస్ట్ ఠాణాగా నిలిచిన పంజగుట్ట నుంచి ఈ ఎస్‌బీసీని ప్రారంభించారు. భవిష్యత్తులో మరింత విస్తరించాలని నగర పోలీసులు భావిస్తున్నారు. టూరిస్ట్ స్పాట్స్‌లో పోలీసింగ్, పెట్రోలింగ్ కోసం వినియోగించనున్నట్లు తెలిసింది. రెండో దశలో టూరిస్ట్‌లు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో గస్తీ కోసం వినియోగిస్తారు. ట్యాంక్‌బండ్ చుట్టూ సంచరించే లేక్ పోలీసులతో పాటు కేబీఆర్ పార్క్, పెడస్ట్రియన్ ప్రాజెక్టు అమలవుతున్న చార్మినార్, కుతుబ్‌షాహీ టూంబ్స్, గోల్కొండ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే బృందాలకు కేటాయించాలని భావిస్తున్నారు. టూరిజం పోలీసింగ్‌కు మాత్రమే కాకుండా బందోబస్తులు, ఊరేగింపుల సమయంలోనూ వినియోగించనున్నారు. -
సాహసానికి దక్కని గుర్తింపు!
సాక్షి, సిటీబ్యూరో: అది 1993 జనవరి 13. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఘట్కేసర్ చేరుకుంది. అకస్మాత్తుగా ఇద్దరు దుండగులు ఎస్–9 బోగీలోకి ప్రవేశించి, ప్రయాణికులపై దాడికి పాల్పడ్డారు. ఆరుగురు గాయపడ్డారు. మిగతా ప్రయాణికులు భయాందోళనతో అరుస్తున్నారు. అందులో పెట్రోలింగ్ విధులు నిర్వర్తిస్తున్న ఇక్బాల్ షరీఫ్ వెంటనే అక్కడికి వెళ్లాడు. దుండగులు ఇక్బాల్‌పై కత్తులతో దాడి చేశారు. తల, శరీరభాగాల్లో తీవ్రమైన గాయాలయ్యాయి. అయినా లెక్కచేయకుండా ఆ దుండగులను అదుపులోకి తీసుకున్నాడు ఇక్బాల్. ప్రాణాలకు తెగించి ఎంతో సాహసంతో బోగీలోని 72 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. ఇది జరిగి 25 ఏళ్లవుతోంది. కానీ ఇప్పటికీ ఇక్బాల్ సాహసానికి గుర్తింపు దక్కలేదు. ఇప్పటికైనా న్యాయం చేయండి.. ఆదిలాబాద్ రిజర్వ్ పోలీస్ విభాగంలో విధులు నిర్వహించిన ఇక్బాల్‌ను 25 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లోని రైల్వే పోలీస్ శాఖకు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. 1993లో జరిగిన రైల్వే ఘటనలో అతడి సాహసానికి మెచ్చి ప్రమోషన్‌తో పాటు బంగారు పతకం అందజేస్తామని అప్పటి రైల్వే ఐజీ సీహెచ్ కోటేశ్వర్రావు, డీజీపీ హామీ ఇచ్చారు. అయితే ఇది ఇప్పటికీ నెరవేరలేదు. అటు పోలీస్ శాఖ నుంచి గానీ, ఇటు రైల్వే శాఖ నుంచి గానీ ఎలాంటి ప్రోత్సాహం లభించలేదు. దీనిపై 25 ఏళ్లుగా పోరాడుతున్నానని, తన రిటైర్మెంట్ కూడా దగ్గరపడుతోందని ఇక్బాల్ ‘సాక్షి’తో తన ఆవేదన చెప్పాడు. సీఎం, హోంమంత్రి, పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికైనా తన సేవలను గుర్తించి, న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. తన సర్వీస్‌లో ఇప్పటి వరకు 20 క్యాష్ అవార్డులు, 20 గుడ్ సర్వీస్ ఎంటీ (జీఎస్ఈ) పతకాలు సాధించానన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా ‘బీట్’ పోలీసింగ్!
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేలా ఆ శాఖ ఉన్నతాధికారులు విప్లవా త్మక మార్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఉన్న బీట్ పెట్రోలింగ్ వ్యవస్థను రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కమిషనరేట్లు, పాత, కొత్త జిల్లా కేంద్రాల్లో అమలు చేసేలా విస్తృ త కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక్కో ఠాణా కింద ఆరు నుంచి ఏడు బీట్లుగా పోలీస్ సిబ్బం దిని నియమించి.. వారికి బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు అందించారు. దీనివల్ల సిబ్బందికి కేటాయించిన బీట్లలో జరిగే ప్రతిచిన్న విషయం త్వరగా తెలిసిపోవడంతో పాటు ఘటనా స్థలాల కు చేరుకోవడం సులువవుతోంది. అలాగే బీట్ పోలీసింగ్ ద్వారా నేరాల నియంత్రణ సులభతరమైంది. ఇదే తరహాలో జిల్లాలు, నూతన కమిషనరేట్లలోనూ బీట్ పోలీసింగ్‌ను అమలుచేసేం దుకు పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది. సరిపడా పెట్రోలింగ్ వాహనాలు తెలంగాణ ఏర్పాటయ్యాక దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రవాణా సౌకర్యాలు కల్పించింది. ఆధునిక సౌకర్యాలున్న ఇన్నోవా కార్లను పెట్రోలింగ్ కోసం అందజేసింది. శాంతిభద్రతల విభాగాలతోపాటు ట్రాఫిక్, ఎస్బీ, ఇతర విభాగాలకు వాహనాలు ఇచ్చింది. వీటికి జీపీఎస్ ట్రాకింగ్ పెట్టడంతో సిబ్బంది అంకితభావంతో సేవలం దించేలా పర్యవేక్షిస్తున్నారు. నూతన కమిషనరేట్లలోనూ పెట్రోలింగ్ కోసం ఇన్నోవా కార్ల కొనుగో లుకు పోలీస్ శాఖ సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన కమిషనరేట్లలో ప్రతీ ఠాణాకు రెండు చొప్పున పెట్రోలింగ్ కార్లు, 8 చొప్పున బ్లూకోల్ట్స్ బైకులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రూరల్ ప్రాంతాల్లో ఒక్కో ఠాణాకు ఒక పెట్రోలింగ్ కారుతో పాటు నాలుగు బ్లూకోల్ట్స్ బైకులు అందజేయనుంది. తద్వారా బీట్స్‌లో ఉండే కానిస్టేబుళ్లు గస్తీ చేపట్టడంతోపాటు ఘటనా స్థలాలకు చేరుకోవడం సులభంగా ఉంటుందని భావిస్తోంది. కొత్త సిబ్బంది సేవలు కీలకం ఇటీవల పోలీస్ శాఖలో కొత్తగా నియామకమైన 10 వేల మంది కానిస్టేబుళ్లను గ్రామీణ ప్రాంతా ల్లో నియమించి టెక్నాలజీ వినియోగాన్ని విస్తృ తం చేసేలా పోలీస్ శాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రతి చిన్న ఘటన నిమిషాల్లో ఉన్నతాధికారులకు తెలిసేలా యాప్స్‌తో అప్డేట్ చేయనున్నారు. ప్రతి ఠాణాకు ఓ ఫేస్బుక్ ఖాతా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ కు విద్యార్థులు, యువత సలహాలిచ్చేలా, ఫిర్యా దులు చేసేలా టెక్నాలజీని వినియోగించనున్నా రు. కొత్తగా రానున్న పెట్రోలింగ్ వాహనాల్లోనే ట్యాబ్‌లు ఏర్పాటుచేసి.. ఘటనా స్థలినుంచే దర్యాప్తునకు అవసరమైన వివరాలు తెలుసుకునేలా.. సీసీటీఎన్ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్)ను మరింత లోతుగా వినియోగించుకోనున్నారు. సర్కిల్ స్థాయి నుంచి.. ప్రస్తుతం జిల్లా పోలీసు విభాగాల్లో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) సిబ్బంది హెడ్‌క్వార్టర్స్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, పలు రాజకీయ పార్టీల కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఈ సిబ్బంది, అధికారులను ఇక సర్కిళ్ల వారీ నియమించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతీ జిల్లాకు ఒక స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, కొందరు కానిస్టేబుళ్లు ఉన్నారు. కీలకమైన ఈ యూనిట్లో ఎక్కువ మంది అధికారులు, సిబ్బందిని నియమించి.. శాంతిభద్రతల పోలీసులను అప్రమత్తం చేసేలా సర్కిల్, డివిజన్ల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. -
అలాంటివి జరగకముందే మేల్కొందాం!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఓ ప్రాంతంలో నిత్యం ఈవ్‌టీజింగ్ జరుగుతోంది. ఓ దశలో ఇది శృతిమించి ప్రేమోన్మాదిగా మారిన పోకిరీ విద్యార్థిని/యువతిపై దాడికి బరితెగించాడు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఉలిక్కిపడింది. సిటీలోని ఓ బస్తీలో ఎక్కడ చూసినా బహిరంగ ప్రదేశంలో మద్యం తాగే వాళ్ళు కనిపిస్తుంటారు. ఇద్దరు తాగుబోతుల మధ్య జరిగిన ఘర్షణ పట్టపగలు, నడిరోడ్డుపై హత్యకు దారితీసింది. ఓ కాలనీలోని ఓ ఇంట్లో పసిపిల్లల్ని పనిలో పెట్టుకుని చిత్రహింసలకు గురి చేసేవారు. కొన్నాళ్ళు ఈ బాధల్ని ఓర్చుకున్న ఆ బాలిక పట్టుకోలేని స్థితిలో బయటపడలేననే భావనతో ఆత్మహత్య చేసుకుంది. – ఈ మూడింటిలో ఏ సమస్యనైనా ముందుగానే గుర్తించి, ఆదిలోనే తుంచేయగలిగితే పరిస్థితులు తీవ్రంగా మారేవి కాదు. ఇదే విషయాన్ని గుర్తించిన నగర పోలీసు విభాగం కమ్యూనిటీ పోలీసింగ్ విధానంలో సమగ్ర మార్పులు తీసుకువస్తోంది. స్థానికంగా ఉండే ఇలాంటి సమస్యల్ని గుర్తించే పనిని క్షేత్రస్థాయి అధికారులకు, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతల్ని అధికారులకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సరికొత్త విధానాలను త్వరలోనే నగర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి కమిషనర్ కార్యాలయం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతోందిలా... నగరంలో ఇప్పుడూ కమ్యూనిటీ పోలీసింగ్ విధానం అమలవుతోంది. ఈ బాధ్యతల్ని క్షేత్రస్థాయిలో గస్తీ విధులు నిర్వర్తించే పెట్రోలింగ్ వాహనాలతో పాటు బ్లూకోల్డ్స్ సిబ్బందికి అప్పగించారు. వీరు తమ పరిధుల్లోని ప్రాంతాల్లో నిత్యం తిరుగుతూ కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ సంక్షేమ సంఘాలు, వర్తక/వాణిజ్య సంఘాలతో పాటు ఇతర కమ్యూనిటీలను కలుస్తుంటారు. పోలీసు విభాగం చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించడంతో పాటు ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలను వారికి పంపిణీ చేస్తారు. క్రమం తప్పకుండా అనునిత్యం వారిని కలుస్తున్నప్పటికీ ఈ కమ్యూనిటీ పోలీసింగ్ విధానంలో లోపాలు ఉన్నట్లు కమిషనరేట్ కార్యాలయం గుర్తించింది. దీంతో ఫలితాలతో కూడిన కమ్యూనిటీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇకపై జరిగేది ఇలా... ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బందితో పాటు గస్తీ వాహనాలకూ ట్యాబ్స్ అందించారు. ఇవి నిత్యం ఇంటర్నెట్ కనెక్టివిటీ కలిగి ఉండటంతో పాటు పోలీసు విభాగానికి సంబంధించిన ప్రత్యేక యాప్స్ నిక్షిప్తమై ఉంటాయి. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఆయా సంఘాలతో పాటు స్థానికుల్ని కలిసినప్పుడు వారి నుంచి ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, న్యూసెన్స్ అంశాలతో పాటు ఇతర ఇబ్బందుల్ని తెలుసుకుంటారు. వాటిని ట్యాబ్‌్సలో ఉండే పోలీసు యాప్స్‌లోకి ఫీడ్ చేస్తారు. ఏ ప్రాంతంలోనైనా ఓ ఇబ్బంది/సమస్యపై ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచేందుకు ఎక్కడా ఎంట్రీ చేయరు. ఈ విధంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలూ పోలీసు విభాగానికి సంబంధించిన సెంట్రలైజ్డ్ డేటాబేస్‌లోకి వచ్చి చేరతాయి. పరిష్కారాలూ ‘చెప్పాల్సిందే’... ఈ డేటాబేస్ కారణంగా ఉన్నతాధికారులకు తమ తమ పరిధుల్లోని ప్రాంతాల్లో ఏ సమస్యలు, ఎక్కడ ఎక్కువగా ఉంటున్నాయి? అనేది తెలుస్తుంది. దీంతో పాటు ఆయా ఏరియాలకు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఇన్స్పెక్టర్), ఏసీపీలు తమ పరిధుల్లోని సమస్యలు డేటాబేస్ ద్వారా గుర్తించడంతో పాటు వారం రోజుల్లో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సదరు సమస్యను తీర్చడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఉన్నతాధికారుల నుంచి అవసరమైన సహాయసహకారాలు ఏంటి? అనే అంశాలనూ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. సదరు సమస్య పోలీసు విభాగం పరిష్కరించేది కాకుంటే సంబంధిత శాఖ అధికారుల దృష్టికి దాన్ని తీసుకువెళ్ళడంతో పాటు అది తీరేలా చూడాల్సిందే. వీటిపైనా నిత్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఉన్న ‘షీ–టీమ్’, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్ తదితర ప్రత్యేక విభాగాలు సైతం నిత్యం సెంట్రలైజ్డ్ డేటాబేస్‌లో ఉన్న వివరాలు ఆధారంగా ఆయా ప్రాంతాల్లో అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. త్వరలో నగర వ్యాప్తంగా అమలులోకి రానున్న ఈ విధానంపై ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ప్రజల్లో ఒకరిగా ఉండి, వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు గుర్తించడంతో పాటు గుర్తించడంతో పాటు వారి ద్వారానే తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు పరిష్కారానికి కృషి చేయడమే కమ్యూనిటీ పోలీసింగ్. దీన్ని నగరంలో పక్కాగా అమలు చేయడానికి నిర్ణయించాం’ అని అన్నారు. -
హాస్టళ్ల పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలి
పోలీస్ అధికారులకు కలెక్టర్ ఆదేశం ఖమ్మం జెడ్పీసెంటర్: బాలల సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, హాస్టళ్ల పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులను కలెక్టర్ లోకేష్‌కుమార్ ఆదేశించారు. జిల్లా బాలల రక్షణ సొసైటీ సమన్వయ కమిటీ శుక్రవారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో జరిగింది. ఆయన మాట్లాడుతూ.. బడి మానేసిన పిల్లల పూర్తి సమాచారం సేకరించాలని, వారిని సీఆర్పీ స్కూల్స్‌లో చే ర్పించాలని అన్నారు. సంఖ్యాపరిమితి లేకుండా అన్ని వసతి Výృహాల్లో విద్యార్థులను చేర్చుకోవాలని సంక్షేమ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద సేవాసంస్థలకు సంబంధించి సీడీపీఓ స్థాయిలో పెండింగులోగల దర్యాప్తులను సెప్టెంబర్ 20 వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి విష్ణువందన మాట్లాడుతూ.. బాలల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై బాలల సంరక్షణ విభాగాల సమావేశాల్లో చైతన్యపరుస్తున్నట్టు చెప్పారు. శివాయిగూడె, ప్రకాష్‌నగర్ తదితర ప్రాంతాల్లో పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరచిన తరువత వసతి గృహాల్లో చేర్పిస్తున్నట్టు చెప్పారు. ఐసీడీఎస్ పీడీ జ్యోతిర్మయి కూడా మాట్లాడారు. సమావేశంలో ఏఎస్పీ సాయికృష్ణ, డీఈఓ రాజేష్, ఆర్వీఎం పీఓ శ్రీనివాస్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.