సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పోలీసులు మరింత చేరువయ్యేలా ఆ శాఖ ఉన్నతాధికారులు విప్లవా త్మక మార్పులకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ఉన్న బీట్ పెట్రోలింగ్ వ్యవస్థను రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కమిషనరేట్లు, పాత, కొత్త జిల్లా కేంద్రాల్లో అమలు చేసేలా విస్తృ త కార్యాచరణ రూపొందిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఒక్కో ఠాణా కింద ఆరు నుంచి ఏడు బీట్లుగా పోలీస్ సిబ్బం దిని నియమించి.. వారికి బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు అందించారు. దీనివల్ల సిబ్బందికి కేటాయించిన బీట్లలో జరిగే ప్రతిచిన్న విషయం త్వరగా తెలిసిపోవడంతో పాటు ఘటనా స్థలాల కు చేరుకోవడం సులువవుతోంది. అలాగే బీట్ పోలీసింగ్ ద్వారా నేరాల నియంత్రణ సులభతరమైంది. ఇదే తరహాలో జిల్లాలు, నూతన కమిషనరేట్లలోనూ బీట్ పోలీసింగ్‌ను అమలుచేసేం దుకు పోలీసుశాఖ కసరత్తు చేస్తోంది.
సరిపడా పెట్రోలింగ్ వాహనాలు
తెలంగాణ ఏర్పాటయ్యాక దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పోలీస్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రవాణా సౌకర్యాలు కల్పించింది. ఆధునిక సౌకర్యాలున్న ఇన్నోవా కార్లను పెట్రోలింగ్ కోసం అందజేసింది. శాంతిభద్రతల విభాగాలతోపాటు ట్రాఫిక్, ఎస్‌బీ, ఇతర విభాగాలకు వాహనాలు ఇచ్చింది. వీటికి జీపీఎస్ ట్రాకింగ్ పెట్టడంతో సిబ్బంది అంకితభావంతో సేవలం దించేలా పర్యవేక్షిస్తున్నారు.
నూతన కమిషనరేట్లలోనూ పెట్రోలింగ్ కోసం ఇన్నోవా కార్ల కొనుగో లుకు పోలీస్ శాఖ సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన కమిషనరేట్లలో ప్రతీ ఠాణాకు రెండు చొప్పున పెట్రోలింగ్ కార్లు, 8 చొప్పున బ్లూకోల్ట్స్ బైకులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రూరల్ ప్రాంతాల్లో ఒక్కో ఠాణాకు ఒక పెట్రోలింగ్ కారుతో పాటు నాలుగు బ్లూకోల్ట్స్ బైకులు అందజేయనుంది. తద్వారా బీట్స్‌లో ఉండే కానిస్టేబుళ్లు గస్తీ చేపట్టడంతోపాటు ఘటనా స్థలాలకు చేరుకోవడం సులభంగా ఉంటుందని భావిస్తోంది.
కొత్త సిబ్బంది సేవలు కీలకం
ఇటీవల పోలీస్ శాఖలో కొత్తగా నియామకమైన 10 వేల మంది కానిస్టేబుళ్లను గ్రామీణ ప్రాంతా ల్లో నియమించి టెక్నాలజీ వినియోగాన్ని విస్తృ తం చేసేలా పోలీస్ శాఖ కార్యాచరణ రూపొందించింది. ప్రతి చిన్న ఘటన నిమిషాల్లో ఉన్నతాధికారులకు తెలిసేలా యాప్స్‌తో అప్‌డేట్ చేయనున్నారు. ప్రతి ఠాణాకు ఓ ఫేస్‌బుక్ ఖాతా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పోలీస్ శాఖ కు విద్యార్థులు, యువత సలహాలిచ్చేలా, ఫిర్యా దులు చేసేలా టెక్నాలజీని వినియోగించనున్నా రు. కొత్తగా రానున్న పెట్రోలింగ్ వాహనాల్లోనే ట్యాబ్‌లు ఏర్పాటుచేసి.. ఘటనా స్థలినుంచే దర్యాప్తునకు అవసరమైన వివరాలు తెలుసుకునేలా.. సీసీటీఎన్‌ఎస్ (క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్)ను మరింత లోతుగా వినియోగించుకోనున్నారు.
సర్కిల్ స్థాయి నుంచి..
ప్రస్తుతం జిల్లా పోలీసు విభాగాల్లో స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) సిబ్బంది హెడ్‌క్వార్టర్స్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, పలు రాజకీయ పార్టీల కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఈ సిబ్బంది, అధికారులను ఇక సర్కిళ్ల వారీ నియమించనున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రతీ జిల్లాకు ఒక స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, కొందరు కానిస్టేబుళ్లు ఉన్నారు. కీలకమైన ఈ యూనిట్‌లో ఎక్కువ మంది అధికారులు, సిబ్బందిని నియమించి.. శాంతిభద్రతల పోలీసులను అప్రమత్తం చేసేలా సర్కిల్, డివిజన్ల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment