కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగల ముఠా సంచారం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చెడ్డీ గ్యాంగ్‌ను తలపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు హెచ్చరించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలోని కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఉన్న జయశంకర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు అరవడం మొదలు పెట్టాయి.
కొందరు కాలనీవాసులు బయటకు వచ్చి చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు. అనుమానంతో ఉదయాన్నే ఇండ్లలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా ఉదయం 3 నుంచి 3.30 ప్రాంతంలో కాలనీలోని శివాలయం, చుట్టూ పక్కల గల్లీలలో ఏడుగురు సభ్యులు గల ఓ దొంగల ముఠా సంచరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, రూరల్ పోలీసులు కాలనీవాసులతో మాట్లాడారు.
పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని, ఆయా కాలనీల్లో గస్తీ దళాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాట్సప్ గ్రూపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా జయశంకర్ కాలనీకి సమీపంలోని ఓం శాంతి మందిర ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అదే సమయంలో దొంగతనం జరిగింది.
ఇంటి యజమాని దేవయ్య ఇటీవలే కుటుంబంతో కలిసి ముంబాయికి వెళ్లాడు. దొంగలు తాళం పగులగొట్టి ఇళ్లంతా చిందరవందర చేశారు. ఇంటిని పోలీసులు పరిశీలించారు. కుటుంబం ఇక్కడ లేకపోవడంతో ఎలాంటి వస్తువులు చోరీకి గురియ్యాయో తెలియరాలేదు. ఈ చోరీకి పాల్పడింది కూడా చెడ్డీ గ్యాంగే అని భావిస్తున్నారు. జయశంకర్‌కాలనీ ప్రాంతంలో సీసీ కెమెరాలు చాలా చోట్ల లేవు. ఉన్న కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ఏవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని భద్రత కల్పించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment