Cheddi Gang
-
భయపెడుతున్న చెడ్డి గ్యాంగ్
-
గోడపై ‘కోడ్’?
మీ ఇల్లు లేదా ఆఫీసు గోడపై ఎక్కడో ఓ చోట ఒకటి, రెండంకెల నంబర్లు లేదా అక్షరాల రూపంలో ఏమైనా రాసి ఉన్నాయా? అయితే చెడ్డీ గ్యాంగ్ కన్నేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంకెలు, అక్షరాల రూపంలో కోడ్ భాషలోనే చెడ్డీ గ్యాంగ్ కమ్యూనికేషన్ చేసుకుంటుందని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇటీవల మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చెడ్డీ గ్యాంగ్ రూ.7.8 లక్షలు చోరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకపోవడంతో సాంకేతిక అంశాల ఆధారంగానే దర్యాప్తు సాగుతోంది. టవర్ డంప్ సాంకేతికతతో రెండు అనుమానిత కాల్స్‌ను పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఇళ్లలో చోరీలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్.. పాఠశాలలు, కార్యాలయాలపై కూడా కన్నేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన చోరీ కేసులో తొలుత ఇది చెడ్డీ గ్యాంగ్ పని కాదని మియాపూర్ పోలీసులు భావించారు. చోరీ జరిగిన రోజున పాఠశాలలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ (పీటీఎం) జరగడంతో పాటు సెలవు దినం కావడంతో పాఠశాల యాజమాన్యం, అక్కడి పరిస్థితుల గురించి అవగాహన ఉన్నవాళ్ల పనై ఉంటుందని భావించారు. కానీ, పోలీసుల డేటా బేస్ ఆధారంగా చెన్నై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సిమెంట్ ఫ్యాక్టరీ, ఓ ప్రైవేట్ ఆఫీసులోనూ చెడ్డీ గ్యాంగ్ ఇదే తరహా చోరీలు చేసినట్లు గుర్తించారు. తాజా కేసులో గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతానికి చెందిన చెడ్డీ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రే తర్వాతే చోరీలు.. సాధారణంగా ఈ ముఠాలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులుంటారు. ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి రైలు మార్గంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. స్టేషన్ లోపలి నుంచి బయటికి రావడం, ఆటో లేదా ఇతరత్రా ప్రజా రవాణాలను వీరు వినియోగించరు. సీసీ టీవీ కెమెరాలకు చిక్కకుండా రైలు పట్టాలను పట్టుకొని నడుచుకుంటూ బయటికి వెళ్లిపోతారు. రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్న ఇళ్లు, స్కూళ్లు, ఆఫీసులను రెక్కీ చేస్తారు. చోరీకి బయలుదేరే ముందు సమీప చెట్ల పొదలు, నిర్మానుష్య ప్రాంతాలలో ఒంటి మీద దుస్తులను విప్పేసి, కేవలం లోదుస్తులు మాత్రమే వేసుకుంటారు. ముఖం కనిపించకుండా క్లాత్‌ను చుట్టుకుంటారు. అర్ధరాత్రి 1–2 గంటల తర్వాతే దొంగతనాలు చేస్తుంటారు. ఆపైన నిర్మానుష్య ప్రాంతాలలో లేదా శివారు ప్రాంతాలలో తాత్కాలికంగా అద్దె ఇళ్లలో తలదాచుకుంటారు. పరిస్థితులు సద్దుమణిగాక తిరిగి రైలులో సొంతూళ్లకు పరారవుతారు. రెక్కీ, చోరీకి వేర్వేరు బృందాలు.. ముఠా నాయకుడు రెక్కీ, చోరీలను పక్కాగా ప్లాన్ చేస్తాడు. ముఠాలోని ప్రతీ సభ్యుడూ చురుగ్గా, తనకు కేటాయించిన విధులను పక్కాగా నిర్వర్తిస్తాడు. రెక్కీ చేసేందుకు ఇద్దరు, చోరీకి దిగేది ఇద్దరేసి సభ్యుల చొప్పున రెండు వేర్వేరు బృందాలుగా విడిపోతారు. రెక్కీ చేసిన బృందం ఆ సమాచారాన్ని ముఠాలోని ఇంకో గ్రూప్‌కు చేరవేసేందుకు టార్గెట్ చేసిన ఇల్లు లేదా ఆఫీసు, స్కూల్ గోడల మీద ఒక చోట అంకెలు, అక్షరాల రూపంలో రాతలు రాస్తారు. దీంతో ముఠాలోని చోరీ చేసే బృందం అర్ధరాత్రి చీకట్లో కూడా టార్గెట్ చేసిన ఇంటిని సులువుగా గుర్తిస్తారు. తాళాలను తెరిచేందుకు ఇనుప రాడ్లు, స్క్రూడ్రైవర్ వంటి పదునైన ఆయుధాలను వెంట తీసుకెళ్తారు. ఎవరైనా ఎదురు తిరిగితే వాటితో దాడి చేసేందుకూ వెనుకాడరు. -
మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
మియాపూర్: మియాపూర్ పరిధిలోని ఓ పాఠశాలలో రూ.7.85 లక్షల నగదును చెడ్డీ గ్యాంగ్ దొంగిలించుకుపోయింది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ న్యూ హాపీజ్ పేట వరల్డ్ వన్ స్కూల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కిటికిలోంచి పాఠశాలలోకి చొరబడి రిసెప్షన్లో లాకర్‌ను పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం పాఠశాల సిబ్బంది వచ్చి చూడగా లాకర్ పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి నల్లటి మాస్క్‌లను ధరించి, చెడ్డీలు వేసుకుని శనివారం అర్ధరాత్రి పాఠశాలలో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వామ్మో..! చెడ్డీ గ్యాంగ్..! జర జాగ్రత్త..!!
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగల ముఠా సంచారం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చెడ్డీ గ్యాంగ్‌ను తలపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు హెచ్చరించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలోని కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఉన్న జయశంకర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు అరవడం మొదలు పెట్టాయి. కొందరు కాలనీవాసులు బయటకు వచ్చి చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు. అనుమానంతో ఉదయాన్నే ఇండ్లలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా ఉదయం 3 నుంచి 3.30 ప్రాంతంలో కాలనీలోని శివాలయం, చుట్టూ పక్కల గల్లీలలో ఏడుగురు సభ్యులు గల ఓ దొంగల ముఠా సంచరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, రూరల్ పోలీసులు కాలనీవాసులతో మాట్లాడారు. పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని, ఆయా కాలనీల్లో గస్తీ దళాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాట్సప్ గ్రూపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా జయశంకర్ కాలనీకి సమీపంలోని ఓం శాంతి మందిర ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అదే సమయంలో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని దేవయ్య ఇటీవలే కుటుంబంతో కలిసి ముంబాయికి వెళ్లాడు. దొంగలు తాళం పగులగొట్టి ఇళ్లంతా చిందరవందర చేశారు. ఇంటిని పోలీసులు పరిశీలించారు. కుటుంబం ఇక్కడ లేకపోవడంతో ఎలాంటి వస్తువులు చోరీకి గురియ్యాయో తెలియరాలేదు. ఈ చోరీకి పాల్పడింది కూడా చెడ్డీ గ్యాంగే అని భావిస్తున్నారు. జయశంకర్‌కాలనీ ప్రాంతంలో సీసీ కెమెరాలు చాలా చోట్ల లేవు. ఉన్న కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ఏవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
TS Crime News: 'చెడ్డీ గ్యాంగ్' ప్రధాన నిందితుడి అరెస్ట్..!
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ ప్రధాన నిందితుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ డీసీపీ సందీప్ రావు గురువారం వివరాలు వెల్లడించారు. హఫీజ్‌పేట్‌లోని వసంత విల్లాస్‌లో 75వ విల్లాలో నివాసం ఉంటున్న రాంసింగ్ కుటుంబంతో సహా ఈ నెల 6న సంగారెడ్డికి వెళ్లాడు. 7న సాయంత్రం అతను తిరిగి వచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా చెడ్డీ గ్యాంగ్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గుజరాత్, ఆంబ్లీ ఖాజురియా గ్రామానికి చెందిన మినమ ముఖేష్ బాయ్‌ని ఆదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. విక్రం బాయ్ దరియా బాయ్ పార్మర్, మోహనియా నితిన్‌బాయ్, సుర్మల్ అలియాస్ సుమోతో కలిసి ఆగస్టు 5న లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేసుకున్న వారు రెండు రోజుల పాటు అమీన్పూర్, మియాపూర్ పీఎస్‌ల పరిధిలో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించారు. 6వ తేదీ రాత్రి అమీన్పూర్ పీఎస్ పరిధిలో మూడు ఇళ్లలో చోరీ చేశారు. ఆ తర్వాత 7న తెల్లవారుజామున వసంత విల్లాస్‌లో చోరీకి పాల్పడ్డారు. చోరీ సొత్తుతో గుజరాత్‌కు పారిపోయారు. గుజరాత్లో ఓ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న విక్రం బాయ్ దరియా బాయ్ పార్మర్ను దాహోడ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నితిన్ బాయ్, సుర్మల్ అలియాస్ సుమో పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల్లో చిక్కకుండా.. నిందితులు మొదట అమీన్పూర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు విప్పి అండర్ వేర్‌పై తాళ్లసాయంంతో మూడు ఇళ్లలో ప్రవేశించి తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకున్నారు. అనంతరం దుస్తులు ధరించి హఫీజ్‌పేట్‌లోని వసంత విల్లాస్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ కూడా దుస్తులు విప్పి విల్లా వెనక నుంచి లోపలికి ప్రవేశించి రాడ్లతో తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎవరైనా వీరిని అడ్డుకుంటే దాడి చేసేందుకు వెనకాడరని డీసీపీ తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ నంద్యాల నర్సింహా రెడ్డి, మియాపూర్ ఏసీపీ నర్సింహ్మ రావు, సీసీఎస్ ఏసీపీ శశాంక్ రెడ్డి, సీఐలు ప్రేమ్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా తియ్యడం అనేది మనిషి పుట్టుకతో సమానం: నాగ్ అశ్విన్
సినిమాలలో చిన్న, పెద్ద అనే తేడా ఉండదు. కంటెంట్ బాగుంటే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం అంటే మనిషి పుట్టుకతో సమానం. ఒక తల్లి గర్భం దాల్చి నవమాసాలు మోసి జన్మించే వరకు పడే తపనే సినిమా’అని దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు. అబుజా ఎంటర్టైన్మెంట్ , శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’. గాయత్రి పటేల్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘చెడ్డి గ్యాంగ్ తమాషా"టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా టీజర్ చూస్తుంటే యంగ్ టీం తో మేము తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా లాగే ఈ ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని అన్నారు. కొత్త టీంతో మేం తీసిన ఈ సినిమా కంటెంట్ నాలుగు గంటలు వస్తే దానిని 2 గంటల 40 నిమిషాలకు తగ్గించడానికి మేము చాలా గర్భ శోకను అనుభవించాం. మంచి కథతో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని నిర్మాత క్రాంతి కిరణ్ అన్నారు. ‘నటుడు అవ్వాలనే మా అమ్మ కోరికతో ఇండస్ట్రీ వచ్చాను. ఈ సినిమాతో నా 15 ఏళ్ల కల నెరవేరింది. అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా ‘చెడ్డి గ్యాంగ్ తమషా’ చిత్రం ఉంటుంది’అని హీరో, దర్శకుడు వెంకట్ కళ్యాణ్ అన్నారు. -
అమ్మో! చెడ్డీ గ్యాంగ్!! స్కెచ్ వేశారో..
చెడ్డీ గ్యాంగ్... జిల్లాలో ఇప్పుడు అందరినోటా భయం భయంగా వినిపిస్తున్న పదం. దొంగతనం చేయడంలో ఆరితేరిన ఈ ముఠా సభ్యుల నిర్వాకం.. ముందుగా చేసే రెక్కీ.. పని పూర్తి చేసే విధానం.. అంతా కొత్తదనమే! పక్కా వివరాలతో ఇంటికి స్కెచ్ వేస్తారు.. దోచేస్తారు. ఎవరైనా వీరి పనికి అడ్డొస్తే.. వాడికి అదే ఆఖరి రోజు. గుజరాత్ నుంచి బయలుదేరిన ఈ గిరిజన తెగ సభ్యులు కొన్ని రోజులుగా పోలీసులకు, జిల్లావాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాడేపల్లి రూరల్ (మంగళగిరి): చెడ్డీగ్యాంగ్ జిల్లాలో ప్రవేశించిందన్న విషయం ఈనెల మొదట్లో కుంచనపల్లి, తాడేపల్లిలో జరిగిన రెండు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అటు ప్రజలకు, ఇటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఏమాత్రం దయాదాక్షిణ్యం లేకుండా తమ పనిచేసుకుని వెళ్లే వీరి ఆగడాలు అంతా ఇంతా కాదు. ‘చెడ్డీ’ వేసి 34 ఏళ్లు! చెడ్డీగ్యాంగ్ పుట్టి 34 సంవత్సరాలు. 1987లో చెడ్డీగ్యాంగ్ దొంగతనాలు చేయడం ఆరంభించింది. ఇలాంటి గ్యాంగ్ ఒకటి ఉందని, వీరు దొంగతనాలు చేస్తారని అప్పటి ఉమ్మడి రాష్ట్ర పోలీసులు 1999లో గుర్తించారు. దాదాపు పుష్కరకాలం అనంతరం వీరు ఉన్నారని విషయం స్పష్టమైంది. మొదటి సారిగా హైదరాబాద్‌లో సీసీ కెమెరాల్లో ఈ చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు రికార్డు కావడంతో బయట ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి చెడ్డీగ్యాంగ్‌ను పట్టుకోవడం అనేది పోలీసులకు సవాలుగా మారింది. చెడ్డీగ్యాంగ్ పుట్టింది గుజరాత్‌లోని దావోద్ జిల్లాలోని గూద్‌బాలా తాలూకా ఓ గిరిజన గ్రామం.. చెడ్డీ గ్యాంగ్ స్టయిలే వేరు! ఈ చెడ్డీగ్యాంగ్ పెద్ద రాంజీ. తొలుత ఐదుగురు యువకులతో చెడ్డీగ్యాంగ్‌ను తయారు చేశారు. వారికి బాగా శిక్షణ ఇచ్చాడు. నాయకుడు రాంజీ వీరికి దొంగతనాలు చేయడానికి కొన్ని సూత్రాలను పాటించాలని కూడా చెప్పాడు. అలా మొదలైన ఆ ఒక్క గ్యాంగ్ పెరుగుతూ వచ్చింది. కొన్ని పదుల గ్యాంగ్స్ పుట్టుకొచ్చాయి. కానీ దొంగతనం చేయడంలో అందరిదీ ఒకటే స్టయిల్. ఈ ముఠాలు ముందుగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ముంబై తదితర ప్రాంతాల్లో దొంగతనాలు చేశారు. అక్కడి పోలీసులు వీరిపై కన్ను వేయడంతో మకాం మారుస్తూ వస్తున్నారు. దొంగతనం చేసేదిలా.. ఇక ఎంచుకున్న ప్రదేశానికి రాత్రి 12 గంటలలోపే చేరుకుంటారు. నిర్మానుష్య ప్రాంతంలో నక్కి దాడి చేయడానికి రెడీ అవుతారు. ఒక్కోసారి మిద్దెల మీద దర్జాగా కూర్చుని సమయం కోసం ఎదురు చూస్తారు. అంతా గాఢ నిద్రలోకి జారుకునే సమయమైన 3 గంటల ప్రాంతంలో వీరి అటాక్ మొదలవుతుంది. అటాక్ చేసే ముందు వీరు తమ డ్రస్కోడ్లోకి మారిపోతారు. శరీరం అంతా ఆయిల్ పూసు కుంటారు. ఒంటిమీద ఒక్క చెడ్డీ తప్ప ఏమీ ఉంచుకోరు. చెప్పులు కాలికి వేసుకోకుండా నడుముకి కట్టుకుంటారు. పదునైన కత్తులు, ఇనుప రాడ్స్ దగ్గర ఉంచుకుంటారు. నేరుగా తలుపులు, కిటికీలు, తాళాలు పగలకొట్టే వీరు ఇంట్లోకి ప్రవేశిస్తారు. సాధారణంగా వీరు మనుషుల మీద అటాక్ చేయరు. ఇంట్లో వారు నిశ్శబ్దంగా ఉంటే ఏమీ అనరు. ఒకవేళ ఎదురు తిరిగితే ఏ మాత్రం విచక్షణ చూపడానికి వెనుకాడరు. దొంగతనం చేసిన ఇంట్లోనే భోజనం చేయడం, అక్కడే మలమూత్ర విసర్జన చేయడం వీరి వృత్తిలో భాగం! ఐకమత్యమే వీరి మహాబలం! చెడ్డీగ్యాంగ్‌లోని ఒక్కో గ్రూప్‌లో 5 నుంచి 8 మంది సభ్యులుంటారు. తమకి కావాల్సినంత దోచుకుని ఆ డబ్బుని అందరూ సమానంగా పంచుకుని విడివిడిగా మాత్రమే తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. పొరపాటున వీరిలో ఏ ఒక్క రు దొరికినా మిగతా వారి ఆచూకీ ఏ మాత్రం వెల్లడించరు. వీరిలో ఐకమత్యం అంత బలంగా ఉంటుంది. వీరు దొంగతనం చేసిన తరువాత రైలు మార్గంలోనే ఎక్కువగా ప్రయాణిస్తారు. ఎందుకంటే వీరు రైలులో గుంపుల మధ్య తప్ప ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. చెడ్డీగ్యాంగ్ ఆంధ్రప్రదేశ్‌ను టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో వీరు పాతిక ఇళ్లల్లో దొంగతనాలు చేసినట్లు సమాచారం. ప్రత్యేక నిఘా రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ ప్రవేశించిందనగానే 13 జిల్లాల్లోని పోలీసులను అలర్ట్ చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. కృష్ణా, అనంతపురం జిల్లాల నుంచి చెడ్డీగ్యాంగ్ వివరాలు సేకరించేందుకు గుజరాత్‌కు మూడు టీంలు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కో స్టేషన్‌కు ఒక్కో సీఐ గుంటూరు జిల్లా తాడేపల్లి కుంచనపల్లిలో చెడ్డీగ్యాంగ్ దొంగతనాలకు ప్రయత్నించారని తెలియడంతో జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, రూరల్ ఎస్పి విశాల్ గున్నీలు ఒక్కో స్టేషన్‌కు ఒక్కో సీఐను కేటాయించి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో అన్వేషిస్తున్నారు. అర్బన్ పరిధిలో మొత్తం 30 టీంలు ఏర్పాటు చేయగా రూరల్ పరిధిలో పలు టీంలు ఏర్పాటు చేశారు. వీరు కాకుండా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సిబ్బంది అంతా రాత్రి సమయంలో తప్పని సరిగా విధులు నిర్వహించాలని ఆదేశించడంతో సివిల్ డ్రస్‌లో చెడ్డీగ్యాంగ్ కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. పక్కాగా దొంగతనం! వీరు ఏడాది పాటు దొంగతనాలు చేయరు. వారి అవసరాలకి తగ్గట్లు సీజనల్‌గా కొన్ని రోజులు మాత్రమే దొంగతనాలు చేస్తారు. దొంగతనం చేయాలని నిర్ణయించుకున్న నగరానికి చెడ్డీ గ్యాంగ్ నెలరోజుల ముందే చేరుకుంటుంది. వీరిలో కొంత మంది కూలీలుగా పనికి కుదురుతారు. మరికొంత మంది పగటి వేళల్లో కుర్తా, పైజామా ధరించి భిక్షాటన చేస్తూ, బెలూన్స్, పక్క పిన్నీసులు అమ్ముతూ మారువేషాల్లో ఇళ్లపై రెక్కీ నిర్వహిస్తారు. ఈ రెక్కీ తరువాత రెండు రోజులు సిటీకి దూరంగా ఉండేలా చూసుకుంటారు. ఈ రెండు రోజుల్లో ఆ ఇంట్లో వాళ్లు ఎన్ని గంటలకు నిద్రపోతున్నారు? ఆ ఇంట్లో ఎంతమంది నివశి స్తున్నారు? ఆ ఇంట్లో కాపలాకి కుక్క ఉందా? లేదా? ఇంటి ముందు ఆరేసిన ఖరీదైన బట్టలు, పార్కింగ్ చేసిన బైకులు, కార్లను బట్టి ఆ ఇంట్లో ఎంత వరకు డబ్బు దొరకవచ్చు అన్న విషయాలను పసిగడతారు. నిఘా పటిష్టం చేశాం అర్బన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్‌పై కదలికలపై పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. ఇప్పటికే కొంత మందిని అదుపులోకి తీసుకున్నాం. ప్రతిచోటా పోలీసు పికెట్ ఏర్పాటు చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. చెడ్డీగ్యాంగ్‌పై త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తాం. – ఆరీఫ్ హఫీజ్, అర్బన్ ఎస్పీ చదవండి: కేవలం వారాల వ్యవధిలోనే శర వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి: సీడీసీ హెచ్చరిక -
చెడ్డీ గ్యాంగ్ చిక్కింది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వరుస దొంగతనాలతో సంచలనం రేపిన చెడ్డీ గ్యాంగ్ సభ్యుల ఆగడాలకు విజయవాడ పోలీసులు అడ్డుకట్ట వేశారు. గుజరాత్లో రెండు చెడ్డీ గ్యాంగ్‌లకు సంబంధించి, నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్‌లో మిగిలిన సభ్యుల కోసం అక్కడి స్థానిక పోలీసుల సహకారంతో ప్రత్యేక బృందాలు వేట సాగిస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ గ్యాంగ్ చోరీ చేసిన సమయంలో సీసీ ఫుటేజీలో వీరి చిత్రాలు స్పష్టంగా కనిపించాయి. ఈ చిత్రాలను మధ్యప్రదేశ్, గుజరాత్ పోలీసులకు ఇక్కడి పోలీసులు పంపగా.. గుజరాత్ నేర విభాగానికి చెందిన పోలీసులు ఈ చిత్రాలను ధ్రువీకరించి, వారి రాష్ట్రంలో దాహోద్ ప్రాంతంలోని చెడ్డీ గ్యాంగ్‌గా నిర్ధారించారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ టీకే రాణా, దాహోద్ ప్రాంత ఎస్పీతో మాట్లాడారు. వారి ఆట కట్టించేందుకు విజయవాడ నుంచి పోలీసు బృందాన్ని గుజరాత్‌కు పంపగా, ఆ బృందం శనివారం సాయంత్రానికి అక్కడికి చేరుకొంది. రెండు గ్యాంగ్‌లలో ఇద్దరు సభ్యులను పట్టుకుంది. మిగిలిన సభ్యులను పట్టుకొని, చోరీకి గురైన సొత్తును రికవరీ చేసేందుకు వీలుగా.. మరొక పోలీస్ బృందాన్ని గుజరాత్‌కు పంపగా, ఆ బృందం మంగళవారం రాత్రికి అక్కడికి చేరింది. రెండు గ్యాంగ్‌లు.. విజయవాడలోని చిట్టినగర్, పోరంకి, ఇబ్రహీం పట్నంలోని గుంటుపల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లి, కుంచనపల్లి ప్రాంతాల్లో జరిగిన ఐదు దొంగతనాల్లో సీసీ ఫుటేజీ, వేలిముద్రలు, ఇతర సాంకేతికత ఆధారంగా రెండు గ్యాంగ్‌లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో గ్యాంగ్‌లో ఐదుగురు సభ్యులు ఉన్నట్లు నిర్ధారించారు. వీరి కదలికలపై నిఘాను పెట్టారు. సీపీ టీకే రాణా స్వయంగా ఘటన జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. గుణదల, మధురానగర్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. శివారు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా తమ ప్రాంతాల్లో తిరిగితే 100 కాల్ సెంటర్‌కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని విస్తృత ప్రచారం చేశారు. శివారు ప్రాంతాల్లో ఉండే అపార్ట్మెంట్లు, గ్రూపు హౌస్‌ల్లో ఉండే వాచ్మెన్లకు, సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసి, రాత్రి వేళ్లలో జాగరూకతతో ఉండాలని హెచ్చరించారు. అంతేకాక కమిషనరేట్ పరిధిలో 10 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. పగలు, రాత్రి శివారు ప్రాంతాల్లో 10 పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీని ముమ్మరం చేశారు. డీసీపీలు హర్షవర్థన్‌రాజు, బాబూరావు, క్రైం బ్రాంచ్ ఏడీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు నిరంతరం పర్యవేక్షించారు. వరుస దొంగతనాలతో బెంబేలు.. నవంబరు 30వ తేదీ నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ ఐదు ప్రాంతాల్లో దొంగతనాలకు యతి్నంచడంతో, శివారు ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందారు. ఈ పరిణామాలు ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన సీపీ కాంతిరాణాకు పెను సవాల్‌గా మారాయి. దీంతో ఆయన ఈ ఘటనలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, చెడ్డీ గ్యాంగ్ సభ్యులను పట్టుకోవడం ప్రత్యేక ఫోకస్ పెట్టారు. -
చెడ్డీ గ్యాంగ్ కేసులో పురోగతి!
విజయవాడ: వరుసగా దోపిడీలకు పాల్పడుతూ ప్రజల్ని హడలెత్తిస్తున్న చెడ్డీ గ్యాంగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. గుజరాత్లో ఇద్దరు చెడ్డీ గ్యాంగ్ సభ్యులను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విజయవాడలో జరిగిన చోరీలతో ఆ ఇద్దరికి సంబంధం ఉందా అనే కోణంలో విచారణ సాగుతున్న తెలుస్తోంది. తమ అదుపులో ఉన్న వారిని విచారించి మిగిలిన ముఠాను పట్టుకునే పనిలో విజయవాడ పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా చెడ్డీ గ్యాంగ్ నేరాలు చేసే విధానం విలక్షణంగా ఉంటుంది. గతంలో జరిగిన నేరాలు దర్యాప్తు చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ మూలాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రవేశించిన ఈ గ్యాంగ్ గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లా నుంచి వచ్చినట్టుగా విజయవాడలో జరిగిన ఘటనల ఆధారంగా ధ్రువీకరించుకున్నారు. వీరు నేరాలకు నగరానికి దూరంగా ఉన్న ఇళ్లనే ఎంపిక చేస్తారు. ముఖ్యంగా రైల్వేట్రాకుల వెంబడి ఉన్న ఇళ్లు, జాతీయ రహదారికి దగ్గరగా ఒంటరిగా ఉన్న బంగ్లాలు, భవనాలు, అపార్టుమెంట్లు వీరు తమ దొంగతనాలకు అనుకూలంగా భావిస్తారు. నిమిషాల వ్యవధిలోనే నేరం చేసి అక్కడ నుంచి సులువుగా బయటకు వచ్చి రైల్వే ట్రాకు వద్దకు చేరుకుని వేగంగా వెళుతున్న రైలును కూడా వీరు సులువుగా ఎక్కి పరారౌతారు. జాతీయ రహదారికి సమీపంలోని ఇళ్లలో నేరాలు చేసి క్షణాల్లో జాతీయ రహదారిపైకి చేరుకుని లారీలపై పరారౌతుంటారు. -
చెడ్డీ గ్యాంగ్ ... యమడేంజర్
కంబాలచెరువు(రాజమహేంద్రవరం)\తూర్పుగోదావరి: చెడ్డీ గ్యాంగ్ ...ఈ పేరు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే అయినా ఆ మాట వింటేనే ఏదో తెలియని వణుకు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ గ్యాంగులు నేరాలకు పాల్పడని జిల్లాలు లేవంటే అతిశయోక్తి కాదు. కొంతకాలంగా ఈ గ్యాంగ్ కదలికలు కనిపించకపోయినా ఇటీవల కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూడటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసు అధికారులు అన్ని జిల్లాల్లోనూ జల్లెడ పడుతూ. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ జిల్లాలో ఇప్పటికే ప్రవేశించిందా అన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి గస్తీ పెంచారు. నేరాలకు ఎంచుకునే ప్రాంతాలు ఇవే.. చెడ్డీ గ్యాంగ్ నేరాలు చేసే విధానం విలక్షణంగా ఉంటుంది. గతంలో జరిగిన నేరాలు దర్యాప్తు చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్ మూలాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రవేశించిన ఈ గ్యాంగ్ గుజరాత్ రాష్ట్రంలోని దాహోద్ జిల్లా నుంచి వచ్చినట్టుగా విజయవాడలో జరిగిన ఘటనల ఆధారంగా ధ్రువీకరించుకున్నారు. వీరు నేరాలకు నగరానికి దూరంగా ఉన్న ఇళ్లనే ఎంపిక చేస్తారు. ముఖ్యంగా రైల్వేట్రాకుల వెంబడి ఉన్న ఇళ్లు, జాతీయ రహదారికి దగ్గరగా ఒంటరిగా ఉన్న బంగ్లాలు, భవనాలు, అపార్టుమెంట్లు వీరు తమ దొంగతనాలకు అనుకూలంగా భావిస్తారు. నిమిషాల వ్యవధిలోనే నేరం చేసి అక్కడ నుంచి సులువుగా బయటకు వచ్చి రైల్వే ట్రాకు వద్దకు చేరుకుని వేగంగా వెళుతున్న రైలును కూడా వీరు సులువుగా ఎక్కి పరారౌతారు. జాతీయ రహదారికి సమీపంలోని ఇళ్లలో నేరాలు చేసి క్షణాల్లో జాతీయ రహదారిపైకి చేరుకుని లారీలపై పరారౌతుంటారు. మూకుమ్మడిగా దాడి.. సుమారు 5 నుంచి 8 మంది సభ్యులుగా ఉండే ఈ గ్యాంగ్ నేరం చేసే ఇళ్లను ముందే ఎంపిక చేసి రెక్కీ నిర్వహించుకుంటారు. అలా ఎంపిక చేసిన ఇళ్ల సమీపంలో చెట్ల వద్ద, పొదల్లో బలమైన కర్రలు ముందే సిద్ధం చేసుకుంటారు. దొంగతనానికి పాల్పడేందుకు వెళ్లే సమయంలో కత్తులు, చాకులు తమ వద్ద ఉంచుకుంటారు. రాత్రి 2 గంటల నుంచి 3 గంటల లోపు సమయాన్ని వీరు నేరాలకు అనువైనదిగా ఎంచుకుంటారు. ఎక్కువ సెక్యూరిటీ ఉండే గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లను సైతం వీరు తమ లక్ష్యంగా ఎంచుకుంటున్నారంటే వీరిలో ఉన్న తెగింపే కారణం. అలాంటి సముదాయాల్లో ఇళ్ల ప్రహరీలు దూకి లోపలికి ప్రవేశించి తమ వద్ద ఉన్న పరికరాలతో తలుపులు పెకళించి ఇళ్లలో దూరుతారు. ఆ ఇళ్లలో కుటుంబ సభ్యులు ఉన్నా వారిని బెదిరించి దాడి చేసి దొంగతనానికి పాల్పడతారు. నిమషాల వ్యవధిలోనే విలువైన వస్తువులు చేజిక్కించుకుని అక్కడ నుంచి పరారౌతారు. ఆ పరంపరలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. నగర శివారుల్లో ఉండే ఇళ్లలో నేరం చేసే సమయంలో తలుపులు పగులగొట్టడానికి వెనకాడరు. పెద్దపెద్ద బండరాళ్లతో తలుపులను, అద్దాలను పగులగొడతారు. తలుపు తీయకపోతే చంపుతామని బెదిరిస్తారు. వీరి హడావిడికి భయానికి లోనైన కుటుంబ సభ్యులు తలుపులు తీస్తే ప్రాణాలు దక్కించుకోవచ్చనే ఆశతో తలుపులు తీసిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ తలుపులు తీయని పక్షంలో పగులగొట్టి లోనికి ప్రవేశించే ఈ గ్యాంగ్ ముందుగా కుటుంబ సభ్యులపై దాడి చేస్తారు. వారి ఒంటిపై ఉన్న విలువైన వస్తువులు తీసుకుంటారు. వీరు బయట తలుపులు పగులగొడుతున్న సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పినా ఈ నేరస్తులు 15 నిముషాల్లోనే తమ పని చక్కబెట్టుకుని పోతుండటంతో పోలీసులు అక్కడకి చేరుకున్నా వివరాలు నమోదు చేసుకోవడం, దర్యాప్తు చేయడం తప్ప నేరాన్ని నిరోధించే అవకాశం దక్కడం లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చెడ్డీగ్యాంగ్ కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పగటి సమయంలో ఇళ్ల సమీపంలో అనుమానిత వ్యక్తులు కదలికలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. రాత్రి సమయంలో అలికిడి అయినా, ఇంటి ఆవరణలో కుళాయిలు విప్పినట్టు గాని శబ్దం వస్తే వెంటనే తలుపులు తెరిచి చూడరాదు. చుట్టుపక్కల ఇళ్ల వారికి ఫోన్ చేసి అప్రమత్తం చేసి పోలీసులకు సమాచారం అందిస్తే గస్తీ పోలీసులు అక్కడకు చేరుకుని నేరాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. నేరస్తులు మన ఇంటి ఆవరణలోకి ప్రవేశించినట్టు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు గట్టిగా కేకలు వేయడం, చుట్టుపక్కల నివాసితులు కూడా కేకలు వేయడం చేస్తే ఈ గ్యాంగ్ నేరానికి తెగబడేందుకు వెనకాడతారు. గస్తీ పెంచాం రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ కదలికలు నేపథ్యంలో జిల్లాలో అప్రమత్తం అయ్యాం. జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సహకారంతో అన్ని రైల్వేస్టేషన్లలో నిఘా పెంచాం. ఫింగర్ ప్రింట్ యంత్రాలతో అనుమానితులను తనిఖీ చేస్తున్నాం. రాత్రి గస్తీ బీటు సిబ్బందిని పెంచాం. నియంత్రణ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి. అనుమానం వస్తే 100కి ఫోన్ చేసి స్పష్టమైన చిరునామా చెబితే నిముషాల వ్యవధిలోనే సమీప గస్తీ పోలీసులు అక్కడకు చేరుకునే అవకాశం ఉంటుంది. శివారు ప్రాంతాల్లో ప్రజలు అనుమానితుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. –ఐశ్వర్య రస్తోగి, రాజమహేద్రవరం, అర్బన్ జిల్లా ఎస్పీ -
ఒంటిమీద దుస్తులు లేకుండా దోపిడీకి యత్నం
తాడేపల్లి రూరల్(మంగళగిరి): చెడ్డీ గ్యాంగ్ తాడేపల్లి ప్రాంతంలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో దోపిడీకి విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఐదుగురు సభ్యుల గ్యాంగ్ కుంచనపల్లిలో అదే రకంగా ప్రయత్నించి విఫలమైనట్లు ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసులకు చెడ్డీగ్యాంగ్ వచ్చినట్లు చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. చెడ్డీగ్యాంగ్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు ఒంటిమీద దుస్తులు లేకుండా ఒక్క చెడ్డీ మాత్రమే ధరించి, తలపాగాలు చుట్టి రెండు ఇళ్ల మధ్యలో ఉన్న సందులో వెళ్తున్నట్లు దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు తాడేపల్లి, మంగళగిరి, కాజా, పెదకాకాని, గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేసి రాత్రి పూట గస్తీలను పెంచారు. దీంతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో నైపుణ్యం పొందిన పోలీసులను మఫ్టీలో వివిధ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేశారు. తాడేపల్లి ప్రాంతంలో కనిపించిన ఐదుగురు సభ్యులున్న చెడ్డీగ్యాంగ్ గుంటుపల్లిలో ఉన్న చెడ్డీగ్యాంగ్ పోలికలు ఒకే విధంగా ఉండడంతో బెజవాడ పోలీసులు, గుంటూరు పోలీసులు సంయుక్తంగా ఆ గ్యాంగ్ ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న విశ్వసనీయ సమాచారం. పోలీసులను చెడ్డీగ్యాంగ్ మీద వివరణ అడుగగా ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా రాత్రి సమయంలో అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. -
Chittoor: మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్
తిరుపతి: టెంపుల్ సిటీ తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ అలజడి రేపింది. నిన్న (సోమవారం) అర్ధరాత్రి విద్యానగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర ప్రణీతారెడ్డి అపార్ట్మెంట్లో ఈ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు. నిన్న అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ముఠా.. సెక్యురిటీ ఇంటికి బిగాలు ఏర్పాటు చేసి మొదటి ఫ్లోర్లో ఉంటున్న విజయలక్ష్మీ ఇంట్లో ప్రవేశించారు. ఆ తర్వాత , వీరు బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. మూడెళ్ల తర్వాత మరోసారి చెడ్డిగ్యాంగ్ అలజడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. అపార్ట్మెంట్లో ఉండే వారంతా.. తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ముఠాకు సంబంధించి తిరుపతి ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలన్నింటిని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఈ గ్యాంగ్‌కు ఇతర నేరస్థులతో ఉన్న సంబంధాలపై కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: Telugu Academy: రూ.64 కోట్లు మాయం.. వారి ఖాతాలో చిల్లిగవ్వ లేదు -
రాజమండ్రిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
-
చెట్ల పొదల్లో దాక్కుని దోచేస్తారు
సాక్షి, సిటీబ్యూరో: చెట్ల పొదల్లో దాక్కుంటారు, చీకటి కాగానే ప్యాంట్, షర్ట్ విప్పి తమ భుజానికి ఉన్న కిట్‌బ్యాగ్‌లో పెట్టుకుంటారు. అప్పటికే రెక్కీ నిర్వహించిన ఇళ్లలోకి చొరబడి మనుషులు ఉంటే బెదిరించి మరీ బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళతారు. ఇలా చెడ్డీగ్యాంగ్ వేషధారణకు దగ్గరి పోలికలు ఉన్న ఈ నేరగాళ్లు దుర్గామాతను పూజిస్తారు. రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి చోరీలకు పాల్పడిన ఏడుగురు సభ్యులతో కూడిన ‘గుమాన్’ గ్యాంగ్‌ను రాచకొండ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రాచకొండ కమిషనరేట్‌లో ఏడు, నిజామాబాద్‌లో ఒక చోరీకి పాల్పడిన ఈ ముఠా కొత్తది కావడం, చెడ్డీ గ్యాంగ్ తరహాలో వారి వేషధారణ ఉండటంతో దర్యాప్తు దారి మళ్లింది. అయితే చివరకు సాంకేతిక ఆధారాలతో వివిధ రాష్ట్రాల్లో సంచరిస్తున్న ఈ ముఠాను రాచకొండ పోలీసులు రెండు నెలల్లో పట్టుకున్నారు. వీరి నుంచి రూ.6.55లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నేరేడ్మెట్లోని ఓ రెస్టారెంట్లో సోమవారం రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. బ్లాంకెట్లు...బొమ్మలు అమ్ముతూ... కుటుంబసభ్యులు, బంధుమిత్రులైన చౌహన్ తారా సింగ్, ఎండీ సోనూ, బిట్టూ, గుఫ్టాన్, సైఫ్ ఆలీ, సాదిక్, ఎండీ సాజీద్కి చెందిన పూర్వీకులు కొన్ని దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ నుంచి వెస్ట్‌బెంగాల్‌కు వలసవచ్చారు. అప్పటి నుంచి వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ నగర శివారుల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో గూడారాలు వేసుకొని నివాసంఉంటూ రహదారులపై బ్లాంకెట్లు, బొమ్మలు విక్రయిస్తూ జీవనం సాగించేవారు. రెండేళ్లుగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో నివాసం ఉన్న వీరు ప్రస్తుతం మహరాష్ట్రలోని అకోలా పట్టణంలో తలదాచుకుంటున్నారు. పగలు రెక్కీ..రాత్రి దోపిడీ... 15 మంది సభ్యుల ముఠా గత మూడేళ్లుగా ‘గుమాన్ గ్యాంగ్’గా ఏర్పడి చోరీలకు పాల్పడుతోంది. ముందుగానే ఎంచుకున్న నగరాలకు రైళ్లలో చేరుకుంటారు. ముఖ్యంగా కొంత అటవీ ప్రాంతం కలిగిన శివార్లను ఎంపిక చేసుకుని గుడారాలు వేసుకుంటారు. పగలు సమీపంలోని కాలనీల్లో తిరిగి రెక్కి నిర్వహిస్తారు. రాత్రి వేళ్లల్లో ఆయా ఇళ్లకు సమీపంలోని చెట్లపొదల్లో దాక్కుని అర్ధరాత్రి తర్వాత ఇళ్ల తాళాలను పగులగొట్టి అందినంత దోచుకెళతారు.గత జనవరిలో తొలిసారిగా హైదరాబాద్ కు వచ్చిన ఈ ముఠా నాంపల్లి రైల్వే స్టేషన్లో మూడు రోజుల పాటు మకాం వేసి ఉప్పల్, చైతన్యపురి, ఎల్బీనగర్, పద్మారావునగర్, చందానగర్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించింది. చైతన్యపురిలోని ఓ ఇంట్లో చోరీకి యత్నించగా వాచ్‌మన్ అప్రమత్తం కావడంతో అతడిపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. మళ్లీ కొన్నిరోజుల అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన ఈ ముఠా చైతన్యపురి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడింది. గత అక్టోబర్‌లో హయత్‌నగర్‌లో మకాం వేసిన వీరు కుంట్లూరు ప్రాంతంలో రెండు ఇళ్లల్లో చోరీలకు పాల్పడింది. అనంతరం విజయవాడవెళ్లి దుర్గమ్మను దర్శించుకున్నా రు. అక్కడ చోరీ సొత్తును విక్రయించాలని భావించినా పట్టుబడతామనే భయంతో వెనకడుగు వేశారు. అనం తరం హైదరాబాద్ వచ్చి అకోలాకు తిరిగి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రైలులో నిజామాబాద్ వచ్చిన వీరు ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గత నవంబర్ 20న విజయవాడ జాతీయ రహదారిపై హోటళ్లలో తలదాచుకున్న ఈ ముఠా కనకదుర్గ కాలనీలోని రెండు ఇళ్లల్లో చోరీ చేసింది. ఇదే తరహాలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఆరు చోరీలకు పాల్పడినట్లు విచారణలోవెల్లడైంది. ఇక్కడ చోరీ సొత్తు విక్రయిస్తే బయటపడతామనే భయంతో ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో విక్రయించినట్లు తెలిపారు. చిక్కిందిలా.. తొలుత చెడ్డీ గ్యాంగ్‌గా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయితే కేసులు కొలిక్కి రాకపోవడంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చోరీ సమయంలో నిందితుల కదలికలను పరిశీలించడమేగాక బాధితులు చెప్పిన వివరాల ఆధారంగా మళ్లీ కేసును దర్యాప్తు చేశారు. రాచకొండ సీపీ ఆదేశాలతో ఎల్బీనగర్ ఎస్ఓటీ, ఎల్బీనగర్ సీసీఎస్, హయత్‌నగర్ పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి రెండు నెలల పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టారు. నిందితులు అకోలాలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లిన పోలీసులు వారు దొరక్కపోవడంతో వెనక్కి తిరిగి వచ్చారు. మరో సారి వారు హయత్‌నగర్ ఠాణా పరిధిలో చోరీ చేసేందుకు నగరానికి వచ్చినట్లు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి చెట్ల పొదల్లో దాక్కున్న వారిని చుట్టుముట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే చోరీ చేసిన సొత్తుతో పరారయ్యేందుకు సిద్ధంగా ఉన్న ముఠా సభ్యుడు సాజీద్‌ను ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో అరెస్టు చేశారు. -
హయాత్‌నగర్‌లో గుమన్గ్యాంగ్ ఆటకట్టు
-
చెడ్డీ గ్యాంగ్ చిక్కింది..
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. చెడ్డీ గ్యాంగ్‌లోని ఏడుగురిని రాచకొండ, ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ గ్యాంగ్ పగటిపూట బొమ్మలు అమ్ముకుంటూ రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో దోపిడీలకు పాల్పడుతోంది. ఈ ముఠాపై హిమాచల్ ప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఈ ఏడుగురు ముఠా సభ్యుల నుంచి 150 గ్రాముల బంగారం, రూ.3వేలు నగదు,నాలుగు వందల గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర అకోలాలో నివాసం ఉంటున్న వీరిని టెక్నికల్ ఆధారాలతో రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగర వాసులకు, పోలీసులకు నిద్ర లేకుండా చేసిన చెడ్డీ గ్యాంగ్ చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
హయత్‌నగర్‌లో చెడ్డీగ్యాంగ్ ఆటకట్టు
-
చెడ్డీగ్యాంగ్ హల్చల్
నిజామాబాద్‌అర్బన్: నగరంలో చెడ్డీ గ్యాంగ్ మరోమారు హల్చల్ చేసింది. ముబారక్‌నగర్ శివారు ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి చోరీకి యత్నిం చింది. ఈ ముఠా సుమారు దాదాపు గంట పాటు ఓ ఇంట్లో కలకలం రేపింది. మామ, అల్లుడు అడ్డుకునేందుకు యత్నించగా దాడికి తెగబడింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మాక్లర్ మండలం సింగంపల్లి తండాకు చెందిన తోలియ.. నగరంలోని ఆదర్శనగర్‌లో గల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన నెల రోజుల క్రితమే ముబారక్‌నగర్ ప్రాంతంలోని పెద్దమ్మ ఆలయ సమీపంలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. చుట్టుపక్కల పెద్దగా ఇళ్లు లేవు. తోలియా, అతని భార్య సవిత, ఇద్దరు పిల్లలతో పాటు అత్తమ్మ చంద్రకళ, మామ గోపి సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు. అయితే, అర్ధరాత్రి 2 గంటల సమయంలో నలుగురు సభ్యులు గల చెడ్డీ గ్యాంగ్ తోలియా ఇంటికి చేరుకుంది. చెడ్డీలు, బనియన్లు వేసుకుని వచ్చిన దుండగులు తలుపులు కొడుతూ తెరవాలని అరుస్తూ హల్చల్ చేసింది. ఈ అలజడితో మెలకువ వచ్చిన తోలియా, అతని మామ గోపి హాల్లోకి వచ్చి చూసే సరికి దొంగలు బయట తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మామ, అల్లుడు కలిసి తలుపులు తెరుచుకోకుండా అడ్డుగా నిలబడ్డారు. దీంతో దొంగలు పెద్ద బండరాయితో తలుపును బద్దలు కొట్టి, కిటికీలను ధ్వంసం చేశారు. కర్రలతో కిటికీల నుంచి మామ అల్లుళ్లపై దాడికి పాల్పడ్డారు. అయినా కూడా వారిద్దరు ధైర్యంగా డోర్‌కు అడ్డంగా నిలబడ్డారు. దాదాపు 45 నిమిషాల పాటు చోరుల ప్రయత్నాన్ని వారు నిలువరించారు. ఇదే క్రమంలో తోలియా ‘100’కు ఫోన్ చేయడంతో రూరల్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పోలీసులు వస్తున్నట్లు గుర్తించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. వెళ్తూ వెళ్తూ పగిలిన అద్దం ముక్కలు విసరడంతో గోపిని నుదిటిపై గాయమైంది. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గాయపడిన గోపి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మామ, అల్లుడు అడ్డుకోక పోతే ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగేదని కుటుంబ సభ్యులు వాపోయారు. గతంలోనూ కలకలం.. చెడ్డీ గ్యాంగ్ గతంలోనూ జిల్లాలో పలుమార్లు పంజా విసిరింది. వినాయక్‌నగర్‌లో అర్ధరాత్రి ఓ అపార్టమెంట్లోకి ప్రవేశించి, చోరీకి యత్నించారు. వినాయక్‌నగర్‌లోనే మరో ప్రాంతంలో దొంగతనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రయత్నంలో ఓ కానిస్టేబుల్ చేతి వేలు తెగి పోయింది. అలాగే కామారెడ్డిలో చోరీకి పాల్పడి పారిపోతూ, జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్లోనూ దొంగతనానికి యత్నించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో చెడ్డీగ్యాంగ్ సభ్యులు పరారయ్యారు. ఏటా చెడ్డీగ్యాంగ్ జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతోంది. పెట్రోలింగ్ కరువు.. జిల్లా కేంద్రానికి మహారాష్ట్ర సరిహద్దు దగ్గరగా ఉండడంతో, ఆ ప్రాంతానికి చెందిన దొంగల ముఠాలు తరచూ జిల్లాలో పంజా విసురుతున్నాయి. షెట్టర్ గ్యాంగ్, చెడ్డీ గ్యాంగ్ తదితర ముఠాలు మధ్యాహ్నం వేళ రెక్కీ నిర్వహించి రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్నాయి. నరగంలో వరుస చోరీలు జరుగుతున్నా పోలీసుల్లో పెద్దగా స్పందన కరువైంది. దొంగతనాల నివారణపై ప్రత్యేక కార్యాచరణ కొరవడింది. అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేయడం లేదు. పోలీసులు ఎన్నికల హడావుడిలో, బందోబస్తు విధుల్లో ఉండడం, పెట్రోలింగ్ తగ్గడంతో దొంగలు తప పని కానిచ్చేస్తున్నారు. -
ముబారక్ నగర్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
-
ప్రతి ఐదు సీన్లకు సస్పెన్స్
శ్రీనివాసరెడ్డి, సెంథిల్ కుమార్, బాబు రాజన్, దేవన్, సరోజిత్, స్నేహాకపూర్ ముఖ్య తారలుగా రమేష్ చౌదరి దర్శకత్వంలో విక్కీరాజ్ నిర్మించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. ఈ నెల 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ మాట్లాడుతూ– ‘‘శరత్, మోహన్‌గాంధీ, కె. వాసు, తాతినేని లక్ష్మీవరప్రసాద్ వంటి దర్శకుల దగ్గర పనిచేశాను. నా పిల్లల చదువుకోసం టైమ్ స్పెండ్ చేయడం వల్ల నేను దర్శకునిగా పరిచయం అవ్వడం ఆలస్యం అయ్యింది. విక్కీరాజ్గారు చాలా బిజీగా ఉంటారు. ఓ ప్రయాణంలో ఆయన పరిచయం అయ్యారు. ఈ సినిమా కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. షూటింగ్ స్టార్ట్ చేశాం. పదిమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు సంబంధించిన కథ ఇది. వారు విహారయాత్రం కోసం అడవుల్లోకి వెళ్లినప్పుడు ఏం జరిగింది? అనే అంశం చుట్టూ సినిమా ఉంటుంది. ప్రతి ఐదు సీన్లకు ఓ సస్పెన్స్ ఉంటుంది. ఇందులోని మర్డర్ మిస్టరీ ప్రేక్షకులకు ఆసక్తికరంగా ఉంటుంది. యువతకు తగ్గట్లు ఉంటుంది. మలేసియాలో చిత్రీకరించిన క్లైమాక్స్, హైదరాబాద్‌లో షూట్ చేసిన ఓ పబ్‌సాంగ్ హైలైట్‌గా ఉంటాయి. టీమ్ అందరూ బాగా నటించారు. విక్కీరాజ్గారితోనే నా నెక్ట్స్ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘కథ విన్నప్పుడు ఎగై్జటింగ్‌గా అనిపించింది. కాస్త డబ్బులు రాగానే లైఫ్‌స్టైల్‌ని మార్చుకుని హైఫై లైఫ్‌ని లీడ్ చేయడానికి ఇష్టపడతారు కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వారికి చెందిన కథే ఇది. సోషల్ మెసేజ్ కూడా ఉంది’’ అన్నారు విక్కీరాజ్. -
తెలుగు వారికి ప్రాధాన్యం ఇవ్వండి
‘‘తెలుగు సినిమాలో తమిళ నటీనటులు ఉండొచ్చా? లేదా? అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ, ఉంటే అనువాద చిత్రం అనే భావన వస్తుంది. మన తెలుగు వాళ్లను మనం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. హీరోయిన్స్ ఎలాగూ తప్పదు.. చిన్న చిన్న నటీనటులను కూడానా? మన వారికి ప్రాధాన్యం ఇవ్వండి. వాళ్లు కుదరకపోతేనే ఇతర భాషల వారిని తీసుకురండి’’ అని నటుడు, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలో అమర్, ప్రదీప్వర్మ, ఉదయ్, అభి, సి.టి., ఖాదర్, లక్ష్మి, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. కనగాల రమేష్ చౌదరి దర్శకత్వం వహించారు. రాజ్ ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ పతాకంపై విక్కీరాజ్ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమేష్ చౌదరి మాట్లాడుతూ– ‘‘30ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో– డైరెక్టర్‌గా పని చేస్తున్న నేను ‘చెడ్డీ గ్యాంగ్’ సినిమాతో దర్శకుడిగా మారాను. పదిమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కేరళ అడవులకు టూర్‌కు వెళతారు. అక్కడి కోయవారి నిబంధనలను అతిక్రమించి ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ తర్వాత వాళ్లు ఎలా బయటపడ్డారనేదే ఈ చిత్ర కథాంశం’’ అన్నారు. ‘‘మలేషియాలో తెరకెక్కించిన క్లైమాక్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన ఐటమ్ సాంగ్ యువతను ఆకట్టుకుంటుంది’’ అని విక్కీరాజ్ అన్నారు. సెన్సార్ సభ్యులు ఎంఎస్ రెడ్డి, పాటల రచయిత లక్ష్మణ్, పద్మాలయ మల్లయ్య పాల్గొన్నారు. -
‘చెడ్డీ గ్యాంగ్’ టీజర్ విడుదల
కనగాల రమేష్ చౌదరి దర్శకత్వంలో రాజ్ ప్రొడక్షన్స్ ఇంటర్నేషనల్ పతాకంపై విక్కీరాజ్ నిర్మిస్తున్న చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. శ్రీనివాసరెడ్డి ముఖ్యపాత్రలో నటించగా అమర్, ప్రదీప్వర్మ, ఉదయ్, అభి, సి.టి., ఖాదర్, లక్ష్మి, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్ ఇతర పాత్రలు పోషించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శివాజీరాజా మాట్లాడుతూ ‘టైటిల్ చాలా బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలి. తెలుగు సినిమాలో తమిళ నటీనటులు ఉండొచ్చా, లేదా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతం. కానీ ఉంటే అనువాద చిత్రం అనే భావన వచ్చేది కాదు. మన తెలుగు మనం తీసుకుంటే ఇంకా బాగుంటుంది. హీరోయిన్స్ ఎలాగూ తప్పదు, చిన్న చిన్న నటీనటులను కూడానా. మన వాళ్లకు ఇంపార్టెన్స్ ఇవ్వండి వాళ్లు కుదరకపోతేనే ఇతర భాషల వారికి తీసుకురండి. అలాగే నటీనటులు కూడా ప్రచారానికి వస్తే దర్శకనిర్మాతలకు, సినిమాకు హెల్ప్ అవుతుంది. ఈ సినిమా విషయానికొస్తే మలేషియా, ముంబైలో చిత్రీకరించారు. ఆ రిచ్‌నెస్ కనిపిస్తోంది. ప్రతీ సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడంలోనే మన పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. దర్శకుడు రమేష్ చాలా సీనియర్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అన్నారు. దర్శకుడు రమేష్ చౌదరి మాట్లాడుతూ ‘మూడు దశాబ్ధాలుగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో- డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నాను. ఈ సినిమాతో దర్శకుడిగా మారాను. పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కేరళ అడవులకు టూర్‌కు వెళ్లి అక్కడి కోయవారి నిబంధనలను అతిక్రమించి ఇరుక్కుపోతారు. అక్కడి నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనేదే ఈ చిత్రం కథాంశం. సింగిల్ లైన్లో విక్కీరాజ్ గారికి స్టోరీ చెప్పాను. కేరళ రండి.. సినిమా తీద్దాం అన్నారు. అలా ఈ సినిమా మొదలైంది. 125 రోజులు షూటింగ్ తీశాం. మలేషియాలోనూ 25 రోజులు షూటింగ్ చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముంది. ఇలాంటి చిన్న చిత్రాలు విజయం సాధిస్తే మరిన్ని మంచి చిత్రాలు రూపొందించడానికి అవకాశముంటుంది’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఇక్కడకు వచ్చిన అందరికీ థ్యాంక్స్. కేరళలోని ఎర్నాకుళం, ఇరిట్టి అడవులు, హైదరాబాద్‌లోని సారధి స్టూడియో, రామోజీ ఫిల్మ్‌సిటీ, మలేషియాలో ఈ సినిమాను తెరకెక్కించాం. మలేషియాలో తెరకెక్కించిన క్లైమాక్స్ సినిమాకు హైలైట్అవుతుంది. చిత్రంలో ఐదు పాటలున్నాయి. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన ఐటమ్ సాంగ్ యువతను ఆకట్టుకుంటుంది. పద్మాలయ మల్లయ్య మాట్లాడుతూ ‘రమేష్ చౌదరి ఈ సినిమాతో దర్శకుడుగి పరిచయం అవడం సంతోషంగా ఉంది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మాత ఈ చిత్రం రూపొందించారు. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదిరించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. సెన్సార్ సభ్యులు ఎంఎస్ రెడ్డి మాట్లాడుతూ ‘ట్రైలర్ చూశాను, బాగుంది. నటీనటులు బిజీగా ఉండటం వల్ల రాలేదు కాబోలు. ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఆదరిస్తేనే వారి నుంచి మరిన్ని మంచి చిత్రాలు వస్తాయి. తద్వారా ఇంకొంతమంది నటీనటులు, టెక్నీషియన్స్ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించాలని కోరుతున్నాను’ అన్నారు. గీత రచయిత లక్ష్మణ్ మాట్లాడుతూ ‘అన్ని పాటలు రాశాను. ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించి, దర్శకులు రమేష్ గారికి సపోర్ట్‌ను ఇచ్చిన నిర్మాత విక్కీరాజ్ గారు ఈ టీమ్‌కు దొరకడం అదృష్టం. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. -
పగలు రెక్కీ... అర్ధరాత్రి చోరీలు
సాక్షి, సిటీబ్యూరో: పగలు రెక్కీలు నిర్వహించి అర్ధరాత్రి ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న గుజరాత్ రాష్ట్రాని కి చెందిన ఇద్దరు చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులను మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్(ఎస్వోటీ) పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని దహోడా జిల్లా, జేసవాడ థానా ప్రాంతానికి చెందిన హసన్ నార్సింగ్, రాజు సవ్‌సింగ్ బరియా అనే వ్యక్తులను అతికష్టంపై అరెస్టు చేసిన పోలీసులు సోమవారం ట్రాన్సిట్ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చారు. ఇందుకుగాను దాదాపు రెం డు వారాల పాటు అక్కడే మకాం వేయాల్సి వచ్చింది. ఈ గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, ఎస్వోటీ అడిషనల్ డీసీపీ దయానందరెడ్డితో కలిసి పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. రెండు వారాల పాటు గుజరాత్‌లోనే... గుజరాత్‌లోని దహోడా జిల్లా, మట్కా గ్రామానికి చెందిన హసన్ నర్సింగ్, వినోద్, పంకజ్, చర్చోడా గ్రామానికి చెందిన రాజు సవ్‌సింగ్ బరియా, జేసమ్ దినసరి కూలీలుగా పనిచేసేవారు. కుటుంబపోషణకు ఆదాయం సరిపోకపోవడంతో చోరీలకు పాల్పడుతున్నారు. రైళ్లలో హైదరాబాద్, తదితర నగరాలకు వచ్చే వీరు రైల్వే స్టేషన్లు, సమీపంలోని మురికివాడల్లో ఉంటూ పగటిపూట కాలనీల్లో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తి స్తారు. రాత్రి వేళల్లో తాము గుర్తించిన ఇంటి సమీపంలోని పొదల్లో అర్ధరాత్రి వరకు మాటు వేస్తారు. అనంతరం చొక్కాలు, పాయింట్లు విప్పేసి నడుముకు కట్టుకొని చెప్పులు చేతుల్లో పట్టుకొని గోడలు దూకి ఇళ్లలోకి చొరబడతారు. చోరీ అనంతరం మళ్లీ అవే పొదల్లోకి వచ్చి తెల్లవారుజాము వరకు అక్కడే వేచి ఉండి అదను చూసుకుని అక్కడి నుంచి జారుకుంటారు. ఈ తరహాలో 2017 డిసెంబర్ 4న, 2018 ఏప్రిల్ 16న, ఏప్రిల్ 16న, 2019 జనవరి 1న కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలోని ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. జనవరి 6న పుప్పలగూడ గ్రామంలో చోరీలకు తెగబడ్డారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మాదాపూర్ ఎస్వోటీ బృందం సంఘటనాస్థలంలో దొరికిన శాస్త్రీయ ఆధారాలు, టెక్నికల్ డేటా ఆధారంగా నిందితులు గుజరాత్‌లోని జేసవాడ థానా పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడే రెండు వారాల పాటు మకాం వేసిన బృందం అక్కడి పోలీసుల సహకారంతో ఈ నెల 18న ఐదుగురు ముఠా సభ్యుల్లో ఇద్దరు హసన్ నర్సింగ్, రాజు సవ్‌సింగ్ బర్లాను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను లునవాడలోని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు. వీరి అరెస్టుతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎనిమిది కేసుల్లో మిస్టరీ వీడింది. పరారీలో ఉన్న వినోద్, పంకజ్, జేసమ్ కోసం గాలిస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ సభ్యులను పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఓటీ సీఐ కె.పురుషోత్తమ్, ఎస్ఐ ఎస్కే.లాల్ మదర్లతో పాటు గ్యాంగ్ సభ్యులను గుర్తించడంలో సహకరించిన బాలానగర్ ఎస్ఓటీ బృందాన్ని సీపీ ప్రశంసించారు. -
చెడ్డి గ్యాంగ్ ఆట కట్టించిన పోలీసులు
-
ఎలా బయటపడ్డారు?
అమర్, ప్రదీప్ వర్మ, ఉదయ్, అభి, సి.టి, ఖాదర్, లక్ష్మీ, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. ఇందులో శ్రీనివాస రెడ్డి కీలక పాత్ర పోషించారు. కనగాల రమేష్ చౌదరి దర్శకత్వంలో విక్కి రాజ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రమేష్ మాట్లాడుతూ– ‘‘దాదాపు 32ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్‌గా చిత్రపరిశ్రమలో పని చేసిన నేను దర్శకునిగా తెరకెక్కించిన తొలి చిత్రమిది. సాఫ్ట్వేర్ కంపెనీలో బాగా పనిచేసే ఓ పది మంది ఉద్యోగులను ఆ కంపెనీ ఎండీ కేరళ టూర్‌కి పంపిస్తాడు. కేరళ అడవుల్లో జరుగుతున్న కోయవారి జాతరకు వెళ్లిన ఆ పదిమంది అక్కడే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా బయటపడ్డారనేది చిత్రకథాంశం. మలేసియాలో తీసిన క్లైమాక్స్ ఓ హైలైట్. దాదాపు 125 రోజుల పాటు రెండు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన స్పెషల్ సాంగ్ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ సంగీతం అందించారు.