గోడపై ‘కోడ్‌’? | Cheddi Gang in Hyderabad | Sakshi
Sakshi News home page

గోడపై ‘కోడ్‌’?

Published Wed, Apr 3 2024 7:31 AM | Last Updated on Wed, Apr 3 2024 7:31 AM

Cheddi Gang in Hyderabad - Sakshi

 కోడ్‌ భాషలోనే ముఠా కమ్యూనికేషన్‌

 
 టార్గెట్‌ చేసిన ఇల్లు, ఆఫీసు గోడలపై అంకెలు లేదా అక్షరాలతో రాతలు  


తద్వారా గ్యాంగ్‌లోని ఇతర సభ్యులకు సమాచారం చేరవేత 


 రెక్కీ, చోరీలకు ఇద్దరేసి చొప్పున రెండు వేర్వేరు బృందాలు 


 మియాపూర్‌ ఠాణా కేసులో రెండు అనుమానిత కాల్స్‌ గుర్తింపు  

మీ ఇల్లు లేదా ఆఫీసు గోడపై ఎక్కడో ఓ చోట ఒకటి, రెండంకెల నంబర్లు లేదా అక్షరాల రూపంలో ఏమైనా రాసి ఉన్నాయా? అయితే చెడ్డీ గ్యాంగ్‌ కన్నేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంకెలు, అక్షరాల రూపంలో కోడ్‌ భాషలోనే చెడ్డీ గ్యాంగ్‌ కమ్యూనికేషన్‌ చేసుకుంటుందని  సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. ఇటీవల మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చెడ్డీ గ్యాంగ్‌ రూ.7.8 లక్షలు చోరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకపోవడంతో సాంకేతిక అంశాల ఆధారంగానే దర్యాప్తు సాగుతోంది. టవర్‌ డంప్‌ సాంకేతికతతో రెండు అనుమానిత కాల్స్‌ను పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
 
ఇప్పటివరకు ఇళ్లలో చోరీలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్‌.. పాఠశాలలు, కార్యాలయాలపై కూడా కన్నేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన చోరీ కేసులో తొలుత ఇది చెడ్డీ గ్యాంగ్‌ పని కాదని మియాపూర్‌ పోలీసులు భావించారు. చోరీ జరిగిన రోజున పాఠశాలలో పేరెంట్స్‌ టీచర్‌ మీటింగ్‌ (పీటీఎం) జరగడంతో పాటు సెలవు దినం కావడంతో పాఠశాల యాజమాన్యం, అక్కడి పరిస్థితుల గురించి అవగాహన ఉన్నవాళ్ల పనై ఉంటుందని భావించారు. కానీ, పోలీసుల డేటా బేస్‌ ఆధారంగా చెన్నై, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో సిమెంట్‌ ఫ్యాక్టరీ, ఓ ప్రైవేట్‌ ఆఫీసులోనూ చెడ్డీ గ్యాంగ్‌ ఇదే తరహా చోరీలు చేసినట్లు గుర్తించారు. తాజా కేసులో గుజరాత్‌లోని దాహోద్‌ ప్రాంతానికి చెందిన చెడ్డీ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. 

అర్ధరాత్రే తర్వాతే చోరీలు.. 
సాధారణంగా ఈ ముఠాలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులుంటారు. ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాల నుంచి రైలు మార్గంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. స్టేషన్‌ లోపలి నుంచి బయటికి రావడం, ఆటో లేదా ఇతరత్రా ప్రజా రవాణాలను వీరు వినియోగించరు. సీసీ టీవీ కెమెరాలకు చిక్కకుండా రైలు పట్టాలను పట్టుకొని నడుచుకుంటూ బయటికి వెళ్లిపోతారు. రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్న ఇళ్లు, స్కూళ్లు, ఆఫీసులను రెక్కీ చేస్తారు. చోరీకి బయలుదేరే ముందు సమీప చెట్ల పొదలు, నిర్మానుష్య ప్రాంతాలలో ఒంటి మీద దుస్తులను విప్పేసి, కేవలం లోదుస్తులు మాత్రమే వేసుకుంటారు. ముఖం కనిపించకుండా క్లాత్‌ను చుట్టుకుంటారు. అర్ధరాత్రి 1–2 గంటల తర్వాతే దొంగతనాలు చేస్తుంటారు. ఆపైన నిర్మానుష్య ప్రాంతాలలో లేదా శివారు ప్రాంతాలలో తాత్కాలికంగా అద్దె ఇళ్లలో తలదాచుకుంటారు. పరిస్థితులు సద్దుమణిగాక తిరిగి రైలులో సొంతూళ్లకు పరారవుతారు. 

రెక్కీ, చోరీకి వేర్వేరు బృందాలు.. 
ముఠా నాయకుడు రెక్కీ, చోరీలను పక్కాగా ప్లాన్‌ చేస్తాడు. ముఠాలోని ప్రతీ సభ్యుడూ చురుగ్గా, తనకు కేటాయించిన విధులను పక్కాగా నిర్వర్తిస్తాడు. రెక్కీ చేసేందుకు ఇద్దరు, చోరీకి దిగేది ఇద్దరేసి సభ్యుల చొప్పున రెండు వేర్వేరు బృందాలుగా విడిపోతారు. రెక్కీ చేసిన బృందం ఆ సమాచారాన్ని ముఠాలోని ఇంకో గ్రూప్‌కు చేరవేసేందుకు టార్గెట్‌ చేసిన ఇల్లు లేదా ఆఫీసు, స్కూల్‌ గోడల మీద ఒక చోట అంకెలు, అక్షరాల రూపంలో రాతలు రాస్తారు. దీంతో ముఠాలోని చోరీ చేసే బృందం అర్ధరాత్రి చీకట్లో కూడా టార్గెట్‌ చేసిన ఇంటిని సులువుగా గుర్తిస్తారు. తాళాలను తెరిచేందుకు ఇనుప రాడ్లు, స్క్రూడ్రైవర్‌ వంటి పదునైన ఆయుధాలను వెంట తీసుకెళ్తారు. ఎవరైనా ఎదురు తిరిగితే వాటితో దాడి చేసేందుకూ వెనుకాడరు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement