తాడేపల్లి రూరల్(మంగళగిరి): చెడ్డీ గ్యాంగ్ తాడేపల్లి ప్రాంతంలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లిలో దోపిడీకి విఫలయత్నం చేసిన విషయం తెలిసిందే. ఐదుగురు సభ్యుల గ్యాంగ్ కుంచనపల్లిలో అదే రకంగా ప్రయత్నించి విఫలమైనట్లు ఘటన ఆదివారం వెలుగుచూసింది. పోలీసులకు చెడ్డీగ్యాంగ్ వచ్చినట్లు చెబుతున్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు.
చెడ్డీగ్యాంగ్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు ఒంటిమీద దుస్తులు లేకుండా ఒక్క చెడ్డీ మాత్రమే ధరించి, తలపాగాలు చుట్టి రెండు ఇళ్ల మధ్యలో ఉన్న సందులో వెళ్తున్నట్లు దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు తాడేపల్లి, మంగళగిరి, కాజా, పెదకాకాని, గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేసి రాత్రి పూట గస్తీలను పెంచారు. దీంతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో నైపుణ్యం పొందిన పోలీసులను మఫ్టీలో వివిధ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటు చేశారు.
తాడేపల్లి ప్రాంతంలో కనిపించిన ఐదుగురు సభ్యులున్న చెడ్డీగ్యాంగ్ గుంటుపల్లిలో ఉన్న చెడ్డీగ్యాంగ్ పోలికలు ఒకే విధంగా ఉండడంతో బెజవాడ పోలీసులు, గుంటూరు పోలీసులు సంయుక్తంగా ఆ గ్యాంగ్ ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్న విశ్వసనీయ సమాచారం. పోలీసులను చెడ్డీగ్యాంగ్ మీద వివరణ అడుగగా ఇంతవరకు ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా రాత్రి సమయంలో అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment