Cheddi Gang In Rajahmundry: Rajahmundry Police On Alert With Cheddi Gang Movement - Sakshi
Sakshi News home page

చెడ్డీ గ్యాంగ్‌ ... యమడేంజర్‌

Published Mon, Dec 13 2021 4:19 PM | Last Updated on Mon, Dec 13 2021 4:48 PM

Rajahmundry Police On Alert With Cheddi Gang Movement - Sakshi

చెడ్డీగ్యాంగ్‌ ఆచూకీకి జల్లెడ పడుతున్నఅర్బన్‌ జిల్లా పోలీసులు-చెడ్డీ గ్యాంగ్‌

కంబాలచెరువు(రాజమహేంద్రవరం)\తూర్పుగోదావరి: చెడ్డీ గ్యాంగ్‌ ...ఈ పేరు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే అయినా ఆ మాట వింటేనే ఏదో తెలియని వణుకు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో  ఈ గ్యాంగులు నేరాలకు పాల్పడని జిల్లాలు లేవంటే అతిశయోక్తి కాదు. కొంతకాలంగా ఈ గ్యాంగ్‌ కదలికలు కనిపించకపోయినా ఇటీవల కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీరు నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగుచూడటంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. వీరిని పట్టుకునేందుకు పోలీసు అధికారులు అన్ని జిల్లాల్లోనూ జల్లెడ పడుతూ. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ గ్యాంగ్‌ జిల్లాలో ఇప్పటికే ప్రవేశించిందా అన్న అనుమానంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేసి గస్తీ పెంచారు.

నేరాలకు ఎంచుకునే ప్రాంతాలు ఇవే..
చెడ్డీ గ్యాంగ్‌ నేరాలు చేసే విధానం విలక్షణంగా ఉంటుంది. గతంలో జరిగిన నేరాలు దర్యాప్తు చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో ఈ గ్యాంగ్‌ మూలాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రవేశించిన ఈ గ్యాంగ్‌ గుజరాత్‌ రాష్ట్రంలోని దాహోద్‌ జిల్లా నుంచి వచ్చినట్టుగా విజయవాడలో జరిగిన ఘటనల ఆధారంగా ధ్రువీకరించుకున్నారు. వీరు నేరాలకు నగరానికి దూరంగా ఉన్న ఇళ్లనే ఎంపిక చేస్తారు. ముఖ్యంగా రైల్వేట్రాకుల వెంబడి ఉన్న ఇళ్లు, జాతీయ రహదారికి దగ్గరగా ఒంటరిగా ఉన్న బంగ్లాలు, భవనాలు, అపార్టుమెంట్లు వీరు తమ దొంగతనాలకు అనుకూలంగా భావిస్తారు. నిమిషాల వ్యవధిలోనే నేరం చేసి అక్కడ నుంచి సులువుగా బయటకు వచ్చి రైల్వే ట్రాకు వద్దకు చేరుకుని వేగంగా వెళుతున్న రైలును కూడా వీరు సులువుగా ఎక్కి పరారౌతారు. జాతీయ రహదారికి సమీపంలోని ఇళ్లలో నేరాలు చేసి క్షణాల్లో జాతీయ రహదారిపైకి చేరుకుని లారీలపై పరారౌతుంటారు.

మూకుమ్మడిగా దాడి..  
సుమారు 5 నుంచి 8 మంది సభ్యులుగా ఉండే ఈ గ్యాంగ్‌ నేరం చేసే ఇళ్లను ముందే ఎంపిక చేసి రెక్కీ నిర్వహించుకుంటారు. అలా ఎంపిక  చేసిన ఇళ్ల సమీపంలో చెట్ల వద్ద, పొదల్లో బలమైన కర్రలు ముందే సిద్ధం చేసుకుంటారు. దొంగతనానికి పాల్పడేందుకు వెళ్లే సమయంలో కత్తులు, చాకులు తమ వద్ద ఉంచుకుంటారు. రాత్రి 2 గంటల నుంచి 3 గంటల లోపు సమయాన్ని వీరు నేరాలకు అనువైనదిగా ఎంచుకుంటారు. ఎక్కువ సెక్యూరిటీ ఉండే గేటెడ్‌ కమ్యూనిటీ ఇళ్లను సైతం వీరు తమ లక్ష్యంగా ఎంచుకుంటున్నారంటే  వీరిలో ఉన్న తెగింపే కారణం.

అలాంటి సముదాయాల్లో ఇళ్ల ప్రహరీలు దూకి లోపలికి ప్రవేశించి తమ వద్ద ఉన్న పరికరాలతో తలుపులు పెకళించి ఇళ్లలో దూరుతారు. ఆ ఇళ్లలో కుటుంబ సభ్యులు ఉన్నా వారిని బెదిరించి దాడి చేసి దొంగతనానికి పాల్పడతారు. నిమషాల వ్యవధిలోనే విలువైన వస్తువులు చేజిక్కించుకుని అక్కడ నుంచి పరారౌతారు. ఆ పరంపరలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. నగర శివారుల్లో ఉండే ఇళ్లలో నేరం చేసే సమయంలో తలుపులు పగులగొట్టడానికి వెనకాడరు. పెద్దపెద్ద బండరాళ్లతో తలుపులను, అద్దాలను పగులగొడతారు.

తలుపు తీయకపోతే చంపుతామని బెదిరిస్తారు. వీరి హడావిడికి భయానికి లోనైన కుటుంబ సభ్యులు తలుపులు తీస్తే ప్రాణాలు దక్కించుకోవచ్చనే ఆశతో తలుపులు తీసిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ తలుపులు తీయని పక్షంలో పగులగొట్టి లోనికి ప్రవేశించే ఈ గ్యాంగ్‌ ముందుగా  కుటుంబ సభ్యులపై దాడి చేస్తారు. వారి ఒంటిపై ఉన్న విలువైన వస్తువులు తీసుకుంటారు. వీరు బయట తలుపులు పగులగొడుతున్న సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్‌ చేసి విషయం చెప్పినా ఈ నేరస్తులు 15 నిముషాల్లోనే తమ పని చక్కబెట్టుకుని పోతుండటంతో పోలీసులు అక్కడకి చేరుకున్నా వివరాలు నమోదు చేసుకోవడం, దర్యాప్తు చేయడం తప్ప నేరాన్ని నిరోధించే అవకాశం దక్కడం లేదు.  

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
చెడ్డీగ్యాంగ్‌ కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పగటి సమయంలో ఇళ్ల సమీపంలో అనుమానిత వ్యక్తులు కదలికలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. రాత్రి సమయంలో అలికిడి అయినా, ఇంటి ఆవరణలో కుళాయిలు విప్పినట్టు గాని శబ్దం వస్తే వెంటనే తలుపులు తెరిచి చూడరాదు. చుట్టుపక్కల ఇళ్ల వారికి ఫోన్‌ చేసి అప్రమత్తం చేసి పోలీసులకు సమాచారం అందిస్తే  గస్తీ పోలీసులు అక్కడకు చేరుకుని నేరాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. నేరస్తులు మన ఇంటి ఆవరణలోకి ప్రవేశించినట్టు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు గట్టిగా కేకలు వేయడం, చుట్టుపక్కల నివాసితులు కూడా కేకలు వేయడం చేస్తే ఈ గ్యాంగ్‌ నేరానికి తెగబడేందుకు వెనకాడతారు.

గస్తీ పెంచాం 
రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్‌ కదలికలు నేపథ్యంలో జిల్లాలో అప్రమత్తం అయ్యాం. జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు సహకారంతో అన్ని రైల్వేస్టేషన్లలో నిఘా పెంచాం. ఫింగర్‌ ప్రింట్‌ యంత్రాలతో అనుమానితులను తనిఖీ చేస్తున్నాం. రాత్రి గస్తీ బీటు సిబ్బందిని పెంచాం.  నియంత్రణ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలి. అనుమానం వస్తే 100కి ఫోన్‌ చేసి స్పష్టమైన చిరునామా చెబితే నిముషాల వ్యవధిలోనే సమీప గస్తీ పోలీసులు అక్కడకు చేరుకునే అవకాశం ఉంటుంది. శివారు ప్రాంతాల్లో ప్రజలు అనుమానితుల కదలికలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి. 
–ఐశ్వర్య రస్తోగి, రాజమహేద్రవరం, అర్బన్‌ జిల్లా ఎస్పీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement