
దొంగలు చిందరవందరగా పడేసిన దుస్తులు, వస్తువులు, ఓ భవనంలో తిరుగుతూ సీసీ కెమెరాకు చిక్కిన చెడ్డీ గ్యాంగ్ సభ్యులు
జడ్చర్ల: పట్టణంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత చెడ్డి గ్యాంగ్ స్వైరవిహారం చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏకకాలంలో నాలుగు కాంప్లెక్స్‌ల్లోని ఆరు ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు.. ఈ క్రమంలో నాలుగు ఇళ్లలో తమ చేతివాటం ప్రదర్శించి.. మరో రెండు ఇళ్లలో విఫలమయ్యారు. ఈ క్రమంలో దొంగల చేతికి పెద్దగా బంగారు, వెండి, నగదు దొరకకపోవడం గమనార్హం. హైదరాబాద్‌కే పరిమితమైన చెడ్డీ గ్యాంగ్ కన్ను జడ్చర్లపై పడడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాలిలా.. స్థానిక శ్రీనివాసనగర్‌కాలనీలో శనివారం రాత్రి ఒంటిగంట తర్వాత ప్రవేశించిన దొంగల ముఠా ముందుగా నరేందర్‌కు చెందిన మూడంతస్థుల భవనంలోకి ప్రవేశించింది.
ముగ్గురు బయట కాపలా ఉండగా మరో ఇద్దరు ప్రహరీ దూకి భవనంలోకి ప్రవేశించారు. అయితే సీసీ కెమెరాలను వారు పెద్దగా గమనించలేదు. నేరుగా కాంప్లెక్స్‌లోని అన్ని అంతస్థులను కలియదిరిగారు. తాళం వేసిన ఇళ్లను పరిశీలించినా.. ఎలాంటి చోరీకి పాల్పడకుండా వెనుదిరిగారు. ఇదంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. వారి చేతుల్లో పదునైన పరికరం కూడా ఉన్నట్లుగా గుర్తించారు. దుండగులంతా 25–30 ఏళ్ల మధ్య వయస్సు గల వారై ఉండగా.. ముఖాలకు ముసుగు వేసుకుని.. చెడ్డీలు ధరించి ఉన్నారు.
రెండో కాంప్లెక్స్‌లో చేతివాటం..
శ్రీనివాసనగర్‌లో నరేందర్ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చిన దొంగలు ఆ పక్కనే ఉన్న మరో కాంప్లెక్స్ భవనంలోకి వెళ్లారు. అక్కడ అద్దెకు ఉన్న సుశాంత్‌సాహు ఇంటికి తాళం వేసి ఉండడంతో తాళం విరగ్గొట్టి బీరువాలో ఉన్న మూడున్నర గ్రాముల చెవి కమ్మలు, కాళ్ల పట్టీలు, రూ.13 వేల నగదు అపహరించారు. ఇదే కాంప్లెక్స్‌లో మరో పోర్షన్‌లో అద్దెకు ఉన్న ఎల్‌ఐసీ ఉద్యోగి రమణకుమారి ఇంటి తాళాన్ని విరగ్గొట్టి తులం బంగారంతోపాటు దాదాపు రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. అనంతరం ఆపక్కనే ఉన్న కాంప్లెక్స్‌లోకి ప్రవేశించిన దొంగలు అద్దెకు ఉంటున్న బ్యాంకు మేనేజర్ శ్రీనునాయక్ ఇంటిని గుళ్ల చేశారు.
మేనేజర్‌కు ఇటీవల బెంగుళూరుకు బదిలీ కావడంతో అక్కడ ఇల్లు వెతికేందుకు వారం రోజు క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. దొంగలు తాళం విరగ్గొట్టి బీరువాలో ఉన్న దాదాపు 6 తులాల బంగారు నగలు, కొంత నగదు అపహరించుకెళ్లారు. అనంతరం ఆ కాంప్లెక్స్ నుంచి బయటకు వచ్చిన దొంగలు ఎదురుగా ఉన్న కృష్ణారెడ్డి ఇంట్లోకి ప్రవేశించి రెండు బెడ్‌రూంలను గాలించారు. బీరువాలను, కప్ బోర్డులను సోదా చేశారు. ఇక్కడ కొంత వెండి సామగ్రి, రూ.5 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కంటపడని నగల మూట కాగా ఓ ఇంట్లో దాదాపు 26 తులాల బంగారు నగలు, కొంత నగదు ఉన్నా అవి దొంగల చేతికి చిక్కకపోవడంతో కటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటిలోని రెండు బెడ్ రూంలలో బీరువాలను, కప్ బోర్డులలో దుస్తులు తదితర సామగ్రిని సోదా చేసినా దుస్తుల మధ్యలో మూటగట్టి ఉన్న నగలు వారి చేతికి చిక్కలేదు.
పట్టపగలే చోరీలు
అచ్చంపేట రూరల్: పట్టణంలోని వినాయకనగర్, ఆదర్శనగర్ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం పట్టపగలే రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. స్థానికుల కథనం ప్రకారం.. వినాయకనగర్‌కాలనీలో నివాసం ఉంటున్న జగ్జీవన్‌రాం, అరుణలు శనివారం హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి వెళ్లగా గమనించిన దొంగలు ఇంటి తాళాలు విరగొట్టి ఇంటిలోకి ప్రవేశించి బీరువాలో ఉన్న తులంన్నర చైను, రూ.20 వేల నగదు, వెండి ఆభరణాలు తీసుకెళ్లారు. అలాగే ఆదర్శనగర్ కాలనీలో ఓ ఇంటి తాళం విరగొట్టి మూడు మాసాల బంగారు ఆభరణాలు దొంగిలించారు. ఇంటి యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పరశురాం తెలిపారు. ఇంటికి తాళం వేసి వెళ్లేటప్పుడు ఇంటి యజమానులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, కాలనీలో అపరిచితులు తిరుగుతుంటే సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.
స్పష్టత రాలేదు
దొంగతనం జరిగిన రెండు ఇళ్లకు సంబంధించిన బాదితులు స్థానికంగా లేకపోవడంతో ఎంత మేరకు చోరీ జరిగిందన్నది ఇంకా స్పష్టత లేదని సీఐ బాలరాజుయాదవ్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, సీసీ పుటేజీలు సేకరించామన్నారు. ఎవరైనా ఇళ్లకు తాళం వేసి వెళ్లే సమయంలో తమకు సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment