స్నేహితులే.. ప్రాణం తీసిండ్రు! | Young Man Brutal Murder In Mahabubnagar | Sakshi
Sakshi News home page

స్నేహితులే.. ప్రాణం తీసిండ్రు!

May 6 2019 7:41 AM | Updated on May 6 2019 7:41 AM

Young Man Brutal  Murder In Mahabubnagar - Sakshi

గోతి నుంచి మృతదేహాన్ని బయటకు తీస్తున్న గ్రామస్తులు  రోదిస్తున్న మృతుడి బంధువులు

అయిజ (అలంపూర్‌): స్నేహితుల మధ్య డబ్బు చిచ్చుపెట్టింది. చివరకు స్నేహితుడి ప్రాణాన్నే తీసేంత స్థాయికి దిగజార్చింది. స్నేహానికే కళంకం తెచ్చే ఈ ఘటన అయిజ మండలంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని కేశవరం గ్రామంలో కురువ మల్లేష్‌(25) ట్రాక్టర్‌ నడుపుకుంటూ సొంతంగా పొలం పనులు చేసుకునేవాడు. వీరన్న, నరసింహులు, మల్లేష్‌ స్నేహితులు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ కాలం గడిపేవారు. అయితే కుర్వ మల్లేష్‌ అతడి తండ్రి దస్తగిరి, భార్య సువర్ణకు తెలియకుండా వీరన్నకు గత ఏడాది రూ.70వేలు అప్పు ఇచ్చాడు. అయితే అప్పు తిరిగి చెల్లించాలని మల్లేష్‌ వీరన్నను కొన్ని రోజులనుంచి అడగడం మొదలు పెట్టాడు.

పథకం ప్రకారం హతమార్చారు
ఇదిలాఉండగా, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం గురువారం రాత్రి 9గంటలకు ముగ్గురు స్నేహితులు కలిసి బైక్‌పై మల్లేష్‌ పొలానికి చేరుకున్నారు. అక్కడే మద్యం సేవించారు. మల్లేష్‌ మద్యం మత్తులో ఉండగా.. వీరన్న, నరసింహులు అతని తలపై బండరాయితో మోదారు. అనంతరం బండిలో ఉన్న పెట్రోల్‌ తీసి మల్లేష్‌పై చల్లి నిప్పంటించారు. అప్పటికీ చనిపోయాడో లేదోనన్న అనుమానంతో కొంత దూరం లాక్కెళ్లి వేణిసోంపురంలోని మల్లన్న ఆలయం సమీపంలో గోతిలో పూడ్చిపెట్టారు. మరుసటి రోజు నుంచి ఏమితెలియని వారిలానే మృతుడి తండ్రితో మాట్లాడుతూ.. ఎక్కడికో వెళ్లి ఉంటాడు, రేపో మాపో వస్తాడంటూ చెప్పినట్లు తెలిసింది.

తండ్రి ఫిర్యాదుతో.. 
అనంతరం మల్లేష్‌ ఫోన్‌ నంబర్‌కు అతని తండ్రి దస్తగిరి, కుటుంబసభ్యులు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్విచ్‌ ఆఫ్‌ అని వస్తుంది. మూడురోజులైనా కొడుకు ఇంటికి రాకపోడంతో తండ్రికి అనుమానం వచ్చి.. వీరన్న, నరసింహులుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదివారం వీరన్నను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా..  సంఘటన మొత్తం బయటకు వచ్చింది. డీఎస్పీ షాకీర్‌హుస్సేన్, శాంతినగర్‌ సీఐ గురునాయుడు, అయిజ ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, ప్రొబిషనరీ ఎస్‌ఐ మానస, తహసీల్దార్‌ కిషన్‌సింగ్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించారు. వైద్యులతో అదే స్థలంలోనే పోస్టుమార్టం చేయించి కేసునమోదు చేసుకున్నారు. నరసింహులు పరారీలో ఉన్నాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటనతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement