వివరాలు సేకరిస్తున్న ఏబీసీ అధికారులు, పట్టుబడిన నగదుతో కానిస్టేబుల్ పల్లె తిరుపతిరెడ్డి
సాక్షి, మహబూబ్‌నగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉద్యోగిగా అవార్డు తీసుకున్న గంటల వ్యవధిలోనే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ కానిస్టేబుల్. దీంతో అవినీతి పరులకు ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు ఇస్తున్నారని ఆ శాఖపై విమర్శలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మడవత్ రమేష్ ప్రభుత్వం నుంచి ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకొని నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తున్నాడు. ఈ క్రమంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పల్లె తిరుపతిరెడ్డి గత ఏడాది నుంచి నాకు డబ్బులు ఇవ్వడం లేదు, డబ్బులు కావాలని రమేష్‌ను పలు మార్లు ఇబ్బంది పెడుతూ వచ్చాడు. అయితే రూ.17వేలు కావాలని తిరుపతిరెడ్డిని డిమాండ్ చేశాడు. దీనికి రమేష్ ఒప్పుకోకపోవడంతో కొన్ని రోజుల సమయం ఇచ్చాడు. ఆ తర్వాత రమేష్‌తో రూ.15వేలకు బేరం కుదుర్చుకున్నాడు.
పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు..
ఈమేరకు రమేష్ జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేసి ఇసుక తరలించడానికి రూ.17వేలు లంచం అడిగినట్లు రుజువు కావడంతో శుక్రవారం ఉదయం నుంచి ప్రణాళిక ప్రకారం విచారణ సాగించారు. మహబూబ్‌నగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పల్లె తిరుపతిరెడిక్డి రూ.17వేలు లంచం ఇస్తుంటే ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో దాడులు చేసి రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి అడిగిన డబ్బును రమేష్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఉన్న పోలీస్ వాహనం వెనుక భాగంలో ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బాధితుడు మాకు తెలపడంతో మా టీంతో లోపలికి వెళ్లి తనిఖీ చేయగా తిరుపతిరెడ్డి ఫ్యాంట్ జేబులో రూ.17వేలు పట్టుబడ్డాయి. ఆ తర్వాత ఏసీబీ అధికారులు కానిస్టేబుల్ తిరుపతిరెడ్డిని పూర్తిగా తనిఖీలు చేసి ఏమైన ఆస్తుల పత్రాలు ఉన్నాయా.. ఏమైన ఆస్తులు ఉన్నాయా? బంధువుల పేర్లమీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయి అనే అంశాలపై వివరాలు సేకరించారు. ఈ కేసులో పూర్తిగా విచారణ చేసి కానిస్టేబుల్ తిరుపతిరెడ్డిని హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు.
అవినీతిపరుడికి ఉత్తమ సేవా పతకం
టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న సమయంలోనే తిరుపతిరెడ్డి అనేక వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ కూడా పాత పద్దతిలోనే వసూళ్లకు పాల్పడుతూ వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఉత్తమ ఉద్యోగిగా పోలీస్ ఉన్నత అధికారులు ఎలా గుర్తించారో అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
ఇబ్బంది పెడుతూ వచ్చాడు
నేను 2017 డిసెంబర్ నుంచి ప్రభుత్వ అనుమతులతో ఇసుక తరలిస్తున్నాను. వన్‌టౌన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి గత కొన్ని రోజుల నుంచి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. రూ.17వేలు అడగగా నా దగ్గర డబ్బులు లేవు మూడు రోజుల సమయం ఇవ్వండి రూ.15వేలు ఇస్తానని చెప్పాను. అనంతరం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశా. సదరు కానిస్టేబుల్‌కు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన సమయంలో కూడా రెండుసార్లు ఇచ్చాను. ఇతను పల్సర్ వాహనంపై సివిల్ డ్రస్‌లో కోయిలకొండ ఎక్స్‌రోడ్, ఫైర్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇసుక ట్రాక్టర్లతో కలెక్షన్ చేస్తుంటాడు.
– మడావత్ రమేష్, ఫిర్యాదుదారుడు
Comments
Please login to add a commentAdd a comment