జాగిలాలతో హంతకుల కోసం గాలిస్తున్న పోలీసులు (ఫైల్)
గద్వాల క్రైం: కూలీ పనులకు వెళ్లిన సగటు వ్యక్తులు సాయంత్రం ఇంటికి వస్తారనే ఆశ..! పొలం పనులకు వెళ్లిన రైతన్న మాత్రం నేడు క్షేమంగా ఇంటికి వెళ్లలేని దుస్థితి. కరెంటు షాక్.. విష పురుగులు.. జంతువుల దాడిలో పొలం వద్ద రైతు మృతి చెందాడనే వార్త గ్రామాల్లో చోటుచేసుకునేవి.. కానీ, ఇప్పుడు మనుషులే ఒకరిపై ఒకరు హత్యలకు తెరతీస్తున్నారు. అర్ధరాత్రి హత్యలకు తెగబడుతున్నారు. ఓ కుటంబ వ్యవస్థను నిలువునా చీల్చి వేస్తున్న దారుణ సంఘటనలు ప్రస్తుతం పల్లె ప్రజలను భయాందోళనలోకి నెట్టేస్తున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలో ఇటీవల కాలంలో రైతు హత్యలు చోటు చేసుకుంటున్నాయి.
ఇవిగో ఘటనలు
ఠి మార్చి 8వ తేదీన కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన చంద్రబండ బోయ తిమ్మప్ప(35) అనే వ్యక్తి పని నిమిత్తం శుక్రవారం రాత్రి ఇంటి నుంచి దగ్గరలో ఉన్న వ్యవసాయ పొలానికి వెళ్లిన క్రమంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రెండు రోజుల తర్వాత వెలుగుచూసింది. అయితే ఈ హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు.
ఠి ఏప్రిల్ 23న కేటీదొడ్డి మండలం పాతపాలెంకు చెందిన కొలిమి వెంకటేష్(55) రోజూ మాదిరిగానే పొలానికి వెళ్లి రాత్రిపూట నిద్రించాడు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులలో దాడి చేసి హతమార్చారు. ఈయనను కూడా ఎందుకు హత్య చేశారనే విషయంపై స్పష్టత లేదు. పోలీసులు రెండు హత్యలపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. నెల వ్యవధిలోనే వ్యవసాయ పొలాల వద్ద చోటు చేసుకున్న ఈ హత్యలపై మండల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
అసలు కారణమేంటి?
ఈ రెండు హత్యల విషయంలో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరమైన వ్యవహారాలు, పొలం తగాదాలు కారణమై ఉంటాయని ఆరోపిస్తున్నారు. అయితే ప్రధానంగా వివాహేతర సంబంధాలు కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి తప్పిదాలు సైతం హత్యకు కారణం కావచ్చనే గుసగుసులు వినిపిస్తున్నాయి. సొంత వ్యక్తులను తమ వర్గం వారే హత్య చేయాల్సిన పరిస్థితికి తీసుకువస్తున్నారు. అయితే ఈ రెండు హత్యల తీరును చూస్తే వివాహేతర సంబంధాలే కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొలిక్కిరాని కేసులు..
సాంకేతిక పరంగా పోలీసు శాఖ పలు కీలక కేసులను ఛేదించడంలో మొదటి స్థానంలో ఉందనే చెప్పాలి. అయితే మార్చి నెల 8వ తేదీన హత్యకు గురైన వివరాలు ఇప్పటి వరకు పోలీసులు తెలుసుకోలేకపోయారు. కేసు దర్యాప్తులో భాగంగా ముమ్మరంగా ఆరా తీస్తున్నా హంతకుల ఆచూకీ తెలియలేదు. అలాగే ఏప్రిల్ 23న జరిగిన హత్య విషయంలోనూ జాగిలాలు గ్రామాల్లో పలు మార్గంలో హంతకులు వెళ్లినట్లు గుర్తించాయి. పోలీసులు సైతం కేసుల విషయంలో పలు కీలక ఆధారాలను సేకరించినప్పటికీ కేసు ఓ కొలిక్కి రాలేదు. దీంతో నిందితులు చిక్కరు.. దొరకరు అన్న చందంగా మారింది.
త్వరలోనే ఛేదిస్తాం..
కేటీదొడ్డి మండలంలో జరిగిన రెండు హత్య కేసులకు సంబంధించి హంతకులను త్వరలోనే పట్టుకుంటాం. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారించి తెలుసుకున్నాం. పలు కీలక ఆధారాల కోసం ఫోరెనిక్స్ నిపుణుల సహాయం తీసుకున్నాం. కేసుల విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. త్వరలోనే కేసులను ఛేదించి నిందితులను కఠినంగా శిక్షిస్తాం. – హన్మంతు, సీఐ, గద్వాల
Comments
Please login to add a commentAdd a comment