
పోలీస్ కమిషనరేట్‌లో వివరాలు వెల్లడిస్తున్న నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా, చిత్రంలో పలువురు పోలీస్ అధికారులు
సాక్షి, విశాఖపట్నం: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుల నుంచి రూ.కోటికి పైగా విలువైన సొత్తును విశాఖ నగర పోలీసులు రికవరీ చేశారు. ఇందులో 609 గ్రాముల బంగారం, 1564 గ్రాముల వెండి, ఒక కారు, మూడు పెద్ద లారీలు, 2 మోటారు సైకిళ్లు, మూడు సెల్‌ఫోన్లు ఉన్నాయి. మొత్తం 40 కేసులను ఛేదించి 13 మందిని అరెస్టు చేశారు. వీరిలో పేరుమోసిన చెడ్డీ బనియన్ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు ఉన్నారు. ఈ వివరాలను కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.
♦ గుజరాత్‌లోని దోహాద్ జిల్లాకు చెందిన చెడ్డీ బనియన్ గ్యాంగ్ సభ్యులు మడియ కంజి, మందోడ్ సుబలబాయి, సత్రబాయి రుమాల్ బాయిలు నగర పరిధిలోని గాజువాక, దువ్వాడ, పీఎం పాలెం, ఆరిలోవ, భీమిలితో పాటు నెల్లూరు, తిరుపతి, ఖమ్మంలలో చోరీలకు పాల్పడ్డారు. వీరిపై 2010 నుంచి 20 కేసులున్నాయి. సౌత్ డివిజన్ క్రైం సీఐ కె.పైడపునాయుడు నేతృత్వంలో ఎస్‌ఐ సూరిబాబు, పోలీస్ సిబ్బంది షీలానగర్ వద్ద వీరిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 400 గ్రాముల వెండి వస్తువులు, రూ.16 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరికొంత సొత్తును దాహోద్‌లో రికవరీ చేయాల్సి ఉందని సీపీ తెలిపారు.
♦ షీలానగర్ ఎంకేఎం గ్రాండ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రిటైర్డ్ డాక్టర్ కుమారరత్నం, అతని భార్య దేవిపై కత్తితో దాడి చేసి నగదు, సెల్‌ఫోన్లను దొంగిలించిన కేసులో విజయనగరం జిల్లా పూసపాటిరేగకు చెందిన మామిడి సూరప్పడును అరెస్టు చేశారు. అతడి నుంచి ఒక సెల్‌ఫోన్, రూ.వెయ్యి నగదు రికవరీ చేశారు. సూరప్పడు గతంలో షీలానగర్‌లోని తులసి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసేవాడని, చెడు అలవాట్లతో దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు.
లారీల చోరుల అరెస్టు
లారీలను దొంగిలించిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు సీపీ మహేష్‌చంద్ర లడ్డా చెప్పారు. గతంలో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తూ వ్యసనాలకు అలవాటుపడిన తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన పూడి జోగిబాబు అగనంపూడిలో ఉండేవాడు. అతనితోపాటు అతని సోదరుడి కుమారుడు వనం రాజు, అతని వద్ద పనిచేసే లారీ డ్రైవర్ డేరంగుల ప్రసాద్‌లు కలిసి ఇనుపలోడును గమ్యానికి చేర్చకుండా సరకును అమ్ముకున్న కేసులో మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్‌పై వచ్చిన వీరు గాజువాక ఆటోనగర్‌లో రూ.90 లక్షలు విలువ చేసే మూడు ట్రాలర్ లారీలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్నారు. వీరితో పాటు కొనుగోలు చేసిన పాయకరావుపేటకు చెందిన గురుబెల్లి సూర్యనాగేశ్వరరావును అగనంపూడి వద్ద క్రైం ఇన్‌స్పెక్టర్ పైడపునాయుడు బృందం అరెస్టు చేసిందని చెప్పారు. వీరి నుంచి మూడు ట్రాలర్ లారీలు, ఒక ట్రాక్టరు, 12 లారీ టైర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.
♦ మరో కేసులో హెచ్‌పీసీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి జి.శివకృష్ణను అరెస్టు చేశామని సీపీ తెలిపారు. ఆటోలో అనుమానాస్పదంగా ప్రయాణస్తున్న శివకృష్ణను గస్తీలో ఉన్న ఎస్‌ఐ జీడీబాబు ఆరా తీశారన్నారు. పొంతనలేని సమాధానం చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అతనిపై 9 దొంగతనం కేసులున్నట్టు నిర్థారణ అయిందన్నారు. అతని నుంచి 504 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి వస్తువులు కొనుగోలు చేసిన తుమ్మూరి వీరభద్రరావును కూడా అరెస్ట్ చేశామన్నారు. ఒక స్విఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.20.48లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే ఆర్.కిరణ్, విజయ, వసంతకుమార్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 4.45 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరందరినీ రిమాండ్‌కు తరలించామని సీపీ తెలిపారు. ఈ కేసులను ఛేదించిన సీఐ పైడపునాయుడితో పాటు పోలీసు సిబ్బందిని సీపీ లడ్డా అభినందించారు. వారికి రివార్డులను అందజేశారు. సమావేశంలో క్రైం డీసీపీ దామోదర్, శాంతిభద్రతల డీసీపీ రవీంద్రనాథ్‌బాబు, ఏడీసీపీ సురేష్‌బాబు, క్రైం ఏసీపీలు ఫల్గుణరావు, వై.గోవిందరావు, క్రైం సీఐ పైడపునాయుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment