
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న డీసీపీ(క్రైం) దామోదర్
విశాఖ క్రైం: వరుస దొంగతనాలతో నగర ప్రజలను హడలెత్తిస్తున్న దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. చెడ్డీ బనియన్ ముఠాతో పాటు పలు చోరీ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మొత్తం 20 మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 750 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. రూ.18 లక్షల విలువ గల 31 టన్నుల ఐరాన్ రాడ్స్‌ను రికవరీ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీ ఎ.ఆర్.దామోదర్ బుధవారం విలేకర్లతో సమావేశంలో వివరాలు వెల్లడించారు.
పోలీసుల అదుపులో నలుగురు చెడ్డీ ముఠా
గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్‌లో నలుగురిని అరెస్ట్ చేశారు. కొద్ది రోజులుగా నగర శివారు ప్రాంతాలలో రాత్రి పూట ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిన ఈ గ్యాంగ్‌ను పట్టుకుని, వారి వద్ద నుంచి 265 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలో దాహోద్ జిల్లా సహద గ్రామానికి చెందిన రామబాద్రియ, కిషన్ బాద్రియ, రావొజి బాద్రియ, గనవ భారత్‌సింగ్ అరెస్టయిన వారిలో ఉన్నారు.
గాజువాకలో..
గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట ఇంటి తలుపులు బద్దలకొట్టి చోరీ చేసిన కేసులో తాటిచెట్లపాలేనికి చెందిన అడపాక జీవరత్నం(అలియాస్ జపనీ)ని అరెస్ట్ చేసి, ఆయన నుంచి రూ.46వేను విలువ గల బంగారం, మరో సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
♦ మరో 10 కేసులను ఛేదించి రూ.56.35 లక్షలు విలువ గల చోరీ సొత్తును రికవరీ చేశారు.
♦ అలాగే జీడిపిక్కల బస్తాలు దొంగతనం కేసులో 9 మంది అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.27.5 లక్షల విలువైన 250 జీడిపిక్కల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
♦ ఇంటి దొంగతనం కేసుల్లో నిందితుడిని అరెస్ట్ చేసి, రూ.68 వేలు రికవరీ చేశారు.
♦ మరో కేసుల్లో దేవాడ కనకప్రసాద్, మంతినగురు నాయుడుతోపాటు మరో ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని, రూ.18లక్షల విలువైన 31 టన్నుల ఐరాన్ రాడ్స్‌ను రికవరీ చేశారు.
ఎండేటి గంగపై 100 కేసులు
కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ఇళ్లలో దొంగతనాల కేసుల్లో ఎండేటి గంగ, ఆమె తల్లి ఎండేటి మంగను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు కేసులకు సంబంధించి 36 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎండేటి గంగపై 100 కేసులు ఉన్నాయి. కంచరపాలెం బర్మా క్యాంపులో నివాసం ఉండేవారు. ఇటీవల విజయవాడలోని సింగ్‌నగర్‌కు మకాం మార్చారు. గతంలో విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఇళ్లల్లో చోరీ కేసుల్లో అరెస్ట్ చేశారు. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో డీసీ షీట్ ఉంది. అలాగే వీరిపై నాన్ బెయిల్ వారెంట్ పెండింగ్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మొత్తం అన్ని కేసుల్లో నిందితుల నుంచి 750 గ్రాముల బంగారు నగలు, 200 గ్రాముల వెండి, రూ.8వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసులను ఛేదించిన పోలీసులకు రివార్డులు ప్రకటించారు. ఈ సమావేశంలో ఏడీసీపీ(క్రైం) సురేష్‌బాబు, ఏసీపీ జోన్–2(క్రైం) పాల్గుణరావు, సీఐలు ఎన్.సాయి, పైడిపునాయుడు, ఎస్‌ఐ జె.డి.బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment