
తనిఖీలు చేస్తున్న ఏఎస్‌ఐ గోవిందమ్మ
విశాఖ క్రైం/పీఎంపాలెం(భీమిలి): నగర శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేస్తోంది. ఈ నెల 6వ తేదీన భీమిలి మండలం సంగివలసలో చోరీకి పాల్పడింది చెడ్డీ గ్యాంగ్ సభ్యులే అని.. ఘటన జరిగిన తీరును బట్టి పోలీసులు నిర్ధరించుకున్నారు. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధి 5వ వార్డులోని పనోరమా హిల్స్ 66 నంబర్ విల్లా సమీపంలో ఈ గ్యాంగ్ సభ్యులు సంచరించినట్టు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న లక్ష్మీనారాయణకు చెందిన ఈ విల్లాలో చోరీ చేయడానికి చెడ్డీ గ్యాంగ్ తీవ్రంగా యత్నించి విఫలమైంది. ఈ విషయమై ఆయన పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ కోసం ప్రత్యేక నిఘా బృందం ఏర్పాటు చేసినట్టు నార్త్ జోన్ నేర విభాగం సీఐ ఆర్. సత్యనారాయణ తెలిపారు. పీఎంపాలెం, ఆనందపురం, పద్మనాభం, భీమిలి పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. కాగా.. రాత్రి 7 గంటల తరువాత పనోరమా హిల్స్, పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బందులు తప్పవు.
పైగా దసరా సెలవులు. చాలా మంది స్వస్థలాలకు బయలుదేరుతున్నారు. ఈ క్రమంలో చెడ్డీ గ్యాంగ్ ఇలాంటి ప్రాంతాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణలో హల్‌చల్ చేసిన ఈ గ్యాంగ్ దృష్టి విశాఖపై పడటంతో శివారు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. కాగా.. చెడ్డీ గ్యాంగ్‌కు నగరంలో ఎవరైనా ఆశ్రయం కల్పిస్తున్నారా అనే కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నా రు. దసరా పండగా నేపథ్యంలో నగర శివారు ప్రాంతాలను ఈ గ్యాంగ్ ఎంచుకున్నట్టు చెబుతున్నారు. దీనిపై క్రైం డీసీపీ దామోదర్‌ను వివరణ కోరగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇప్పటికే చెడ్డీ గ్యాంగ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టామని స్పష్టం చేశారు. వారు ఎక్కడ నుంచి వచ్చారన్న కోణంలో సీసీ ఫుటేజ్‌ల ద్వారా పరిశీలిస్తున్నామని తెలిపారు. శివారు ప్రాంతాల్లో లా అండ్ ఆర్డర్, క్రైం పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు.
చెడ్డీ గ్యాంగ్ కోసం విస్తృత తనిఖీలు
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నగరంలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. శివారు ప్రాంతాలైన గోపాలపట్నం, కొత్తపాలెం, గోశాల, వేపగుంట మార్గాల్లో ఎస్‌ఐ జీడీబాబు ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ గోవిందమ్మ, హెచ్‌సీ మేడిది శ్యామ్యూల్ తదితరులు సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గుజరాత్ ప్రాంతానికి చెందిన ఈ గ్యాంగ్ సభ్యులు చోరీకి పాల్పడేటప్పుడు ఎవరికీ చిక్కకుండా చెడ్డీ, తలపాగా, లుంగీ, బనియన్లు ధరిస్తారు. గ్యాంగ్ సభ్యులు తెల్లపంచి కప్పుకుని, చెప్పులు చేతులో పట్టుకుని అర్ధరాత్రి చోరీలకు పాల్పడుతుంటారు. హిందీలో మాట్లాడతారు. నలుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతుంటారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను మాత్రమే కొళ్లగొట్టడం వీరి ప్రత్యేకత. సుడిగాలిలా వచ్చి క్షణాలలో చేతికి అందిన కాడికి దోచుకుని పరారవుతారు. నగర శివారులో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.– కె.లక్ష్మణమూర్తి, సీఐ, పీఎంపాలెం పోలీస్ స్టేషన్
Comments
Please login to add a commentAdd a comment