
పిడుగురాళ్లలో జరిగిన చోరీకి సంబంధించి సీసీ కెమెరాలో రికార్డయిన నిందితుల దృశ్యం (ఫైల్)
తాళం వేసిన ఇళ్లే వారి లక్ష్యం..చిటికెలో చోరీచేసి క్షణాల్లో మాయమవడం వారికి వెన్నతో పెట్టిన విద్య.. చోరీ సమయంలో ఎవరైనా అడ్డువస్తే హతమార్చేందుకు కూడా వెనుకాడని నరహంతకులు.. సీసీ కెమెరాలు ఉన్నా లెక్కచేయరు.. కెమెరాల ఎదుట ముసుగులేకుండా తిరిగి మరీ పోలీసులకు సవాల్‌విసురుతారు. వారే చెడ్డీ గ్యాంగ్ సభ్యులు.. ఆ చెడ్డీగ్యాంగ్ సభ్యులు జిల్లాలో సంచరిస్తున్నారని తెలిసిన ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
సాక్షి, గుంటూరు : చెడ్డీ గ్యాంగ్ పేరు వింటేనే ఎవరికైనా ఆందోళన కలగడం సహజం. అలాంటిది ఆ గ్యాంగ్ ఏకంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతోందనే వార్తలు రావడంతో ప్రజలు హడలెత్తి పోతున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించి ఆపై అర్ధరాత్రి సమయంలో ఇంటిపై ఒక్కసారిగా దాడిచేసి నిమిషాల వ్యవధిలో చోరీ ముగించి పరారవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరైనా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే హతమార్చేందుకు కూడా వెనుకాడరు. ఇంతటి ప్రమాదకరమైన గ్యాంగ్ జిల్లాలో సంచరిస్తున్నట్లు అనుమానాలు వచ్చిన పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. పిడుగురాళ్ల్ల, నరసరావుపేట,అచ్చంపేటతోపాటు గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన చోరీలను పరిశీలిస్తే చెడ్డీ గ్యాంగ్ పనేనన్న అనుమానాలు కలుగుతున్నాయి. పిడుగురాళ్లలో జరిగిన చోరీ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దొంగలు బనియన్, నిక్కరు వేసుకుని సీసీ కెమెరాలో రికార్డవుతుందని గమనించి కూడా ఎటువంటి భయం లేకుండా ముఖానికి కట్టిన ఖర్చీఫ్‌లు తీసి సీసీ కెమెరాల వైపు చూస్తూ నిలబడ్డారు. ఇక్కడి దొంగలు అంత ధైర్యం చేయరని పోలీసులు చెబుతున్నారు. ఆ చోరీ చెడ్డీగ్యాంగ్ పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీలు జరిగిన ప్రాంతాల్లో సేకరించిన ఆధారాల ప్రకారం గ్యాంగ్‌ను ఎలాగైనా పట్టుకోవాలనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అందుకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి వారి జాడ కోసం వేట ప్రారంభించారు.
దోపిడీలకు పాల్పడేదిలా....
బిహార్, మహారాష్ట్ర నుంచి వచ్చే దొంగలు గతంలో పలుమార్లు జిల్లాలో దోపిడీలకు పాల్పడి పరారయ్యారు. ఇప్పటికీ అలాంటి కేసులు కొన్ని ఇంకా దర్యాప్తు దశలోనే కొనసాగుతున్నాయి. ఆయా ముఠాల్లో సభ్యుల్లో మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఖాకీ సినిమాలో చూపిన విధంగా భయంకరంగా చోరీలకు తెగపడటం, అడ్డువచ్చిన వారిని హతమార్చడం చెడ్డీగ్యాంగ్‌ల ప్రత్యేకత. ముందుగా వారు ఎంచుకున్న జిల్లాలో పోలీసుల నిఘా ఎక్కడ తక్కువ ఉంటుందనే విషయాలను గుర్తిస్తారు. ఆపై ఆ ప్రాంతాల్లో గుడారాలను ఏర్పాటు చేసుకొని పగలు మహిళలు వివిధ వస్తువులు విక్రయించే వారిగా సంచరిస్తూ చోరీకి అనువుగా ఉండే ఇళ్లను గుర్తించి వెళ్తారు. ఆపై అర్ధరాత్రి దాటాక పోలీసుల ఉనికి లేదని నిర్ధారించుకున్న అనంతరం వారు ఎంచుకున్న ఇంటిపై గ్యాంగ్‌లోను మగవారు దాడిచేసి చోరీలకు పాల్పడతారు. ఎవరైనా అడ్డుకునే యత్నం చేస్తే వారిని హతమార్చేందుకు కూడా వెనుకాడకుండా నిమి షాల వ్యవధిలో చోరీ ముగించి పరారవుతారు.
తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం
పిడుగురాళ్ల, నరసరావుపేట వంటి ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలోనే చోరీలు జరిగాయి. దీనిని బట్టి తాళం వేసిన ఇళ్లే చెడ్డీగ్యాంగ్ సభ్యుల లక్ష్యమని పోలీసులు భావిస్తున్నారు. పిడుగురాళ్లలో చోరీ చేసిన ఇంట్లో సీసీ కెమెరా పుటేజీని పరి శీలిస్తే దొంగలు చోరీకి పాల్పడిన వైనం బయట పడింది. ఉలిక్కిపడిన పోలీస్ యంత్రాంగా అప్రమత్తమైంది. ఆ పుటేజీ ప్రకారం దొంగలు మహా రాష్ట్రకు చెందిన ప్రమాదకర చెడ్డీగ్యాంగ్ సభ్యులని అనుమానించారు. దర్యాప్తు కొనసాగించి వారి కోసం ప్రత్యేక బృందాన్ని మహారాష్ట్రకు పంపారు. అయితే అక్కడ వారిని గుర్తించడంలో బృందం విఫలం కావడంతో తిరిగి జిల్లాకు చేరుకుంది. గతంలో కూడా పలుమార్లు మహారాష్ట్ర వెళ్లిన పోలీస్ బృందాలకు అక్కడి నుంచి దొంగలను అదుపులోకి తీసుకొని జిల్లాకు తరలించే ధైర్యసాహసాలు చేయలేక తిరిగి వచ్చిన ఘటనలు ఉన్నాయి. జిల్లాలో జరుగుతున్న వరుస దొంగతనాలకు పాల్పడుతోంది చెడ్డీ గ్యాంగ్ కాదనుకుంటే, అదే తరహాలో చోరీలకు పాల్పడుతుంది ఎవరు అనే ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఒకవేళ బిహార్ ముఠా ఏమైనా దొంగతనాలకు పాల్పడిందేమోననే దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాత్రివేళ యువకుల గస్తీ
పిడుగురాళ్ల(గురజాల): చెడ్డీగ్యాంగ్‌లు సంచరి స్తున్నాయన్న ప్రచారం జరగడంతో పిడుగురాళ్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని కళ్లం టౌన్‌షిప్‌లో నివసిస్తున్న అపార్ట్‌మెంట్ వాసులు దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు రాత్రి వేల గస్తీ కాస్తున్నారు. చేతిలో టార్చిలైట్లు, కర్రలు పట్టుకుని తెల్లవార్లు జాగారం చేస్తున్నారు. ఇదే కళ్లం టౌన్‌షిప్‌లో పది రోజుల కిందట దొంగతనం జరిగింది. ఆ చోరీ జరిగిన ఇంటి వద్ద సీసీ కెమెరా పుటేజీలో నింది తులు చెడ్డీలు ధరించి కనిపించారు. ఈ పుటేజీ ఆధారంగా నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. దొంగలు ఎవరనేది పోలీసులు కచ్చితంగా గుర్తించలేదు. ఈ విషయమై పిడుగురాళ్ల పట్టణ ఎస్‌ఐ భుజంగరావును వివరణ కోరగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎల్‌హెచ్‌ఎంఎస్(లాకింగ్ హౌస్ మాని టరింగ్ సిస్టమ్) అందుబాటులో ఉందని, ఎవరైనా ఊరికి వెళ్తే పోలీసులకు సమాచారం అందిస్తే ఈ సిస్టమ్ అమరుస్తామని తెలిపారు. అపార్టుమెంటు ప్రజలకు, పట్టణ ప్రజలకు ఈ సిస్టమ్‌పై గతంలోనే అవగాహన కల్పించామన్నారు. రాత్రి సమయాల్లో పోలీసు పహారా ఉంటుందని, భద్ర టీమ్ తిరుగుతూనే ఉందని ప్రజలు భయపడాల్సిన పని లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment