‘చెడ్డీ గ్యాంగ్‌’ ఆటకట్టు | Cheddi Gang Arrest In Nagol Hyderabad | Sakshi
Sakshi News home page

‘చెడ్డీ గ్యాంగ్‌’ ఆటకట్టు

Published Wed, Aug 15 2018 7:43 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Cheddi Gang Arrest In Nagol Hyderabad - Sakshi

పలు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ‘చెడ్డీ గ్యాంగ్‌’ ప్రధాన నిందితుడు రాచకొండ పోలీసులకు చిక్కాడు. గుజరాత్‌ రాష్ట్రం, సహాడ తండాకు చెందిన పారమార్‌రామ బాంధియా తన కుటుంబ సభ్యులు,బంధువులతో కలిసి 2010లో చెడ్డీగ్యాంగ్‌ను ఏర్పాటు చేసి దోపిడీలకు పాల్పడుతున్నాడు.ఈ కరడుగట్టిన దొంగను పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.10 లక్షల విలువైన బంగారు, వెండిఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.   

నాగోలు: మూడు కమిషనరేట్ల పరిధిలో పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న చెడ్డీ గ్యాంగ్‌ ప్రధాన నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేసి రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ వివరాలు వెల్లడించారు... గుజరాత్‌ రాష్ట్రం, సహాడ తండాకు చెందిన పారమార్‌ రామ బాంధియా తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి 2010లో చెడ్డీగ్యాంగ్‌ను ఏర్పాటు చేశాడు. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన అతను 2014లో మరికొందరితో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, విశాఖపట్నం, భీమిలి, తిరుపతి ప్రాంతాల్లో 2014 నుంచి సంక్రాంతి, దీపావళి పండుగల సమయంలో ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడేవారు. అడ్డు వచ్చిన వారిని హత్య చేసేందుకైనా వీరు వెనకాడరు.

చోరీలకు వెళ్లే సమయంలో వీరు కేవలం చెడ్డీపైనే ఉంటూ చెప్పులు చేతపట్టుకుని గోడలు దూకేవారు. ఇటీవల మీర్‌పేట ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో వీరి కదలికలు రికార్డయ్యాయి. వీరిపై నిఘా ఏర్పాటు చేసిన రాచకొండ పోలీసులు ముఠా సభ్యులైన కిషన్‌ బాంధియా, రావూజీ, భగత్‌సింగ్‌లను అరెస్ట్‌ చేసి వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా ముఠా నాయకుడు రామ బాంధియాను అరెస్ట్‌ చేశారు. రామ బాంధియా భవన నిర్మాణ కూలీగా నటిస్తూ రెక్కీ నిర్వహించి చోరీలు చేసేవాడు. మూడు కమిషనరేట్‌ల పరిధిలో 28 చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుజరాత్‌లోని దాహోద్‌ సీనియర్‌ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ హిటీష్‌ జోయేసర్‌ సహకారంతో బాంధియాను అరెస్ట్‌ చేసి అతడి నుంచి రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మావోజి, మెగ్జి, సంజయ్‌ తప్పించుకు తిరుగుతున్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ క్రైం డీసీపీ నాగరాజు, ఎస్‌ఓటీ అడిషనల్‌ డీసీపీ సయ్యద్‌ రఫిక్, ఎస్‌ఓటీ సీఐ రవికుమార్, సీసీఎస్‌ సీఐ కాశీవిశ్వనాధ్, మీర్‌పేట డీఐ మధుసూదన్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement