న్యూఢిల్లీ: సరిహద్దుల్లోని తవాంగ్ వద్ద రెండు దేశాల ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో భారత్, చైనాల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. అయితే, తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభన తొలిగేదిశగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని భారత్, చైనా పేర్కొన్నాయి. అపరిష్కృత సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాలంటూ ఇరు దేశాల నేతలు అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా దాపరికాలు లేకుండా మరింత వివరణాత్మకంగా చర్చలు జరిపినట్లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి.
క్షేత్ర స్థాయిలో సరిహద్దుల్లో భద్రతను, స్థిరతను కాపాడుకోవాలని అంగీకరించినట్లు చెప్పాయి. సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తూ, విభేదాలకు ఆమోదయోగ్య పరిష్కారాన్ని త్వరగా కనుగొనాలని పేర్కొన్నాయి. ఈ నెల 20న సరిహద్దుల్లోని చైనా భూభాగంలో చుషుల్–మోల్దో వద్ద 17వ విడత భారత్–చైనా కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment