discussions fail
-
Junior doctors: ప్రత్యక్షప్రసారం చేయాలి
కోల్‌కతా: నెలరోజులకు పై గా విధులను బహిష్కరిస్తున్న జూనియర్ డాక్టర్లతో చర్చలకు పశి్చమబెంగాల్ ప్రభుత్వం వరుసగా రెండోరోజు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి సమక్షంలోనే చర్చలు జ రగాలని జూనియర్ డాక్టర్లు పట్టుబట్టారు. అలాగే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని, తమ తరఫున 30 మంది ప్రతినిధుల బృందాన్ని చర్చలకు అనుమతించాలని డిమాండ్ చేశారు. సచివాలయం నబన్నాలో బుధవారం సాయంత్రం 6 గంటలకు చర్చలకు రావాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శి మనోజ్ పంత్ జూనియర్ డాక్టర్లకు ఈ–మెయిల్ ద్వారా ఆహా్వనాన్ని పంపారు. 12 నుంచి 15 మంది రావాలని కోరారు. సీఎం మమతా బెనర్జీ నేరుగా చర్చల్లో పాల్గొనే విషయాన్ని సీఎస్ మెయిల్లో ధృవీకరించలేదు. చట్టానికి బద్ధులై ఉండే పౌరులుగా సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడం ప్రతి ఒక్కరి విధి అయినప్పటికీ జూనియర్ డాక్టర్లు దానికి కట్టుబడలేదని పంత్ పేర్కొన్నారు. దీనిపై సాయంత్రం 5:23 గంటలకు జూనియర్ డాక్టర్లు విలేకరుల సమావేశంలో స్పందించారు. ‘సీఎం మమతా బెనర్జీ సమక్షంలోనే చర్చలు జరగాలి. టీవీల్లో ప్రత్యక్షప్రసారం ఉండాలి. పలు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులకు చెందిన జూనియర్ డాక్టర్లు ఆందోళనలో పాలుపంచుకొంటున్నందున కనీసం 30 మందిని చర్చలకు అనుమతించాలి’ అని జుడాల ఫోరం ప్రకటించింది. షరతులకు ఒప్పుకోం బేషరతుగా చర్చలకు రావాలని, జూనియర్ డాక్టర్లు పెట్టిన ఏ షరతునూ అంగీకరించాడానికి బెంగాల్ సర్కారు సిద్ధంగా లేదని ఆరోగ్యమంత్రి చంద్రిమా భట్టాచార్య స్పష్టం చేశారు. షరతులు పెట్టారంటే వారు మనస్ఫూర్తిగా చర్చలకు సిద్ధంగా లేరని అర్థమన్నారు. -
ఫలితం లేకుండానే ముగిసిన భారత్–చైనా చర్చలు
న్యూఢిల్లీ: సరిహద్దుల్లోని తవాంగ్ వద్ద రెండు దేశాల ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణల నేపథ్యంలో భారత్, చైనాల మధ్య మంగళవారం జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. అయితే, తూర్పు లద్దాఖ్ ప్రతిష్టంభన తొలిగేదిశగా నిర్మాణాత్మక చర్చలు జరిగాయని భారత్, చైనా పేర్కొన్నాయి. అపరిష్కృత సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాలంటూ ఇరు దేశాల నేతలు అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా దాపరికాలు లేకుండా మరింత వివరణాత్మకంగా చర్చలు జరిపినట్లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. క్షేత్ర స్థాయిలో సరిహద్దుల్లో భద్రతను, స్థిరతను కాపాడుకోవాలని అంగీకరించినట్లు చెప్పాయి. సైనిక, దౌత్య మార్గాల ద్వారా చర్చలు కొనసాగిస్తూ, విభేదాలకు ఆమోదయోగ్య పరిష్కారాన్ని త్వరగా కనుగొనాలని పేర్కొన్నాయి. ఈ నెల 20న సరిహద్దుల్లోని చైనా భూభాగంలో చుషుల్–మోల్దో వద్ద 17వ విడత భారత్–చైనా కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. -
ఇదేనా ప్రజాస్వామ్యం?
మరో విడత పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అధికార–ప్రతిపక్షాల వాదోపవాదాలు... సభా మధ్యంలో నిరసనలు... అనివార్యమైన వాయిదాలు... మళ్ళీ అవే సన్నివేశాలు. డిసెంబర్ 23 వరకు జరగాల్సిన శీతకాల సమావేశాలు ఒకరోజు ముందే బుధవారమే ముగిశాయి. వెనక్కి తిరిగి చూస్తే, చట్టసభలు సాగిన తీరులో ఏమున్నది గర్వకారణం అనిపించక మానదు. సభాసమయంలో వృథానే ఎక్కువగా కనిపిస్తుంది. కీలక బిల్లులు ఆమోదం పొందినా, వాటిపై చర్చ జరగలేదనే చేదు నిజం వెక్కిరిస్తుంది. ఎవరి పాలెంతనేది పక్కనపెడితే, అధికార, ప్రతిపక్షాలు రెంటిలో తప్పు కనిపిస్తుంది. నవంబర్ 29న సభ మొదలైన రోజు నుంచే పరిస్థితి అదుపు తప్పింది. వర్షాకాల సమావేశాల్లోని ప్రవర్తన తీరుకు దండనగా 12 మంది ప్రతిపక్ష సభ్యులను మొత్తం ఈ శీతకాల సమావేశాల నుంచి బహిష్కరించడం వివాదాస్పదమైంది. దాని చట్టబద్ధతా ప్రశ్నార్థకమైంది. పలుమార్లు సభలో అంతరాయాలకూ, సభ బయట ధర్నాలకూ కారణమైంది. ఒక రకంగా ప్రతిపక్షాల్లో అనూహ్య ఐక్యతకూ దారి తీసింది. 22 రోజుల పాటు గాంధీ విగ్రహం పాదాల చెంత ప్రతిపక్ష సత్యాగ్రహం సాగింది. సామూహిక పశ్చాత్తాపం కాదు... వ్యక్తిగతంగా ఎవరికి వారు క్షమాపణలు చెబితేనే సభలోకి అనుమతిస్తామన్న అధికార పక్షం మంకుపట్టు ఆఖరి దాకా కొనసాగింది. అదీ విచిత్రం. ఈ విడతలో లోక్‌సభ, రాజ్యసభ– చెరి 18 సార్లు సమావేశమయ్యాయి. కానీ, అంతరాయాలతో లోక్‌సభలో 18 గంటల 48 నిమిషాలు వృథా. అంతరాయాలు, వాయిదాలతో రాజ్యసభలో ఏకంగా 49 గంటల 32 నిమిషాలు కృష్ణార్పణం. మొత్తం మీద లోక్‌సభ ఉత్పాదకత 77 శాతమైతే, రాజ్య సభది 43 శాతమేనని చట్టసభలపై స్వచ్ఛంద పరిశోధనా సంస్థ పీఆర్ఎస్ లెక్కేసింది. ప్రభుత్వం లెక్క మాత్రం అంతకన్నా కాస్తంత మెరుగ్గా ఉంది (లోక్‌సభ 82 శాతం, రాజ్యసభ 47 శాతం). ఏ లెక్కనైనా ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదనేది నిర్వివాదాంశం. ఈ సమావేశాల్లో 12 బిల్లులు లోక్‌సభలో, ఒక బిల్లు రాజ్యసభలో– మొత్తం 13 బిల్లుల్ని ప్రవేశ పెట్టారు. వాటిలో 11 ఉభయసభల ఆమోదం పొందాయి. అందులో అద్దె గర్భం, సహాయ పునరు త్పాదక టెక్నాలజీ (ఏఆర్టీ), నార్కోటిక్ డ్రగ్స్ లాంటి కీలక బిల్లులున్నాయి. లోక్‌సభలో మెజారిటీ ఉండడంతో వీటిని పాస్ చేయించుకోవడం పాలకపక్షానికి కష్టమేమీ కాదు. కానీ, రాజ్యసభలో ప్రతిపక్షాలదే ఇప్పటికీ స్వల్ప మెజారిటీ (ప్రతిపక్షాలు 120, ఎన్డీఏ సభ్యులు 118). అందుకే, ప్రభుత్వం వ్యూహాత్మకంగా పాత తప్పుల సాకుతో 12 మంది విపక్ష సభ్యుల్ని ఇప్పుడు సస్పెండ్ చేసి, కృత్రిమ మెజారిటీ సంపాదించి, బిల్లులను పాస్ చేయించుకుందనేది కాంగ్రెస్ ఆరోపణ. నిందారోపణలు ఏమైనా, చర్చ లేకుండా నిమిషాల వ్యవధిలోనే అనేక బిల్లులకు ఆమోద ముద్ర పడడం మటుకు నిజం. సమావేశాల మొదట్లోనే తెచ్చిన కొత్త సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు మొదలు చివరలో తెర మీదకు తెచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు దాకా అనేకం అర్థవంతమైన చర్చ ఏమీ లేకుండా, అరగంటలో పాలకపక్షం మమ అనిపించినవే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు గుర్తింపు కార్డునూ – ఆధార్‌నూ అనుసంధానించడానికి వీలు కల్పించే అత్యంత కీలక ఎన్నికల చట్టం మార్పుపై చర్చించడానికి అధికార పక్షానికి సమయమే లేదా అన్నది విమర్శకుల ప్రశ్న. భిన్నాభిప్రాయాల చర్చావేదికగా నిలవడం, ఆ చర్చల్లో ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకోవడం పార్లమెంట్ ప్రాథమిక లక్షణం. కానీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ప్రజాస్వామ్య వేదిక ఆ గుణాన్ని కోల్పోయినట్టు కనిపిస్తోందన్నది కొందరి విమర్శ. 17వ లోక్‌సభలోని తాజా 7వ విడత సమావేశాల్లో సగటున ప్రతి బిల్లూ లోక్‌సభలో 10 నిమిషాల్లో, రాజ్యసభలో అరగంటలో పాసైపోయాయి. చట్టసభల్లో పరిఢవిల్లాల్సిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని బీజేపీ పరిహసించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది అందుకే. బిల్లులపై భిన్నాభిప్రాయాలున్నప్పుడు వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపడం సాధారణం. ఇటీవల ఆ ధోరణి కూడా తగ్గుముఖం పడుతోంది. తాజా సమా వేశాల్లో 6 బిల్లుల్ని మాత్రం పార్లమెంటరీ కమిటీలకు నివేదించారు. ఆడపిల్లల వివాహ వయస్సును పెంచే ప్రతిపాదనపై సందేహాలు వ్యక్తమయ్యాక ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు. ఇక, ప్రజాసమస్యలను ప్రస్తావించి పాలకపక్షాన్ని ఇరుకునపెట్టడానికి అవకాశమున్న కీలకమైన ప్రశ్నోత్తరాల సమయంలోనూ 60 శాతం సమయం వృథా తప్పలేదంటే, ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రంగస్థల ప్రదర్శనలా మారిపోతున్న తమ సభావ్యూహాన్ని పునరాలోచించుకోవాలి. నిజానికి, ఈసారి సభలో గట్టిగా చర్చ జరిగింది – కోవిడ్ పైన, పర్యావరణ మార్పుల పైనే! రైతుల ప్రాణాలు బలిగొన్న లఖిమ్‌పూర్ ఖేరీ ఘటన పథకం ప్రకారం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో, కన్నకొడుకే నిందితుడైన హోమ్ శాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు చివరి దాకా పట్టుబట్టాయి. కానీ, కీలక అంశాల చర్చకు ప్రభుత్వాన్ని ఒప్పించడమూ అంతే ముఖ్యమని గ్రహించాల్సింది. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే సమావేశాలు మరింత మెరుగ్గా జరిగి ఉండేవి. రాజ్యసభ ఛైర్మన్ అన్న ఆ మాట నిజమే. కానీ, అందుకు పాలకపక్షం కూడా కలసి రావాలి. పట్టువిడుపులతో ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ఎంతైనా, ఒంటి చేతితో చప్పట్లు కొట్టలేం కదా! పాలకులు ఏకపక్ష ప్రకటనలు చేయడానికీ, అనుకున్నవాటికి రబ్బరు స్టాంపు రాజముద్రలు వేయడానికీ పార్లమెంట్ సమావేశాలతో పని ఏముంది! -
108 చర్చలు మళ్లీ విఫలం..
అసంపూర్తిగా ముగిసిన చర్చలు 13వ తేదీకి వాయిదా సాక్షి, హైదరాబాద్: 108 సిబ్బంది సమస్యలపై అదనపు లేబర్ కమిషనర్ వై.సూర్యప్రసాద్ సమక్షంలో యాజమాన్యం, 108 యూనియన్ల మధ్య గురువారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కనీస వేతనం పెంపు, 8 గంటల పనివిధానం, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం తదితర డిమాండ్లపై జీవీకే, ఈఎంఆర్ఐ యాజమాన్యం దిగిరాకపోవడంతో ఐదవ దఫా చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చలను 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సూర్యప్రసాద్ ప్రకటించారు. చర్చల్లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా, 108 సిబ్బంది యూనియన్ గౌరవాధ్యక్షుడు భూపాల్, అధ్యక్షుడు అప్పిరెడ్డి తదితరులు, జీవీకే యాజమాన్యం పక్షాన భట్టాచార్య, మూర్తి పాల్గొన్నారు. అనంతరం సాయిబాబా, భూపాల్, అప్పిరెడ్డిలు విలేకరులతో మాట్లాడుతూ.. తమ డిమాండ్లపై యాజమాన్యం మొండివైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకూ సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. పర్మనెంట్ చేస్తే గ్రామాల్లో సేవలందిస్తాం: జూడాలు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం జూనియర్ డాక్టర్లను పర్మనెంట్ చేసినట్లయితే.. గ్రామాల్లో వైద్యసేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జూడాల అధ్యక్షుడు డాక్టర్ వంశీ తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ హైదరాబాద్‌లోని డీఎంఈ కార్యాలయం ముందు జూనియర్ డాక్టర్లు గురువారం ధర్నా నిర్వహించారు. డీఎంఈ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన జూడాలు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించనట్లయితే.. సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
108 సిబ్బందితో చర్చలు విఫలం.. నేడు మళ్లీ చర్చలు
ప్రధాన డిమాండ్లపై కుదరని రాజీ.. సాక్షి, హైదరాబాద్: 108 సిబ్బంది సమస్యలపై అదనపు లేబర్ కమిషనర్ సూర్యప్రసాద్ సమక్షంలో జీవీకే యాజమాన్యం, 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని టి.అంజయ్య కార్మిక సంక్షేమ భవన్లో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు జరిగిన చర్చల్లో సిబ్బంది ప్రధాన డిమాండ్లు.. కనీస వేతనం రూ.15 వేలు, అదనపు పనికి అదనపు వేతనం తదితర అంశాలపై జీవీకే యాజమాన్యం, యూనియన్ ప్రతి నిధుల మధ్య రాజీ కుదరలేదు. దీంతో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఉభయపక్షాలతో మళ్లీ చర్చలు జరపాలని కార్మిక శాఖ నిర్ణయించింది. తాజా చర్చల్లో జీవీకే, ఈఎంఆర్ఐ ప్రతినిధులు భట్టాచార్య, మూర్తి, 108 యూనియన్ ప్రతినిధులు భూపాల్, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.