మరో విడత పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అధికార–ప్రతిపక్షాల వాదోపవాదాలు... సభా మధ్యంలో నిరసనలు... అనివార్యమైన వాయిదాలు... మళ్ళీ అవే సన్నివేశాలు. డిసెంబర్ 23 వరకు జరగాల్సిన శీతకాల సమావేశాలు ఒకరోజు ముందే బుధవారమే ముగిశాయి. వెనక్కి తిరిగి చూస్తే, చట్టసభలు సాగిన తీరులో ఏమున్నది గర్వకారణం అనిపించక మానదు. సభాసమయంలో వృథానే ఎక్కువగా కనిపిస్తుంది. కీలక బిల్లులు ఆమోదం పొందినా, వాటిపై చర్చ జరగలేదనే చేదు నిజం వెక్కిరిస్తుంది. ఎవరి పాలెంతనేది పక్కనపెడితే, అధికార, ప్రతిపక్షాలు రెంటిలో తప్పు కనిపిస్తుంది.
నవంబర్ 29న సభ మొదలైన రోజు నుంచే పరిస్థితి అదుపు తప్పింది. వర్షాకాల సమావేశాల్లోని ప్రవర్తన తీరుకు దండనగా 12 మంది ప్రతిపక్ష సభ్యులను మొత్తం ఈ శీతకాల సమావేశాల నుంచి బహిష్కరించడం వివాదాస్పదమైంది. దాని చట్టబద్ధతా ప్రశ్నార్థకమైంది. పలుమార్లు సభలో అంతరాయాలకూ, సభ బయట ధర్నాలకూ కారణమైంది. ఒక రకంగా ప్రతిపక్షాల్లో అనూహ్య ఐక్యతకూ దారి తీసింది. 22 రోజుల పాటు గాంధీ విగ్రహం పాదాల చెంత ప్రతిపక్ష సత్యాగ్రహం సాగింది. సామూహిక పశ్చాత్తాపం కాదు... వ్యక్తిగతంగా ఎవరికి వారు క్షమాపణలు చెబితేనే సభలోకి అనుమతిస్తామన్న అధికార పక్షం మంకుపట్టు ఆఖరి దాకా కొనసాగింది. అదీ విచిత్రం.
ఈ విడతలో లోక్‌సభ, రాజ్యసభ– చెరి 18 సార్లు సమావేశమయ్యాయి. కానీ, అంతరాయాలతో లోక్‌సభలో 18 గంటల 48 నిమిషాలు వృథా. అంతరాయాలు, వాయిదాలతో రాజ్యసభలో ఏకంగా 49 గంటల 32 నిమిషాలు కృష్ణార్పణం. మొత్తం మీద లోక్‌సభ ఉత్పాదకత 77 శాతమైతే, రాజ్య సభది 43 శాతమేనని చట్టసభలపై స్వచ్ఛంద పరిశోధనా సంస్థ పీఆర్‌ఎస్ లెక్కేసింది. ప్రభుత్వం లెక్క మాత్రం అంతకన్నా కాస్తంత మెరుగ్గా ఉంది (లోక్‌సభ 82 శాతం, రాజ్యసభ 47 శాతం). ఏ లెక్కనైనా ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వన్నె తీసుకురాదనేది నిర్వివాదాంశం.
ఈ సమావేశాల్లో 12 బిల్లులు లోక్‌సభలో, ఒక బిల్లు రాజ్యసభలో– మొత్తం 13 బిల్లుల్ని ప్రవేశ పెట్టారు. వాటిలో 11 ఉభయసభల ఆమోదం పొందాయి. అందులో అద్దె గర్భం, సహాయ పునరు త్పాదక టెక్నాలజీ (ఏఆర్టీ), నార్కోటిక్ డ్రగ్స్ లాంటి కీలక బిల్లులున్నాయి. లోక్‌సభలో మెజారిటీ ఉండడంతో వీటిని పాస్ చేయించుకోవడం పాలకపక్షానికి కష్టమేమీ కాదు. కానీ, రాజ్యసభలో ప్రతిపక్షాలదే ఇప్పటికీ స్వల్ప మెజారిటీ (ప్రతిపక్షాలు 120, ఎన్డీఏ సభ్యులు 118). అందుకే, ప్రభుత్వం వ్యూహాత్మకంగా పాత తప్పుల సాకుతో 12 మంది విపక్ష సభ్యుల్ని ఇప్పుడు సస్పెండ్ చేసి, కృత్రిమ మెజారిటీ సంపాదించి, బిల్లులను పాస్ చేయించుకుందనేది కాంగ్రెస్ ఆరోపణ. నిందారోపణలు ఏమైనా, చర్చ లేకుండా నిమిషాల వ్యవధిలోనే అనేక బిల్లులకు ఆమోద ముద్ర పడడం మటుకు నిజం. సమావేశాల మొదట్లోనే తెచ్చిన కొత్త సాగు చట్టాల ఉపసంహరణ బిల్లు మొదలు చివరలో తెర మీదకు తెచ్చిన ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు దాకా అనేకం అర్థవంతమైన చర్చ ఏమీ లేకుండా, అరగంటలో పాలకపక్షం మమ అనిపించినవే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు గుర్తింపు కార్డునూ – ఆధార్‌నూ అనుసంధానించడానికి వీలు కల్పించే అత్యంత కీలక ఎన్నికల చట్టం మార్పుపై చర్చించడానికి అధికార పక్షానికి సమయమే లేదా అన్నది విమర్శకుల ప్రశ్న.
భిన్నాభిప్రాయాల చర్చావేదికగా నిలవడం, ఆ చర్చల్లో ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకోవడం పార్లమెంట్ ప్రాథమిక లక్షణం. కానీ, బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ప్రజాస్వామ్య వేదిక ఆ గుణాన్ని కోల్పోయినట్టు కనిపిస్తోందన్నది కొందరి విమర్శ. 17వ లోక్‌సభలోని తాజా 7వ విడత సమావేశాల్లో సగటున ప్రతి బిల్లూ లోక్‌సభలో 10 నిమిషాల్లో, రాజ్యసభలో అరగంటలో పాసైపోయాయి. చట్టసభల్లో పరిఢవిల్లాల్సిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని బీజేపీ పరిహసించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది అందుకే. బిల్లులపై భిన్నాభిప్రాయాలున్నప్పుడు వాటిని పార్లమెంటరీ కమిటీలకు పంపడం సాధారణం. ఇటీవల ఆ ధోరణి కూడా తగ్గుముఖం పడుతోంది. తాజా సమా వేశాల్లో 6 బిల్లుల్ని మాత్రం పార్లమెంటరీ కమిటీలకు నివేదించారు. ఆడపిల్లల వివాహ వయస్సును పెంచే ప్రతిపాదనపై సందేహాలు వ్యక్తమయ్యాక ఆ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపారు.
ఇక, ప్రజాసమస్యలను ప్రస్తావించి పాలకపక్షాన్ని ఇరుకునపెట్టడానికి అవకాశమున్న కీలకమైన ప్రశ్నోత్తరాల సమయంలోనూ 60 శాతం సమయం వృథా తప్పలేదంటే, ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రంగస్థల ప్రదర్శనలా మారిపోతున్న తమ సభావ్యూహాన్ని పునరాలోచించుకోవాలి. నిజానికి, ఈసారి సభలో గట్టిగా చర్చ జరిగింది – కోవిడ్ పైన, పర్యావరణ మార్పుల పైనే! రైతుల ప్రాణాలు బలిగొన్న లఖిమ్‌పూర్ ఖేరీ ఘటన పథకం ప్రకారం జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చడంతో, కన్నకొడుకే నిందితుడైన హోమ్ శాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు చివరి దాకా పట్టుబట్టాయి. కానీ, కీలక అంశాల చర్చకు ప్రభుత్వాన్ని ఒప్పించడమూ అంతే ముఖ్యమని గ్రహించాల్సింది. సభ్యులు భిన్నంగా ప్రవర్తించి ఉంటే సమావేశాలు మరింత మెరుగ్గా జరిగి ఉండేవి. రాజ్యసభ ఛైర్మన్ అన్న ఆ మాట నిజమే. కానీ, అందుకు పాలకపక్షం కూడా కలసి రావాలి. పట్టువిడుపులతో ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి. ఎంతైనా, ఒంటి చేతితో చప్పట్లు కొట్టలేం కదా! పాలకులు ఏకపక్ష ప్రకటనలు చేయడానికీ, అనుకున్నవాటికి రబ్బరు స్టాంపు రాజముద్రలు వేయడానికీ పార్లమెంట్ సమావేశాలతో పని ఏముంది!
Comments
Please login to add a commentAdd a comment