భారతదేశంలోని హిందువుల చిరకాల వాంఛ త్వరలో నెరవేరనుంది. కైలాస మానసరోవర యాత్ర చేయాలనుకుంటున్నవారి ఆశ సాకారంకానుంది. ఇందుకు భారత్- చైనాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇదొక్కటే కాదు ఇరుదేశాల మధ్య మొత్తం ఆరు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు భేటీ
భారత సరిహద్దుల్లోని తూర్పు లడఖ్ వద్ద ఘర్షణల కారణంగా భారత్, చైనాల మధ్య దాదాపు ఐదేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోయాయి. ఇటువంటి తరుణంలో తిరిగి సంబంధాల పునరుద్దరణకు ఇరు దేశాలూ ముందుకు వచ్చాయి. తాజాగా బీజింగ్‌లో భారత్, చైనా ప్రత్యేక ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి భారత్ నుంచి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సారధ్యం వహించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో శాంతి స్థాపనకు రోడ్ మ్యాప్, ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఆరు సూత్రాల ప్రణాళిక అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. టిబెట్ మీదుగా కైలాస మానసరోవర యాత్ర పునరుద్ధరణ, నదీజలాలకు సంబంధించిన సమగ్ర వివరాలను పంచుకోవడం, పరస్పరం వాణిజ్య సహకారం మొదలైన అంశాలపై ఇరుదేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
ఆరు అంశాలపై ఏకాభిప్రాయం?
భారత్‌తో సానుకూల వాతావరణంలో చర్చలు సాగాయని, ఇరు దేశాలు ఆరు అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చైనా వెల్లడించింది. దశల వారీగా రోడ్‌మ్యాప్ రూపొందించేందుకు అంగీకారానికి వచ్చామని, వివాదాస్పద అంశాలను పక్కనపెట్టి సంబంధాలను మరింత మెరుగుపరిచేందుకు కృషిచేస్తున్నామని చైనా తెలిపింది. ఇదే సమయంలో భారత్ ఈ విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే సైనిక బలగాల ఉపసంహరణపై గతంలో జరిగిన ఒప్పందం అమలుకు అనుగుణంగా సరిహద్దుల్లో పెట్రోలింగ్ కొనసాగుతున్నదని భారత్ పేర్కొంది.
శాంతికి విఘాతం కలగొద్దు
కాగా పరస్పర ఆమోదయోగ్యమైన నిర్ణయాలకు, ఒప్పందాలకు ఇకపైనా కట్టుబడి ఉండాలని, శాంతికి విఘాతం కలగకుండా చూసుకోవాలని ఇరు దేశాల ప్రతినిధులు తీర్మానించారు. అలాగే ప్రత్యేక ప్రతినిధుల వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు సైనిక-దౌత్యపరమైన చర్చలను సమన్వయంతో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇరుదేశాల ప్రతినిధుల సమావేశాన్ని వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో నాంది
భారత్, చైనా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక ప్రతినిధులు 2003 నుంచి ఇప్పటివరకు 22సార్లు భేటీ అయ్యారు. తాజాగా 23వ సారి సమావేశం అయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిని నెలకొల్పడం, ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరణే లక్ష్యంగా ఈ చర్చలు సాగాయి. కాగా గత అక్టోబరు 24న రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రత్యేకంగా సమావేశమై, ఇరుదేశాల మధ్య సయోధ్యకు మార్గం సుగమం చేశారు.
ఇది కూడా చదవండి: మంచు సున్నితం.. వడగళ్లు కఠినం.. ఆకాశంలో ఏం జరుగుతుంది?
Comments
Please login to add a commentAdd a comment